Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎఐ భస్మాసురం … అదో పనిదయ్యం… మింగేస్తుంది బహుపరాక్‌…

November 19, 2024 by M S R

.

ఐటి ఉద్యోగులు కృత్రిమ మేధతో పోటీ పడాలట!

కొన్ని వార్తలను చదివి ఎలా అర్థం చేసుకోవాలో! ఎలా అన్వయించుకోవాలో! తెలియక తికమకపడతాం. అర్థం కాకుండా ఉంటేనే అజ్ఞానంలో హాయిగా బతికేయవచ్చేమో! అర్థమైతే మనమీద మనకే జాలి పుడుతుంది. భవిష్యత్తు మొత్తం అయోమయంగా, అంధకారంగా అనిపిస్తుంది. అలాంటి ఒకానొక వార్త ఇది.

Ads

సాఫ్ట్ వేర్ ఉద్యోగాల్లేకపోతే ఈ భూగోళం నిరుద్యోగంతో విలవిలలాడి మాడి మసైపోయేదేమో! సాఫ్ట్ వేర్ లేని ప్రపంచాన్ని ఇప్పుడు ఊహించడమే కష్టం. కోళ్ళఫారాలన్నీ ఇంజనీరింగ్ కాలేజీలు అని గంపగుత్తగా అనలేము కానీ…గ్రామీణ ప్రాంతాల్లో చాలా కోళ్ళ ఫారాలు ఇంజనీరింగ్ కాలేజీలు అయిన మాట నిజం. సాఫ్ట్ వేర్ ఉద్యోగులను ఉత్పత్తి చేసే ఇంజనీరింగ్ కాలేజీలు సమాజానికి చేసిన మంచిచెడుల మీద ఎవరి అభిప్రాయాలు వారికి ఉండచ్చు. ఆ చర్చ ఇక్కడ అనవసరం.

దాదాపు తొంభై ఏళ్ల కిందట అంటే 1930లలో ప్రపంచవ్యాప్తంగా పెను ఆర్థిక సంక్షోభం సంభవించింది. అమెరికాలో మొదలై ఈ సంక్షోభం భూగోళమంతా విస్తరించింది. ఆర్థిక శాస్త్రం ఈ సంక్షోభానికి “గ్రేట్ డిప్రెషన్” అని నామకరణం చేసింది. ఈ సంక్షోభానికి మూల కారణం అతి పారిశ్రామికీకరణ అని తేల్చాడు చార్లీ చాప్లిన్. గ్రేట్ డిప్రెషన్ ఇతివృత్తంగా మోడరన్ టైమ్స్ పేరుతో 1936లో చార్లీ చాప్లిన్ తీసిన సినిమా ఒక విషాదానికి కన్నీటి ప్రతిరూపం. ఈ సినిమాకు దర్శకుడు, నిర్మాత, రచయిత, సంగీతం, కథానాయకుడు అన్నీ చాప్లినే.

మనిషి యంత్రంలో యంత్రమై, బోల్ట్ లో బోల్ట్ అయి, చక్రాల పళ్ల మధ్య బెల్ట్ అయి, సైరన్ మోగగానే మరబొమ్మలా పనిచేసి; మళ్లీ సైరన్ మోగగానే ఆగిపోయే ఒక పరికరంగా ఎలా మిగిలిపోయాడో ఆనాడే చాప్లిన్ కన్నీళ్లకే కళ్లల్లో రక్తం కారేలా తెలుపు నలుపు మూగసినిమాలో చెప్పాడు. అప్పటికే అంతగా గుండెలు బాదుకోవాల్సిన పరిస్థితి అయితే- ఇప్పటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుట్టించిన స్వయంచాలిత రోబో యంత్రాల అధునాతన పరిశ్రమలను, ఆ పరిశ్రమలను ఇళ్లల్లో నుండి నిద్రలో అయినా మానిటర్ చేసే వర్క్ ఫ్రమ్ హోమ్ లను చూస్తే చాప్లిన్ ఎన్ని మోడరన్ టైమ్స్ సినిమాలు తీయాల్సివచ్చేదో?

AI

ఇంటర్నెట్, సెల్ ఫోన్లు వచ్చాక ఇల్లు- ఆఫీసు తేడా లేదు. ఉద్యోగి రోజంతా సిస్టమ్ ముందు కూర్చోవాల్సిందే. సెల్ ఫోన్ లో అందుబాటులో ఉండాల్సిందే. కరోనా రాగానే వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరిగింది. ఉన్న ఉద్యోగం ఊడిపోవడం కంటే ఇంటినుండి పనిచేసుకునే వెసులుబాటు మొదట్లో ఉద్యోగులకు బాగానే అనిపించింది.

రాను రాను యాజమాన్యాలు వర్క్ ఫ్రమ్ హోమ్ పని గంటలు పెంచుకుంటూ పోతున్నాయట. ఆఫీసులో అయితే ఎనిమిది గంటలే. ఇంట్లోనే పడి ఉంటారు కదా? ప్రస్తుతానికి పన్నెండు గంటలు చేసి చావండి- మీ ఖర్మ ఇలాగే బాగా కాలితే భవిష్యత్తులో పద్దెనిమిది గంటలు ఖరారు చేద్దాం అంటున్నాయి యాజమాన్యాలు.

అసలే బయట ఆర్థిక సంక్షోభంతో ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. ఏదో ఇంట్లోనే కదా అనుకుని తిట్టుకుంటూ, విసుక్కుంటూ విధిలేక పని చేస్తున్నారు. రోజంతా సిస్టం ముందు, వీడియో కాన్ఫరెన్సులు, సెల్ ఫోన్లో ఉండడంతో మానసిక, ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని అందరికీ తెలిసిందే. ఇంటిగ్రేటెడ్ థెఫ్ట్ అని గిట్టనివాళ్లు ఎగతాళిగా అంటుంటారు. అంటే సమగ్ర దోపిడీ. ఐటీ సమగ్ర దోపిడీలో ఉద్యోగులను సంపూర్ణంగా, సమగ్రంగా దోచుకోవడం కూడా ఒక భాగం!

ai

పెరిగిన పని గంటలు, ఇంట్లో ఉన్నా చేసితీరాల్సిన ఆఫీసు పనులు, టార్గెట్లు, ఊస్టింగులను మించి ఇప్పుడు ఐటి ఉద్యోగుల ముందు ఇంకో ప్రమాదం కొండలా పెరిగి మీద పడుతోంది. “కృత్రిమ మేధ- ఏఐ కంటే నువ్ వేగంగా, భిన్నంగా పని చేయగలవా?” అని ఐటి ఉద్యోగులను ఇంటర్వ్యూల్లో అడుగుతున్నారట. “ఏఐ నెలకు యాభై వేల పేజీల సాఫ్ట్ వేర్ కోడ్ రాస్తోంది. నువ్ ఎన్ని వేల పేజీలు రాయగలవు?” అని ఈమధ్య బెంగళూరులో ఒక ఐ టి ఉద్యోగార్థిని ఇంటర్వ్యూలో అడిగితే అతడు పాపం అమాయకంగా దిక్కులు చూశాడట. మెదడున్నవారెవరైనా అడిగే ప్రశ్నేనా ఇది? అని ప్రస్తుతానికి మనకు అనిపించవచ్చు కానీ… భవిష్యత్ చిత్రపటం మాత్రం అక్షరాలా ఇదే!

మనిషి చేసిన యంత్రం మనిషినే మింగేస్తున్న భస్మాసురహస్తం కథ ఇది. మనిషి చేసిన యంత్రంతోనే పోటీపడలేక ఓడిపోతున్న మనిషి కథ ఇది. ప్రకృతి ధర్మాల యుక్తాయుక్త విచక్షణ అవసరం లేని వికృతిలో ఉన్నాం.

వెనుకటికి ఒక బద్దకస్థుడు ఏ పనయినా చిటికెలో చేసి పెట్టే దయ్యం కోసం ఘోరమయిన వామాచార అభిచారీ హోమం చేశాడు. అతడి హోమానికి మెచ్చి దయ్యం ప్రత్యక్షమయ్యింది.
“నాకు నా పళ్లు తోముకోవడం కూడా బద్దకమే. ఎప్పుడూ నా వెంట ఉండి…నేను నోటితో చెప్పడం ఆలస్యం…నువ్వు ఆ పనులన్నీ చేసి పెడుతూ ఉండాలి” అన్నాడు.
“దానికేమి భాగ్యం! అలాగే.
అయితే- ఒక షరతు. నాకు పనులు చెబుతూనే ఉండాలి. పనులు చెప్పనప్పుడు… నేను నిన్ను మింగేస్తాను…లేదా అదృశ్యం అయిపోతాను” అంది.

సరే అని మనవాడు-
“ఇల్లు శుభ్రం చేయి
నీళ్లు తోడి పెట్టు
కట్టెలు కొట్టు
పొలం దున్ను
ఎడ్లకు మేత పెట్టు
నాకు అన్నం కలిపి ముద్దలు నోట్లో పెట్టు
నాకు జోల పాడు”
అని విసుగు విరామం లేకుండా పనులు చెబుతూనే ఉన్నాడు. అలుపు సొలుపూ లేకుండా దయ్యం చేస్తూనే ఉంది.

హమ్మయ్య!
అని మొదటిరోజు రాత్రి హాయిగా పడుకున్నాడు. ఇలా రెండు, మూడు రోజులు గడిచాక మనవాడికి చెప్పడానికి పనులు మిగల్లేదు. దయ్యమేమో పని పని అని మీది మీదికి వస్తోంది. పని చెప్పకపోతే దయ్యం మిగేస్తుందన్న భయం, అదృశ్యం అవుతుందన్న ఆందోళన మొదలయ్యింది. ఊళ్లో ప్రఖ్యాత భూత వైద్యుడిని సంప్రదించాడు. అతడు చెవిలో ఒక రహస్యం చెప్పాడు.

ఇంటికి రాగానే దయ్యం పని పని అంటూ మీద పడబోయింది. ఒక పొడుగాటి వెంట్రుకను ఇచ్చి “దీన్ని కర్రలా నిటారుగా చేయి” అన్నాడు. ఎంతకూ ఆ వెంట్రుక కర్రలా అవడం లేదు. ఆ రోజు నుండి ఈరోజు వరకు మళ్లీ ఇంకో పని చెప్పే వరకు మధ్యలో దయ్యం చేతికి ఒక వెంట్రుకను ఇస్తుంటాడు. భూతవైద్యుడు చెవిలో చెప్పిన చిట్కా ఇది!

మీదపడుతున్న ఏఐ దయ్యం బారినుండి మనల్ను మనం రక్షించుకోవడానికి చెవిలో ఇలాంటి చిట్కాలు చెప్పి, మెడలో తాయత్తుల రక్ష కట్టే మామంచి భూతవైద్యులు ఎక్కడున్నారో!
అసలు ఉన్నారో! లేరో!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నడిరాతిరి వేళా నీ పిలుపు… ఇలాంటి ఓ హిందీ పాటే ఓ ఉత్సవం…
  • ఈ తూరుపు, ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ…!
  • జామ ఆకులు తెగ తింటున్నారు… పచ్చి, ఎండు, పొడి… అన్నీ…
  • ఆంధ్రాబాబు బుర్రలో బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది..!!
  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!
  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions