సినిమా పాటల మీద రివ్యూలు, అభిప్రాయాలు వ్యక్తీకరించడం వేరే భాషలతో పోలిస్తే తెలుగులో చాలా తక్కువ అని చెప్పుకున్నాం కదా… కొందరు బ్లాగర్లు రాసినా పరిమితంగానే కనిపిస్తూ ఉంటయ్ నెట్‌లో… మరో పాట కోసం వెతుకుతూ ఉంటే మేఘసందేశంలోని ‘ముందు తెలిసినా ప్రభూ’ పాట కనిపించింది… ఎంత హృద్యంగా ఉందో..! అసలే దేవులపల్లి కృష్ణశాస్త్రి రచన… సుశీల గాత్రం… రమేష్ నాయుడు స్వరసారథ్యం… దేవులపల్లి అలతి పదాలతోనే పాటను మనసులోకి గుచ్చేస్తాడు… భావగీతాలకు చిరునామా… అప్పట్లోనే… అంటే నలభై ఏళ్ల క్రితం… అక్కినేని నాగేశ్వరరావు మేకప్ ఏదీ లేకుండా, గడ్డం విగ్గు పెట్టేసుకుని, ఓ వృద్ధ పాత్రలో జీవించేయగా….. ఖచ్చితంగా చెప్పుకుని చప్పట్లు కొట్టాల్సిన అభినయం మాత్రం జయప్రదది… 40 ఏళ్ల క్రితమే మేకప్ లేకుండా, ఓ ముసలిదానిలా… పాత బొంతల్ని ధరించి, చింపిరి జుట్టుతో ఆమె కనిపించిన తీరు, ఆ పాత్ర ఆహార్యానికి, ఆకారానికి ఆమె ‘‘ఆ కెరీర్ క్రీం రోజుల్లో’’… ఇరవై ఏళ్ల వయస్సులోనే అంగీకరించిన తీరు నిజంగా విశేషం… మెప్పించింది కూడా… (అఫ కోర్స్, జయసుధ వేషం కూడా డీగ్లామరైజ్డే… బాగా చేసింది, కానీ ఈ పాటతో జయప్రద సినిమాను హైజాక్ చేసేసినట్టనిపించింది…)
జయప్రద… తన వ్యక్తిగత జీవితం, తన రాజకీయ జీవితం, ఆమె వర్తమానం గట్రా ఇక్కడ అప్రస్తుతం… కానీ మంచి నటి… అందం, అభినయాల కలబోత… డీగ్లామరస్ వేషాలు వేయలేదని కాదు… కానీ చాలా అరుదు… సాగరసంగమంలో కూడా ఓ యుక్తవయస్కురాలి తల్లి పాత్రలో కూడా చేసిందిగా… కాకపోతే హీరోయిన్ అంటేనే ఫుల్లు గ్లామర్ బొమ్మలు కదా మన ఇండస్ట్రీలో… ఇలాంటి కొన్ని అరుదైన వేషాలు, అవకాశాలు ఆమెకు దక్కడం ఆమె అదృష్టం… అప్పట్లో అభినయ ప్రాధాన్య పాత్ర అంటే జయసుధ… అందం ప్రాధాన్యపాత్ర అంటే శ్రీదేవి… రెండూ కలగలిసిన పాత్ర అయితే జయప్రద… స్వతహాగా డాన్సర్ కావడం కూడా బాగా ఆమె నటనకు కలిసొచ్చింది… ఇప్పటి హీరోయిన్లలో ఇలాంటి పాత్రలు చేయగలిగిన వారెవరున్నారబ్బా… అసలు అది కాదు ప్రశ్న… ఇలాంటి పాత్రలతో సినిమాలు తీసేవారెవరున్నారబ్బా… ఇక పాట విషయానికొద్దాం…
Ads
ప్రియుడిని అమితంగా ఆరాధించే ఓ ప్రేమికురాలు… ప్రియుడు హఠాత్తుగా తన నివాసానికి వస్తే, ఆమె ఫీలయ్యేదేమిటి..? అయ్యో, ఎక్కడి సామాన్లు అక్కడే ఉన్నయ్… ఇల్లు తుడవలేదు… మాసిన కర్టెన్లు, కుర్చీల మీద దుమ్ము… సానిపి సంస్కారం లేని వాకిలి… కాస్త ముందు తెలిసినా బాగుండు కదా అనుకుంటుందా..? ప్రియుడితో సమాగమానికి తన అలంకరణే కాదు, ఆంబియెన్స్ కూడా ముఖ్యమే కదా… అదే దేవులపల్లి భాషలో అయితే…. ఇలా సాగుతుంది…
ముందు తెలిసినా ప్రభూ! ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు మధురక్షణమేదో
కాస్త ముందు తెలిసినా ప్రభూ! ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు మధురక్షణమేదో
కాస్త ముందు తెలిసినా ప్రభూ!
అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే
అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే
సుందర మందారకుంద సుమ దళములు పరువనా
సుందర మందారకుంద సుమ దళములు పరువనా
దారి పొడుగునా తడిసిన పారిజాతములపై
నీ అడుగుల గురుతులే నిలిచినా చాలును
ముందు తెలిసినా ప్రభూ! ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు మధురక్షణమేదో
కాస్త ముందు తెలిసినా ప్రభూ!
బ్రతుకంతా ఎదురుచూచు పట్టున రానేరావు
బ్రతుకంతా ఎదురుచూచు పట్టున రానేరావు
ఎదురరయని వేళవచ్చి ఇట్టే మాయమవుతావు
ఎదురరయని వేళవచ్చి ఇట్టే మాయమవుతావు
కదలనీక నిముసము నను వదలిపోక నిలుపగ
నీ పదముల బంధింపలేను హృదయము సంకెల జేసి
ముందు తెలిసినా ప్రభూ! ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు మధురక్షణమేదో
కాస్త ముందు తెలిసినా ప్రభూ!
అయ్యో, మందమతిని, నువ్వు వచ్చే ఆ మధురక్షణం ముందే తెలిస్తే… ఈ మందిరాన్ని ఇలాగే ఉంచేదానినా..? పూలు పరవనా..? నా పాదముద్రలు పడితే చాలదా..? అని భావావేశానికి గురవుతుంది… పాట రెండో చరణం వచ్చేసరికి, ఈమె ఇక్కడ పాడుతూ ఉంటుంది ఒంటరిగా… బతుకుంతా ఎదురుచూసినా నువ్వు రానేరావు, కలలోనో ఇలలోనో మెలకువలోనో వచ్చినట్టే వచ్చి మాయమవుతావు, ఎటూపోకుండా నీ పాదాల్ని ఎలా కట్టేయను..? నా గుండెనే సంకెళ్లుగా మార్చనా..? అని… అక్కడ ఆ ప్రియుడు భౌతికంగానే మాయమవుతాడు… ప్రేక్షకుడికి అలా కనెక్టవుతుంది ఆ పాట, ఆ సందర్భం… పాటకు సంగీతం కూడా సరళంగా, మంద్రంగా వినిపిస్తుంటే… కళ్లు అరమోడ్పులవుతాయి… వీనులవిందు అంటే ఇదే…!!
Share this Article