Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఔరా.., ఇది విశ్వనాథ్ సినిమాయేనా..? అత్యంత నిరాసక్తంగా…!!

May 30, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ……… సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా జగమెరిగిన చేంబోలు సీతారామ శాస్త్రి (భరణి కలం పేరు) మొదటి సినిమా అందరూ అనుకునే సిరివెన్నెల కాదు … 1984 లో కె విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన ఈ జననీ జన్మభూమి సినిమా .

టైటిల్సులో Ch సీతారామ శాస్త్రి (భరణి) అని వేసారు . శాస్త్రి గారు మంచి పాటే వ్రాసారు . గంగావతరణం మీద . రస వాహినీ స్వాగతం జీవరసధుని స్వాగతం , సరస హృదయ సంభావిత కవితా కుసుమాంజలిదే . అద్భుతమైన సాహిత్యం .

ఏం లాభం ! ఇద్దరు చిన్నపిల్లలు సాయి గీత , సాయి కిరణ్ చేత పాడించారు విశ్వనాథ్ . అశ్రావ్యంగా ఉంటుంది . సాహిత్యం ఎంత గొప్పగా ఉన్నా శ్రావ్యమైన కంఠం నుండి రాకపోతే జనానికి చేరదు .

Ads

కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారిని ఎంతో మంది అడిగేవారు . పుష్పవిలాపం ఇంత జనాదరణ పొందటానికి మీ సాహిత్యం కారణమా లేక ఘంటసాల గారి కంఠం కారణమా అని . ఆయన రెండూ అని మృదువుగా , చక్కని నవ్వుతో చెప్పేవారు .

సీతారామ శాస్త్రి గారు వ్రాసిన ఈ గంగావతరణం పాట ఏ సుశీలమ్మో , జానకమ్మో , శైలజో పాడి ఉంటే రసహృదయులు ఆస్వాదించి ఉండేవారు , శాస్త్రి గారి మొదటి సినిమా పాటే ఓ రికార్డు సృష్టించేది .

అసలు సినిమా అంతా ఇంతే . యువకులు అమెరికా వెళ్ళి అల్ట్రా మోడర్న్ గా తిరిగి వస్తారు . ఈ సినిమాలో హీరో బాలకృష్ణ ఇండియాలో అల్ట్రా మోడర్న్ గా ఉండే జల్సారాయుడు . అమెరికాకు వెళ్ళి వివేకానందుడు అయి తిరిగి వస్తాడు .

కోటీశ్వరుడు , అవినీతిలో తప్పు ఏముంది అని భావించే తండ్రి దేశంలో తిరిగితే ఈ దేశం ఎంత బాగుందో అర్థం అవుతుందని సవాల్ విసురుతాడు . తల్లి సలహాతో స్వంత ఊరికే వెళతాడు . దారిలో జనం కష్టాలు , స్వగ్రామంలో ప్రజల జీవనం , వగైరా సత్యాలను సిద్దార్ధుడి లాగా తెలుసుకుంటాడు . ఆ గ్రామాన్ని రిపేర్ చేయటం ప్రారంభిస్తాడు .

ఈ సినిమాను ఇప్పుడు చూస్తే 2015 లో వచ్చిన మహేష్ బాబు , జగపతిబాబు , రాజేంద్రప్రసాదుల శ్రీమంతుడు సినిమా గుర్తుకొస్తుంది . శ్రీమంతుడు నాన్ వెజిటేరియన్ సినిమా , ఈ జనని జన్మభూమి సినిమా వెజిటేరియన్ సినిమా . విశ్వనాథ్ గారు కదా స్టోరీ రైటర్ , దర్శకుడు .

కె వి మహదేవన్ సంగీతం , వేటూరి వారి సాహిత్యం కూడా సినిమాను విజయపధం వైపు నడిపించలేకపోయాయి . పాటలు థియేటర్లో ఫరవాలేదు అని అనిపిస్తాయి . ఘల్లుఘల్లున కాళ్ళ గజ్జెలు , తడిసిన అందాలలో , తూలే తూలే తూలేనమ్మా తూనీగ నడుము డ్యూయెట్లు శ్రావ్యంగా ఉంటాయి . సినిమాలో కాకుండా ఈ పాటలు బయట వింటే బాగుంటాయి… ప్రత్యేకించి తడిసిన అందాలలో హమ్మింగ్ భలే ఉంటుంది… (ఈ పాట ఏ కచేరీల్లోనూ, ఏ సింగింగ్ కంపిటీషన్లలోనూ వినిపించలేదు మళ్లీ…)

విశ్వనాథ్ సినిమాా అంటేనే హాయి పాటలు కదా… అలాగే మహదేవన్‌తో ట్యూన్లు చేయించుకున్నాడు, పాటల సాహిత్యం కూడా బాగుంటుంది… సరిగంగ తానాలు అంటూ సాగే పల్లె జనం పాట చిత్రీకరణ బాగుంటుంది . పలుకు తేనెల తల్లి పవళించవమ్మా అంటూ తల్లికి పాడే హీరో జోలపాట సినిమాలో వీక్షించడానికి కూడా బాగుంటుంది …

రామచంద్రాపురం , రాజమహేంద్రవరం , గోదావరి , గోదావరి జిల్లా అందాలను ఔట్ డోర్ షూటింగులో మిత్రులు Meer S కెమేరాలో బాగా బంధించారు . సంభాషణలను డి వి నరసరాజు గారు వ్రాసారు . విశ్వనాథ్ గారికి ఆయనెందుకు గుర్తుకొచ్చారో !

బాలకృష్ణ , సత్యనారాయణ , శారద , సుమలత , రాజ్యలక్ష్మి , శుభలేఖ సుధాకర్ , రాగిణి , గోకిన రామారావు , పి జె శర్మ , డబ్బింగ్ జానకి , సాక్షి రంగారావు , రమాప్రభ , ప్రభృతులు నటించారు . సినిమాలో హరిశ్చంద్ర నాటకాన్ని కూడా పెట్టారు . దీనినీ సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు .

బాలకృష్ణ , నందమూరి అభిమానులను వరుసగా నిరాశపరిచిన బాలకృష్ణ మూడో సినిమా ఇది . వీటన్నింటినీ కాంపన్సేట్ చేస్తూ మంగమ్మ గారి మనమడు విజయ ఢంకా మోగించింది ఈ 1984 లో . మరి ఫెయిలయిన ఈ సినిమా గురించి ఎందుకు ఈ సింహావలోకనం అంటే విశ్వనాథ్ గారు ఎంచుకున్న కధాంశం అభినందనీయం కావటం వలన …

సినిమా గూడ్స్ బండిలాగా ఉసూరుమంటూ సాగినా ఓపిగ్గా చూడతగ్గ సినిమాయే . విశ్వనాథ్ గారి ప్రయత్నాన్ని అభినందించాలి . బాలకృష్ణ , సత్యనారాయణ , శారదల నటన బాగుంటుంది . బాలకృష్ణ , నందమూరి అభిమానులు ట్రై చేయవచ్చు . యూట్యూబులో ఉంది . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు



ఎందుకో గానీ విశ్వనాథ్ మీద ఏ ఒత్తిడి ఉందో తెలియదు… మధ్యలోనే వదిలేస్తే ఇంకెవరైనా పూర్తిచేశారేమో అనిపిస్తుంది… ఏదో పాటలో పిచ్చి స్టెప్పులు కూడా… కథనం కూడా నీరసంగా, ఏ మెరుపులూ లేకుండా… బాలయ్య సినిమాల్లో అత్యంత పేలవమైన సినిమా బహుశా ఇదేనేమో… అదీ విశ్వనాథ్ దర్శకత్వంలో……. ముచ్చట



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మొత్తం 5 జంటలు… మరి ఈ ‘ముచ్చటగా ముగ్గురు’ టైటిల్ ఏమిటో…
  • AI ప్లాట్‌ఫామ్స్ … అతివాడకంతో మన బుర్రలు మొద్దుబారుతున్నయ్…
  • గుల్ఫాం ఉప-ద్రవం… తాగినా చస్తారు, తాగకపోయినా చస్తారు…
  • మీ కడుపులు చల్లంగుండ… సన్నబియ్యంతో పాశం చేసుకున్నం సారూ…
  • ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి మంచు కన్నప్ప నేర్పిన పాఠం ఏమిటి..?
  • సంగమానంతరం శ్రీవారి నవ్వులు ఆమె తలపై చల్లిన అక్షతలయ్యాయట..!
  • Aap Jaisa Koi …. రొమాంటిక్ ఫీల్స్ పురుషులకేనా..? స్త్రీలకు ఉండవా..?!
  • ఆ రాజు గారు అంటే అంతే… పక్కా నిక్కచ్చి, ఫక్తు రూల్ కేరక్టర్…
  • అయ్యో బాబూ… బనకచర్లపై ‘ముచ్చట’ చెప్పిందే వెదిరె శ్రీరామూ చెప్పాడు..!!
  • కూలేశ్వరం ఏటీఎం కీలక బోల్ట్… ఏళ్లకేళ్లు సర్వీస్ ఎక్స్‌టెన్షన్ …

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions