అది 1982-83… పాకిస్థాన్‌లో ఇండియా క్రికెట్ టెస్ట్ సీరీస్ ఆడుతోంది… పాకిస్థాన్ మంచి జోరు మీదుంది… ఓసారి లాహోర్‌లో గెట్‌టుగెదర్ ఏర్పాటు చేశారు, క్రికెటర్ల గౌరవార్థం… అక్కడికి పాకిస్థానీ సింగర్ నూర్జహాన్ వచ్చింది… జట్టు మేనేజర్ ఆమెకు ‘‘తెలుసు కదా, ఈయన మా కెప్టెన్ సునీల్ గవాస్కర్’’ అంటూ పరిచయం చేయబోయాడు… ఆమె పెద్ద మెంటల్ కేసు… ‘’ఓహ్, అలాగా… నాకు ఇమ్రాన్ ఖాన్ తెలుసు, జహీర్ తెలుసు’’ అన్నదామె… అసలే ఇమ్రాన్ పరుగులు, జహీర్ వికెట్లతో గవాస్కర్‌కు పుండు సలుపుతోంది… ఆమె మాటలు కారం చల్లినట్టయింది… మేనేజర్ ఆమెను ‘‘ఫేమస్ సింగర్ నూర్జహాన్’’ అని పరిచయం చేయబోతే… ‘‘ఓహ్, అలాగా… నాకు ఒక్క లతామంగేష్కర్ అనే సింగర్ మాత్రమే తెలుసు’’ అని అక్కడి నుంచి కదిలాడు…
విలేకరుల సమావేశం… నటి నిత్యామేనన్‌ను ఎవరో ప్రభాస్ ప్రస్తావన తెచ్చి తెలుసా అనడిగాడు… సినిమా రిపోర్టర్ల ప్రతిభ గురించి ఈమధ్య కొన్ని విషయాలు చెప్పుకున్నాం కదా, ఫస్ట్ నుంచీ అంతే… ఆమె అమాయకంగా ప్రభాస్ ఎవరు అనడిగింది… ఇంకేం..? దుమ్ము రేపేశారు… ఫాఫం నిత్య, చాలా ఏళ్లు ఆ ప్రభావాన్ని భరించాల్సి వచ్చింది… ప్రభాస్ అంటే ఇప్పుడు బాహుబలి కావచ్చు, కానీ అప్పటికి ఓ సగటు తెలుగు హీరో… ఓ మలయాళీ నటికి తెలియాలని ఏముంది..?
ఒకసారి ప్రఖ్యాత నటుడు దిలీప్ కుమార్, ప్రముఖ పారిశ్రామికవేత్త జేఆర్‌డీ టాటా పక్క పక్క సీట్లలో కూర్చుని విమానంలో ఎటో వెళ్తున్నారు… హీరోలందరికీ తాము ఈ భూమి మీద అవతరించిన దైవప్రతినిధులం అనే అహం ఉంటుంది కదా… ఈ టాటా మాత్రం అతన్ని అస్సలు దేకడం లేదు… ఆయన అప్పటికే ఈ దేశ వ్యాపార, పారిశ్రామిక రంగాలకు వెన్నెముక… అందరూ దిలీప్ పట్ల ఆరాధనగా చూస్తున్నారు, టాటా మాత్రం టీ తాగుతూ, పేపర్ చదువుతూ, కిటికీ నుంచి బయటికి చూస్తూ దిలీప్ మొహం కూడా చూడలేదు… దిలీప్ అహం నేలకు దిగింది… ‘‘నా పేరు దిలీప్, నేను సినిమా హీరోను’’ అని పరిచయం చేసుకున్నాడు… ‘‘ఓహ్, అలాగా, నాపేరు టాటా’’ అని చిరునవ్వు నవ్వేసి కదిలాడు ఆయన…
Ads
మనుషుల్ని గుర్తుపట్టడం వేరు, గుర్తించడం వేరు… ఉద్దేశపూర్వకమూ కావచ్చు, వ్యూహాత్మకమూ కావచ్చు, అసలు అలాంటిది ఏదీ లేకపోవచ్చు…! ఈ మూడు ఉదాహరణలూ ఎందుకంటే… ఈరోజు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సినిమా హీరోలందరూ జీరోలే అని వెటకరిస్తూ, మొన్నటి జగన్- సినీహీరోల భేటీపై సుదీర్ఘవ్యాసం రాశాడు… సిగ్గూశరం లేదా జగన్ ఎదుట మోకరిల్లడానికి..? పవన్ కల్యాణే అసలు హీరో… ఒక్కడికీ మర్యాద ఇవ్వలేదు జగన్, ఏం, చచ్చిపోతారా జగన్ ఎదుట సాగిలబడకపోతే..? జగన్ దగ్గరకు వెళ్తే స్వాగతం లేదు, అదే చంద్రబాబు అయితేనే ఎదురేగి, పన్నీరు జల్లి, అడిగినవన్నీ ఇచ్చి, ఒక్కొక్కరినీ అలుముకుని ఆదరించేవాడు తెలుసా..? అన్నట్టుగా ఏదో ఏదో రాసేశాడు… రెండు ఏనుగుల్ని తీసుకొచ్చి, దండలు వేయించాల్సి ఉండిందా..?!
(తీసుకున్న పొలిటికల్ లైన్ ఎలాంటిదైనా రాధాకృష్ణ హీరో… ఈ సోకాల్డ్ దైవాంశసంభూతులు ఆప్టరాల్ జీరోలు అని అందరి బట్టలిప్పేశాడు… కాకపోతే ఎగ్జిబిటర్లు, థియేటర్ల సమస్యపై హీరోలతో సమావేశం ఏమిటి అనే ప్రధాన ప్రశ్న మరిచిపోయాడు… కానీ పోసాని, ఆలీ, నారాయణమూర్తి పాత్రలు ఏమిటి ఆ భేటీలో అనడిగాడు… ప్రభుత్వం ఎదుట సాష్టాంగం చేయకపోయినా బాలయ్య అఖండ వసూళ్లతో దుమ్మురేపాడనే ప్రస్తావనే రాలేదు, అదేమిటో మరి..?)
ఆ వ్యాసంలో ఓచోట ఒక వాక్యం ఉంది… అంతకుముందు ఓసారి జగన్ వద్దకు వెళ్తే రాజమౌళిని తను గుర్తేపట్టలేదు అని రాసుకొచ్చాడు… అపజయమే ఎరుగని రాజమౌళికి, తెలుగు సినిమాను జాతీయ-అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోయిన తనకు ఎంత అమర్యాద పాపం అని తెగబాధపడిపోయాడు… సో వాట్..? రాజమౌళిని గుర్తుపట్టాలని ఏముంది..? ఐనా అంతటి విశేష పేరుప్రఖ్యాతుల ప్రముఖుడు మరి జగన్ వద్దకు వెళ్లి ఎందుకు దేబిరించాడట మరి..?!
నా దగ్గరకు వచ్చి మోకరిల్లితే తప్ప ఎత్తిన కొరడా దింపను అని జగన్ కబురు చెప్పి పంపాడా ఏమైనా..? ఈరోజు ముడ్డి కింద సెగ తగుల్తోంది కాబట్టి ‘‘బాబ్బాబు, త్వమేవ శరణం నాస్తి’’ అని అహాల్ని, హీరోయిజాల్ని తీసిపారేసి, బోర్లాపడుకుని దండాలు పెట్టారు… దిగ్రేట్ మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రి, సొంత పార్టీ పెట్టి రాష్ట్రమంతా వైఎస్ఆర్‌కు దీటుగా జనంలో తిరిగిన అత్యంత పాపులర్ హీరో చిరంజీవి పూర్తిగా పాతాళంలోకి తలవంచేసి, జగన్‌ను ఎలా ప్రాధేయపడ్డాడో సోషల్ మీడియాలో తెగ సర్క్యులేటవుతున్న వీడియోలో చూశాం కదా…
ఐనా, రాజమౌళిని జగన్ గుర్తుపట్టాలని ఏముంది..? ఫాఫం జగన్ తను యవ్వనంలో ఉన్నప్పుడు బాలయ్య అభిమాని అంటారు, అప్పట్లో ఏం సినిమాలు చూశాడో గానీ, తరువాత ఒక్క తెలుగు సినిమాను కూడా చూసి ఉండడు, ఇతర డబ్బు సంపాదన యవ్వారాల్లో బిజీ… అందరికీ అన్ని రంగాల్లోని ప్రముఖుల్ని చూడగానే గుర్తుపట్టేంత జనరల్ నాలెడ్జ్ రాధాకృష్ణకు ఉన్నంతగా జగన్‌కు ఉండాలనేముంది..? చంద్రబాబు వేరు, ఆయన అందరినీ గుర్తించగలడు, అదొక ఎన్‌సైక్లోపీడియా… ఫాఫం, జగన్‌కు అంత తెలివి ఎక్కడుంది..?!
Share this Article