ఓ మిత్రుడు చెప్పినట్టు… ఈసారి ఎన్నికలు అక్షరాలా జగన్మోహన్‌రెడ్డికీ ఈనాడు రామోజీరావుకు నడుమ యుద్ధం… నిజమే… స్థూలంగా చెప్పుకోవాలంటే… ఇది వైసీపీ వర్సెస్ యెల్లో కూటమి పోరాటం కాదు… ఇది రెడ్డి వర్సెస్ కమ్మ-కాపు కూటమి పోరాటం కానే కాదు… ఇది జగన్ వర్సెస్ జగన్ చెల్లెలు షర్మిల పోరాటం అసలే కాదు… జస్ట్, జగన్ వర్సెస్ రామోజీ…
కొద్దిరోజులుగా ఈనాడు బరితెగించి, బట్టలు విడిచిపెట్టి, పోతురాజులా బజారులో నిలబడి యెల్లో కొరడాతో ఛెళ్లుఛెళ్లుమని కొట్టుకుంటూ జగన్ ముర్దాబాద్ అని కేకలేస్తోంది.., మాస్ట్ హెడ్ కింద ఫస్ట్ లీడ్ నుంచి మొదలు పెట్టి చివరి పేజీ చివరి కాలమ్ దాకా, ఇమ్‌ప్రింట్ దాకా జగన్ వ్యతిరేక కథనాలు… నిజమో అబద్ధమో జానాదేవ్… ఎంత విషాన్ని, ఎంత విద్వేషాన్ని అక్షరాల్లో నింపావనేదే ప్రధానం…
మరీ ఈరోజు జగన్ అరాచక, నియంత పాలనకు వ్యతిరేకంగా వోటేయాలంటూ ఫస్ట్ పేజీలో పిలుపు… 8, 9 పేజీల సెంటర్ స్ప్రెడ్ అడ్డంగా పరిచేశారు జగన్ వ్యతిరేక కథనాల్ని… నిజానికి తెలుగుదేశం పుట్టుక తరువాత జరిగిన ఎన్నికల్లో కూడా ఇంత నిర్లజ్జగా వ్యవహరించలేదు ఈనాడు ఒక పత్రికగా… అఫ్ కోర్స్, అప్పట్లో లబ్దిదారు ఎన్టీయార్ కూడా ఆ తరువాత ఈనాడు వైఖరిని తిట్టిపోశాడు, అది వేరే కథ…
Ads
ఒకప్పుడు దినపత్రికలు చదివి జనం ప్రభావితులయ్యేవాళ్లు… అది గతం… ఇప్పుడిది సోషల్ మీడియా యుగం… పైగా జనంలో చైతన్యం పాళ్లు ఎక్కువ… రాజకీయ స్పృహ పెరిగింది… ఎవరి రాతల వెనుక ఏ మర్మముందో ఇట్టే గమనిస్తున్నారు… ఐనా సరే, ఇంకా మేం కసికసిగా రాస్తాం, జనం జగన్‌ను తన్ని తగలేస్తారు అనే అహానికి కారణమేమిటో అర్థం కాదు… నిజంగా ఈనాడు రాతల్ని జనం నమ్మే పక్షంలో మొన్నటి ఎన్నికల్లో జగన్ ఎలా గెలుస్తాడు, చంద్రబాబు ఎలా ఓడిపోతాడు… అంతకుముందు వైఎస్ ఎలా గెలుస్తాడు..?
జగన్ మార్గదర్శి మీద కక్షకట్టాడు, కేసులు పెట్టాడు, వైఎస్‌ను మించి వేటాడుతున్నాడు, రామోజీరావునే అరెస్టు చేద్దామని అనుకుంటున్నాడు, ఈ మంట రామోజీరావులో రగిలిపోతుంది… నిజమే… కానీ ఆ ఆగ్రహం తన రాతల్లో చూపిస్తే వచ్చే ప్రయోజనం ఏమిటి..? ఇప్పటిదాకా న్యూట్రల్ ముసుగు వేసుకుని చెలామణీ చేస్తున్న ఓ భ్రమపదార్థాన్ని తనంతట తనే బ్రేక్ చేయడం ఇది… పూర్తిగా పోలరైజ్ చేయడం… పత్రిక మనుగడను కూడా పణంగా పెట్టడం…
అందుకే ఈరోజు ఈనాడు ఏపీ ఎడిషన్ మీద నెటిజనం తీవ్రంగా వ్యతిరేకతను కనబర్చింది… ఈ ఫస్ట పేజీ ఎడిటోరియల్ పిలుపును జతచేసి రకరకాల వ్యాఖ్యానాలు కనిపిస్తున్నాయి… ఎహె, సాక్షి మాత్రం శుద్ధపూసా..? తెల్లారిలేస్తే జగన్ భజన, చంద్రబాబుపై విషమే కదా అంటారా..? అదీ నిజమే.,. కానీ అది జగన్ సొంత పత్రిక, అలా ఉండకపోతే తనకు మాలిన ధర్మం అంటారు… కేసీయార్‌కు నమస్తే తెలంగాణలాగా…
ఎటొచ్చీ ఇన్నాళ్లూ ఈనాడు న్యూట్రల్ ముసుగు వేసుకుంది కాబట్టి, తెలుగు పత్రికల్లో నంబర్ వన్ స్థానం ఇచ్చి పోషించారు కాబట్టి… కొంతైనా పాత్రికేయ నైతికత చూపించాలనేది పాఠకజనం అమాయకపు కోరిక… పోనీ, మాది చంద్రబాబు పత్రికే అని చెబితే ఇంకెవరూ మాట్లాడరు… ఇన్నాళ్లూ ఆంధ్రజ్యోతి మాత్రమే చంద్రబాబు పత్రికగా ముద్రపడినా సరే తన జగన్ వ్యతిరేక ధోరణిని నిస్సిగ్గుగానే ప్రదర్శించేది… ఈనాడు ఎదుట ఆంధ్రజ్యోతి ఈ విషయంలో ఇప్పుడు వెలతెలా…!!
జగన్ ఓడినా, గెలిచినా… జగన్ వర్సెస్ రామోజీరావు పోరాటం కొనసాగే సూచనలే కనిపిస్తున్నాయి… జగన్ ఓడిపోతే యెల్లో బలగాలు తనను వెంటాడతాయి, వేటాడతాయి… మునుపటిలా కాదు… యెల్లో క్యాంపు అసహనంతో రగిలిపోతోంది… కాదూ, జగన్ మళ్లీ గెలిస్తే..? అప్పుడిక యెల్లో క్యాంపు మీద కసిగా పడతాడు జగన్… మునుపటికన్నా ప్రళయ ఘోషతో… తనసలే మొండి… రామోజీరావు తనకన్నా మొండి..!!
Share this Article