.
( ప్రియదర్శిని కృష్ణ
) …. ‘జగడపు చనువుల జాజర’ అనే అన్నమయ్య కీర్తనకి మా గురువు గారు తీసిన ‘అన్నమయ్య’ సినిమాలోని ట్రాక్ పైన గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జనాలు తెగ డాన్సులు వేస్తున్నారు… అసలు వీరికి దాని అర్థం ఏమాత్రం తెలియదని ఈ కీర్తనలు బాగా పరిచయం ఉన్నవారికి తెలిసిపోతుంది…
వీరందరు వేసే కుప్పిగంతులు చూస్తున్నప్పుడు ఆ కీర్తన టీకా తాత్పర్యం గుర్తొచ్చినప్పుడు కొన్నిసార్లు నవ్వు వచ్చినా, చాలాసార్లు చిరాకే వేస్తోంది…
Ads
ఈ శృంగార సంకీర్తనను భక్తిగా పాడినా, ఆ భక్తి భావంతో నర్తిస్తున్న వారి అమాయకత్వానికి వందనాలు… తెలుగు జానుతెనుగు, ప్రాచీన తెలుగు అర్థమయ్యేవారికి నా మనోభావాలు కూడా అర్థమవుతాయని నేను ఫీలవుతున్నాను…
మరీ ముఖ్యంగా…. ’భారపు కుచముల పైపై కడు సింగారము నెరపెడి…..’ అన్నచోత ఈ జనాల కుప్పిగంతులు వర్ణనాతీతం… కానీ, ఈ శృంగార కీర్తన గురించి… పదకవితా పితామహుడైన అన్నమయ్య వాడిన జానుతెనుగు పద కూర్పుల గురించి మాత్రం రాయాలని ఉంది…
ముందుగా ఈ కీర్తనలోని కొన్ని లైన్ల అర్థం చూస్తే…… ’జగడపు చనువుల జాజర….’ ఇందులోని జాజరకి ఉన్న చాలా అర్థాల్లో ముఖ్యమైనవి- ఆట, క్రీడ అనేవి ఇక్కడ పొసిగిన అర్థాలు. మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో జాజరని కోళ్ళాటం లాంటి సంప్రదాయ బృంద భక్తి నృత్యాల్లో ఆడుతూ ఉంటారు…
వేంకటేశ్వరుడు తన దేవేరితో కలహించి- చిరు తగాదాలతో ఉండగా చెలులందరూ చేరి జాజర ఆడుతూ పూలు చల్లుతూ తిరుగుతున్నారు….
రెండో చరణం- ‘భారపు కుచముల పైపై కడు సింగారము నెరపెడి…..’ అలా ఏకాంత సమయాన్ని ప్రణయ కలహంతో గిల్లికజ్జాలతో సరస సల్లాపాలలో ఉంటే చుట్టూ చెలులు చేరి చల్లుతున్న పూల పుప్పొడి జలజల జారి దేవేరి బరువైవ వక్షాలపై రాలి పడగా, స్వామి గట్టి బలమైన ఆలింగనంతో, ఆ పుప్పొడి సుగంధాన్ని వెదజల్లుతూ శ్రీపతికి కూడా అంటి మరింత పరిమళాన్ని వెదజల్లుతోంది…
ఇంత అందంగా, ఇంత హృద్యంగా, ఇంత సున్నితంగా, ఇంత గాఢంగా, ఇంత లోతుగా అన్నమయ్య పదాలను రంగరించి వాడితే, మన చచ్చుపుచ్చు రీళ్ళమంద మాత్రం కుచములు అనగానే స్థనద్వయాలను దరిద్రమైన ‘హస్తాభినయం’ తో రోత పుట్టేలా డాన్సులు చేస్తున్నారు…
ఎందుకురా అయ్యల్లారా, అమ్మలక్కల్లారా, మీకు ఈ ఘననామ సంకీర్తనలు, శృంగార కీర్తనలకు మీ రోత రీళ్ళు… మీకంటూ ఐటం సాంగ్స్ ఉన్నాయిగా … వాటికి గెంతవచ్చుగా కుప్పిగంతులు….!!
పదకవితా పితామహుడైన అన్నమయ్య రాసిన జాజర కీర్తన పూర్తి లిరిక్ మీకోసం :
జగడపు చనువుల జాజర
సగినల మంచపు జాజర ॥పల్లవి॥
మొల్లలు తురుముల ముడిచిన బరువున
మొల్లపు సరసపు మురిపెమున
జల్లన పుప్పొడి జారగ పతిపై
చల్లేరతివలు జాజర ॥చ1॥
భారపు కుచముల పైపై కడు సింగారము నెరపెడి గంధఒడి చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజర ॥చ2॥
Share this Article