ఒక గుడిలోకి వెళ్లాలంటే ఆ దేవుడి మీద విశ్వాసం ఉన్నట్టు ప్రకటించాలా..? గుళ్లు- సంప్రదాయాలు- కట్టుబాట్లపై ఓ కీలక ప్రశ్నను జగన్ సంధించాడు యావత్ హిందూ సమాజానికి..! ఓ చర్చకు తెరతీశాడు…
తిరుమల దర్శనానికి రావాలంటే తప్పకుండా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని కూటమి ప్రభుత్వం పట్టుబడుతోంది… మరి అంతకుముందు వెళ్లాడు కదా..? వెళ్లాడు… తను అధికారంలో ఉన్నప్పుడు డిక్లరేషన్ అడిగే సాహసం ఎవరికి ఉంటుంది..? తను నియమించిన శ్రీవారి భృత్యగణమే కదా…
అంతకుముందు ఓసారి ఇచ్చాడు, ఇక పదే పదే ఇవ్వాల్సిన అవసరం లేదని కొందరి ఉవాచ… ఐనా సరే, జగన్ ఇప్పుడు మాత్రం డిక్లరేషన్ దేనికి..? మానవత్వమే నా మతం, అదే నా డిక్లరేషన్ అంటున్నాడు… తిరుమల లడ్డూలో కొవ్వు నూనెల కల్తీ నెయ్యి వివాదం ఎటెటో దారితీస్తోంది… జగన్ దీన్ని స్థూలంగా హిందూ ఆలయాల ప్రవేశాలకు సంబంధించిన పద్ధతుల వైపు మళ్లించాడు ఇప్పుడు… ఇదేం దేశం అంటున్నాడు…
Ads
సరే, జగన్ వ్యాఖ్యలకు కూటమి ప్రభుత్వ అధినేత చంద్రబాబే ఘాటుగా రిప్లయ్ ఇచ్చాడు… ఏ మత ప్రార్థనా స్థలం అయినా సరే అక్కడి సంప్రదాయాలు, పద్దతులు పాటించాల్సిందే అంటున్నాడు… పవన్ కల్యాణ్ అయితే సనాతన ధర్మ పరిరక్షణ ఛాంపియన్ అనిపించుకునే విశ్వప్రయత్నంలో ఉన్నాడు…
బీజేపీ సరేసరి… తొలిసారిగా జగన్‌కు వ్యతిరేకంగా నిరసనలకు పూనుకుంటోంది… జగన్ రాకతో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ క్రియేటవుతుందనే సాకుతో ప్రభుత్వం ఆంక్షలు, షరతులతో కఠినంగా వ్యవహరించడానికి రెడీ అయిపోయింది… తప్పనిసరై జగన్ తన టూర్ రద్దు చేసుకుని, ఇదుగో డిక్లరేషన్ వివాదంలో తనూ కొంత ఆజ్యం పోశాడు…
ఇదే విషయంలో సెర్చ్ చేస్తుంటే… తెలిసిన విషయాలు… ప్రతి గుడికీ ఓ పద్ధతి ఉంటుంది… ఎన్నాళ్లుగానో భక్తులు వాటిని పాటిస్తుంటారు… ఇతర మతస్తులు కూడా వాటిని గౌరవిస్తారు… 1984… ఇందిరాగాంధీ ఒడిశాలోని ప్రఖ్యాత హిందూ దేవాలయం పూరి జగన్నాథాలయంలోకి ప్రవేశించాలని అనుకుంటే అర్చకగణం ససేమిరా అంది… కారణం, ఆమె పార్శీ మతస్తుడైన ఫిరోజ్ గాంధీని పెళ్లి చేసుకోవడం..!
1934… మహాత్మాగాంధీ తన అనుచరుడు వినోభా భావే, ఇతర అన్యమతస్తులతో గుడిలోకి ప్రవేశించాలని సంకల్పిస్తే తిరస్కారమే ఎదురైంది… ‘పిరాలి బ్రాహ్మణుడ’నే కారణంతో రవీంద్రనాథ్ ఠాగూర్‌ను కూడా గుడిలోకి రానివ్వలేదు ఓసారి…
2005లో పూరి గుడిని థాయ్‌లాండ్ మహారాణి మహాచక్రి శ్రీధరన్ సందర్శించాలని అనుకుంది… దేవస్థానం తిరస్కరించింది… కారణం, ఆమె బౌద్ధాన్ని పాటిస్తుంది… కానీ భారత దేశానికి చెందిన బౌద్ధులు, సిక్కులు, జైన్లకు ఆ గుడిలో ప్రవేశానికి అభ్యంతరాలు లేవు… ఇలాగే 1988లో రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ నేపాల్ వెళ్లారు…
ఖాట్మండులోని ప్రఖ్యాత పశుపతినాథాలయంలోకి సోనియాకు ప్రవేశం నిరాకరించబడింది… కారణం, ఆమె క్రిస్టియన్… (నిజానికి రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకుంది కాబట్టి రాజీవ్ మతమే ఆమె మతం కదా అంటారా..? కానీ రాజీవ్ పార్శీ మతస్తుడి కొడుకు… అదొక చర్చ…) నేపాల్ రాజు కూడా గుడి నిర్ణయాన్ని సమర్థించాడు… ఆ పద్ధతి విషయంలో తను ఇంతటి బలమైన దేశంతో గోక్కోవడానికి కూడా సిద్ధపడ్డాడు… నిజంగానే రాజీవ్ గాంధీ ఆ తరువాత నేపాల్ పట్ల ఓ శతృభావనను ప్రదర్శించాడని, అప్పటి నుంచే నేపాల్ ఇండియాకు దూరం కావడం ప్రారంభమైందంటారు…
ఇవే కాదు… ఇండియాలోని చాలా గుళ్లలో హిందువేతరులకు ప్రవేశం లేదు… తిరుమలలో మాత్రం దేవుడి మీద విశ్వాసం ఉన్నట్టు ప్రకటిస్తే లోనకు రానిస్తారు… చాలామంది ప్రముఖులు అలా డిక్లరేషన్స్ ఇచ్చారు… అది ఆ గుడికి, ఆ దేవుడికి ఇచ్చే వినయపూర్వక విశ్వాస ప్రకటన… ఇప్పుడు జగన్ ఆ పద్దతినే తిరస్కరిస్తున్నాడు, ఇదేమిటని ప్రశ్నిస్తున్నాడు…
ఒక్కో గుడికి ఒక్కో పద్ధతి ఉంటుంది… కొన్ని గుళ్లల్లోకి పురుషుల్నే రానివ్వరు… అంతెందుకు, శబరిమల వివాదం తెలుసు కదా… రుతుమహిళల్ని రానివ్వరు… సుప్రీంకోర్టు ఏదో చెప్పింది కానీ భక్తగణం తాము విశ్వసిస్తున్న పద్దతులకే కట్టుబడ్డారు… దాన్ని బ్రేక్ చేయడానికి ప్రయత్నించిన లెఫ్ట్ ప్రభుత్వం భంగపడింది… హిందూ సమాజం ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది… సీపీఐ చెంపలేసుకుంది… సీపీఎంకూ మొన్నటి ఎన్నికల్లో అర్థమైంది…
మొన్నమొన్నటిదాకా బీజేపీ- జగన్ నడుమ రహస్య స్నేహం… తరువాత జగన్‌ను వదిలేసిన బీజేపీ నమ్మకస్తుడు గాకపోయినా సరే చంద్రబాబుతో కలిసింది… ఈ లడ్డూ వివాదంతో కేంద్రంలోని బీజేపీకి జగన్ మీద కోపం పెరిగిపోయింది… అందుకే బీజేపీ శ్రేణులు తమ పరిమిత బలాల్ని సమీకరించుకుని జగన్ ధోరణులన్ని ప్రతిఘటించడానికి, నిరసించడానికి సిద్ధమవుతున్నాయి… ఇప్పుడిక హిందూ గుళ్లల్లో ప్రవేశమనే మరో సెన్సిటివ్ టాపిక్‌ను జగన్ నెత్తికెత్తుకున్నాడు… రాష్ట్రంలో చంద్రబాబు సరే, కేంద్రంలోని బీజేపీ ప్రతిస్పందన ఏమిటనేది ఆసక్తికరంగా మారింది..!
ఇప్పటికే లడ్డూ అపచారం విషయంలో జగన్ మీద హిందూ సమాజంలో వ్యతిరేకత పెంచేందుకు కూటమి ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది… దానికితోడు అసలు గుడిలోకి వెళ్లడానికి డిక్లరేషన్ ఎందుకనే కీలక ప్రశ్నను లేవనెత్తి, ఆ గుడి పద్ధతుల్ని నిరాకరిస్తూ జగన్ మరో వివాదంలోకి తనంతటతానే ప్రవేశించాడు..!! ఇప్పుడు తన రాకకు బారికేడ్లను గనుక ఊహించి ఉంటే, జగన్ తన భృత్యప్రముఖుడు అధర్మారెడ్డితో అసలు డిక్లరేషన్ రూల్‌నే తీసేయించేవాడా..?!
Share this Article