.
ఒక వ్యక్తిని విమర్శించాలనో, పొగడాలనో ఇది రాయలేదు… నా వృత్తిలో భాగంగా రాజకీయ నిత్య విద్యార్థిగా గమనించి రాస్తున్నాను.
రాజకీయంలో వ్యూహ ప్రతివ్యూహాలు, విద్వేష విద్రోహాలు ఉంటాయి… ఉండాల్సిందే. కానీ ఎప్పుడు ఎక్కడ ఏ వ్యూహం వాడాలి… ఎలా వాడాలి… ఎందుకు వాడాలి… అన్నది తెలిసిన వారే అసలైన రాజకీయ విజ్ఞాని. ఈ మధ్య బాగా డబ్బులుండో, తాతలు తండ్రులు సంపాదించిన పేరు ప్రతిష్టల వల్లో, నాలుగు మాటలు నాలుగు భాషల్లో ప్రాసగా మాట్లాడితే చాలన్న మిడిమిడి జ్ఞానమో తెలియదు కానీ రాజకీయం అందరూ చేయాలనీ కలలు కంటున్నారు.
రాజకీయం అంటే వ్యూహంతో కూడిన చదరంగం అన్న విషయం చాలమందికి తెలియక తమ చుట్టూ చేరిన నలుగురు భజనపరులు భ్రమింపజేసే ఒక అభూతకల్పనగా కనబడి ఒక ఈవెంట్ ల అంతే తొందరగా ముగిసిపోతుంది, కాలగర్భంలో కలిసిపోతుంది.
Ads
కలియుగ రాజకీయభారతంలో కొందరు వ్యక్తులు నేటి రాజకీయాలను ఏ మాత్రం ప్రభావితం చేయలేరు, చేయరు అనటానికి నేనొక మంచి ఉదాహరణ చెప్తాను… దీనిపై వాదప్రతివాదనలు అనవసరం. రాజకీయాల్లో ప్రత్యక్ష శత్రుత్వాలు, పరోక్ష శత్రుత్వాలు ఒకేలా ఉండిపోవు, కాలగమనంలో పరిస్థితులను బట్టి వాటి పంథాను మార్చుకుంటూ శత్రుత్వ శాతాన్ని తగ్గించుకుంటూ లేదా పెంచుకుంటూ పోతాయి.
తెలంగాణలో ప్రముఖ రాజకీయనాయకుడైన హరీష్ రావు తండ్రి చనిపోయిన వెంటనే… తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ ప్రముఖులందరూ స్పందించి ఆయనను పరామర్శించారు, సానుభూతుల జల్లులు కురిపించారు. కానీ ఆయన కుటుంబంలో ఒక వ్యక్తి అయినటువంటి కవిత కనబడలేదు. అదేమంత వార్త కానప్పటికీ, ఎవరికీ ఏమంత ఆశ్చర్యం అనిపించకపోయినప్పటికీ వ్యూహచతురతలో ‘ఉండేలు దెబ్బ’ సామెతను గుర్తు చేసింది.
మరణాంతాని వైరాణి నిర్వృత్తం నః ప్రయోజనమ్.
శ్రీ రాముడు విభిషణుడికి చెప్పిన ఈ శ్లోకం రామాయణంలోని యుద్ధకాండలో చెప్పబడింది… మరణాంతరం ఒక ‘సందర్బంగా’ మార్చుకున్నపుడు శత్రుత్వాలు సమసిపోతాయని దీని తాత్విక పరమార్థం. రాజకీయంలో సందర్భం దొరకదు, మనమే సృష్టించుకోవాల్సి వస్తుంది.
కానీ అప్పుడప్పుడు సందర్భమే సాదరంగా వచ్చి మన గడప మీద నిల్చొని కాలింగ్ బెల్ కొడుతుంది అప్పుడు స్వీకరించాలి… ఆ సందర్భాన్ని కవిత వాడుకొని ఉండుంటే రాజకీయ వ్యూహపరంపరలో మొదటిమెట్టు ఎక్కేది, ఆమె రాష్ట్రంలో తనదైన రాజకీయం అనే గేమ్ ఆన్ చేసి ఉండేది.
18 రోజుల మహాభారతకురుక్షేత్రంలో కృషుడి వ్యూహంలో భాగంగా అర్జునుడు ఏ రోజుకారోజు సూర్యాస్తమయం తర్వాత యుద్ధానంతరం సాయంత్రం తాను చంపిన ప్రతి యోధుడి వద్దకు వెళ్లి క్షమించమని చెప్తూ సగర్వంగా నివాళి అర్పించి వచ్చేవాడట. తద్వారా శత్రుసైన్యంతో గౌరవం పొందేవాడు, అలాగే ఒక రకమైన సానుభూతి ఏర్పరచేవాడు. దాంతో శత్రుసైన్యానికి అర్జునుడు తమ శత్రువన్న ఆలోచన నుండి డీవియేట్ చేసేవాడు. అది యుద్ధతంత్రం.
సీఎం రేవంత్ రెడ్డి తన ప్రభుత్వం వచ్చిన తొలిరోజుల్లో ఇదే యుద్ధతంత్రాన్ని ఉపయోగించుకొని క్రియేట్ చేసింది అదే… కెసిఆర్ ఫార్మ్ హౌస్ లో కాలు జారిపడ్డ వెంటనే సీఎం హోదాలో వెళ్లి వెంటనే పరామర్శించి వచ్చాడు.
అలా అని ఆ పరామర్శ కెసిఆర్ మీద ప్రేమతోనో, ఆ బాగయ్యింది లే అని కేటీఆర్ మీద ద్వేషంతోనో కాదు… సందర్భాన్ని ఉపయోగించుకునే రాజనీతిజ్ఞత అతనికి తెలుసు కాబట్టి రేవంత్ రెడ్డి అలానే చేస్తాడు. పగలతో రగిల్చే రాజకీయాలు తాను చేయబోనని పరోక్షంగా తాను పాలించే ప్రజలకు సంకేతాలిచ్చాడు.
రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహాన్ని అతి దగ్గరగా గమనించిన వ్యక్తిగా నేను చెప్పగలుగుతాను. 2018 ఎన్నికలప్పుడు నిరాక్షిణ్యంగా తన బెడ్ రూమ్ డోర్లు బద్దలు కొట్టిన వ్యూహాన్ని అమలుపరచిన ఇదే హరీష్ రావును సైతం పరామర్శించటానికి కూడా రేపో ఎల్లుండో వెళ్లే అవకాశం లేకపోలేదు. దాన్నే రాజనీతిజ్ఞత అంటారు.
నేను ముందు చెప్పినట్టుగా కవిత ఈ విషయంలో అలాంటి రాజనీతిజ్ఞత ప్రదర్శించలేదు…. ప్రదర్శించదు కూడా. ఎమోషన్ తో చేసే రాజకీయం ఎక్కువకాలం మనుగడ లేదు. సందర్భంతో కూడిన వ్యూహంతో చేసే రాజకీయం మాత్రమే యుద్ధమార్గంలో లక్ష్యాన్ని చూపుతుంది. మహాభారతంలో పరిస్థితులన్నీ కురుక్షేత్రానికి దారి తీయటంతో భవిష్యత్ తెలిసిన భీష్ముడు వెళ్లి వద్దని వారించాడట. అప్పుడు దుర్యోధనుడు…
జానామి ధర్మం న చ మే ప్రవృత్తిః జానామ్యధర్మం న చ మే నివృత్తిః కేనాపి దేవేన హృది స్థితేన, యథా నియుక్తోऽస్మి తథా కరోమి
ధర్మం ఏంటో నాకు తెలుసు కానీ ఆచరించను, అధర్మం ఏంటో నాకు తెలుసు కానీ వదిలిపెట్టను, ఏదో దేవతాశక్తి నన్ను ఆవహించి నాతో ఇలా చేయిస్తుందని అన్నాడట. కవిత పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది… పాపం!! – హరికాంత్ రెడ్డి (HK)
Share this Article