Bharadwaja Rangavajhala ……….. మండు వేసవి… మల్లెపువ్వులూ….
సృష్టిలో కొన్ని సంగతులు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. వాటిలో ఒకటి మండు వేసవి మల్లెపువ్వుల కాంబినేషన్. మల్లె పూవు రొమాంటిక్ ఫీల్ కు సింబల్. అలాంటి మల్లెల్ని మండు వేసవిలో పూయమని ఆనతివ్వడం ఎంత దారుణం. సృష్టి వైచిత్రి ప్రకారం మల్లెలు మండు వేసవిలోనే పూస్తాయి. మరి ఆ మల్లెల మధురిమలను తెలుగు సినిమా కవులు ఎలా వర్ణించారో ఇప్పుడు చూద్దారి .
మల్లెపువ్వులు అనగానే ఠక్కున గుర్తొచ్చే పాట మేఘసందేశంలో దేవులపల్లి వారి రచన. సిగలో అవి విరులో… అగరు పొగలో అత్తరులో… అంటూ సాగే గీతం. ఎదురుగా మల్లెలు పొదిగిన జడతో శ్రీమతి కనిపించే సరికి కవిగారిలో భావుకత కట్టలు తెంచుకున్న సందర్భం అది. … అగరు పొగల పరిమళాలకు మత్తెక్కించే మల్లెపూల సువాసనలు, అత్తరు ఘుమఘుమలు తోడైతే అదీ పాట నేపథ్యం.
Ads
మల్లెపూలు… తెల్ల చీర ఓ రొమాంటిక్ కాంబినేషన్. తెలుపు రంగు సత్యానిది అన్నారో సందర్భంలో మహాకవి శ్రీశ్రీ. స్వచ్చమైన ప్రేమలో తడిసిన రెండు మనసులు సమాగమం చెందే సందర్భాన్ని చెప్పడానికి తెల్ల చీరను… మల్లెపూలను ఆశ్రయించక తప్పింది కాదు కవికి. జగపతీవారి అంతస్తులులో నాయకితో తెల్లచీర కట్టినా… మల్లెపూలు పెట్టినా… కల్లకపటమెరుగనీ మనసు కోసమే అనిపిస్తాడు ఆత్రేయ.
తెలుగు సినిమాల్లో వచ్చే ఫస్ట్ నైట్ సాంగ్స్ అన్నీ దాదాపు మల్లెల మీదే నడుస్తాయి. ఇంటింటి రామాయణంలో ఆ తరహా గీతాల్లో అత్యద్భుతం అనదగ్గ డ్యూయట్ ఒకటి రాశారు వేటూరి. రాజన్ నాగేంద్ర వెరైటీగా శృతి చేసిన ఈ గీతం బాలు గాత్రంలో గొప్ప ఫీల్ తో సాగుతుంది. కాటుకలంటుకున్న కౌగలింతలెంత వింతలే లాంటి వేటూరి తరహా సమ్మోహన పదబంధాలు పాట నిండా గుభాళిస్తాయి.
అప్పుడే యవ్వన ప్రాంగళంలోకి అడుగుపెడుతున్న అమ్మాయి… తన మనసు గుసగుసలను గుట్టుగా మల్లెలకు నివేదించుకునే సందర్భాన్ని ఊహించారు వేటూరి సుందరరామ్మూర్తి. పదహారేళ్ల వయసు కోసం రాసిన ఈ గీతం చిత్రీకరణలోనూ తన మహత్తు చూపించి ఆడియన్స్ ను మత్తులో ముంచెత్తారు దర్శకేంద్రుడు రాఘవేంద్రుడు.
వేసవి పగలంతా ఎండ వేడిమికి తల్లడిల్లిన తనువులు చల్లని రాత్రి వేళ ఆరుబయట సేదతీరతాయి. రాత్రి చల్లదనానికి మల్లెల పరిమళం తోడైతే… మనసులు ఎక్కడో విహరిస్తాయి. అలా… ఎండ భారిన హృదయాలకు ఒక్కింత ఓదార్పు కల్పించడానికే మల్లెల తీరాలు చూపిస్తుందేమో ప్రకృతి. మల్లెపూలు జల్లాను… మంచమేసి ఉన్నాను అంటూ రెచ్చిపోయి మరీ పాటలల్లారు మన సినీ కవులు.
మగువలకీ మల్లెపూలకీ విడదీయరాని బంధం. పెళ్లన్నా… పెళ్లి చూపులన్నా… ఏ ఇతర వేడుకన్నా… పట్టు చీరల గరగరలతో పాటు… మల్లె పూల జడల ఘుమఘుమలూ తప్పనిసరి. మల్లెపూలంటే లేడీస్ కున్న వీక్ నెస్సును బాగా కనిపెట్టి… జస్ట్ మూరెడు మల్లెపూలతో భార్యల్ని బుట్టలో చేసుకునే భర్తలెందరో. అలాంటి ఓ భర్త పాడే జడదండకం వినండి…
రెండు మనసులు కలసిన సందర్భంలో పోటెత్తే భావాలను చెప్పడానికీ మల్లెల్నే ఆశ్రయించారు వేటూరి సుందరరామ్మూర్తి. విఫలమైన ప్రేమను చెప్పడానికి మల్లెల చితిలో వెన్నెల మంటలు రగిలించే అనేశారాయన. అనుబంధం చిత్రంలో మల్లెపూలు ఘొల్లుమన్నవీ… పక్కలోనా… అంటూ ఓ హుషారైన కుర్ర గీతం రాశారు.
రెండు మనసుల మద్య పెరిగిన అనుబంధాన్ని చెప్పడానికి మల్లెల కన్నా ఉపమానం ఏముంటుందంటారు ఆత్రేయ. ఆరాధన చిత్రంలో తన మనసును అంకితం చేస్తూ…. తీగెనై మల్లెలూ… పూచిన వేళ ఆగనా అల్లనా పూజకో మాల అంటాడు నాయకుడు. మనసు తెర తీసినా మోమాటంతో మౌనం రాజ్యం చేసినా… ప్రేమ పరిమళం ఊరికే ఉండనీదు కదా…. అచ్చు… మల్లెపూలలాగా…
విరహ వేదన చెప్పడానికీ మల్లెపూలను తోడు తెచ్చుకున్న కవులు చాలా మందే ఉన్నారు. నారాయణరెడ్డి మల్లియలారా…మాలికలారా అంటూ నాయకుడి వేదనను మల్లెలకు విన్నవిస్తే… దాశరధి మల్లెతీగ వాడిపోగ మరల పూలు పూయునా… అని ఆక్రోసించారు. అయితే ఉన్నట్టుండి తన మనసులో పుట్టిన ప్రేమ భావాన్ని గుర్తించిన ఓ అమ్మాయితో మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో అని ప్రశ్నింపచేశారు ఆత్రేయ. అదీ కవిత్వంలో మల్లెల సిగ్నిఫికెన్సు. గురజాడ వారితో కూడా ఫుల్లుమూను బ్రైటటా… జాసిమిన్ను వైటటా… అనేలా చేసింది మల్లెపూవు …
Share this Article