Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జీవనపోరాటం… మానవ సంబంధాలన్నీ జస్ట్, మనీబంధాలే…

August 25, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ……. మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలే ప్రపంచంలో చాలామందికి . అలాంటి స్వార్ధ బంధంలో చిక్కుకుని పోయిన ప్రేయసి చేతిలో నలిగిపోయిన భంగ , భగ్న ప్రేమికుడిగా ; ఆదర్శం అవసరం మధ్య నిత్య సంఘర్షణకు గురయ్యే విద్యావంతుడుగా శోభన్ బాబు బాగా నటించిన సినిమా ఈ జీవన పోరాటం .

హిందీలో సూపర్ డూపర్ హిట్టయిన రోటీ కపడా ఔర్ మకాన్ సినిమాకు రీమేక్ 1986 ఏప్రిల్లో వచ్చిన మన జీవన పోరాటం సినిమా . దేశభక్తి , సమాజ శ్రేయస్సు అంశాలపై మక్కువ ఉన్న మనోజ్ కుమార్ వ్రాసుకున్న , నిర్మించిన , దర్శకత్వం వహించిన సినిమా .

Ads

ఉపకార్ , పూరబ్ ఔర్ పశ్చిం వంటి సందేశాత్మక సినిమాలను తీసిన మనోజ్ కుమార్ ప్రధాన పాత్రలో కూడా నటించాడీ సినిమాలో . ఓ నిస్వార్ధ స్వాతంత్ర్య సమర యోధుని ముగ్గురు కుమారులుగా మనోజ్ కుమార్ , అమితాబ్ బచ్చన్ , శశికపూర్ నటించారు .

ఈ మూడు పాత్రలను శోభన్ బాబు , రజనీకాంత్ , నరేషులు నటించారు మన తెలుగు సినిమాలో . రజనీకాంత్ అదరగొట్టేసాడు ఈ సినిమాలో . వీరిద్దరి తర్వాత గొప్ప పాత్ర సత్యనారాయణది . మానవత్వం ఉన్న కాబూలీవాలాగా అద్భుతంగా నటించాడు .

సంపదతో వచ్చే సుఖమయ జీవితం కొరకు ఆరాటపడే యువతిగా విజయశాంతి , తులసీ రామాయణం అని సినిమా అంతా ప్రస్తావించబడే నయా రామాయణంలో సీతగా రాధిక బ్రహ్మాండంగా నటించారు . ఇద్దరి పాత్రలూ గొప్పవే . ఇద్దరూ బాగా నటించారు . రాధిక పాత్ర పవర్ఫుల్ పాత్ర కావటం వలన ఆమె ప్రేక్షకులు గుర్తుంచుకునే విధంగా నటించగలిగింది .

భారీ తారాగణం . గుమ్మడి , పుష్పలత , సుత్తి వేలు , శరత్ బాబు , శ్రీలక్ష్మి , శుభ , రాళ్ళపల్లి , మాడా , పి యల్ నారాయణ , సుత్తి వీరభద్రరావు , కోట శ్రీనివాసరావు , ప్రసాద్ బాబు , ఈశ్వరరావు , రావు గోపాలరావు , ఊర్వశి , దేవి , పేకేటి , ప్రభృతులు నటించారు . ఓ గ్రూప్ డాన్సులో మీనాక్షి శేషాద్రి తళుక్కుమంటుంది . ఈ సినిమా నిర్మాత టి సుబ్బరామిరెడ్డి కూడా తళుక్కుమంటాడు .

ఆరు కేంద్రాలలో వంద రోజులు ఆడిన ఈ సినిమా విజయానికి గణేష్ పాత్రో సంభాషణలు , చక్రవర్తి సంగీతం , వేటూరి వారి పాటలు , బాలసుబ్రమణ్యం జేసుదాస్ సుశీలమ్మల గాత్రం ముఖ్య భూమికను పోషించాయి . సినిమాలో రాధిక పేరు తులసి . రామాయణంలో రావణుడి వంటి ముగ్గురు కీచకులు ఆమె ఆకలిని ఆసరాగా తీసుకుని జీవితాన్ని నాశనం చేస్తారు .

ఆ క్రమంలో తులసీ రామాయణం , సీత , రాముడు , రావణుడు , హనుమంతుడు వగైరా పాత్రల ప్రస్తావన విస్తృతంగా ఉంటుంది . సందర్భానుసారంగా పండింది కూడా .

rajnikanth

ఇంక పాటల చిత్రీకరణ . సైనికుల ఆర్ధిక సహాయం కొరకు ఏర్పాటు చేయబడిన వినోద కార్యక్రమంలో మీనాక్షి శేషాద్రి , రజనీకాంతుల బృంద నృత్యం చక్కగా చిత్రీకరించబడింది . అంబారే జంబారే అంటూ సాగుతుంది ఈ పాట . జేసుదాస్ పాడిన మరచిపో నేస్తమా హృదయముంటే సాధ్యమా చాలా శ్రావ్యంగా ఉంటుంది . శోభన్ బాబు గొప్పగా నటించారు .

మరో శ్రావ్యమైన పాట మరువకుమా అనురాగం మనుగడలో మకరందం . సినిమాలో రెండు సార్లు వస్తుంది . శ్రావ్యంగా ఉండటమే కాకుండా బాగా చిత్రీకరించబడింది కూడా . శోభన్ బాబు రాధికల మీద చిత్రీకరించబడిన దశరధ రాముడు నీవంట ధరణికి సోముడు నీవంట అందంగా చిత్రీకరించబడింది . సినిమా మొత్తంలో రామాయణం లోన పాత్రలు , సన్నివేశాలు విస్తృతంగా వస్తాయి .

శోభన్ బాబు గాత్రాన్ని అభిమానించే పాత్రలో నటించిన ఊర్వశి మీద ఓ ఊపైన పాట ఉంది . ఓహో పండిత పుత్రా అంటూ హీరో ఆదర్శవాదాన్ని హేళన చేస్తూ సాగుతుంది . శోభన్ బాబు విజయశాంతిల మీద డ్యూయెట్ జలతారు జల్లమ్మా కూడా బాగుంటుంది . దర్శకుడు రాజాచంద్ర పాటల చిత్రీకరణ మీద ప్రత్యేక శ్రధ్ధ తీసుకున్నట్లు అర్థం అవుతుంది . సఫలం కూడా ఆయ్యాడు .

సాధారణంగా హీరో పేరు భరత్ అని ఉంటుంది . ఈ సినిమాలో కావాలని భారత్ అని పెట్టబడింది . సినిమా కధకు బాగా సెట్టయింది . మనోజ్ కుమార్ సినిమాలు ఉపకార్ , పూరబ్ ఔర్ పశ్చింలు నాకు బాగా ఇష్టమైన సినిమాలు . వాటి వలన మనోజ్ కుమార్ కూడా ఇష్టమైన నటుడు . హిందీ సినిమాలు తక్కువగా చూసే నేను రోటీ కపడా ఔర్ మకాన్ ఆరోజుల్లోనే రెండు సార్లు చూసా . ఆ సినిమా ఆధారంగా తీయబడిన ఈ జీవన పోరాటం కూడా బాగుంటుంది .

ఇంతకుముందు చూడనివారు తప్పక చూడండి . యూట్యూబులో ఉంది . శోభన్ బాబు , రజనీకాంత్ అభిమానులు ఎన్ని సార్లయినా చూడొచ్చు . It’s a message-oriented , sentimental , action , patriotic and romantic movie . Undoubtedly a watchable one . #సినిమా_స్కూల్ #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగు_సినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నాడు ఎంట్రీపై నిరసనలు… నేడు సీఎం హోదాలో రేవంత్‌కు స్వాగతాలు…
  • నో తుర్కియే, నో అజర్‌బైజాన్… ఇప్పుడిదే ట్రెండ్… ఎందుకంటే..?!
  • కంగాళీ వెన్నెల..! బాపు చేతులెత్తేశాడు… కెమెరా వీఎస్ఆర్ స్వామి ఫ్లాప్…!!
  • తెలంగాణ ప్రజల చెవుల్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వం క్యాబేజీ పూలు..!!
  • జీవనపోరాటం… మానవ సంబంధాలన్నీ జస్ట్, మనీబంధాలే…
  • పాపం బమ్మెర పోతన ప్రాజెక్టు… ఎక్కడికక్కడ ఆగి ఏడుస్తోంది…
  • ప్రకృతి సౌందర్యానికి ప్రతీక… సముద్రపు ఒడిలో తేలియాడే గ్రామం..!
  • ఓ చిక్కు ప్రశ్న… పీటముడి… మీరేమైనా విప్పగలరా..? చెప్పగలరా..?
  • ఓహ్… కేటీయార్ ప్రేమించిన కంచె ఐలయ్య కాంగ్రెస్ సలహాదారా..?!
  • వాట్సప్‌లో పెళ్లిపత్రిక వచ్చిందా..? వెంటనే క్లిక్ చేయకండి, ఆరిపోతారు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions