‘‘ఆదాయమే ముఖ్యం అనుకుంటే కేసీఆర్‌తో గానీ, జగన్మోహన్ రెడ్డితో గానీ రాజీపడిపోవడం ఎంతసేపు? ప్రభుత్వానికి సహకరించడానికి అంగీకరిస్తే స్వయంగా వచ్చి కలుస్తానని జగన్మోహన్ రెడ్డి నాకు కబురు పంపడం నిజం కాదా? జగన్మోహన్ రెడ్డి పోకడల వల్ల ఆంధ్రప్రదేశ్ దెబ్బతింటుందని మేం గట్టిగా నమ్ముతున్నాం. ఈ మూడున్నరేళ్లలో ఏం జరిగిందో, జరుగుతున్నదో చూస్తున్నాం కదా? జగన్‌తో రాజీపడటానికి సిద్ధపడి ఉంటే ఈ మూడున్నరేళ్లలో ‘ఈనాడు’, ‘సాక్షి’ తరహాలోనే ‘ఆంధ్రజ్యోతి’కి కూడా 300 కోట్ల ఆదాయం వచ్చి ఉండేది. అంత పెద్ద మొత్తం కోల్పోవడానికి సిద్ధపడ్డాం గానీ జర్నలిజాన్ని అమ్ముకోదలచుకోలేదు…
— ఈ పేరా చదివారు కదా, ఆంధ్రజ్యోతి ఓనర్ రాధాకృష్ణ స్వయంగా రాసుకున్న మాటలే… మూాతపడిన తమ పత్రికను ఓ ఎంప్లాయీ తిరిగి తెరిచి, ధైర్యం నిలిచి, 20 ఏళ్లుగా స్థిరంగా నిలబడటం ఖచ్చితంగా పెద్ద సక్సెస్ స్టోరీ… పైగా ఈనాడు వంటి పత్రికను తట్టుకుని, మధ్యలో వచ్చిన సాక్షిని తట్టుకుని, తనకంటూ ఓ లైన్ క్రియేట్ చేసుకుని, అవసరమున్నప్పుడు నిజంగా తలవంచకుండా నిలబడిన తీరును అభినందిద్దాం… కాకపోతే మాకు ఏ పొలిటికల్ అఫిలియేషన్లూ లేవు అనే ఆర్కే మాటల్ని అయిదో తరగతి పిల్లాడు కూడా నమ్మడు… మీకంటూ ఓ పొలిటికల్ లైన్ ఉండటం తప్పు కాకపోవచ్చు, కానీ పదే పదే మేం న్యూట్రల్ అని చెప్పుకుని, పాఠకుల్ని నమ్మించబూనడం ఓ వృథా ప్రయాస…
పైన పేరాలో ఓ తెంపరితనం కనిపిస్తోంది… ఈనాడు రామోజీరావు జగన్‌తో రాజీపడ్డాడు, జగన్ స్వయంగా వచ్చి నన్నూ కలుస్తానని అన్నాడు, అంగీకరించి ఉంటే ఓ 300 కోట్లు వచ్చేవి అంటున్నాడు ఆర్కే… ‘‘ఏమయ్యోయ్ రామోజీ, నువ్వు వంగిపోయావు, నేను వెన్నువంచకుండా నిలబడ్డాను, చూశావా’’ అని ఆర్కే రామోజీని అడుగుతున్నట్టుగా ఉన్నాయి ఈ వాక్యాలు… జగన్, రామోజీ కలవడం అసత్యం కాదు… తరువాత చాన్నాళ్లు జగన్ మీద రామోజీ ఏమీ రాయనివ్వలేదు, రాయి విసరనివ్వలేదు… ఇప్పుడు ఎక్కడ యవ్వారం ఎదురుతన్నిందో గానీ జగన్ మీద విరుచుకుపడుతున్నాడు…
Ads
ఇప్పుడు ఏ ధూర్త స్థాయికి జారిపోయింది ఈనాడు అంటే… నిన్న విశాఖలో జనసేన, టీడీపీ, వైసీపీ యాక్టివిటీలు జరిగాయి… ఏపీ ఎడిషన్లు, మిగతా పత్రికలు తమ పొలిటికల్ లైన్స్ ను బట్టి కవర్ చేశాయి… హైదరాబాద్ ఎడిషన్ చూస్తే ఈనాడులో జనసేన పవన్ కల్యాణ్‌కు అపూర్వ, అబ్బుర స్వాగతాలట, టీడీపీ ఇంకేదో మీటింగు కవరేజీ కనిపించింది… మరి మంత్రులు పాల్గొన్న వైసీపీ గర్జన వార్త ఏది..? లేదు… కనిపించలేదు… మొత్తం వార్తలు, ఫోటోల్నే ఎత్తిపారేశారు…
రెండురోజులుగా ధర్మాన మీద క్షిపణి దాడులు చేస్తోంది… మరి అప్పట్లో జగన్‌కూ రామోజీకి నడుమ భేటీలో కుదిరిన సయోధ్య ఏమిటి..? ఇప్పుడెందుకు బెడిసికొట్టింది..? ఇలా ఎన్నిరోజులు..? జగన్ మళ్లీ కలిసేవరకేనా..? అవన్నీ ఓ పద్ధతిలో ఆలోచిస్తే జగన్ ఆర్కేను కలవడానికి ప్రయత్నించే ఉంటాడని నమ్మడానికి ఎందుకు అభ్యంతరం..?
ఇక కేసీయార్‌తో ఆర్కేకు నిత్యకయ్యమే… నిజానికి ఇద్దరూ మంచి ప్రాణస్నేహితులు… ఎప్పుడు ఎక్కడ బెడిసికొడుతుందో తెలియదు, పెద్ద మిస్టరీ… ఆ చానెల్‌ను నిషేధిస్తాడు, యాడ్స్ ఇవ్వడు… ఆఫీసు కాలిపోతే అందరికన్నా ముందే వెళ్లి ఆర్కేను అలుముకుంటాడు… వేల గజాల భూమి ఫ్రీగా ఇస్తానంటాడు… అక్కడెక్కడో బస్సు ప్రమాదంలో 53మంది మరణిస్తే అటువైపు వెళ్లని కేసీయార్ ఇక్కడ ఈ ఆఫీసు కాలిపోతే మాత్రం నానా హైరానా పడ్డాడు… కేసీయార్, ఆర్కే బంధం మిస్టరీ ఏమిటో ఎవడికీ అర్థం కాదు… అసలు వాళ్లకైనా సరిగ్గా అర్థమవుతుందా అనేదీ డౌటే… ఏతావాతా తెలుగునాట పత్రిక అంటేనే ఎవరూ శుద్ధపూసలు కారు… పార్టీలతో పెనవేసుకున్న ఏవో బంధాలు, విషాలు, ద్వేషాలు…!! వాటిని బట్టే కథనాలు, వాటి రంగులు… ఏ ఒక్క దానికీ తటస్థత లేదు… ఉండదు… ఉండనివ్వరు…!!
Share this Article