.
‘సినీ’ మాలోకం… by Gopireddy Yedula
‘‘రాంబాబు గారూ…మోస్ట్ అర్జెంట్. మీ హాస్పిటల్లోని ఐ స్పెషలిస్టులనీ, ఇ.యన్.టి స్పెషలిస్టులనీ ఎంత మంది ఉంటే అంత మందిని మా గ్లోకల్ హాస్పిటల్కు పంపించగలరా’’ అని అడిగాడు పీఆర్వో పరాంకుశం.
‘‘మాకూ…ఫుల్ వాంటెడ్. నేనే మీకు చేద్దాం అనుకుంటుండగా మీ ఫోన్ వచ్చింది’’ అని ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు టపోలో హాస్పిటల్ పీఆర్వో.
Ads
హైదరాబాద్ లోని అన్ని కార్పొరేట్ హాస్పిటల్ప్లో అదే పరిస్ధితి. కళ్ళు, చెవుల నుండి రక్తాలు కారుతున్న స్థితిలో వందల మంది వివిధ ఆస్పత్రుల్లో చేరిపోయారు. ఏమైంది అని అడిగితే వాళ్ళకు వినపడదు, కనపడదు. పోనీ, చేరిన వాళ్ళు మామూలు వాళ్ళా అంటే, కాదు…!
తెలుగు సినిమా నిర్మాతలు, దర్శకులు, హీరోలు, హీరోయిన్లు, రచయితలు!!. వాళ్లకు ఏమైందీ అనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. అన్ని స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. పోలీస్ కమీషనర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి డీసీపీ రామచంద్రను స్పెషల్ ఆఫీసర్గా నియమించి, అతనికి మెరికల్లాంటి ఎనిమిది మంది ఏసీపీ లను అసిస్టెంట్లుగా ఇచ్చి 24 గంటల్లో మిస్టరీని ఛేదించాలని ఆర్డర్స్ జారీ చేశాడు.
డీసీపీ రామచంద్ర ఏడుగురిని తలో హాస్పిటల్కు పంపి బ్రహ్మానందం ఏసీపీని తనవెంట తీసుకొని గ్లోకల్ హాస్పిటల్కు వెళ్ళి మొదలు బి.కె. రాధాకృష్ణ అనే పేషంట్ దగ్గరికి వెళ్ళాఢు. ఆయన తెలుగు సినీ రచయిత. కళ్ళకు, చెవులకు బాండేజి వేయడం వల్ల మొత్తం తలకాయకే పాగా చుట్టినట్టుంది. ‘‘నరికెయ్, చంపెయ్, ఆ నా కొడుకుని వదలకు’’ అని కలవరిస్తున్నాడు.
ఆయన కుటుంబ సభ్యులంతా దిగాలుగా, భయంతో బిగుసుకుపోయి ఉన్నారు. హాస్పిటల్లోని అందరు పేషంట్లను సందర్శించాడు డీసీపీ. అయినా చిన్న క్లూ కూడా దొరకలేదు. ఎండకు భూమి పగిలి నట్టు కళ్లూ, కోడిగుడ్డు పగిలినట్టు కర్ణభేరీ పగలడం వల్ల పేషంట్లందరికీ నిరంతరం రక్తస్రావం జరుగుతోందని డాక్టర్ చెప్పాడు.
నిరాశతో వెనుదిరిగిన డీసీపీ హాస్పిటల్ బయట పేషంట్ల తాలూకు కారు డ్రైవర్లు ఆనందంగా ఉండటం చూశాడు. బి.కె. రాధాకృష్ణ కారు డ్రైవర్ను పక్కకు పిలిచి ఆరా తీశాడు.
‘రాత్రి ‘వాడే..ఆ నాకొడుకే’ సినిమా ప్రివ్యూ చూసి బయటకు రాగానే ఇలా అయిపోయారు సార్’’ అని డ్రైవర్ చెప్పాడు.
‘‘హుర్రే… ర్రే…“ అని కేక వేసాడు డీసీపీ.
అమెరికా నుంచి తెప్పించి, ప్రత్యేకమైన కెమికల్లో ముంచిన హెల్మెట్లను ధరించి సినిమా చూస్తున్నారు పోలీసులూ, న్యాయవాదులూ, న్యాయమూర్తులూ, డాక్టర్లూనూ.
‘వాడే… ఆ.. నా కొడుకే’ – ‘సందేశమే మా ప్రాణం’ అని టైటిల్ పడింది.
హీరో సుభాష్ వెనక నుండి తల మీద సమ్మెట దెబ్బ పడింది. మరొకరైతే తల పచ్చలు కావలసిందే. కాని, సుభాష్ నిభాయించుకొని కిందపడిపోయాడు. బుల్డోజర్తో రెండు కాళ్ళ మీదనుండి తొక్కించారు. 300 మంది రౌడీలు కత్తులు, గడ్డపారలు, వంకీలు గల స్టీలు గొడ్డళ్ళతో గంటన్నరసేపు చిత్రవధ చేశారు. సుభాష్ అపస్మారక స్థితిలోకి పోయాడు. సుభాస్ ను మట్టుబెట్టానన్న ఆనందంతో రౌడీరాజ్ పక్కనే చెట్టుకు కట్టేసిన రాధ దగ్గరకు వెళ్ళాడు. ఆమె రౌడీరాజ్ని ఈసడించుకుంది.
‘‘నీ సుభాస్ అనంత లోకాలకు వెళ్ళాడు. ఇక నేనే నీకు దిక్కు’’ అన్నాడు మూరెడు పొడవు జుట్టుని వెనక్కితోసి రక్తాన్ని తుడుచుకుంటూ.
‘‘నా ప్రేమ నిజమైతే, నా సుభాస్ చేతిలో నువ్వు చావడం ఖాయం’’ అని ‘‘సుభా… ఆ… ఆ… ఆ…స్’’ అని గావు కేక పెట్టింది రాధ. అప్పటికే సుభాస్ ను తీసుకొని సగం దూరం వెళ్లిపోయారు యమభటులు. కానీ, ఇక్కడే ఓ అనుకోని సంఘటన జరిగింది.
కర్కశ అనే యమభటునికి రాధ పూర్వజన్మలో ప్రేమికురాలు. ఆమె గొంతును గుర్తుపట్టిన కర్కశ ఠక్కున ఆగిపోయాడు. కర్కశ 2 అనే పక్క భటుడు కర్కశ అంతరంగాన్ని అర్ధం చేసుకొని ‘‘సుభాస్ తప్పించుకొని పారిపోయాడని యముడికి చెపుదాం’’ అని సుభాస్ ప్రాణాన్ని వదిలి వెళ్ళి పోయారు.
* * *
అప్పుడే వర్షం మొదలైంది. తెలంగాణ శకుంతల 100 మంది డపుకు బ్యాచ్తో ‘‘అరెరెరెరే ఉగ్ర నరసింహుడు లేస్తాడూ… నీపీచ మణచ వస్తాడూ… ’’ అని పాట అందుకుంది.
‘‘గానా బహుత్ అఛ్ఛాహై. ఎవరది పాడేది? ముమైత్ ఖాన్ హై క్యా?’’ అంటూ సిగరెట్ ముట్టించాడు రౌడీరాజ్. శవంలా పడిఉన్న ప్రభాస్ శరీరం ఒక్కో అంగం కదలడం మొదలైంది, కాలు, తొడలు, డాష్.., నడుము, ఛాతి, చేతులు, కళ్ళు కదిలాయి. కళ్ళు తెరుచుకున్నాయి. కుంగ్ఫూలో నిలబడేవిధంగా డైవ్ చేసి నిలబడ్డాడు సుభాస్. ఈ పరిణామానికి నివ్వెరపోయిన 300 మంది రౌడీలు సుభాస్ ను మళ్ళీ చుట్టుముట్టారు.
‘‘ఒరేయ్… రౌడీరాజ్, నువ్వు ఒకే అబ్బకు పుట్టినవాడివైతే, నువ్వు ఒక్కడివే రారా అటో ఇటో తేల్చుకుందాం’’ అన్నాడు సుభాస్ తొడ చరిచి. రౌడీ రాజ్ అందర్నీ వెనక్కి పంపి చొక్కావిప్పి పక్క వెహికిల్లో రడీగా ఉన్న డంబెల్, ముద్గార్, వెయిట్ లిఫ్టింగ్తో కాసేపు వ్యాయామం చేసి ‘‘ఇక రారా నీయబ్బ’’ అన్నాడు.
‘‘నాన్నా… పీల చేతుల పిలగాడనుకుంటున్నావా? సీమ పందిక్కూడా కండలు ఉంటాయి. కాని, అది ఏమీ చేయలేదు. మా తాత రజాకార్ల పీచమణచాడు. మా నాన్న బాంబులతో చెండాడాడు. నా గురించి తెలియని తెలుగోడు లేడు’’ అంటూ రౌడీ రాజ్ని తుక్కుతుక్కుచేసి చంపి రాధ కట్లు విప్పుతాడు సుభాష్. 300 మంది రౌడీలు దేభ్యం మొహం వేసుకొని ఇంకో రౌడీని వెతుక్కోవడానికి వెళ్ళిపోయారు.
మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం హెలికాప్టర్తో నేరుగా దుబ్బ చెలకమీద దుమ్ములేపుతూ సుభాస్ కు సమీపంలో దిగుతాడు. రౌడీరాజ్ శవం దగ్గరకు వెళ్ళి టోపీ తీసి రెండు కన్నీటి బొట్లు కార్చి, సుభాస్ దగ్గరికి వచ్చి ‘‘నా ఏకైక కొడుకు రౌడీరాజ్ని చంపి సంబర పడుతున్నావేమో? కానీ, తేనె తుట్టెని కదిపి నీ ప్రాణాల మీదికి తెచ్చుకున్నావు. భయం, భక్తి, పూజ, పురస్కారాలు అంటే ఏంటో నీకు త్వరలో చూపిస్తా’’ అని శవాన్ని హెలికాప్టర్లో ఎక్కించాడు. ఎ.కె. 47 పట్టుకున్న పదిమంది అనుసరిస్తుండగా క్రూరంగా చూస్తూ దావూద్ భాయ్ వెళ్ళిపోయాడు.
సుభాస్ రాధని ఆమె ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. విరహ గీతం అయిపోగానే తన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేసరికి తల్లి ఒక పూరిగుడిసెలో దగ్గుతూ చావుబతుకుల మధ్య ఉంటుంది. ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి ‘‘లైఫ్ అండ్ డెత్’’ అనే టానిక్ తెస్తేనే నీ తల్లి బతుకుతుంది’’ అంటాడు.
ఇంటి పక్కనే ఉన్న మెడికల్ షాపుకు పరుగులు తీసి టానిక్ ఇవ్వమంటాడు సుభాస్. పదేళ్లుగా సుభాస్ కోసం మారువేషంలో మెడికల్ షాపులో ఉన్న దావూద్ మనిషి క్రూరంగా నవ్వి కత్తిని సుభాస్ కడుపులో దింపి మెలి తిప్పి బయటకు లాగగానే పేగులు బయటకు వస్తాయి.
సుభాస్ పళ్ళ బిగువున పేగులను లోపలికి నెట్టి, కౌంటర్ మీద ఉన్న టానిక్ తీసుకొని ‘‘ఒరేయ్… నన్ను కన్న తల్లి ప్రాణాపాయ స్థితిలో ఉండటం వల్ల నువ్వు బతికి పోయావురా’’ అనుకుంటూ ఇంటికి వెళ్ళేసరికి తల్లి కొన పూపిరితో ఉంటుంది. తన మేనమామ కూతురు జానకి చేతిని సుభాస్ చేతిలో పెట్టి ఆమె చనిపోతుంది.
కడుపులోని గాయానికి నడుం చుట్టు కండువ కట్టుకున్న సుభాస్ ఆకాశం వైపు ఎరుపు కండ్లతో చూస్తూ ‘‘ఒరేయ్ దావూద్, నువ్వు సప్త సముద్రాల ఆవల ఉన్నా, సప్త ఎడారుల ఈవల ఉన్నా, నాకు తోచని ఇంకే స్థలంలో ఉన్నా, నీ గుండెతో గోలీకాయలాడు కుంటాను. ఈ భూమాత మీద ఒట్టు’’ అని నేలని ముద్దాడి మట్టితో బొట్టు పెట్టుకుంటాడు. జానకినీ, రాధనీ తీసుకొని, రోజూ తన చుట్టూ తిరిగే కమెడియన్స్ ని కూడా తీసుకొని హెలికాప్టర్లో సరాసరి పాకిస్థాన్ లోని దావూద్ డాబా సమీపంలో దిగుతారు.
దావూద్కు ఉన్న ఏకైక బలహీనత సాయంత్రం రికార్డింగ్ డాన్స్లు చూడడం. సుభాస్ బ్యాచ్ మారువేషాల్లో ‘‘నేను వచ్చానురా కొడకా.., నాకు జానకీ, రాధ తోడు ఉన్నారురా… , ఈరోజు నీ అంతం ఖాయం రా… ’’ అని సంగీత భరితమైన పాటను పాడుతూ శివతాండవం ఆడతారు. పాట అయిపోగానే కరెంటు పోతుంది.
* * *
కరెంటు వచ్చేసరికి ఇండియాలో దుబ్బ చెలక మీద ఉంటారు. దావూద్ ఇబ్రహీంతో సహా అందరినీ బస్తాలల్లో కట్టి, హెలికాఫ్టర్ లో ఎక్కించుకొని వచ్చారు. హీరో కుర్చీ వేసుకుని దావూద్ కు ఎదురుగా కూర్చుంటాడు. దూరంగా బుల్డోజర్తో చెలకను లెవెల్ చేస్తూ ఉంటారు. దావూద్ కోపంతో పళ్ళు నూరుకుంటూ సుభాష్ ఎదురుగా నిలబడ్డాడు. సుభాస్ ఆ బుల్డోజర్ దగ్గరకు వెళ్ళి దాన్ని ఒక్క తన్ను తంతే ఆకాశంలోకి లేచి పిండి పిండి అయి కింద పడిపోతుంది. అది చూసిన దావూద్ షాక్ తిని కోమాలోకి వెళ్ళిపోతాడు.
సరిగ్గా అప్పుడే దావూద్ అనుచరుడు ఒకడు ఇనుప రాడ్డుతో సుభాస్ తల మీద వెనక నుండి కొట్టగా స్పృహ తప్పుతాడు. దావూద్ను తీసుకొని వాడు వెళ్ళిపోతాడు. పక్కనే ఉన్న జానకి, రాధలు సుభాస్ ను తీసుకొని చికిత్స గురించి కేరళకు వెళతారు.
కేరళలో మహరాజ్ పిళ్ళె అని మర్మకళ తెలిసిన వైద్యుడు ఉంటాడు. ఆయనకు పరువం మీదున్న ఓ మనవరాలు ఉంటుంది. ఆమె తల్లిదండ్రులను కేరళలో ముంబాయి రౌడీలు హతమారుస్తారు. ఆ కథ మనకు అప్రస్తుతం. వైద్యం పొంది కోలుకుంటున్న క్రమంలో రౌడీల బారిన పడిన కేరళ అమ్మాయిని సుభాస్ రక్షించడం వల్ల ఆమె సుభాస్ తో ప్రేమలో పడుతుంది.
మహరాజ్ పిళ్ళె కు మనిషిలోని ఏ నరం దొరికినా గుంజి, మెలిపెట్టి చంపేయగలడు. తన మనవరాలిని రక్షించినందుకు ఆ విద్యనే సుభాస్ కు నేర్పుతాడు. అయితే పక్క గుడిశలోనే యమహరాజ్ పిళ్ళె అని మహరాజ్ పిళ్ళె పాలివాడు ఉంటాడు. ఆయనకు కూడా మర్మకళ తెలుసు. ఆయన దగ్గర దావూద్ ఇబ్రహీం చేరాడని ఎవరికీ తెలియదు. యమహరాజ్ పిళ్ళెకు కూడా ఓ మనవరాలు ఉంటుంది.
ఆమె ఫ్లాష్ బాక్ అనవసరం. అయితే కోలుకున్న దావూద్ ఇబ్రహీం ఆమెను రేప్ చేస్తాడు. మర్మకళ నేర్చుకున్న దావూద్ ఇబ్రహీం యమహరాజ్ పిళ్లే నరం గుంజి చంపేస్తాడు. ఆయన మనవరాలిని ఉంపుడుగత్తెగా ఉంచుకుంటాడు.
* * *
హైదరాబాద్కు తిరిగి వచ్చిన సుభాస్ గురించి దావూద్ ఇబ్రహీం మనుషులు వేట మొదలుపెడతారు. సుభాస్ ఫ్రెండ్స్ని ఆరుగురిని చంపుతారు. చివరికి సుభాస్ హైటెక్ సిటీలోని ఓ కాంటీన్లో పనివాడిగా ఉన్నాడని తెలుసుకొని బీహార్ బిక్కూ యాదవ్, బొంబాయి పాండాలతో పాటు వారి అనుచరులను తీసుకొని కాంటీన్ని చుట్టుముడతాడు దావూద్ ఇబ్రహీం.
చక్రబంధంలో ఇరుక్కున్నానని గ్రహించిన సుభాస్ రౌడీల మధ్యలో కుర్చీ మీద కూర్చొని ‘‘ఎందుకురా నన్ను రెచ్చగొడతారు. నా ఉగ్రస్వరూపం చూస్తే మీరు తట్టుకోలేరురా. అసలే నేను మర్మకళతో సల సల మరిగి పోతున్నాను’’ అంటాడు.
పాండా ‘‘అరేయ్… ’’ అంటూ ఐదు బారల పొడుగున్న కత్తిని తిప్పుతూ ఉరికొస్తుంటాడు. వాని పొడుగు జుట్టు మొహం నిండా పడడం వల్ల వాని కళ్ళల్లోని రౌద్రం కనిపించదు.
సుభాస్ ఏమాత్రం చలించకుండా ‘‘నాన్నా… పాండా… ఒకసారి వెనక్కి చూడమ్మా’’ అంటాడు. పాండా ఆశ్చర్యపోయి వెనక్కి తిరిగే సరికి బిక్కూ యాదవ్ ఒక్క పోటు పొడవగానే పాండా చచ్చిపోతాడు. పాండా మనుషులులంతా బిక్కూ యాదవ్ గ్రూపులో చేరిపోతారు. ఇది సుభాస్ బిక్కూ యాదవ్ కలిసి ఆడిన నాటకం అని దావూద్ గ్రహిస్తాడు.
దావూద్, బిక్కూల మధ్యన భీకర పోరు జరుగుతుంది. బిక్కూ గాంగ్ అంతా చనిపోతుంది. కూర్చొని ఫైటింగ్ ను చూస్తున్న సుభాస్ వెనక నుండి ఎవరో పొడవబోయే సరికి అప్పుడే అక్కడకు చేరుకున్న కేరళ అమ్మాయి అడ్డుపడి ప్రాణ త్యాగం చేస్తుంది. చనిపోయేటపుడు ‘‘నా అక్కలిద్దరిని బాగా చూసుకో బావా’’ అని సుభాస్ తో అంటుంది.
దావూద్ గాంగ్ మిగులుతుంది. సుభాస్ ఆవేశం కట్టలు తెంచుకోగా, దిక్కులు పిక్కటిల్లేలా ‘‘ఒరేయ్… కొజ్జాగా, నీ కొమ్ములు విరిచి కోలాటం ఆడతారా’’ అని ఒళ్ళు విరుచుకొని మర్మకళ ఉపయోగించి దావూద్ ఇబ్రహాంతో సహా అందరి నరాలు పీకి కొక్కాలకు తగిలిస్తాడు. జానకి, రాధ వచ్చి సుభాస్ ను కౌగిలించుకుంటారు.
డీజీపీ హడావుడిగా వచ్చి ‘‘కంగ్రాట్స్ మిస్టర్ సూర్యా ఐ.పి.ఎస్. ఎన్నో ఏళ్ళుగా చట్టానికి దొరక కుండా నేరాలు చేస్తున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ని మట్టు బెట్టి నీ దేశభక్తిని చాటుకున్నావ్. పోలీసు డిపార్ట్మెంట్లో అత్యంత ప్రతిష్టాకరమైన ‘‘శౌర్య పతకం’’ ప్రదానం చేస్తున్నాను’’ అంటూ సుభాస్ మెడలు వంచి మెడల్ వేస్తాడు. ‘అశుభం’ అని టైటిల్ పడుతుంది.
* * *
సినిమా చూసిన రెండు రోజులకు కోలుకున్న పోలీసులు డైరెక్టర్, నిర్మాతల మీద కేసు ఫైల్ చేశారు. కోర్టు అత్యవసర కేసుకుంద విచారించి ‘‘డైరెక్టర్ అరివీర భయంకర్కు, నిర్మాత ప్రతీకారం పాపారావుకి, కథారచయిత శాడిస్ట్ శ్యాం కు హెల్మెట్ లేకుండా ఈ సినిమా చూపించాలి’’ అని ఉత్తర్వులు ఇచ్చి, వాళ్ళ కళ్ళల్లో భయం తాండవిస్తుండగా జడ్జి బెంచ్ దిగిపోయాడు.
.
ఇదీ ఏదుల గోపిరెడ్డి అనే పోలీసాయన లాఠీ రాసిన జాతిరత్నాలు అనే పుస్తకంలో ఒక కథ… అలాంటి హ్యూమరస్ కథలు ఎన్నో…. కరకు లాఠీ, కానిస్టేబుల్‌కు ఏం తెలుసు కలం రచన అని తప్పుబాటలో ఆలోచించకండి… తన లాఠీయే ఓ కలం… ప్రతులకు… నవోదయ, లోగిలి, నవ తెలంగాణ, న్యూ విశాలాంద్ర & Writer ఫోన్ 8555947800… అమెజాన్ ఆల్సో…
Share this Article