Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చిన్నప్పుడు గణేషుడి సొంత ఉత్సవమే వేరు… తలుచుకుంటేనే ఓ మైమరుపు.!!

September 7, 2024 by M S R

అరేయ్ వినాయకున్నీ పెట్టుకుందామా? అరేయ్ పైసలు లెవ్వు కదరా ఎట్ల మరి… ఏ ఏం కాదురా ఇద్దరి పొత్తుల పెట్టుకుందాం…

గొడ్డలి పట్టుకుని సర్కార్ తుమ్మళ్లకు పోయి ఎనిమిది సర్కార్ తుమ్మ కట్టెలు కొట్టుకుని వచ్చినం… ఆ ఇసుక కుప్ప పక్క పొంటి నాలుగు పొక్కలు తవ్వి, అందులో సర్కార్ తుమ్మ కట్టెలు పెట్టి గుంజలు పాతినం…

ఆ నాలుగు కట్టెలకు మీద ఇంకో నాలుగు కట్టెలు వేసి సుతిల్ దారాల తోటి పందిరి గట్టిగా కట్టి, మీది కెళ్ళి కంది పొరక వేసి, ఇంట్ల ఖాళీ బియ్యం సంచులు పట్టుకొచ్చి పందిరి కప్పినం..

Ads

పందిరి ముంగట గడ్డి చెక్కి చీపురుతో మంచిగా ఊడిసినం, ఇగ దేవున్ని తెచ్చుడే తరువాయి, మరి దేవుడు ఎట్లా, కొందామంటే పైసలు లేవు, ఇంట్ల అడుగుతే ఇయ్యరు, ఎట్లారా భగవంతుడా అనుకునేది, ఇద్దరం కలిసి ఆ పత్తి చేన్లకు పోయి నల్ల మట్టి తెచ్చేది.. మట్టి మీద కొద్దిగంత నీళ్లు పోస్తే అది బంక మట్టి లెక్క అయ్యేది..

నేను వినాయకుని తలకాయ చేస్తే, వాడు కాళ్ళు చేతులు చేసేది, గుండ్రంగా బొజ్జ తయారు చేసి, కాళ్ళు చేతులు అతికిచ్చి, లాస్టుకు తలకాయ అతికిచ్చేది… చిన్న తొండం ముక్కూ కాడ అంటు పెట్టి, దానికి తుది మెరుగులు అద్ది, కొద్దిసేపు అరబెట్టేది… ఈ లోగా అరేయ్, ఇంట్ల కెళ్ళి పీట పట్టుక రాపోరా అంటే అరేయ్ మా అమ్మ కొడుతది నువ్వే పట్టుక రాపో అంటే నువ్వే పట్టుక రాపో అని ఇద్దరం కొద్దిగా సేపు లొల్లి పెట్టుకుని, ఫైనల్ గా ఒక ఒప్పందంకి వచ్చేది, నువ్వు పీట పట్టుకురా, నేను ఇంట్ల కెళ్ళి పసుపు కుంకుమ పట్టుకస్తా అనేది..

ఇగ పీట, పసుపు కుంకుమ, మట్టి విగ్రహం అన్ని రెడీ అయ్యాక పందిరికి డెకరేషన్ చేయాలి ఎట్లా ఎట్లా అనుకుని… ఇద్దరం కలిసి పెద్ద పెద్ద వినాయకుని మండపాలు పెట్టె కాడ డెకరేషన్ చేసేటపుడు కింద పడ్డ కొన్ని డెకరేషన్ ఐటమ్స్ ఎత్తుకొచ్చి, పందిరిని ముస్తాబు చేసేవాళ్ళం..

ఇగ పీట మీద మట్టి గణపయ్యను కూసుండబెట్టి గింతంత పసుపు కుంకుమ మీద జల్లేది, గణపయ్య నుదుటిన వీర తిలకం దిద్దిన తరువాత మల్ల ఓ బాధ… దేవుని ముంగట ఏదో దీపం పెడుతారట, అది 9 రోజులు ఆరిపోవద్దట, ఆరిపోతే అరిష్టం అని, అయ్యో ఎట్లా, మరి దీపం పెట్టాలంటే మళ్ళా నూనె కావాలె ఎట్లా అని మళ్ళా ఒక ఒప్పందం చేసుకున్నాం, ఒకరోజు ఇంట్ల కెళ్ళి నువ్వు నూనె తీసుకురా ఒకరోజు నేను తీసుకు వస్తా అని ఒప్పందం చేసుకున్నాం..

ఒక కొబ్బరి చిప్ప పట్టుకొచ్చి అందులో ఇంట్ల కెళ్ళి ఎత్తుకచ్చిన నూనె పోసి దీపం ముట్టించినం, ఆ నూనె తోటి మహా తిప్పలు పడేది, ఇంట్ల అవ్వ రోజు పది రూపాల నూనెనే తెచ్చేది ,అందులోకెళ్ళి తాపకు కొద్దిగా నూనె అమ్మ లేనప్పుడు మెల్లగా దొంగతనంగా ఎత్తుకొచ్చి వినాయకుని దీపం ముట్టిచ్చేది, దీపం ఆరిపోకుండా దీపం సుట్టు ఇటుక పెళ్లలు పేర్చేవాళ్ళం, ఎందుకంటే గాలికి ఆ దీపం ఆరిపోవద్దని..

ఇగ దేవునికి నైవేద్యం పెట్టడానికి దగ్గరలో ఉన్న వినాయకుని మండపాల దగ్గరకు పోయి ప్రసాదం ఎప్పుడు పెడతారా అని పిట్టకు పెట్టినట్టు ఎదురుచూసి,  అక్కడింత ఇక్కడింత ప్రసాదం ఎదుర్కచ్చి, మా బుజ్జి గణపయ్యకు ఆ ప్రసాదంతో బువ్వ పెట్టి బజ్జో పెట్టేవాళ్ళం… అట్లా తొమ్మిది రోజులు అన్ని రకాలుగా దేవున్ని మంచిగా చూసుకుని, ఇగ నిమజ్జనం రోజు బాపు సైకిల్ పట్టుకొచ్చి, సైకిల్ వెనుక ఉన్న క్యారెల్ మీద ఒక పీట పెట్టి, సుతిల్ దారాలతో పీటను గట్టిగా కట్టేది..

,
ఆ పీట మీద మా బుజ్జి వినాయకుడిని కూసుండ బెట్టి, డెకరేషన్ దారాలతో సైకిల్ ను ముస్తాబు చేసి, వాడు గణపయ్య కింద పడిపోకుండా పట్టుకుంటే, నేను సైకిల్ ని మెల్లగా దొబ్బుకుంట దొబ్బుకుంట SRSP కెనాల్ లో మా గణపయ్యను నిమజ్జనం చేసి, బై బై టాటా చెప్పి ,ఇద్దరం సైకిల్ మీద గప్ చుప్ గా ఇంటికి వచ్చేవాళ్ళం…

ఒకవేళ మాకు నిమజ్జనానికి సైకిల్ దొరకకుంటే, దేవుణ్ణి ఎత్తుకుని పెద్ద దేవుని కాడికి పోయి, అక్కడ పెద్ద దేవుణ్ణి నిమజ్జనానికి తీసుకు పోయేటోళ్లను అపి, అబ్బా అన్నా బాంచెన్, మా దేవుణ్ణి కూడా తీసుకుపోవాయే అని బతిమాలుకుని దేవుణ్ణి ఇచ్చి నిమజ్జనానికి పంపించేది

ఆరో తరగతి దాకా ఇట్లే చేసేవాళ్ళం, ఆరో తరగతి తరవాత అదే లాస్ట్, నేను దేవున్ని మనస్ఫూర్తిగా నమ్మి మొక్కడం… మళ్ళీ ఇప్పటి వరకు మొక్కలేదు…ఇన్నేళ్లకు ఎందుకో మళ్ళీ వినాయకుడికి మొక్కాలి అనిపించింది…. (శ్రీనివాస్ సార్ల)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆ రాజు గారు అంటే అంతే… పక్కా నిక్కచ్చి, ఫక్తు రూల్ కేరక్టర్…
  • అయ్యో బాబూ… బనకచర్లపై ‘ముచ్చట’ చెప్పిందే వెదిరె శ్రీరామూ చెప్పాడు..!!
  • కూలేశ్వరం ఏటీఎం కీలక బోల్ట్… ఏళ్లకేళ్లు సర్వీస్ ఎక్స్‌టెన్షన్ …
  • బనకచర్లపై మాట్లాడేదేం లేదు… కేంద్ర-బాబుకు తెలంగాణ ప్రభుత్వం షాక్…
  • ఎవరు ఆ త్రిశూలధారి..? ఆ యుద్ధంలో ఎలా ప్రత్యక్షమయ్యాడు..? ఎందుకు..?!
  • జగడపు చనువుల జాజర… ఓ శృంగార కీర్తనకు వెగటు గెంతుల రీల్స్…
  • రేవంత్‌రెడ్డి ఎఫెక్ట్..! బనకచర్ల ఏటీఎంకు బాబు కోటరీలోనే వ్యతిరేకత..!!
  • ఆహా ఏమి రుచి..! కొత్తిమీర కూరితేనే వంకాయకు ఆ రుచివైభోగం…
  • గాలికదుపు లేదు- కడలికంతు లేదు… ప్రతి పదంలోనూ లోతైన భావన…
  • ఓహ్… ఆ జంబలకిడిపంబ సినిమాకు ఇక్కడ బీజం పడిందా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions