.
Subramanyam Dogiparthi …….. ప్రముఖ రచయిత సత్యానంద్ దర్శకత్వం వహించిన ఏకైక సినిమా 1988 జూన్లో వచ్చిన ఈ ఝాన్సీ రాణి సినిమా … ఎన్నో హిట్ సినిమాలను నిర్మించిన మిద్దె రామారావు నిర్మాత .
సినిమా కూడా బాగానే ఉంటుంది . మరెందుకనో కమర్షియల్గా సక్సెస్ కాలేదు . ఒకటి రెండు ఇంటర్వ్యూలలో సత్యానంద్ గారు ఏం అన్నారంటే : రాజేంద్రప్రసాద్ నెగటివ్ పాత్రలో నటించటాన్ని ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేకపోయారు అని .
Ads
నాకయితే ఏం అనిపించిందంటే మన తెలుగు వారికి డిటెక్టివ్ , పరిశోధనాత్మక సినిమాలు ఓ పట్టాన రుచించవు అని . క్రైం , ఏక్షన్ సినిమాలను బాగా ఆదరిస్తారు కానీ పరిశోధనాత్మక సినిమాలను ఆదరించరు . అందువలన కూడా ఈ సినిమా ఆర్ధికంగా సక్సెస్ కాలేదు అనేది నా అభిప్రాయం .
ఏ మేగజైన్లో వచ్చిందో గుర్తు లేదు కానీ మల్లాది వారి ఈ నవల 1980 ప్రాంతంలో సీరియల్గా వచ్చింది . మిస్టర్ వి . చాలా పాపులర్ అయింది . ఆ నవలని సినిమాకు అనుగుణంగా స్క్రీన్ ప్లేని తయారు చేసుకున్నారు సత్యానంద్ . డైలాగులను కూడా ఆయనే వ్రాసారు .
కధ ఏంటంటే… : ఝాన్సీరాణి అనే యువతి LIC లో ఉద్యోగం చేసుకుంటూ దినకర్ అనే లాయర్ని ప్రేమిస్తూ ఉంటుంది . పేరుకు తగ్గట్లుగా ఎవరు తప్పు చేసినా నిర్భయంగా ఎదుర్కుంటూ ఉండే యువతి . Whistle blower .
తన అక్కను పెళ్ళి చేసుకుని వెంటనే ప్రమాదంలో చనిపోతాడు ఆమె భర్త . అది ప్రమాదం కాదని అతను అమ్మాయిలను పెళ్ళిళ్ళు చేసుకుని వదిలేసే మోసగాడని CID ఆఫీసర్ ఝాన్సీకి చెపుతాడు .
ఆ మోసగాడిని పట్టుకోవాలని పెద్ద పరిశోధన చేస్తూ ఉంటుంది . ఆమెకు ప్రియుడైన ఆ యంగ్ లాయర్ దివాకర్ సాయపడుతుంటాడు . ఆ మోసగాడు V అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వివిధ పేర్లతో ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఆడపిల్లలను పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటాడు .
అతని లిస్టులో ఝాన్సీ కూడా ఉంటుంది . సెకండ్ హాఫ్లో ఆ మోసగాడు రాజేంద్రప్రసాదే అని ప్రేక్షకులకు తెలిసిపోతుంది .
అక్కడ నుంచి ఝాన్సీని తుదముట్టించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు . ఝాన్సీ తప్పించుకుంటూ ఉంటుంది . ఈ క్రమంలో V చిత్రాన్ని అతన్ని చూసిన ఏకైక సాక్షి ద్వారా గీయించి ఆశ్చర్యపోతుంది . తన స్నేహితురాలిని పెళ్లి చేసుకోబోయే V ని పోలీసులకు అప్పగిస్తుంది . అతన్ని చంపే ప్రయత్నం చేసినందుకు ఝాన్సీని అరెస్ట్ చేసి కోర్టులో బోను ఎక్కిస్తారు .
అక్కడ V లాయర్ అతన్ని నిర్దోషిగా తీర్పు ఇప్పిస్తాడు . ఈ ఝాన్సీ ఆ ఝాన్సీ లక్ష్మీబాయి అయిపోయి కోర్టులోనే V ని షూట్ చేసి చంపేస్తుంది . ఏడు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష పడుతుంది . ఆమె తిరిగి వచ్చేదాకా ఎదురు చూస్తూ ఉంటానని ఆమె ప్రియుడు చెప్పడంతో సినిమా ముగుస్తుంది .
ఝాన్సీరాణిగా భానుప్రియ , V గా రాజేంద్రప్రసాద్ బాగా నటించారు . గోముఖ వ్యాఘ్రంగా రాజేంద్రప్రసాద్ బాగా రాణించాడు . లవర్ దివాకర్ గా దగ్గుబాటి రాజా , ఝాన్సీ అక్కగా రాజ్యలక్ష్మి నటించారు . ఇతర ప్రధాన పాత్రల్లో కోట శ్రీనివాసరావు , పూర్ణిమ , బాలాజి , సాక్షి రంగారావు , ముచ్చెర్ల అరుణ , సుత్తి జంట , కాంతారావు , జగ్గయ్య , అన్నపూర్ణ , శుభలేఖ సుధాకర్ , శ్రీలక్ష్మి , పి జె శర్మ , బెనర్జీ , రాధాకుమారి , హేమసుందర్ , ప్రభృతులు నటించారు .
చక్రవర్తి చాలా శ్రావ్యమైన బేక్ గ్రౌండ్ మ్యూజిక్కుతో పాటు పాటలకు ఇంకా శ్రావ్యమైన సంగీతాన్ని అందించారు . పాటలనన్నీ వేటూరి వారే వ్రాసారు . బాగా వ్రాసారు . దగ్గుబాటి రాజా , భానుప్రియల మీద రెండు డ్యూయెట్లు ఉంటాయి .
రేపో మాపో పెళ్ళంట , అతివ కోపం అంటూ సాగుతాయి ఆ రెండు పాటలు . మరో పాట రాజేంద్రప్రసాద్ , భానుప్రియ మీద ఉంటుంది . ప్రణయానికి పుట్టినరోజు పరువానికి పండుగ రోజు . చాలా బాగా చిత్రీకరించారు దర్శకుడు సత్యానంద్ . బాలసుబ్రమణ్యం , జానకమ్మ , సుశీలమ్మ , మనో పాడారు .
సినిమా వ్యాపారపరంగా విజయం సాధించిందా లేదా అనేది నాలాంటి ప్రేక్షకులకు పెద్దగా అవసరం లేని అంశం . నా ఉద్దేశంలో సినిమా చూడబులా కాదా అనేదే ముఖ్యం . ఆ కోణంలో ఈ సినిమా చూడబులే . డైరెక్టర్ గారు నటీమణులు భానుప్రియ , రాజ్యలక్ష్మి , అరుణ , పూర్ణిమలను అందంగా చూపారు .
రాజేంద్రప్రసాద్ నటన ఎంగేజింగుగా ఉంటుంది . పాటలు బాగానే ఉన్నాయి . సినిమా యూట్యూబులో ఉంది . చూడబులే . ఇంతకుముందు చూడనట్లయితే వాచ్ లిస్టులో పెట్టేసేయండి .
నేను పరిచయం చేస్తున్న 1173 వ సినిమా ఇది . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_స్కూల్ #సినిమా_కబుర్లు #తెలుగు_సినిమాలు
Share this Article