.
హతవిధీ సుధీర్ బాబు…! అంతటి బలమైన సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉండీ… ఎంత శ్రమిస్తున్నా సరే… ఓ మంచి హిట్ దొరకడం లేదు… ఎన్నో ఆశలు పెట్టుకున్న తాజా సినిమా జటాధర కూడా దాదాపు తుస్…
మహేష్ బాబు బావ సుధీర్ బాబు… ఈ సినిమాలో మహేష్ బాబు వదిన శిల్పా శిరోద్కర్ కూడా ఉంది… అంతేకాదు, ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి కూడా ఉంది… ఇంతే, ఈ సినిమా ఆకర్షణలు… చాన్నాళ్ల తరువాత సోనాక్షి కనిపిస్తోంది తెర మీద… శిల్పా శిరోద్కర్ కూడా అప్పుడెప్పుడో మోహన్‌బాబుతో ఓ సినిమా చేసింది…
Ads
కానీ కథాకథనాలు నీరసంగా సాగడంతో ఎక్కడా ఈ సినిమా థ్రిల్ కలిగించదు… ఏదో హారర్ అన్నారు గానీ ఎక్కడా ఏమీ భయపెట్టలేకపోయింది… ధన పిశాచి అని సోనాక్షిని చూపించారు, ఎంతసేపూ ఏదో జువెలరీ కంపెనీ యాడ్ చేస్తున్నట్టు ఒంటి నిండా నగలు దిగేసుకుని అసందర్భంగా అరవడం నవ్వడం తప్ప ఆ పాత్ర చేసిందేమీ లేదు…
శిల్ప కూడా సుధీర్ బాబు మేనత్త పాత్రో ఏదో నెగెటివ్ రోల్ చేసింది… ఏమాత్రం ఇంప్రెసివ్ పాత్ర కాదు అది… ఇందులో సుధీర్ బాబు పక్కన దివ్య ఖోస్లా అసలు సెట్ కాలేదు… కథాగమనానికి వీళ్ల లవ్ స్టోరీ పెద్ద బ్రేకులు వేస్తూ ఉంటుంది… సుధీర్ బాబు ఏదో కష్టపడ్డాడు గానీ తన పాత్ర కేరక్టరైజేషనే వీక్‌గా ఉంటే ఇక తనేం చేయగలడు… ఆ కాస్త సిక్స్ ప్యాక్ చూపడం మినహా…
పోనీ, సెకండాఫ్‌లో సినిమాకు బూస్టప్ ఇస్తుందని అనుకున్న శివుడి ఎపిసోడ్ కూడా తేలిపోయింది… వీఎఫ్ఎక్స్ జస్ట్ వోకే… కానీ బీజీఎం నిరాశపరిచింది… కథేమిటంటారా..? సుధీర్ బాబు ఓ ఘోస్ట్ హంటర్, సైన్స్ తప్ప దెయ్యాలను గట్రా అస్సలు నమ్మడు, ఎక్కడైనా దెయ్యాల ప్రస్తావన వినిపిస్తే వెళ్లి మరీ హంబగ్ అని నిరూపించి వస్తుంటాడు…
ఎక్కడో ధన పిశాచి కథ విని, అక్కడికి వెళ్తాడు… ఆ పిశాచికీ ఈ హీరోకు నడుమ ఓ పాత కథ… అదేమిటి..? నడుమ ఈ శిల్పా శిరోద్కర్ ఎవరు..? అదీ కథ… బోలెడు చూశాం కదా ఈ కథలు… కాకపోతే మాంచి ప్రజెంటేషన్‌తో రక్తికట్టించాడా దర్శకుడు అనుకుంటే, అదీ లేదు… అదే అసలు లోపం సినిమాకు…
ఓ సాదాసీదా క్లైమాక్స్‌తో రెండో భాగం ఉంటుందని భయపెట్టి ముగించారు, రెండో పార్ట్ ఉందని చెప్పడమే ప్రేక్షకుల్ని భయపెట్టిన హారర్ పాయింట్, అంతే.,. ఆరుగురు నిర్మాతలు, ఇద్దరు దర్శకులు కలిసికట్టుగా ఎంతగా ప్రయాసపడినా సుధీర్ బాబుకు నిరాశే మిగిల్చారు పాపం..!! ఇంకా సినిమాలో చెప్పడానికేమీ లేదు..!!
Share this Article