నిన్నా… మొన్నా… నలభయ్యేళ్ల క్రితం పాట… ‘మాఘమాస వేళలో…’ ఈ ట్యూన్, ఈ పాట విన్నతరువాత చాలాసేపు బుర్రలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది… ఆ బాణి అదీ… సినిమా పేరు తెలుసా..? జాతర… ధవళ సత్యం దర్శకత్వం… హీరో ఎవరో తెలుసా..? మన మెగా చిరంజీవి… అవును, తన కెరీర్ కొత్తలో చేసిన సినిమా… విగ్గులు, పెట్టుడు మీసాలు, ముసలి మొహాలు చూసి విసిగిన ప్రేక్షకులకు చిరంజీవి వంటి యంగ్ స్టార్ల ఒ:రిజినల్ జుత్తు, ఒరిజినల్ ఫైట్లు, ఒరిజినల్ డాన్సులు భలే అట్రాక్ట్ చేసేవి… ఓసారి ఈ బొమ్మ చూడండి…
బాలసుబ్రహ్మణ్యం సోదరి శైలజ… తొలిసారిగా ఓ హీరోయిన్‌కు పాడిన పాట ఇది… హీరోయిన్ అంటే గుర్తొచ్చింది… మన వారస హీరోలకు మల్లే… ఆమె మొహంలో కనిపించేది ఏ భావమో అర్థమయ్యేది కాదు… లక్ష ఉద్వేగాలకైనా ఒకేరకంగా మొహం పెట్టడం అనే ప్రతిభ ఆనాటి నుంచే ఉన్నట్టుంది… హీరోయిన్ ఫీచర్స్ కాకపోయినా చిరంజీవి ఎలా అంగీకరించాడబ్బా… ఐనా తను కూడా అప్పుడు చిన్నపాటి హీరోయే కదా… అంగీకరించకతప్పదు, తన చాయిస్ ఏముంటుందిలే… ఆమె పేరు కూడా ఇప్పుడు ఎవరికీ తెలియదు…
Ads
పాటకొస్తే… మాఘమాసవేళలో, ఒకనాటి సంధ్యలో, గొరవంకపై ఓ చిలుకకు గుబులాయెనెందుకో అని రాస్తాడు పాటల రచయిత మైలవరపు గోపి… మనకు పాటల రచయిత అనగానే ఆత్రేయ, ఆరుద్ర, వేటూరి తప్ప మరొకరు గుర్తుకురారాయె… కానీ ఈయన 1949 నుంచి 1996 దాకా అనేక చిత్రాలకు మంచి మంచి పాటలు రాశాడు… మంచి కలమే… ఉదాత్తమైన, ఉన్నతమైన భావాలున్న రచయితే… మరి ఈ గుబులాయెనెందుకో అనే పదం ఎందుకు వాడినట్టు..? ఈ ప్రశ్నకు జవాబు ఎవరూ సరిగ్గా ఇవ్వలేదు ఇప్పటికీ…
సాధారణంగా గుబులు అంటే… లేదా బుగులు అంటే… భయం… మరి గొరవంకపై గుబులు కావడం ఏమిటి..? మనసాయెనెందుకో అని రాస్తే, స్క్రిప్టు సరిగ్గా చదవక సంగీత దర్శకుడు ఇలా గుబులు అని పాడించేశాడా…? మరి ధవళ సత్యం ఏం చూసుకున్నట్టు..? అవునూ, సంగీత దర్శకుడు అంటే గుర్తొచ్చింది… ఆయన పేరు జీకే వెంకటేష్… మన హైదరాబాదీ… 60ల నుంచి 80ల దాకా కన్నడ, తమిళ, తెలుగు చిత్రాలెన్నింటికో స్వరదర్శకుడు ఆయన… తన ఖాతాలో కొన్ని మంచిపాటలున్నయ్… అంతేకాదు, ఇళయరాజా, శంకర్ గణేష్, వైద్యనాథన్ తదితరులు ఈయన శిష్యులే… ఈ మాఘమాసవేళలో అనే పాట ట్యూన్ కూడా తనదే…
మళ్లీ పాటకొస్తే… ఆ గుబులు పదాన్ని వదిలేయండి, ఏమైనా అంటే కవిహృదయం ఖాతాలో వేస్తారు… మిగతా పాటంతా కొన్ని పడికట్టు పదాలతో నింపేసినా సరే కానీ… పాట చివరి చరణంలో… మా ఊరు తలుచుకుంటూ నీతోటి సాగనీ… నిన్ను తలుచుకుంటూ నా ఊరు చేరనీ… ఈ రాకపోకలందే నను రేవు చేరుకోనీ… అని కొంత తాత్వికత, గృహిణి జీవితం చెప్పేస్తాడు… విన్నంతసేపు బాగుంటుంది…
మాఘమాసవేళలో… ఒకనాటి రేయిలో… ఈ పాటపై ఓ శ్రోతకు గుబులాయెనెందుకో… ఛ, ఆ భాషే వస్తోంది… కొంపదీసి గుబులు అంటే ప్రేమ, అభిమానం అనే అర్థాలు ఏమీ లేవు కదా, ఏ ప్రాంతంలోనో…!!
Share this Article