ఏం భిన్నంగా ఉంది జగనన్నా… మరీ 23 సీట్లకు చంద్రబాబును ఛీత్కరించేసి, నిన్ను గద్దెనెక్కిస్తే ఏం భిన్నంగా ఉంది..? నిష్ఠురం కాదు… నువ్వే చెప్పు… ఎలాగూ మీడియా ముందుకు రావుగా… నువ్వు గొప్పోడివి, మొన్నటి ఎన్నికల ముందు దాకా చంద్రబాబు కూడా అంతే… మీరు గొప్ప వ్యక్తులు… తెలుగు జాతి ఆశాకిరణాలు… ఆయన అమరావతిని మధ్యలో పడుకోబెట్టాడు… గ్రాఫిక్స్‌తో జనాన్ని పిచ్చోళ్లను చేశాడు… మూడేళ్లు కావస్తోందిగా, మరి జగనన్న ఏం చేశాడు..?
మండలి రద్దు నుంచి సినిమా టికెట్ల ధరల దాకా… ఎన్నో యూటర్నులు… ఒక కేసీయార్‌కు చూపించుకోవడానికి ఓ కాళేశ్వరం ఉంది, ఓ మిషన్ భగీరథ ఉంది… మరి ఏపీలో..? పోలవరం ఏమైంది..? ఎత్తు తగ్గిస్తామని మోడీ చెప్పాడా, షెకావత్ చెప్పాడా అనే వెక్కిరింపులు సరే… ఈ రెండున్నరేళ్లలో పాత కంట్రాక్టర్లను తరిమేసి, ఆత్మీయ మేఘాను తెచ్చిపెడితే… ఇంతకీ పని ఎంతదాకా జరిగింది..? సీమ లిఫ్టు ఎక్కడి దాకా వచ్చింది..? పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు ఏమైంది..? పోనీ, పాత ప్రాజెక్టుల్లో ఒక్కటైనా కొసెళ్లిందా..?
ఇప్పటికి వచ్చిన పెట్టుబడులెన్ని..? చెప్పుకోదగిన ఓ పెద్ద యూనిట్ వచ్చిందా..? రాష్ట్రంలో చీప్ లిక్కరే లేదంటివి… దబాయింపు సరే, అసలు నిజాలు అందరికీ తెలుసుగా… ఏపీ అంటేనే ఎలాంటి మందు దొరుకుతుందో… రంగుసారాకు వేల కోట్లు… వేలాది కేసులు, కక్షసాధింపులు, నిన్న వైసీపీ ఇంటి దారికోసం ఓ కోమటాయన ఇల్లు కూల్చేశారు… ఏం భిన్నంగా ఉంది జగనన్నా… చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు, ఓ కులం డామినేషన్, వేధింపులు… ఇప్పుడేం భిన్నంగా ఉంది..?
Ads
ఓ వైసీపీ నేత తన కూతురు టాపర్ కావాలని ఓ మైనారిటీ పిల్ల ఉసురు పోసుకున్నారుగా…. దీనికీ వేరే వంకర కథనం అల్లి ఏదో చెప్పేస్తారేమో… అక్కడెక్కడో 20 మంది దాకా ఒకేచోట చనిపోతే అన్నీ సహజమరణాలే అంటుంది మీ సర్కారు… కానీ ఆ ఒక్కచోటే సహజంగా ఎలా రాలిపోతున్నారు..? ఎవరు బాధ్యులు..? పుష్కర మృతుల మీద రచ్చరచ్చ చేశారు కదా మీరంతా… అదొక ప్రమాదం, దుస్సంఘటన, ఈ సారా మరణాలు కూడా అంతేనా..?
ఊళ్లల్లో, పట్టణాల్లో అధికారం రుచిమరిగిన దిగువ స్థాయి నాయకులు చేసే అరాచకాలే పాలకుడి గతిని, కీర్తిని, పాపపుణ్యాల స్థితినీ నిర్దేశిస్తాయ్… వెనకేసుకొస్తే ఇక క్రమేపీ వెనుకబాటే… చంద్రబాబు దుర్గతి చూడలేదా ఏం..? ఇప్పుడంతా బాగానే కనిపిస్తూ ఉండవచ్చుగాక… మరో 20, 30 ఏళ్లు పాలించాలనే కోరిక ఉండవచ్చుగాక… కానీ ఇలాగేనా..? చంద్రబాబును తరిమేస్తే దక్కిందేమిటి..? ఇదేనా..? కనీసం రాష్ట్ర ఆర్థిక స్థితి కూడా సజావుగా లేదు… పరిస్థితి ఇలాగే దిగజారిపోతుంటే… ఆఫ్టరాల్ ప్రశాంత్ కిషోర్ చేతిలో మంత్రదండం ఏమీ లేదుగా… అబ్రకదబ్ర అని పైకి లేపలేడు…
ప్రత్యేక హోదా, పోలవరం, మూడు రాజధానులు, పోతిరెడ్డిపాడు ఎట్సెట్రా వదిలేస్తే…. ఊళ్లల్లో మీ నాయకగణం అరాచకాల మాటేమిటి..? ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి అనే పచ్చభూతాల్ని కూడా కాసేపు వదిలెయ్… జనానికి ఏం భిన్నంగా కనిపిస్తోంది జగనన్నా… పాలనలో జనం మెచ్చే కొత్తదనం ఏది..? ఒక్క మాట… చంద్రబాబును జనం ఛీత్కరించింది తన పార్టీ నాయకుల అరాచకాలతో విసిగిపోయి… అంతేతప్ప వైఎస్ లెగసీ కోసం కాదు, జగన్ కోసమూ కాదు, ఆ సమయానికి ఓ ప్రత్యామ్నాయంగా నువ్వు కనిపించావు కాబట్టి గెలిపించారు… వైసీపీ నాయకగణంపై అదుపు లేకపోతే, అరాచకం ప్రబలితే ప్రజలు ఏం చేస్తారు..? ఫాఫం, దురదృష్టం ఏమిటంటే… మరో మెరుగైన ప్రత్యామ్నాయం కనిపించకపోవడం…!!
Share this Article