నిజమే చంద్రబాబు గారూ… ఈ జగన్కు ఏమీ చేతకాదు… దుర్మార్గుడు, ఆర్థిక నేరస్థుడు… తనకు ఫాఫం ఏం తెలుసు..? అరె, ఇన్ని విపత్తులు వస్తుంటే ఏం చేస్తున్నాడు తను..? ఏపీ ప్రజలు ఓ దద్దమ్మను సీఎంగా ఎన్నుకున్నారు… నిజమే… ఇప్పుడే కదా చంద్రబాబు గొప్పతనం తెలిసేది… మీరు అక్కడ సంతృప్తిపడాలి… ఈరోజు ప్రధాని మోడీ వేక్సిన్ పరిశీలనకు హైదరాబాద్ వస్తున్నాడంటే… అది ఎవరి పుణ్యం..? మీది…! మీరు చాలా చాలా ముందుచూపుతో ఫార్మా జోన్ ఏర్పాటు చేశారు కాబట్టి, ఈ భారత్ బయోటెక్ వచ్చింది, ఇప్పుడు ఏకంగా కరోనా వేక్సినే తయారు చేస్తోంది… ప్రపంచానికి ఆపద్బంధావి అయింది…
ఫాపం మీరు… ఈ ఫార్మా వ్యాలీ ఏర్పాటు చేస్తున్నప్పుడు కలగనలేదు కదా… ఈ భారత్ బయోటెక్ వాళ్లు రామోజీరావు వియ్యంకులు అవుతారని… ప్రపంచ శ్రేయస్సు కోసం కష్టపడ్డారు… అయినా ఈ లోకం మిమ్మల్ని ఎప్పుడు సరిగ్గా అర్థం చేసుకున్నది గనుక….
Ads
ఇప్పుడూ అదే… జగన్ ఉత్త పులివెందుల మార్కు ఫ్యాక్షనిస్టు… తనకు ఏం తెలుసు..? మీరు అప్పట్లో ఏదో తుపాన్ వస్తే దాని దశ మార్చి తమిళనాడు వైపు వెళ్లగొట్టారు, ఇంకేదో వస్తే ఒడిశా వైపు మళ్లించారు… అసలు సముద్రాన్నే శాసించే సత్తా మీ సొంతం… ఈ మూర్ఖ ప్రజలకు అది అర్థం కాదు కదా… ఈ జగన్కేమో చేతకాదు… లేకపోతే ఇన్నిరోజుల్లో ఒక్క విపత్తునైనా దారి మళ్లించగలిగాడా..? ఉత్త శుద్ధ మొద్దావతారం…
ఇప్పుడు సీఎం కుర్చీలో మీరు గనుక కూర్చుని ఉంటే, ఈ విపత్తులు ఏపీపై దాడి చేయడానికి ఇంత ధైర్యం చేసేవా..? మీరు అధికారంలో లేరనే కదా ఈ విపత్తులకు అంత ధైర్యం..? అందుకే చంద్రబాబు గారూ… ఈ మూర్ఖ ప్రజలకు కావల్సిందే… అనుభవించాల్సిందే… మీ గొప్పతనం అర్థం కావాలంటే ఇది తప్పనిసరి…
అరె, వర్షాలు ఇంకా కురుస్తూనే ఉన్నాయి, ఇప్పుడు సహాయక చర్యలే ప్రధానం, ఇప్పుడు పరిహారాలు, సాయాలు కాదు… అదంతా తరువాత సంగతి అని ఎవరో పనికిమాలినవాడు జగన్ను సమర్థించవచ్చుగాక… కానీ మీరు విపత్తు విజృంభణకు ముందే సాయం చేసేవాళ్లు అనేది వాళ్లకు తెలియదు కదా ఫాఫం… ఎప్పుడో రాబోయే విపత్తు నష్టాలను ముందే అంచనా వేసి, మీరు ముందుగానే సాాయం చేసేవాళ్లు అనే నిజం వాళ్లకు అర్థం కాదు కదా… సో, వాళ్లను క్షమించేసేయండి…
మీకు వీలయితే కాస్త మీ జుబ్లీ హిల్స్ చంద్రభవంతి నుంచి బయటపడి… కాస్త ఏపీ ప్రజల మీద ప్రేమతో… ఆ విజయవాడ కృష్ణా కరకట్టపై ఇంకా నిలబడే ఉన్న మీ నివాసం చేరుకొండి… అంజనం వేస్తారో, అపర మాంత్రికుడిలా స్టాప్ దేర్ అని హూంకరిస్తారో మీ ఇష్టం… ఏపీ ప్రజల కోసం మీరు ప్రాణాలనైనా త్యాగం చేయగల ధీరులు మీరు… ఇకపై రాబోయే విపత్తులనైనా ఆపేయండి… ఏపీ ప్రజలను కాపాడండి… మీరు తప్ప వేరే దిక్కులేదు జనానికి… ప్లీజ్… తెలుగు ప్రజల ఆశాకిరణం, మీరు అలగకండి, ఈ ప్రజల మూర్ఖత్వాన్ని క్షమించేసి, కాపాడండి సార్… ప్లీజు… పెద్దమనసు చేసుకొండి… మీరు తప్ప గత్యంతరం లేదు… ప్లీజు సారూ…. ఈ పరిహారాలు, సాయాలు తరువాత మాట్లాడుకుందాం… సరే అనండి సారూ…!!
Share this Article