.
“చెట్టునై పుట్టి ఉంటే ఏడాదికొక్క వసంతమయినా మిగిలేది- మనిషినై పుట్టి అన్ని వసంతాలు కోల్పోయాను”
అన్నాడు గుంటూరు శేషేంద్ర. రాముడు వనవాసానికి వెళుతుంటే అయోధ్యవాసులందరూ సరయూ నది దాకా వెళ్లి వీడ్కోలు ఇచ్చి వచ్చారు. వేళ్ళున్నందుకు కదల్లేక చెట్ల కొమ్మలచేతులు రాముడు వెళ్ళినవైపు తిప్పి విలపించాయన్నాడు వాల్మీకి.
చెట్టంత ఎదిగిన మనిషి యుగయుగాలుగా చెట్టును పూజిస్తూ వచ్చాడు. చెట్టును నమ్ముకునే బతికాడు. ఇప్పుడు చెట్టును అమ్ముకుని బతుకుతున్నాడు. చెట్లు మాయమయ్యేసరికి కోల్పోయిన వసంతాలెన్నో తెలిసి వస్తోంది. చుట్టూ చెట్టంటూ చుట్టమై ఉంటే శేషేంద్ర చెప్పినట్లు ఏడాదికొక్క వసంతమైనా వస్తుందని, కాలం కలిసొస్తే ఏడాదంతా వసంతమొస్తుందని కొందరైనా పూనుకుని చెట్లను పరిరక్షిస్తున్నారు.
Ads
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా గ్రామం ఆరేళ్లక్రితం పంచాయతీగా మారింది. గాడ్గే మీనాక్షి గ్రామ తొలి సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎంతో కొంత ఊరిని బాగుచేయాలన్న పట్టుదలతో మీనాక్షి కార్యరంగంలోకి దిగారు. ఆమె చొరవతో బహిరంగ మల విసర్జనకు తెరపడింది.
చెత్త నుండి వర్మీ కంపోస్ట్ చేస్తే అయిదు లక్షల ఆదాయం వచ్చింది. దాంతో గ్రామంలో వీధి దీపాలు, ప్రభుత్వ కార్యాలయాలకు సోలార్ వెలుగులు ఏర్పాటు చేశారు. కరెంటు బిల్లులు దాదాపు సున్నా అయ్యాయి. ఐదేళ్లలో లక్షకు పైగా మొక్కలు నాటారు. చెట్ల సంరక్షణ, వాటిని పర్యవేక్షించడానికి మీనాక్షి వినూత్నంగా ఆలోచించారు.
చెట్లకు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేశారు. మనిషికి ఆధార్ నంబర్ ఉన్నట్లు ప్రతి చెట్టుకు డిజిటల్ ఆధార్ క్యూ ఆర్ కోడ్ ఏర్పాటు చేసి చెట్టు కొమ్మకు బిగించారు. మనం ఆ కోడ్ స్కాన్ చేయగానే అది ఏ చెట్టు? దాని శాస్త్రీయ నామం ఏమిటి? ఎప్పుడు నాటారు? ఒక్కో చెట్టు ఎంత కార్బన్ డై అక్సయిడ్ ను తీసుకుని ఎంత ప్రాణవాయువు ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది? లాంటి సమస్త వివరాలు వస్తాయి.
నాటిన చెట్టు ఎండిపోతే…అదే స్థానంలో మరో చెట్టును నాటుతున్నారు. దేశంలో చెట్లకు ప్రత్యేక గుర్తింపు నంబరు వేసిన తొలి గ్రామమై ముఖరా ముఖం పచ్చనాకు సాక్షిగా పచ్చగా కళకళలాడుతోంది.
మీనాక్షి పదవీకాలం అయిపోయింది. ప్రస్తుతం ఆమె మాజీ. కానీ ప్రతి చెట్టుకూ ఆమె చుట్టమే. ఆ చెట్ల ఎదుగుదల పనులనుండీ ఆమెను ఎవ్వరూ మాజీ చేయలేరు.
“ఎవరో ఒకరు
ఎపుడో అపుడు
నడవరా ముందుకు!”
ఒకానొక పల్లెలో ఒకానొక సర్పంచ్ తలచుకుంటే ఇన్నిన్ని మంచి పనులు చేయగలిగారు. లక్ష చెట్లు కొమ్మల రెమ్మల చేతులు చాచి కొత్తపూల మధుమాసాలను పల్లెకు తీసుకొచ్చేలా చేయగలిగారు. ప్రతి ఊళ్ళో ఒక మీనాక్షి ఉంటే! ప్రతి ఊరు ఒక ముఖరా అయితే! పీల్చుకున్నవారికి పీల్చుకున్నంత ప్రాణవాయువు.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article