.
ఎస్, టీవీకే పార్టీ బ్లాక్ బస్టర్… కానీ విజయ్ వీడ్కోలు సినిమాగా చెప్పబడిన జననాయకుడు సినిమా ఓ డిజాస్టర్… కమర్షియల్ ఎక్కాలు, లెక్కల్లో కాదు… నాసిరకం రీమేక్ ప్రమాణాల్లో… భగవంత్ కేసరి ఒరిజినల్ సినిమా తీసిన బాలకృష్ణ, అనిల్ రావిపూడీ, మీరే తోపులు… ఈ రీమేక్ ఉత్త తోకపటాకు… రివ్యూలోకి వెళ్దాం..,.,
అసలు కథలోని ఆత్మను పూర్తిగా చంపేసిన కమర్షియల్ హంగామా… విజయ్‌కు వీడ్కోలు కానుకగా మిగిలిందేమిటి?
Ads
విజయ్ చివరి సినిమా అనే భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘జననాయకన్’… అసలు చూస్తే ఇది బాలకృష్ణ నటించిన తెలుగు చిత్రం ‘భగవంత్ కేసరి’కి రీమేక్. కానీ రీమేక్ అంటే కథను మరో భాషలో చెప్పడం మాత్రమే కాదు, ఆ కథలోని ఆత్మను కూడా తీసుకెళ్లాలి. అదే చోట దర్శకుడు హెచ్. వినోద్ పూర్తిగా విఫలమయ్యాడనే భావన ఈ సినిమా చూస్తే కలుగుతుంది.
కథ ఏమిటి?
‘భగవంత్ కేసరి’లో ఉన్న అసలు కథనే ఇక్కడ కూడా కొనసాగించారు. విజయ్ పోషించిన పాత్ర చిన్నారి విజి (మమిత బైజు)ని తన కూతురిలా పెంచుకుంటాడు. ఆమెను ఆర్మీలో చేరేలా చేయడమే అతని జీవిత లక్ష్యం. ఆమె తండ్రి కలను నెరవేర్చాలనే బాధ్యతను తన భుజాలపై వేసుకుంటాడు.
ఇంతవరకూ అంతా బాగానే ఉంటుంది. కానీ ఈ భావోద్వేగ కథ చుట్టూ దర్శకుడు కట్టిన కమర్షియల్ ప్యాకేజీ మొత్తం సినిమాను పట్టాలు తప్పిస్తుంది. అసలు కథను పక్కనబెట్టి, పాతబడ్డ విలన్ ట్రాక్‌లు, గన్ స్మగ్లింగ్ ఎపిసోడ్‌లు, రాజకీయ డ్రామా, లాజిక్ లేని యాక్షన్ సన్నివేశాలతో సినిమా నిండిపోతుంది.
విజయ్… ఉన్నాడు కానీ మెరవలేదు.. విజయ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకునేంత గొప్పదేమీ లేదు. అతను తనకు అలవాటైన శైలిలో నటించాడు. కానీ సినిమా మొత్తం మీద ప్రేక్షకులు “ఇదీ విజయ్!” అని చెప్పుకునే ఒక్క సీన్ కూడా కనిపించదు.
అఫ్‌కోర్స్, తీసి పడేయాల్సినంత చెడ్డ నటన కాదు. అలాగే ప్రశంసించాల్సినంత గొప్ప నటన కూడా కాదు. చివరి సినిమా అనే స్థాయిలో గుర్తుండిపోయే ఒక్క సీన్ కూడా విజయ్ నుంచి రాకపోవడం పెద్ద నిరాశ. మమిత బైజు పాత్రను పూర్తిగా నాశనం చేశారు. ఈ సినిమా అసలు బలం విజి పాత్ర అయి ఉండాలి నిజానికి.
తెలుగు వెర్షన్‌లో శ్రీలీల పాత్ర ఎంత బలంగా ఉంటుందో, ఆమె ప్రయాణం ఎంత భావోద్వేగంగా ఉంటుందో తెలిసిందే. కానీ ‘జననాయకన్’లో మమిత బైజు పాత్రను దాదాపు పూర్తిగా చెడగొట్టేశారు. పాత్ర రూపకల్పన బలహీనంగా ఉంది. ఆమె పాత్రకు సంబంధించిన రచన మరింత బలహీనంగా ఉంది. ఫలితంగా ఆమె నటనకూ స్కోప్ లేకుండా పోయింది.
పూజా హెగ్డే… ఎందుకు ఉందో కూడా అర్థం కాదు… పూజా హెగ్డే ట్రాక్ పూర్తిగా హాఫ్ బేక్డ్. కథకు ఉపయోగం లేదు. గుర్తుండిపోయే సన్నివేశం లేదు. ఆమె పాత్ర లేకపోయినా సినిమాకు పెద్ద తేడా ఉండేదేమీ కాదనే భావన కలుగుతుంది. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా పొద్దున… రన్ టైమ్ పెరిగిందని ఆమె సీన్లను మొత్తం లేపేశారు… అసలే వరుస ఫ్లాపులు, పాపం, ఇదీ అంతే…
దర్శకుడు హెచ్. వినోద్ చేసిన అతిపెద్ద తప్పు ఏమిటంటే..? సినిమా మొదలైన వెంటనే దర్శకుడు అసలు కథను అలాగే ఉంచానని చెప్పాడు కదా, విజయ్- మమిత మధ్య బంధం కూడా ‘భగవంత్ కేసరి’లోని బాలకృష్ణ- శ్రీలీల ట్రాక్‌ను గుర్తు చేస్తుంది జస్ట్, అంతే… అక్కడి నుంచే సమస్య మొదలవుతుంది కూడా… మిగతా సినిమా మొత్తం కమర్షియల్ ఫార్ములా దారిలో పడిపోతుంది…
బాబీ డియోల్ విలన్ ట్రాక్… పూర్తిగా పాతబడ్డ టెంప్లేట్… బాబీ డియోల్‌కు భారీ స్క్రీన్ టైమ్ ఇచ్చారు. కానీ అతని పాత్ర పూర్తిగా అర్థంలేనిదిగా తయారైంది. అతడి చుట్టూ తిరిగే కథ… గన్ స్మగ్లింగ్… యాక్షన్… అన్నీ ఏళ్లనాటి పాత సినిమాలను గుర్తు చేసే విధంగా సాగుతాయి. కొత్తదనం కనిపించదు. భయపెట్టే విలన్ కాదు. బోర్ కొట్టించే విలన్‌గా మాత్రమే మిగిలిపోతాడు.
మొదటి భాగం… పూర్తిగా నిరాశ … మొదటి భాగంలోనే సినిమా చేతులెత్తేస్తుంది. ప్రత్యేకంగా… బాబీ డియోల్ ట్రాక్, సముద్రంలో జరిగే యాక్షన్ సన్నివేశం,, టీవీ సీరియల్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, ఇవేవీ పనిచేయవు. కమర్షియల్ సినిమాగా కూడా కాదు. ‘భగవంత్ కేసరి’కి సరైన రీమేక్‌గా కూడా కాదు. మొదటి భాగంలో ఒక్క సీన్ కూడా “ఇదే హైలైట్” అనిపించదు.
రెండో భాగం… అసలు సినిమా ఆత్మనే చంపేశారు. తెలుగు వెర్షన్ చూసిన వారికి రెండో భాగం మరింత బాధ కలిగిస్తుంది. ఎందుకంటే…
అసలు సినిమా మొత్తం నిలబెట్టాల్సిన అంశం ఏమిటి? ఒక తండ్రి… ఒక దత్తపుత్రిక… ఆమె ఆర్మీలో చేరే కల… ఆ కల కోసం ఆమె ఎదుర్కొనే భయాలు… సంకోచాలు… పోరాటం… ఈ భావోద్వేగ ప్రయాణమే. కానీ రీమేక్‌లో ఇవన్నీ దాదాపు మాయమైపోయాయి.
భావోద్వేగానికి బదులు యాక్షన్ హడావుడి, విజి పాత్రను రెండో భాగంలో దాదాపు కనిపించనివ్వరు. చివర్లో రెండు మూడు సన్నివేశాల కోసం మాత్రమే తీసుకొస్తారు. మిగతా సమయం అంతా… బాబీ డియోల్ ట్రాక్…
ప్రకాశ్ రాజ్ రాజకీయ కథ… ఈయన్ని పదే పదే ఇంకా ఎందుకు సినిమాల్లో తీసుకుంటున్నారో నిర్మాతలకే తెలియాలి… పరమ స్టీరియోటైప్, మొనాటనస్… గన్ ఫైట్లు… పేలుళ్లు… ఇవే. దాంతో సినిమా అసలు ఉద్దేశమే మాయమవుతుంది.
యాక్షన్… వీడియో గేమ్‌లా కనిపిస్తుంది. దర్శకుడు అసలు కథను మార్చి భారీ యాక్షన్ మీద ఆధారపడాలని ప్రయత్నించాడు. కానీ ఫలితం పూర్తిగా తారుమారైంది. తక్కువ స్థాయి CGI… వీడియో గేమ్‌లా కనిపించే గన్ ఫైర్లు… నకిలీగా కనిపించే పేలుళ్లు… ఇవి పెద్ద స్టార్ సినిమా చూస్తున్నామా? లేక చౌకబారు టీవీ విజువల్స్ చూస్తున్నామా? అనే అనుమానం కలిగిస్తాయి.
క్లైమాక్స్… ఓపికకు పరీక్ష… చివరి ఫైట్‌కు అంతం ఉండదు. సాగుతూనే ఉంటుంది. ప్రేక్షకుల సహనాన్ని పూర్తిగా పరీక్షించేలా క్లైమాక్స్ రూపొందించారు. ప్రియమణి, నాజర్, సునీల్ తదితరులున్నా ఎవరికీ చెప్పుకోదగ్గ పాత్రలు లేవు. సినిమాలో ఉన్నట్టే ఉంటారు.
అనిరుధ్ రవిచందర్ సంగీతం కూడా ఈసారి నిరాశపరుస్తుంది. పాటలు వినిపించవు. చూసినా ఆకట్టుకోవు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా పెద్దగా ప్రభావం చూపదు. అయితే దీనికి అనిరుధ్‌ను పూర్తిగా తప్పుబట్టలేం. ఎందుకంటే సినిమా అతనికి సంగీతంతో మ్యాజిక్ చేయడానికి అవకాశమే ఇవ్వదు. సత్యన్ సూర్యన్ ఛాయాగ్రహణం కూడా ఆశించిన స్థాయిలో లేదు.
ప్రదీప్ రాఘవ్ ఎడిటింగ్ కూడా అంతే. సన్నివేశాల మధ్య కట్‌లు అసహజంగా అనిపిస్తాయి. సినిమా నిడివి కూడా అవసరానికి మించి సాగదీసిన భావన కలిగిస్తుంది. మొత్తానికి హడావుడిగా ఏదో విజయ్ రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్దేశించి, ఒరిజినల్ కథను చెడగొట్టి, జనం మీదకు వదిలారు సినిమాను… కేవీఎన్ ప్రొడక్షన్స్ నాసిరకం నిర్మాణ విలువలు… చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత గుర్తుండేది కథ కాదు… విజయ్ చివరి సినిమా కూడా ఇలా అయిపోయిందా అనే నిరాశ మాత్రమే… పాపం అనే నిట్టూర్పు!!
Share this Article