చంద్రబాబు కావాలనే చేశాడో… ఫ్లోలో ఏదో అనేసి, ఇక తప్పనిసరై లడ్డూ కంట్రవర్సీని కొనసాగిస్తున్నాడో తెలియదు గానీ… నిజం చెప్పాలంటే… జగన్ ఇందులో నుంచి ఎలా బయటికి రావాలో తెలియక అయోమయంలో పడ్డాడు…
దేశమంతా… కాదు, యావత్ హిందూ ప్రపంచమంతా ప్రచారం జరిగిపోయింది… జగన్ కావాలని చేయకపోవచ్చు గానీ, తను నమ్మిన దరిద్రులే ఘాతుకానికి ఒడిగట్టవచ్చు… కానీ తన హయాంలో తిరుమల తన లడ్డూ ప్రసాదంతో సహా అపవిత్రం అయిపోయిందనే ఓ బలమైన ప్రచారం వ్యాప్తి చెందింది…
దీన్ని కౌంటర్ చేయడానికి నానా అవస్థలూ… అధర్మారెడ్డి అయిపూజాడా లేడు, ఎవరూ సరిగ్గా గొంతెత్తి బలంగా కౌంటర్ ఇచ్చేవాళ్లు లేరు… భూమన, సుబ్బారెడ్డిలకు విశ్వసనీయత లేదు… జగన్ తరఫున బలమైన వాయిస్ లేదు… మాట్లాడుతున్న రోజా, అంబటి, తమ్మినేని మరింత డ్యామేజీ చేస్తున్నారు… (ఒక్క సాక్షి పత్రిక మినహా)…
Ads
చివరకు తనే తిరుమల వెళ్లాలని సంకల్పించాడు… వెళ్లి ఏం చేస్తాడు..? ఎవరికీ తెలియదు… కూటమి ప్రభుత్వం ఊరుకుంటుందా…? అవకాశం ఇస్తుందా..? ఆల్రెడీ ఎన్నాళ్లుగానో కోపాన్ని అణుచుకుంటున్న కాషాయ శిబిరం యాక్టివ్ రోల్ తీసుకుంది… చంద్రబాబు చల్లబడినట్టు కనిపించినా సరే, పవన్ కల్యాణ్ అందుకున్నాడు…
జగన్ ఏదో ప్లే చేయాలనే ఆలోచనలో ఉన్నాడని పసిగట్టిన కూటమి ప్రభుత్వం… జగన్ అనుచరగణానికి ముందస్తు షోకాజులు, హెచ్చరికలు జారీ చేసి… భారీగా పోలీస్ బలగాలను దింపి… జగన్ ఇంకా హిందుత్వానికి, దేవుడికి, తిరుమలకు ద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నాడనే కలర్ ఇవ్వడానికి సిద్ధమైంది… డిక్లరేషన్ సాకును ముందుపెట్టింది…
అసలు లడ్డూ వివాదం మొదలవగానే ‘ఎవడు బాధ్యులుగా తేలితే, అసలు తప్పు జరిగిందని తేలితే వాళ్లపై చర్యలు తీసుకొండి, శ్రీవారి మీద నాకు విశ్వాసం ఉంది’ అని ఒక్క మాట జగన్ అని ఉంటే బాగుండేది… అనలేదు… ఇప్పుడు కూడా డిక్లరేషన్ అనగానే… ‘ఎన్ని వేలసార్లయినా సరే శ్రీవారి మీద నాకు నమ్మకం ఉందని రాసిస్తాను’ అని ఇంకొక్క మాట అనుంటే బాగుండేది… అనలేదు…
(అప్పట్లో షర్మిల తన కొడుకు పెళ్లిని పక్కా హిందూ పద్ధతుల్లో చేసి… ఎక్కడికో వెళ్లి అబ్బే మేమేమీ హిందూ తంతును పాటించలేదు, కట్టింది కూడా క్రాస్ తప్ప పుస్తె కాదు అన్నట్టుగా నానా వివరణలూ ఇచ్చుకుంది తల్లి విజయమ్మతో కలిసి… అది గుర్తొస్తోంది…)
ఇప్పుడేమంటున్నాడు జగన్..? నా మతం మానవత్వం అని రాసుకొండి అంటాడు, ఇలాగైతే దళితులకు గుళ్లలో ఎంట్రీ మాటేమిటి అంటాడు..? ఇవన్నీ సమస్యను పక్కదోవ పట్టించడం… అది హిందూ గుడి, దానికి కొన్ని సంప్రదాయాలున్నాయి… వాటిని నేను ఖాతరు చేయను అన్నట్టుగా… ఇష్యూను డైవర్ట్ చేయడం..!
లడ్డూ విషయంలో ఎదురుదాడికి సంబంధించి పదే పదే జగన్ వైపు నుంచి తప్పుటడుగులే పడుతున్నాయి… రాజకీయం, దొరికిన అవకాశాన్ని అంది పుచ్చుకుని కూటమి ప్రభుత్వం బిగిస్తోంది… దాన్నెలా ఎదుర్కోవాలో జగన్‌కు అంతుపట్టడం లేదు… డిక్లరేషన్ ఇవ్వకుండా, శ్రీవారి మీద విశ్వాసాన్ని ప్రకటించకుండా జగన్ ఏవేవో వాదనల్ని ముందుకు తీసుకొస్తున్నాడనే మరో కొత్త నెగెటివిటీని మూటగట్టుకుంటున్నాడు…
ఛల్, చంద్రబాబు ఏం చేస్తాడో చూస్తాను అని బయల్దేరితే… ఎక్కడైనా అడ్డగిస్తే… నేను శ్రీవారి మీద నమ్మకంతో వస్తుంటే చంద్రబాబు అడ్డుకున్నాడు అని ఎదురుదాడి చేసే అవకాశాన్ని కూడా చేజార్చుకున్నాడు… ఆఫ్టరాల్ చెత్తా రాజకీయం… చంద్రబాబు గానీ, పవన్ కల్యాణ్ గానీ, జగన్ గానీ… హిందూ విశ్వాసాలతో ఆడుకుంటున్నారు… తను పవిత్రంగా, కనీసం తనకు ఏ దురుద్దేశాలూ లేవని చెబుతూ బయటపడే ప్రతి అవకాశమూ జగన్ చేజేతులా చేజార్చుకుంటున్నాడు..!!
Share this Article