Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అడుగడుగునా అల్లరల్లరి… జంధ్యాల మార్క్ మరో కామెడీ…

January 6, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …….. నా ఆప్తమిత్రుడు కీ.శే. ధర్మవరపు సుబ్రమణ్యం నటించిన మొదటి సినిమా ఈ జయమ్ము నిశ్చయమ్మురా . మా ఇంటికొస్తే ఏం తెస్తావ్ ; మీ ఇంటికొస్తే ఏమిస్తావ్ అనే సినిమా ప్రపంచంలో తద్భిన్నమైన మనిషి ధర్మవరపు . ఆయనకు నా నివాళి .

మాయాబజార్ సినిమా పాటల నుండి , మాటల నుండి సినిమాలు తీసిన హాస్య బ్రహ్మ యన్టీఆర్ శభాష్ రాముడు సినిమాలో పాపులర్ అయిన పాట జయమ్ము నిశ్చయమ్మురా టైటిల్ గా పెట్టి తీసిన మరో హాస్య ప్రధాన చిత్రం 1989 జూలైలో వచ్చిన ఈ సినిమా .

Ads

జంధ్యాల సినిమాల్లో పాత్రల సృష్టి , వాటి మేనరిజమ్స్ , డైలాగులు ప్రత్యేకంగా ఉంటాయి . ఈ సినిమా పేరు చెప్పగానే ముందుగా ఎవరికయినా గుర్తుకొచ్చేది శ్రీలక్ష్మే . బాబూ చిట్టీ అంటూ లాక్కోని కౌగలించుకునే పాత్ర . ఆమె లాక్కోబోయే ముందు ఆమె ముఖంలో వచ్చే సూచనలు , వాటిని చూడగానే బ్రహ్మానందం ముఖంలో వచ్చే పిచ్చి మార్పులు సినిమాకే హైలెట్ .

ఆ తర్వాత తెలంగాణా యాసలో కోట శ్రీనివాసరావు సైన్మా పిచ్చి గోల . పాత సినిమాల గురించి తెలంగాణా యాసలో కధలు చెప్పటం , కలల్లో సుమన్ , వెంకటేష్ , రమేష్ బాబులతో సైన్మాలు తీయటం !! ఇంటికొచ్చిన అతిధికి కాఫీ ఇచ్చి బిల్లు ఇవ్వటం !!! ప్రేక్షకులు మరచిపోయే ప్రసక్తే లేదు . సినిమా చివర్లో బ్రహ్మానందం రివర్స్ హేమరింగ్ కూడా ప్రేక్షకులు మరచిపోరు .

ఇంక టూకీగా కధ ఏంటంటే : రాజేంద్రప్రసాద్ , చంద్రమోహన్లు కాలేజీలో ఫ్రెండ్స్ . రాజేంద్రప్రసాద్ సుమలతని , చంద్రమోహన్ కొత్త నటి అవంతిని ప్రేమిస్తారు . రాజేంద్రప్రసాద్ తండ్రి ధర్మవరపు తన మిత్రుడు సుత్తి వేలు కుమార్తెతో పెళ్లి జరిపించాలని కోరిక . ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనేది రాజేంద్రప్రసాద్ పట్టుదల .

ఆరు నెలలు సమయం తీసుకుని మిత్రుడు ఊరికి వెళతాడు రాజేంద్రప్రసాద్ . అక్కడ కనిపించిన సుమలతకు , తనకు పందెం వస్తుంది . సుమలత తల్లిదండ్రులు అయిన వేలు , రాధాకుమారిలను ఒప్పించి మెప్పించి పెళ్లి చేసుకుంటానని పందెం . ఒకరిని ఒకరు ఓడించుకుంటానికి ప్రయత్నిస్తూ ఉంటారు .

తండ్రి పెడుతున్న పరీక్షలకు విసుక్కొని , అసలు విషయాలన్నీ తెలుసుకున్న సుమలత రాజేంద్రప్రసాదుని పెళ్లి చేసుకోవటంతో సినిమా సుఖాంతం అవుతుంది . రెండో జంట చంద్రమోహన్ , అవంతి కూడా వాళ్ళ కష్టాలను దాటి పెళ్లి చేసుకుంటారు .

సినిమా అంతా అల్లరి , గోలలు , అల్లరి గోలలు వగైరా . అన్ని పాత్రలూ అల్లరి చేసేవే . జంధ్యాల సినిమా అంటే అంతేగా మరి ! ఈ అల్లరి సత్యనారాయణ కూడా చేస్తాడు చివర్లో అశోక్ కుమార్ తండ్రిగా ఎంటరయి . ధర్మవరపు గుమాస్తాగా సత్తిబాబు , సుత్తి వేలు నౌకర్లు , ఒకరేమిటి అందరూ అల్లరి చేసేవారే .

హీరోహీరోయిన్లుగా రాజేంద్రప్రసాద్ , సుమలత , చంద్రమోహన్ , అవంతి చలాకీగా నటించారు . ప్రముఖ హాస్య నటి హేమ ఓ చిన్న పాత్రలో తళుక్కుమంటుంది . 1989 లోనే ఆమె సినిమా రంగంలోకి ప్రవేశించింది . అయితే ఈ సినిమాకన్నా ముందే కొన్ని సినిమాల్లో నటించింది .

రాజ్- కోటి సంగీత దర్శకత్వంలో పాటలు శ్రావ్యంగా ఉంటాయి . ముఖ్యంగా సిరివెన్నెల వ్రాసిన అభిమతమో అభినయమో ఈ ప్రేమ చతురాతి చతురం చాలా శ్రావ్యంగా ఉంటుంది . ఈ డ్యూయెట్ రాజేంద్రప్రసాద్ , సుమలత మీద ఉంటుంది . అలాగే చంద్రమోహన్ , అవంతి మీద డ్యూయెట్ ఓ చిలకా చిరు మొలకా కూడా బాగా చిత్రీకరించబడింది . అవంతి నృత్యం బాగుంటుంది .

నీ మనసే మహాశక్తిరా నీ పలుకే పరాశక్తిరా , అయ్యయ్యొయ్యో రామా , జయంబు నిశ్చయంబురా అంటూ సాగే మిగిలిన పాటలు కూడా బాగుంటాయి . సిరివెన్నెల , జొన్నవిత్తుల , మూళ్ళపూడి శాస్త్రిలు పాటల్ని వ్రాయగా బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , శైలజ , చిత్ర వాటిని పాడారు .

కధను ఆదివిష్ణు నేయగా స్క్రీన్ ప్లే , దర్శకత్వాన్ని , డైలాగులను జంధ్యాల నిర్వహించారు . స్క్రీన్ ప్లే కాస్త నీరసంగా ఉన్నా పాత్రల సృష్టి , మేనరిజమ్స్ , డైలాగులు ప్రేక్షకులను లాక్కెళుతాయి . తమిళంలో కిలాడీ మప్పిళ్ళై అనే టైటిలుతో రీమేక్ అయింది . పాండ్యరాజన్ , సింధుజ , దివ్యశ్రీలు నటించారు .

జంధ్యాల హాస్య రస సినిమాలలో మరో కలికితురాయి ఈ జయమ్ము నిశ్చయమ్మురా . ఇంతకుముందు చూసినా మళ్ళా చూడవచ్చు . అప్పుడప్పుడు టివిలో కూడా వస్తూనే ఉంటుంది . సినిమా యూట్యూబులో ఉంది .

నేను పరిచయం చేస్తున్న 1214 వ సినిమా
#తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వాటిని గజల్స్ అంటారా..? నీ సారస్వత సేవ ఏమిటి శ్రీనివాసులూ…?
  • వెనెజులా..! ట్రంపుదే కాదు… మన చమురూ ఉంది అక్కడ… తవ్వాలి..!!
  • అవునూ, ఇంతకీ ఈ ‘తెలుగు గజల్ శ్రీనివాస్’ పాత కేసు ఏమైనట్టు..?!
  • చైల్డ్ ఆర్టిస్టు కాదు… డబుల్ రోల్‌లో మహేశ్ బాబే అసలు హీరో…
  • … ఫాఫం అంబానీ..! కంటెంట్ రైటర్ల పారితోషికాలకూ డబ్బుల్లేవ్..!!
  • తల్లి చెప్పింది… ‘సింహంలా పోరాడు… అంతేగానీ పిరికివాడివై తిరిగిరాకు’
  • రోగ్ ప్లానెట్ కాదు… దుష్ట గ్రహమూ కాదు… అదొక ఒంటరి జర్నీ… అంతే…
  • 1500 కోట్ల పణం..! ప్రేక్షకుడు ఎందుకెక్కువ చెల్లించాలి…? మళ్లీ అదే ప్రశ్న..!!
  • వెనెజులా..! ఇప్పుడు ట్రంపు దాడి… ఎప్పటి నుంచో ‘ఉచితాల’ దాడి..!!
  • ఈ బీరువా తలుపులు తెరవగానే… నా బాల్యం నన్ను నిండా కమ్మేస్తుంది…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions