Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇతడు..! ఓ లేజర్ తాత గారు… ఓ హిమేశ్ బాబు… ఓ పాత స్పూఫ్…

July 30, 2025 by M S R

.

అతడు సినిమా అనుకున్నంత రేంజులో లాభాలు ఇవ్వలేకపోయిందనీ, కానీ టీవీల్లో మాత్రం బంపర్ హిట్ అనీ, ఇప్పుడు 4కే, 6 కే రిజల్యూషన్‌తో రీరిలీజ్ చేస్తున్నాం, ప్రేక్షకులు ఆదరిస్తారనీ మురళీమోహన్ ఈమధ్య ఎక్కడో చెప్పినట్టు గుర్తు…

నిజమే… సినిమా బాగుంటుంది… ఖలేజా, అతడు సినిమాల్లో ఏది ఎక్కువసార్లు టీవీల్లో వేశారో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి షో’లో అమితాబ్ అడిగాడో లేదో గుర్తులేదు గానీ… మహేశ్ బాబును ఎప్పుడూ ఇంట్లో కట్టేసుకున్నట్టే కనిపిస్తుంటాడు ఎప్పుడూ…

Ads

ఇక  ఆగస్టు ఫస్ట్ వీకో, సెకండ్ వీకో అతడు రీరిలీజ్ షెడ్యూల్ చేసినట్టున్నారు… కామెడీ, యాక్సన్, రొమాన్స్‌లకన్నా త్రివిక్రమ్ డైలాగులు పదునుగా బాగుంటాయి… ఈ వార్తలు చదువుతుంటే మిత్రుడు Yaseen Shaikh మూడేళ్ల క్రితం రాసిన స్పూఫ్ ఒకటి గుర్తొచ్చింది… సరదాగా చదివేసేయండి…



‘ఇతడు’!!
‘ద స్ఫూఫ్‌’!
ఎవరెవరో ఇంగ్లిష్‌ సినిమాలు చూసి తెలుగులో తీస్తుంటారు కదా. నాక్కూడా తీయాలనుంటుంది. కానీ ఇంగ్లిష్‌ రాదు. అందుకే తెలుగు సినిమాయే చూసి తెలుగులోనే తీయాలనుకున్నా. నా సినిమాకోసం రాసుకున్న కొన్ని సీన్లు ఇవి. అన్నట్టు… నా మూవీ పేరు… ‘ఇతడు’!

* * *
ఓ సీన్‌…
ఎందుకోగానీ లేజర్‌ గారి చెయ్యి బలహీనంగా వణుకుతూ ఉంటుంది. టూతు బ్రష్షు మీద పేస్టు వేసుకోవడానికీ ఎంతో కష్టపడుతుంటాడు. ఒకరోజు పేస్ట్‌ ట్యూబ్‌ నొక్కుతుండగా ‘‘నాన్నా… వ్యర్థూ వచ్చాడు’’ అంటూ ఇంట్లో ఆడవాళ్లంతా హిమేశ్‌ బాబును సాదరంగా లోపలికి తీసుకొచ్చారు.

లేజర్‌ గారి ముందు మోకాళ్ల మీద కూర్చున్నాడు హిమేశ్‌ బాబు.
కాసేపు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు లేజర్‌ గారు.
విసుగ్గా లేచి వెళ్లిపోబోయాడు హిమే శ్‌బాబు.
‘‘పొద్దుట్నుంచి నేనూ బ్రష్‌ చేసుకోలేదు. పేస్ట్‌ ఇవ్వడం కాసేపు లేట్‌ అయితే ఆగలేడా అమ్మా వాడు’ చేయి వణుకుతుండగా వాపోయారు లేజర్‌ గారు.

పేస్టు ఇటు ఇవ్వండన్నట్టుగా మళ్లీ చెయ్యిజాపాడు హిమేశ్‌ బాబు.
‘‘పాపం… ముఖం కడుక్కొని ఎన్నాళ్లయ్యిందో. ముందు వాడికో కొత్త బ్రష్షు కొనివ్వండి’’ అంటూ ముక్కు మూసుకుంటూ పేస్టునందించబోయారు లేజర్‌.
‘‘నేను పేస్ట్‌ అడిగింది నాకోసం కాదు తాతయ్యా!… నీకోసం, ఇప్పటివరకూ నువ్వు నొక్కుకొనీ, నొక్కుకొనీ కష్టపడింది చాలు. ఇంకెప్పుడూ పేస్టునొక్కడానికి నీ చేయి వణకకూడదు తాతయ్యా… వణక్కూడదు’’ గద్గద స్వరంతో అంటూ ట్యూబును తలుపు సందులో పెట్టి నొక్కి బ్రష్షు మీద వేసిచ్చాడు హిమేశ్‌బాబు.

* * *
మరో సీన్‌…
తాత గారైన లేజర్‌ గారు మటన్‌ ముక్కల్నీ, నల్లీ బొక్కల్నీ నమిలి తింటున్నారు. ఈ లేటు వయసులోనూ గట్టి గట్టి మటన్‌ బొమికల్ని కరకరా నమిలేయడం చూసిన లేజర్‌ గారి ఓ అల్లుడు గారు… ‘ముసలోడే గానీ… మహానుభావుడు’ అనుకుంటాడు మనసులో.

ఇలా మటన్‌ తింటుండగానే ఓ ముక్క పళ్ల మధ్య ఇరుక్కుంది. ఎంతగానో బాధిస్తోంది. ఒకచోట కుదురుగా నిలవనివ్వడం లేదు. పళ్ల మధ్య ఏదైనా ఇరికితే అంతే. అది బయటిపడితేగానీ స్థిమితం కుదరదు కదా.
‘‘డాక్టర్‌ డెంటలాద్రీశ్వర్‌రావుగారికి ఫోన్‌ చెయ్యండి’’ హుందాగా ఆజ్ఞాపించారు లేజర్‌ గారు.
పిలవడమే ఆలస్యం డాక్టర్‌ డెంటలాద్రీ, ఆయన అసిస్టెంటూ ఎంటరయ్యారు. ‘‘మీకెందుకు సార్‌ బెంగ. ఇరుక్కున్న ముక్కను ఇట్టే పీకేస్తాం. మీరు నిశ్చింతగా ఉండండి సార్‌’’ అంటూ… ఇంకా ఏదో అనబోయారు.

‘‘ఎందుకో గానీ మేం రావడం మీ మనవడు గారికి ఇష్టం లేనట్టుంది సార్‌. ఇలా ఇలా వేలు చూపించి మమ్మల్ని బెదిరిస్తున్నారు’’ అంటూ భయం భయంగా వెనక్కి వెనక్కి వెళ్లిపోయారు డెంటల్‌ డాక్టరూ, ఆయన అసిస్టెంటు.
‘‘ఏరా… పంట్లో ఇరుక్కున్న ఎముకను తీయడానికి వస్తే… వాళ్లను వేలు చూపించి ఇలా ఇలా బెదిరించావట’’ కోప్పడ్డారు లేజర్‌తాత.
‘‘ఎన్ని ముక్కలు పీకాలి తాతయ్యా?’’ అడిగాడు హిమేశ్‌బాబు.

‘‘పంటికీ పంటికీ మధ్య ఒక్కొక్కటి చొప్పున పుంజీడు బొక్కలు. పై వరసా కింది వరసా కలుపుకుని మొత్తం ముప్పయి ముక్కలు. ఏం నువ్వు పీకిస్తావా లేక పీకేస్తావా?’’ లేజర్‌ గారు ఆగ్రహంతో ఊగిపోయారు.
‘‘ఎంతెంతో ఫీజులు చెల్లిస్తూ… ఎన్నెన్నో బిల్లులు కట్టేస్తూ ఇప్పటివరకూ ఆ డెంటలాద్రీశ్వర్రావుగారితో మీరు పడ్డ కష్టాలు చాలు తాతాయ్యా’’ గద్గదికంగా గొంతును వణికిస్తూ… మరో పక్క జేబులోంచి టూత్‌పిక్‌ డబ్బా తీశాడు. తాతగారి పళ్లమధ్య ఇరుక్కున్న నల్లీ బొక్కల్నీ, ఎముక ముక్కల్నీ టేబుల్‌ మీద పెట్టేసి… కళ్లు తుడుచుకుంటూ దిగంతాల్లోకి తప్పుకున్నాడు హిమేశ్‌ బాబు.

* * *
ఇంకో సీన్‌…
నిజానికి హిమేశ్‌ బాబు అంత మంచివాడు కాదు. అతడో ప్రొఫెషనల్‌ అప్పులోడు. అందరి దగ్గరా అప్పు తీసుకుని ఎగొట్టే అలవాటు ఉన్న లోన్‌మేన్‌.
హిమేశ్‌ ఆచూకీ పసిగట్టిన జనం ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చి అక్కడికి దిగబడ్డారు. అప్పులిచ్చినవాళ్లంతా ఒక్కసారిగా లేజరు గారింటికి ఎగబడ్డారు. దాంతో హిమేశ్‌ బాబు బండారమంతా బయటపడింది.

విషయం ముందే తెలుసుకున్న హిమేశ్‌ ఎవరికీ దొరక్కుండా పారిపోయాడు. ఆ రాత్రి మళ్లీ తీరిగ్గా వచ్చి మళ్లీ లేజర్‌ తాత గారి ముందు మోకాళ్ల మీద కూర్చున్నాడు.
‘‘నేను మీ మనవడు వ్యర్థూని కాను. మీకు దయతో అప్పులిచ్చే అలవాటుందని తెలిసింది, తీర్చకున్నా డబ్బులిచ్చే ఉదార హృదయులని అర్థమైంది. అప్పనంగా సొమ్ములు దొబ్బేద్దామని వ్యర్థూగా వచ్చా. అప్పడిగితే మీరు ఇచ్చేవారేమో… కానీ తీసుకోకుండా ఉండేందుకు నేనెంతటి క్షోభ అనుభవించానో మీకు తెలియదు తాతయ్యా… తెలియదు.

మిమ్మల్ని అప్పు అడగకుండా ఉండేందుకు నన్ను నేను ఎంతగా కంట్రోల్‌ చేసుకున్నానో మీకు చెప్పలేను తాతయ్యా. ఇలా నన్ను నేనే క్షోభపెట్టుకుంటూ ఎంతో గుండెకోత అనుభవించా. అంతేగానీ మిమ్మల్ని మోసం చేయలేదు. పైగా ఇంట్లో అందరికీ న్యాయం చేశా’’
‘‘దీన్ని మోసమనకపోతే మరేమంటారో’’ అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించాడు లేజరు గారి మరో అల్లుడు గారు.
‘‘ఎగ్గొట్టడానికి అప్పడగడం మోసం. అప్పిస్తారని తెలిసినా అడగకపోవడం న్యాయం’’

* * *
క్లైమాక్స్‌ సీన్‌…
‘‘చివరికంటా అయిపోయిన టూత్‌పేస్టును బయటకు తీయడానికి తలుపు మధ్య పెట్టి నొక్కినప్పుడే అడగాల్సింది…. నువ్వెవరని? పళ్ల మధ్య ఇరుక్కుపోయిన ఎముకల్ని బయటకు తీయడానికి టూత్‌ పిక్కుల డబ్బా ఇచ్చినప్పుడన్నా అడగాల్సింది నీకీ విద్య ఎలా తెలుసని?
కానీ… అప్పుడు నేనడగలేదు. ఇప్పుడడిగే అర్హత నాకు లేదు. అందుకే ఇవి తీసుకో’’ అంటూ కొన్ని పేపర్లు తెచ్చిచ్చాడు లేజర్‌ తాత.

‘‘ఏమిటి తాతయ్యా ఇవి?!’’ అడిగాడు హిమేశ్‌ బాబు.
‘‘అప్పట్లో మీ నాన్న… అదే వ్యర్థూ వాళ్ల నాన్న కూడా అంతే. వాడికీ అప్పులు అడగడం సరదా. ఇంతప్పట్నుంచీ అందర్నీ అప్పులడుగుతూ ఉండేవాడు. అప్పులివ్వమంటూ వాళ్లనూ వీళ్లనూ సతాయిస్తూ ఉండేవాడు. తీరా అప్పు తీర్చమంటూ అందరూ ఒక్కసారిగా ఇంటి మీద పడేసరికి తట్టుకోలేక దేశాలు పట్టుకుపోయాడు. ఇవి వాడు నింపుదామని తీసుకొచ్చిన ‘ఇన్‌సాల్వెన్సీ పిటీషన్‌’ పేపర్లు! అదే…. ఐపీ పేపర్లు!! వీటిని తీసుకెళ్లి నువ్వు ఐపీ పెట్టుకో.

అప్పులన్నీ ఎగొట్టేసి రాగలిగితే రా. లేదంటే కొత్త అప్పులు చేసుకుంటూ అక్కడే ఉండు. ఎందుకంటే… నాకీ వయసులో కావాల్సింది అప్పులోళ్లూ బాకీలోళ్లూ కాదురా. నీ టూతు పిక్కులూ, అయిపోయిన ట్యూబు నుంచి పేస్టును కక్కించే నీ టెక్నిక్కులు. ’’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ హొరైజన్‌లోకి వెళ్లిపోయాడు లేజర్‌ తాత…. – యాసీన్‌ 1–1–2022

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సారీ రాజేష్… మన దిక్కుమాలిన న్యాయవ్యవస్థలో ఇక ఇంతే…
  • హీరోయిన్‌ను మారుద్దామని పంచాయితీ పెడితే… హీరోనే పీకిపారేశాడు…
  • మ్… తెలుగు పాటల్లో పూర్ణ అనుస్వరంపై చంద్రబోస్ సరైన వ్యాఖ్యానం…
  • టమాట రైతుకు గట్టి భరోసా… టమాటర్ పాలసీతో చైనాను దాటేయొచ్చు..!!
  • BRS లో చేరగానే… ఈ కొత్త బాస్‌పై ఆ పాత ఆరోపణలన్నీ డిలిటేనా..?
  • 70 ఏళ్ల క్రితమే ఓ సూపర్ పాన్ ఇండియా మూవీ… ఆ స్టార్ ఎవరో తెలుసా..?
  • బూతుకూ హాస్యానికీ నడుమ ఓ గీత… దానికి జంధ్యాల గౌరవం…
  • కార్పొరేట్ విద్య అంటేనే ఓ నయా మాఫియా… పిల్లలు బలి..!!
  • ఇతడు..! ఓ లేజర్ తాత గారు… ఓ హిమేశ్ బాబు… ఓ పాత స్పూఫ్…
  • సంతానసాఫల్యం… ఈ వ్యాపారం అనేక మార్గాలు… ఎన్నెన్నో మోసాలు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions