కులం కంపులో బతుకుతూనే, బయటికి మాత్రం కులం పేరు ఉచ్చరించడానికి మస్తు నాగరికతను నటించే ప్రపంచం మనది… ప్రత్యేకించి సినిమా ఇండస్ట్రీ… మరీ ప్రత్యేకించి తెలుగు ఇండస్ట్రీ… ఇది ఇప్పుడు ఎందుకు మళ్లీ చర్చల్లోకి వస్తున్నదీ అంటారా… ? జగన్ ప్రభుత్వం ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ మీద అంకుశం ప్రయోగిస్తోంది కాబట్టి… తెలుగు సినిమా పెద్దలు కిక్కుమనడం లేదు కాబట్టి… తమ జోలికి ఎవరైనా వస్తే గాయిగత్తర చేసే సినిమా పెద్దతలకాయలు సైలెంట్… సో, కాస్త నిజంనిజంగానే మాట్లాడుకోవాలి… అందరికీ తెలుసు, తెలుగు ఇండస్ట్రీ అంటేనే కమ్మదనం… రెడ్లకు పెద్దగా గ్రిప్ దొరకలేదు… సుధాకర్‌రెడ్డి, దిల్‌రాజు ఎట్సెట్రా డిస్ట్రిబ్యూషన్ ఫీల్డులో కాస్త గ్రిప్ సంపాదించినా… చిరంజీవి ఆధ్వర్యంలో కాపులు కాస్త గ్రిప్ అందిపుచ్చుకున్నా సరే… స్టిల్ కమ్మలదే రాజ్యం… స్టూడియోలు, సినిమా నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్ మాఫియా నుంచి హీరోల దాకా… ఇక విషయంలోకి వెళ్దాం…
జగన్‌ను తెలుగు ఇండస్ట్రీ ఓ లీడర్‌గా గుర్తించలేదు… వాళ్లకు చంద్రబాబు మాత్రమే కనిపిస్తాడు… ఆయనకే డప్పు కొడతారు, చంద్రబాబుకు అన్నిరకాలుగా అండగా నిలిచే ప్రధానరంగాల్లో టాలీవుడ్ కూడా..! రాజకీయంగా తను సుస్థిరం కావడానికి జగన్ కమ్మ ఆర్థిక స్థంభాలను కూల్చేసే పనిలో ఉన్న విషయం తెలిసిందే కదా… పవర్, కంట్రాక్టులు, లిక్కర్, మెడికల్, ఎడ్యుకేషన్, రియల్ ఎస్టేట్ మాఫియాలపై రకరకాల దెబ్బలు కొడుతూ వస్తున్నాడు… ఇన్‌క్లూడింగ్ అమరావతి… తను పాదయాత్ర చేస్తే థర్టీ ఇయర్స్ పృథ్వీ, వెటరన్ నటుడు విజయ్ చందర్ తప్ప ఇంకెవరూ జగన్‌కు సంఘీభావం చెప్పలేదు… ఆలీ, కాస్త మోహన్‌బాబు జగన్‌తో బాగున్నారు, అంతే… ఇంకెవరూ జగన్‌ను దేకలేదు… చివరకు తను సీఎం అయ్యాక కూడా ఎవరూ పట్టించుకోలేదు… పైగా ‘కొత్తగా ఎవరు సీఎం అయినా వెళ్లి దండాలు పెట్టాలా’ అంటూ రాజేంద్రప్రసాద్ వంటి వెటరన్ నటులు వ్యాఖ్యలు చేసినట్టు వార్తలొచ్చినయ్…
చిరంజీవి కూడా ఎన్నికల ఫలితాల ముందుదాకా జగన్‌ను ఏమీ పట్టించుకోలేదు, పవన్ కల్యాణ్ ఎలాగూ జగన్‌కు ప్రత్యర్థే… సో, జగన్ సీఎం అయ్యాక చిరంజీవి ఒక్కసారిగా మేల్కొన్నాడు, అసలే ఇండస్ట్రీకి పెద్దమనిషి అవుదామనే తహతహ… అందుకని తనకు డిప్యూటీగా ఓ కమ్మ హీరో నాగార్జునను వెంటేసుకుని జగన్‌ను కలిశాడు… కానీ టికెట్ రేట్లు వంటి అంశాల్లో దగ్గుబాటి సురేష్ అక్కడక్కడా జగన్ పట్ల నెగెటివ్ వ్యాఖ్యలు చేసినట్టుగా జగన్‌కు సమాచారం ఉంది… వాళ్ల విశాఖ స్టూడియో భూములపైనా ఓ సస్పెన్స్ నెలకొని ఉంది… జగన్ ఎప్పుడూ పెద్దగా బయటపడడు… ఆన్‌లైన్ టికెట్ల యవ్వారంలో గోల్‌మాల్ సాగుతోందని విమర్శలున్నయ్… ఏపీలో డిస్ట్రిబ్యూషన్ మాఫియా బలంగా ఉంది… చిన్న సినిమాలను బతకనివ్వడం లేదు… ఎంతసేపూ పెద్ద హీరోలు, పెద్ద సినిమాలే… ఏపీలో షూటింగులు చేయడం లేదు… యాక్టివిటీ లేకుండా పోయింది… సో, ఓ నిర్ణయం తీసుకున్నాడు, రైల్వే ఆన్‌లైన్ ట్రాకింగ్ లాగే సినిమా టికెట్లకూ ఓ పద్థతిని తీసుకొస్తున్నారు… ఈ జీవో అదే… ఆ టికెట్ డబ్బులన్నీ ప్రభుత్వం వద్దకు చేరతాయి, తరువాత తన టాక్స్ తీసేసుకుని, ఎవరెవరికి ఎంత పంచాలో ప్రభుత్వమే పంచుతుంది…
Ads
ఇందులో సినిమా ప్రతినిధులు ఎవరూ లేరు… ఉండరు… జగన్ ఆలోచనలు, అడుగులు అర్థం చేసుకోవడం టాలీవుడ్‌కు ఇప్పట్లో సాధ్యం కాదు… దానిపై జగన్‌కు కోపం ఎందుకు ఉన్నదో కూడా సరిగ్గా టాలీవుడ్ పెద్ద తలలు అర్థం చేసుకునే స్థితిలో లేవు… అర్థమైనా కిమ్మనవు… కొత్తగా ఏర్పడే ప్రజాప్రభుత్వాలకు ఆహ్వానించడం, స్వాగతించడం, ఓ రెండు పూలబొకేలు ఇచ్చి అభినందించడం ప్రతీ కీలకరంగానికి అలవాటే… అదొక మర్యాద… రేప్పొద్దున ఏమైనా ఇష్యూస్ వస్తే, సంప్రదింపులు జరపడానికి ఓ చానెల్ ఏర్పాటు చేసుకోవడం… ఆ సోయి కూడా టాలీవుడ్ పెద్దలకు లేదు… కుర్చీ మీద కూర్చున్న పాలకుడికి ఇగో ఉండదా మరి..? పైగా తన ప్రత్యర్థికి మద్దతువర్గం…! ఈ ఆన్‌లైన్ టికెట్ల సంగతి సరే, ఇంకేమైనా ప్రభుత్వపరమైన కఠిన నిర్ణయాలు ఉంటాయా..? ఈ ప్రశ్నకు ప్రస్తుతం జవాబు లేదు… జగన్ ఆలోచనల్లో ఏముందో తన చుట్టూ ఉండేవాళ్లకే తెలియదు… సైలెంటుగా ఇలాంటి జీవోలు మీదపడేవరకూ తెలియదు… తెలియదు…!!
Share this Article