.
Subramanyam Dogiparthi …. నాగార్జున , రాఘవేంద్రరావు మూగమనసులు సినిమాకు స్ఫూర్తి ANR , సావిత్రి , జమున నటించిన మూగమనసులే అయినా… కధను కొత్తగా నేసిన విజయేంద్రప్రసాద్ సోదరులు అటూఇటూ తిప్పి భిన్నంగా మలిచారు ఈ జానకిరాముడు సినిమాను… ఇది నాగార్జున , విజయశాంతి , జీవిత సినిమా…
విజయేంద్రప్రసాద్ , ఆయన అన్న శివశక్తి దత్తా ఇద్దరికీ ఇదే మొదటి సినిమా కధా రచన . బాగా సక్సెస్ అయ్యారు . వారిద్దరూ మంచి కధను నేస్తే రాఘవేంద్రరావు , మురారి బిర్రయిన స్క్రీన్ ప్లేని తయారు చేసుకున్నారు .
Ads
మురారి తన యువచిత్ర బ్రాండ్ ఇమేజిని పెంచుకున్నారు మరో హిట్ సినిమాతో . హిట్టే కాదు ; చక్కటి సినిమా … నాగార్జున , విజయశాంతి మూడు సినిమాలు నటిస్తే మూడింటిలో ఈ జానకిరాముడు రొమాంటిక్ మ్యూజికల్ హిట్ …
ANR , సావిత్రి , జమున , ఆదుర్తిలకు మూగమనసులు ఎలా చిరస్థాయి కీర్తిని తెచ్చిపెట్టిందో ఈ జానకిరాముడు అలాగే నాగార్జున , విజయశాంతి , జీవిత , రాఘవేంద్రరావులకు చిర స్థాయి కీర్తిని తెచ్చిపెట్టింది . సత్యానంద్ సంభాషణలు కూడా చాలా బాగుంటాయి .
కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో ఆత్రేయ , వేటూరి , సిరివెన్నెల పోటాపోటీగా పాటల్ని వ్రాసారు . నా గొంతు శృతిలోన నా గుండే లయ లోన , నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పాటలు అద్భుతమైన , శ్రావ్యమైన పాటలు . రాఘవేంద్రరావు మార్క్ పాటల చిత్రీకరణ .
మిగిలిన పాటలు అదిరింది మావ అదిరిందిరో ముదిరింది ప్రేమ ముదిరిందిరో , అరెరే దడబెట్టి పోతుంది కొంటె ఈడు , చిలక పచ్చ తోటలో చిలిపి కోయల , రాలుగాయి పిల్లదానికి రవ్వలాంటి మొగుడొస్తే శ్రావ్యంగా , హుషారుగా , కమనీయంగా ఉంటాయి . విషాద గీతమయిన ఎవరిని అడగాలి చెప్పవే చిరుగాలి చాలా బాగుంటుంది . బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , జానకమ్మ , చిత్ర శ్రావ్యంగా పాడారు .
విజయశాంతి ఇలాంటి పాత్రలనే కాదు ఏ పాత్రనయినా అవలీలగా , ప్రేక్షకులను మెప్పించేలా నటించగలదు . ఈ సినిమాలో కూడా అంతే . నాగార్జున ఇప్పటికి స్టెబిలైజ్ అయ్యాడనే చెప్పుకోవచ్చు . ఈ సినిమా అంటే చాలా ఇష్టంగా కూడా నటించానని నాగార్జున చెపుతూ ఉంటారు . అది సినిమాలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది కూడా . మస్తు పాటలు , డాన్సులు , రొమాన్స్ , ఫైట్లు అన్నీ ఉంటాయి అతని పాత్రకు . అన్నింటికీ న్యాయం చేసాడు .
ప్రత్యేకంగా మెచ్చుకోవలసింది జీవిత పాత్రను , ఆమె నటనను . అల్లరి పిల్లగా , అబధ్ధాల సత్యవతిగా చాలా బాగా నటించింది . ఇతర ప్రధాన పాత్రల్లో మోహన్ బాబు , సత్యనారాయణ , జగ్గయ్య , ప్రదీప్ శక్తి , బ్రహ్మానందం , సుత్తి వేలు , సాక్షి రంగారావు , చలపతిరావు , భీమేశ్వరరావు , వంకాయల , కాకినాడ శ్యామల , శ్రీలక్ష్మి , శుభ , ప్రభృతులు నటించారు . మోహన్ బాబు తన కామెడీ విలనీని , రేపుల విలనీని రాఘవేంద్రరావు బాగా చూపారు .
రెండు జన్మల కధ . రెండో జన్మలో కోటీశ్వరుడు కొడుకు నాగార్జున సాధారణ యువతి విజయశాంతిని ప్రేమిస్తాడు . తండ్రి సత్యనారాయణ అడ్డం పడితే తండ్రిని వదిలేసి ప్రియురాలిని తీసుకుని వెళ్ళిపోతాడు హీరో . తండ్రి పురమాయించిన రౌడీలు వెంటపడగా నదిలో పడిపోయి ఓ గ్రామానికి చేరుతారు .
అక్కడకు వెళ్ళాక ఇద్దరికీ గత జన్మ స్మృతులు వస్తాయి . సినిమా అంతా ముందు జన్మే . పాత్రలన్నీ ముందు జన్మవే . విలన్ల బారి నుండి తప్పించుకొని పెళ్లి చేసుకునే క్రమంలో అందరూ చనిపోతారు . నాగార్జున , విజయశాంతి చనిపోయి పునర్జన్మను పొంది అదే గ్రామానికి చేరుకుంటారు.
మరు జన్మ సమయానికి కూడా జీవించే ఉన్న జీవిత , సుత్తి వేలు నాగార్జున , విజయశాంతి పెళ్లి చేస్తారు . సంతోషం ఏమిటంటే మగధీర సినిమాలో లాగా ముందు జన్మ విలన్లు మరు జన్మలో పుట్టరు .
సినిమా అంతా గోదావరి ప్రాంతంలో షూట్ చేసారు . మూగమనసులు సెంటిమెంటో లేక అందంగా ఉంటుందని ఏమో తెలియదు . చక్కని ఈ 1+2 సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూసినా మరలా చూడొచ్చు . It’s a romantic , feel good , musical splendour .
నేను పరిచయం చేస్తున్న 1171 వ సినిమా . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్
ఇక్కడ Vasudha B Rao కామెంట్ కూడా ప్రస్తావనార్హం…
‘‘ఒక వస్తువు తయారై విజయవంతం అయితే వెంటనే నమూనాగానో నకిలీగానో మరికొన్ని తయారై మార్కెట్లోకి వచ్చేయడం సహజం… అలాగే సినిమా ప్రపంచం కూడా. హిట్ అయిన కథలను రీమేక్ హక్కులు కొందరు, అనుకరణతో కొందరు… అసలు కొంత కలిపి, కొంత స్వంత పైత్యం చేర్చి కొందరు ఇలా నమూనాలను చేసి వదులుతారు.
మధ్యలో ఇచ్చి పుచ్చుకోవడాలు తృప్తిగా పూర్తయితే ఏ గొడవలు ఉండవు. అందులో తేడాలొస్తేనే.. రోడ్డెక్కెది.. కోర్టెక్కేదీ. అవీ చూసాం..
ఇదే జానకి రాముడు పేరుతో 2016, డిసెంబరు 16న విడుదలైన తెలుగు చలనచిత్రం ఇంకొకటి… టి. సతీష్ బాబు దర్శకత్వంలో వచ్చింది. ఆ చిత్రంలో నవీన్ సంజయ్, మౌర్యాని, అర్జున్ యజత్ తదితరులు నటించారు., దాని గొడవేమిటో ప్రస్తుతానికి పక్కన పెడితే…
ఇక ప్రస్తుత జానకి రాముడు విషయానికొస్తే………. 1964 లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో సి.సుందరం గారు తీశారు.. కథా పరంగా ప్రేమ కథా చిత్రంగా మ్యూజికల్ గా బాగా హిట్ అయ్యి నేటికీ ప్రేక్షకులు నీరాజనం పట్టే సినిమా.
ఆ కథనే దాదాపు అలానే 1977లో వి బి రాజేంద్రప్రసాద్ అక్కినేనితోనే మంజుల కథా నాయికగా కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో విజయవాడలోనూ నిర్మించగా అదీ మ్యూజికల్ హిట్ గా నిలిచింది.
ఇక ఇప్పుడు 1988లో అక్కినేని వారసుడు నాగార్జున, విజయ శాంతి జంటగా మురారి, రాఘవేంద్రరావు నేతృత్వంలో వచ్చి ఇదీ గొప్ప మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఈ మూడు చిత్రాలకూ ఆత్రేయ,
మహదేవన్ లే కామన్ గా సాహిత్య సంగీతాలను నిర్వహించడం గమనార్హం’’
Share this Article