Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జయహో టెస్టు మ్యాచ్ సీరీస్… వన్డేలు, టీ20లకు దీటుగా ప్రేక్షకాదరణ…

August 6, 2025 by M S R

.

  • ఇండియా – ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్… ఓవల్ స్టేడియం, అయిదో & చివరి టెస్ట్ మ్యాచ్… చివరి రోజు…

గెలుపు కోసం ఇంగ్లాండ్ చేయాల్సినవి కేవలం 35 రన్స్.. చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి..
మరి చివరి రోజు ఆట ఎంత సేపు సాగుతుంది…!
మహా అయితే అరగంట…

ఆ అరగంట మ్యాచ్ చూసేందుకు ఎంత మంది ప్రేక్షకులు స్టేడియంకు వచ్చారో తెలుసా…. ఓవల్ స్టేడియం దాదాపు నిండి పోయింది. దాదాపు 25 వేల మందికి ఆ మ్యాచ్ చూసేందుకు వచ్చారు…
టెస్ట్ క్రికెట్టే అసలైన క్రికెట్ అని ఇరు జట్ల ఆటగాళ్లే కాదు… ఈ సిరీస్ లో అయిదు టెస్టు మ్యాచులు చూసేందుకు స్టేడియంలకు వచ్చిన ప్రేక్షకులు కూడా నిరూపించారు.

Ads

వన్డేలు, అంతకు మించి టీ 20 క్రికెట్ పెను తుఫాన్ తాకిడికి టెస్టు క్రికెట్ మరుగున పడిపోతోందనే భావనను పటాపంచలు చేసిందీ సిరీస్.
ఆర్థర్టన్ – టెండుల్కర్ సిరీస్ అనే కొత్త పేరుతో ఇండియా – ఇంగ్లాండ్ అయిదు మ్యాచ్ మ్యాచ్ ల సిరీస్ ఆద్యంతం రసవత్తరంగా సాగిందన్నది నిస్సందేహం. అందుకు ఇరు జట్ల ఆటగాళ్ళ అద్భుత ఆటతీరు ఎంత కారణమో…. ఈ అయిదు టెస్ట్ మ్యాచులు చూసేందుకు స్టేడియంలకు వచ్చిన ప్రేక్షకులు కూడా అంతగా అభినందనీయులు.

అయిదు మ్యాచ్‌లు ఎంత పోటాపోటీగా సాగనీ… రెండు జట్లు ఎంత బాగా ఆడనీ.. బ్యాటర్ల సెంచరీలు, హాఫ్ సెంచరీలు… ఒక ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసిన బౌలర్ల అద్భుత స్పెల్స్ … మెరుపు క్యాచ్ లు.. ఇరు జట్ల ఆటగాళ్లు భావోద్వేగాలతో సై అంటే సై అనడం… ఇలా క్రికెట్ సిరీస్ లో ఉండాల్సిన అన్ని ఉత్కంఠభరిత అంశాలూ ఈ సిరీస్ లో అంతర్భాగమయ్యాయి.

కానీ క్రికెటర్లు గ్రౌండ్ లో ఎంత బాగా ఆడుతున్నా… ఎదురుగా గ్యాలరీలో ప్రేక్షకులు లేకపోతే ఆటగాళ్ళకు ప్రేరణ ఉండదు. ఆ క్రికెట్ లో మజా ఉండదు. ఎంతటి కళాకారుడు అయినా ఖాళీగానో అంతంత మాత్రం నిండిన ఆడిటోరియంలో ప్రదర్శన ఇవ్వమంటే … తనలోకి కళను పూర్తిగా ప్రదర్శించలేడు. అది ఆటగాళ్ళకూ వర్తిస్తుంది.

వన్డేలు, టీ 20 లకు వేలాది మంది ప్రేక్షకులతో హోరెత్తిపోయే స్టేడియంలు మనం చూస్తూనే ఉన్నాం. ఇండియాలో టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లు అంటే స్టేడియంలు పావు వంతు కూడా నిండవు. స్కూల్, కాలేజ్ విద్యార్థులకు ఉచితంగా టిక్కెట్లు ఇచ్చి మరీ స్టేడియంలకు తీసుకు వచ్చిన సందర్భాలూ ఉన్నాయి.

టెస్ట్ క్రికెట్ అంటే బోరు బోరు అనే భావన పాతుకుపోయింది. . భారత ఉపఖండంలో బ్యాటర్లకు పూర్తి అనుకూలంగా ఉండే నిస్సారమైన పిచ్ లు.. ఫాస్ట్ బౌలర్లు చెమటలు కక్కడం తప్ప మరో ప్రయోజనం లేని పిచ్ లు… మరీ అయితే రెండో రోజు నుంచే బంతి విపరీతంగా స్పిన్ అయి మూడు రోజుల్లోనే ఫలితం తేలిపోయే మ్యాచ్ లు ..

ఇక ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాలలో ఫాస్ట్ బౌలర్లకు ఏకపక్షంగా అనుకూలించే బౌన్సీ పిచ్ లు… అటువంటి మ్యాచులతో టెస్ట్ క్రికెట్ కు పూర్వ వైభవం తేవడం అసాధ్యం.. ఇరు జట్లలోని బ్యాటర్లు, బౌలర్లకు సమాన అవకాశాలు ఇవ్వవు. రెండు జట్ల ఆటగాళ్ల నైపుణ్యానికి, ఓపిక కు పరీక్ష పెట్టవు అటువంటి టెస్ట్ మ్యాచులు.

ఇక ప్రేక్షకులు తీరూ అలానే ఉంటుంది. స్వదేశ జట్టును సపోర్ట్ చేయడం…. ప్రత్యర్థి జట్టు సభ్యులను హేళన చేయడమే పనిగా పెట్టుకుంటారు. అటువంటి పరిస్థితులే అయిదు రోజుల టెస్ట్ మ్యాచ్ లలోని మజాను దూరం చేస్తున్నాయి.

క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ లో అందుకు పూర్తి భిన్నమైన క్రీడా చిత్రం వెల్లివిరిసింది. అయిదు టెస్ట్ మ్యాచులు నిర్వహించిన పిచ్ లు ఇరు జట్ల బ్యాటర్లు , బౌలర్లు, అందులోని ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్ల కు సమానంగా సహకరించాయి.

ఇండియా తరపున స్టార్ బ్యాటర్లు శుభమన్ గిల్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, యశస్వి జైశ్వాల్ పరుగుల వరద పారించారు. ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, వాసింగ్టన్ సుందర్ అటు బ్యాటింగ్లోనూ ఇటు స్పిన్ బౌలింగ్ లోనూ రాణించారు.

ప్రధాన ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా మెరుపులు మెరిపించగా కొత్త బౌలర్లు ప్రసిద్ కృష్ణ, ఆకాశ్ కూడా అంతర్జాతీయ క్రికెట్ లో తమ మార్కు చూపించారు . ఇంగ్లాండ్ తరపున స్టార్ బ్యాటర్ జో రూట్ అద్భుతంగా బ్యాటింగ్ చేయగా… బెన్ డకెట్, హేరీ బ్రూక్, జేన్ స్మిత్ ఉత్తమ బ్యాటింగ్ తో ఆకట్టుకున్నారు.

ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ రాణించగా స్టార్ బౌలర్లు జెఫ్రీ ఆర్చర్, డాసన్ మెరుపు బౌలింగ్ తో వికెట్ల పంట పండించారు. భారత్, ఇంగ్లాండ్ జట్లు రెండూ సిరీస్ ఆద్యంతం పోటాపోటీ ఆట తీరుతో సరి సమానంగా రాణించాయి. టెస్ట్ సిరీస్ 2 – 2 తో డ్రా కావడం సరైన తుది ఫలితం.

  • ఆహ్లాదభరిత ఇంగ్లీష్ వేసవి వాతావరణంలో క్రికెట్ మ్యాచులు ఆడటమే కాదు… గ్యాలరీలో కూర్చుని చూడటం కూడా అందమైన అనుభూతే. సినిమా తీయడానికే కాదు చూడటానికి ఒక అభిరుచి ఉండాలి.. అలానే టెస్ట్ మ్యాచులు చూడటానికి కూడా తమకు మంచి టేస్ట్ ఉందని ఇంగ్లాండ్ ప్రేక్షకులు మరో మారు నిరూపించారు.

హెడింగ్లీ ( లీడ్స్) , ఎడ్బస్టన్ ( బర్మింగ్హామ్) , లార్డ్స్ ( లండన్), ఓల్డ్ ట్రాఫర్డ్ ( మాంచెస్టర్), ద ఓవల్ ( లండన్) స్టేడియంలలో నిర్వహించిన అయిదు టెస్టు మ్యాచులకు అన్ని రోజులూ, అంటే 25 రోజులూ స్టేడియంలు ప్రేక్షకులతో నిండుగా కనిపించాయి.

లార్డ్స్ టెస్టు మ్యాచ్ ఆరంభానికి గంట ముందే చిన్నా పెద్ద అనే వయోభేదం లేకుండా స్టేడియం ముందు బారులు తీరిన ప్రేక్షకులు చూడముచ్చటగా అనిపించారు. తమ దేశ టీమ్ ప్లేయర్ మాత్రమే కాదు ప్రత్యర్థి టీమ్ ప్లేయర్ బాగా ఆడినా చప్పట్లతో అభినందించడం వారి ఉత్తమ క్రీడాభిరుచికి నిదర్శనం. క్రికెట్ అంటే జెంటిల్ మెన్ గేమ్ అనే నానుడిని నిజమని ఇంగ్లాండ్ ప్రేక్షకులు మరోమారు నిరూపించారు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తెరపైకి మళ్లీ ‘దాసరి చిరంజీవి’… పెద్దన్న పాత్రలోకి రంగప్రవేశం..!!
  • సీఎం సాబ్… తమరు జర్నలిస్టుగా ఉన్న కాలం కాదు… జమానా బదల్ గయా..!!
  • ట్రావెల్ థెరపీ… సరదాగా చెప్పుకున్నా నిజముంది, ఫలముంది…
  • మోడీ దర్శించిన ఆ హిస్టారిక్ టెంపుల్ కథాకమామిషు ఏమిటంటే..!!
  • జయహో టెస్టు మ్యాచ్ సీరీస్… వన్డేలు, టీ20లకు దీటుగా ప్రేక్షకాదరణ…
  • Ramayana… a story for English readers and civil trainees..!!
  • ఢిల్లీలో ఫైట్‌కు రేవంత్ రెడీ..! కుదరదంటున్న బండి సంజయ్..!!
  • ఫేక్ జర్నలిస్టులపై మరి ప్రభుత్వ తక్షణ బాధ్యత ఏమీ లేదా..?
  • నీయమ్మని, నీయక్కని, నీతల్లిని, నీచెల్లిని… నమ్మండి, తెలుగు పాటే..!!
  • మా ‘భాగ్య’ నగరానికేం తక్కువ..? చినుకు పడితే చాలు వెనిస్ నగరమే..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions