.
అదేదో దాసరి సినిమాలో మోహన్‌బాబు, సుజాత పాట… ఉంగరం పడిపోయింది, పోతే పోనీ పోతే పోనీ…
సేమ్, అప్పట్లో… 1966లో… మేరా సాయా అనే ఓ హిట్ సినిమా… మిస్టరీ, డ్రామా కథాంశమే కాదు, ఒక పాట సూపర్ హిట్… ఝుమ్కా గిరారే బరేలీ కే బజార్ మే… (బరేలీ మార్కెట్‌లో ఝుమ్కా పడిపోయింది… చెవి కమ్మ, రింగు…)
Ads
హీరోయిన్ తన ఝుమ్కాను బరేలీ మార్కెట్‌లో పోగొట్టుకుంటుంది అని అర్థం… 54 సంవత్సరాలు వేగంగా గడిచిపోయాయి… ఆ హీరోయిన్ పోగొట్టుకున్న ఆ చెవి కమ్మను తిరిగి వెతికి ప్రజలందరికీ కానుకగా అందించింది అనుకుంది బరేలీ ఉన్నతాధికారగణం… ఎలా..? ఇదుగో ఇలా…
2020లో, బరేలీ డెవలప్‌మెంట్ అథారిటీ ఒక గొప్ప స్మారక చిహ్నాన్ని ఆవిష్కరించింది..: గుర్గావ్ కళాకారుడు ఇత్తడి, రాగితో తయారు చేసిన 14 అడుగుల పొడవు, 200 కిలోగ్రాముల జుమ్కా.., దీని ధర ₹18 లక్షలు… NH-24 జీరో పాయింట్ వద్ద స్థాపించబడిన ఈ స్మారకం ఇప్పుడు గర్వంగా “జుమ్కా తిరాహా” అని పిలువబడుతుంది… ఇది త్వరగా పర్యాటక మైలురాయిగా మారింది…
ఆ పాట ఒక కలల బృందం – గేయ రచయిత రాజా మెహదీ అలీ ఖాన్, గాయని ఆశా భోంస్లే, స్వరకర్త మదన్ మోహన్, దివంగత సాధన శివదాసాని తెరపై అందమైన ప్రదర్శన అది… ముందే చెప్పుకున్నట్టు, ఈ సినిమా కథాంశానికి లేదా దాని మరాఠీ ఒరిజినల్‌కూ (పాత్లాగ్, 1964) బరేలీతో ఎటువంటి సంబంధం లేదు…
జస్ట్, ఆ పాట సాహిత్యంలో మాత్రమే బరేలీ ప్రస్తావన… అయితే… “బరేలీలోని ఝుమ్కా” అనే ప్రస్తావనకు ఒకరి నిజ జీవితంలో కొన్ని రూట్స్ మాత్రం ఉన్నాయి… అదీ బచ్చన్ కుటుంబ చరిత్రలో…
హరివంశ్ రాయ్ బచ్చన్, కవి, అమితాబ్ బచ్చన్ తండ్రి, మొదటిసారిగా బరేలీలో బంధువుల పెళ్లిలో తేజీ సూరిని (తరువాత తేజీ బచ్చన్) కలిసినప్పుడు ఇది ప్రారంభమైంది… ఒక పెళ్లి ఫంక్షన్లో, హరివంశ్ రాయ్ ని ఒక కవిత చెప్పమని కోరారు అందరూ… ఆయన అప్పటికప్పుడు ఓ పాట అల్లాడు… అది విని తేజీ కళ్ళలో నీళ్లు తిరిగాయి…
ఆమె కదిలిపోవడం చూసి హరివంశ్ రాయ్ కూడా చలించిపోయాడు… స్పందించాడు… ఆ కవితా సమావేశం, ఆ పాట కాస్తా త్వరలోనే ఓ ప్రేమకథగా వికసించింది… కానీ కొంతకాలం వరకు వాళ్ల పెళ్లి ప్రకటన రాలేదు… అది ఎప్పుడు జరుగుతుందని స్నేహితులు తరచుగా అడిగేవారు…
అలాంటి మిత్రుడు రాజా మెహదీ అలీ ఖాన్ ఓసారి తేజీని అాదే అడిగాడు.., ఆ ప్రశ్న నుండి తప్పించుకోవడానికి నవ్వుతూ అంది… “మేరా ఝుమ్కా తో బరేలీకే బజార్ మే గిర్ గయా హై…” (“నా చెవి రింగుర బరేలీ మార్కెట్‌లో పడిపోయింది…”)
ఆ మాట ఆ గీత రచయిత మనస్సులో బలంగా నాటుకుపోయింది… చాలా సంవత్సరాల తరువాత, మేరా సాయా కోసం పాటలు రాస్తున్నప్పుడు, తనకు అది గుర్తొచ్చింది… దాన్నే ఓ మరుపురాని పాటగా మలిచాడు… అదీ కథ… అదే బరేలీ చెవి కమ్మ కథ…
2020 లో, బరేలీ తేజీ బాపతు ఆ ఊహాత్మక ఝుమ్కాను ప్రపంచానికి “తిరిగి” ఇచ్చింది… అలా కాజువల్‌గా చెప్పబడిన ఆ ఝుమ్కా బరేలీ పాపులర్ చౌరస్తాలో ఓ స్మారకంగా నిర్మించబడింది… పర్లేదు, కొందరు అధికారులకూ క్రియేటివీ, సాహిత్యస్పృహ, అభిరుచి ఉంటాయి… ఝుమ్కా 1966లోనే “పడిపోయి” ఉండవచ్చు… కానీ బరేలీలో దొరికింది… అది ఇప్పుడు ఎత్తుగా నిలబడి ఉంది….
Share this Article