Sai Vamshi….. ‘గిరీశం’ పాత్ర మరొకరు వేయగలిగారా?
… సూర్యకాంతం అనే పేరు తెలుగునాట మరొకరు పెట్టుకోలేదు. అదొక బ్రాండ్. జ్యోతిలక్ష్మి పేరు మరొకరికి కనిపించదు. అదొక ట్రెండ్. అట్లాంటిదే ఈ గిరీశం క్యారెక్టర్. నందమూరి తారకరామారావు అనే నటుడు ఒకే ఒక్క మారు దాన్ని పోషించారు. తెలుగు తెరపై మళ్లీ మరొకరు ఆ పాత్ర ప్రయత్నించలేదు. న భూతో న భవిష్యతి!
… కథానాయక పాత్ర చేయొచ్చు. ప్రతినాయక పాత్ర పోషించవచ్చు. హాస్యపాత్ర తలకెత్తుకోవచ్చు. సహాయక పాత్రలో ఒదిగిపోవచ్చు. గిరీశం ఇవన్నీ కలిసిన ఇంద్రధనుస్సు. ‘కన్యాశుల్కం’ నాటకంలో కాసేపు తనే హీరో అనిపిస్తాడు. కాసేపు తనే విలన్‌గా మారిపోతాడు. కొద్ది క్షణాలు తనే హాస్యం పండిస్తాడు. కొంత నిడివి సహాయక పాత్రగానూ అలరిస్తాడు. నవరసాలూ కలిపి గురజాడ అప్పారావు గారు దిద్దిన తీరైన పాత్ర అది. దాన్ని పోషించడం ఆషామాషీ సంగతి కాదు. అందుకే చాలామంది ఆ పాత్ర చేయడానికి జంకారు. పి.పుల్లయ్య గారి మస్తిష్కంలో ఎన్టీఆర్ మెదిలి, ఆ పాత్ర ఆయనకు సొంతమైంది.
… తెలుగులో ఒక పాత్రకు ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ ఉండటం, ప్రత్యేకమైన పద్ధతిలో మాట్లాడటం గిరీశం పాత్ర నుంచే మొదలై ఉండవచ్చు. ఎలుకల ఎదుట శాకాహార వ్రతం చేస్తున్న పిల్లిలాంటి ముఖం, హడావిడితనపు డాబు, దర్పం, చేతిలో సిగార్, రింగుల జుట్టు, తెల్ల పంచె, లాల్చీ, మెళ్లో రుమాలు, నుదిటిపై కలిసిన కనుబొమ్మలు.. ఎన్టీఆర్ స్టైల్ ఆఫ్ కంట్రిబ్యూషన్ బోలెడంత కనిపిస్తుంది ఆ పాత్రకు. గిరీశం ఇంతటి అందగాడా అనిపిస్తుంది.
… గురజాడ వారి కలం కదం తొక్కిన చోట, ఎన్టీఆర్ తన శైలిలో వాటికి వరుస కట్టారు. ‘యామండీ గిరీశం గారు! విధవలు పెళ్లాట్టం పాపం కదూ’ అని అమాయకంగా బుచ్చమ్మ పాత్ర వేసిన షావుకారు జానకి అడిగితే, ‘ఆ..హా..హా.. మీ సత్యకాలం చూస్తే నాకు చాలా విచారంగా ఉంది. విధవలు పెళ్లాడవలసింది, పెళ్లాడవలసింది అని పరాశర స్మృతిలో స్పష్టంగా రాసుంది. రాజమహేంద్రవరంలో పండితులు ఇదంతా సిద్ధాంతం చేశారు. పూర్వకాలంలో విధవలు పెళ్లాడేవారు వదినా!’ అంటూ ఆయన చెప్పే మాటలు ఎంత ముచ్చటగా ఉంటాయో! ఆ సన్నివేశం మొత్తం గొప్ప కంపోజిషన్.
మరో చోట, మధురవాణి ఇంటికి వస్తాడు గిరీశం. తాను బయట చేరానని అతణ్ని ముట్టుకోవద్దంటుంది మధురవాణి. ‘మైలా గీలా మా ఇంగ్లీషు వాళ్లకు లక్ష్యం లేదు. ఇలా రా’ అంటూ మొదలుపెడతాడు గిరీశం పాత్రలోని ఎన్టీఆర్. మొత్తం ఆ సన్నివేశంలో అటు సావిత్రి, ఇటు ఎన్టీఆర్.. ఎవరి నటన ఎక్కువ? ఎవరి పాత్ర తక్కువ? మురిపెంగా ఆ ఇద్దరూ చేసిన ఆ అజరామరమైన నటనకు మరొకరు సమం అవుతారా ఎప్పటికైనా?
శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆర్ అంటారు. కానీ సీఎస్సార్, ఈలపాట రఘురామయ్య, బాలకృష్ణ, శోభన్‌బాబు లాంటి వాళ్లు ఆ పాత్ర వేసి మెప్పించారు. రాముడన్నా ఎన్టీఆరే అంటారు. కానీ దాన్నీ మరికొందరు పోషించి జనాన్ని ఒప్పించారు. వెంకటేశ్వరుడు, రావణాసురుడు, దుర్యోధనుడు, కర్ణుడు.. ఆయన చేసిన అనేక పౌరాణిక పాత్రలను ఆ తర్వాత కాలంలో మళ్లీ ఎవరో ఒకరు వేశారు. ఒక్క గిరీశం పాత్ర మాత్రం మినహాయింపు. నాటక రంగంలో ఎందరో ఆ పాత్ర పోషించారు. జె.వి.రమణమూర్తి గారు గిరీశం పాత్రకు ఫేమస్ అయ్యారు. టీవీల్లోనూ ఆ పాత్రలో కనిపించారు. కానీ తెలుగు తెర మీద గిరీశం అంటే మాత్రం ఎన్టీఆర్. One and Only NTR. He is Gireesham.
… ఇవాళ నందమూరి తారక రామారావు గారి జయంతి. వీలైతే ‘కన్యాశుల్కం'(1955) సినిమా చూడండి. ‘మైడియర్ వెంకటేశం’ అంటూ ఆయన పలికిన సంభాషణలు మననం చేసుకోండి. It’s a Greatest Lesson for the Upcoming Artists and Directors… – విశీ
Share this Article