Subrahmanyam Kvs…. ప్రతి పనికీ ఎక్కడో ఒక చోట బ్రేక్ రావాలి. బ్రేక్ వస్తేనే పనులు ముందుకు సాగుతాయి. వెయ్యి మందికి పైగా జర్నలిస్టులు సభ్యులుగా ఉన్న జె.ఎన్.జె. మాక్స్ హోసింగ్ సొసైటీకి ఆ బ్రేక్ ఈరోజు అంటే ఫిబ్రవరి 4 న వచ్చింది. 15 ఏళ్ళ పాటు ఆ సంఘం సభ్యుల ఎదురు చూపులు సాకారం కావడానికి సరైన అడుగు పడింది.
అంతకు మించి అధికారుల చేతిలో పడితే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఈనాటి సమావేశం తెలియజెప్పింది. ఇంతవరకూ జర్నలిస్టులుగా మనం ఒకరిని అదిలించడమే కానీ… ఒకరి చేత దులిపించుకోవడం తెలియని వాళ్ళం. ఈరోజు మనం దానిని చవి చూసాం. సహకార శాఖ అధికారి రమాదేవి జర్నలిస్టులను అదుపు చేయడానికి ఆఖరుగా ఆగ్రహాస్త్రాన్ని ప్రయోగించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. రెండు వర్గాల నడుమ నెలకొన్న పోటీ… ఘర్షణాత్మక వైఖరిగా మారుతున్న దశలో ఆమె జోక్యం చేసుకుని… అధికారిగా తాను చెప్పిన అంశాలను విని తీరాల్సిందేనని, జర్నలిస్టులకు వేరే ఆప్షన్ లేదని కుండబద్దలుకొట్టినట్టు చెప్పారు.
ఎన్నికల ప్రక్రియ సాగే విధానాన్ని తాను ఎంతో వివరంగా చెప్పినా ఎందుకు వినడం లేదని అసహనాన్ని వ్యక్తం చేశారు. సొసైటీలో ప్రస్తుతం కమిటీ లేదు, వాక్యూమ్ నెలకొంది. దీనిని అధిగమించడానికి అడ్ హాక్ కమిటీని ఏర్పాటు చేసుకుని, ఎన్నికలు నిర్వహింపజేసుకుని నూతన పాలకవర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ‘మీరంతా ఏకాభిప్రాయానికి వచ్చి ఐదుగురు సభ్యులను సూచిస్తారా లేక ఎంపిక బాధ్యతను నన్ను చేపట్టమంటారా’ అని ఆమె సూటిగా ప్రశ్నించారు.
Ads
సొసైటీ సభ్యుడైన నేమాని భాస్కర్ ను అడ్ హాక్ కమిటీ సభ్యునిగా ఎంపిక చేయడం కొంతసేపు గందరగోళానికి గురి చేసింది. ఆయన ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారని… కొందరు అభ్యంతరం చెప్పడంతో నేమాని తాను ఉండనని స్పష్టం చేశారు. దీనితో అలజడి సద్దుమణిగింది. వంశీ, జ్యోతిప్రసాద్, రమణారావు, నాగభూషణం, బోడపాటి శ్రీనివాస్ కూడా తాము అడ్ హాక్ కమిటీలో ఉండాలన్న ప్రతిపాదనను తిరస్కరించారు. ఈ దశలో అధికారి రమాదేవి లాటరీ ద్వారా కమిటీ సభ్యుల ఎంపికను ప్రారంభించడంతో కొందరు సభ్యులు అభ్యంతరం చెప్పారు.
అడ్ హాక్ కమిటీ ఎంపిక ప్రక్రియ తమకు చెప్పలేదని, ఇది తమకు సమ్మతం కాదనీ తెలిపారు. ‘అయితే మీరే ఐదు పేర్లను సూచించండి నేను ప్రకటిస్తాన’ని రమాదేవి అన్నారు. ఐదు నిముషాల సమయాన్ని ఇచ్చారు. ఈ క్రమంలో సొసైటీలోని రెండు వర్గాలు ఏకాభిప్రాయానికి వచ్చి, జాబితాను ఆమెకు అందజేశారు. ఈ పరిణామంతో కధ సుఖాంతమయింది.
ఎం. రామారావు, వి. శ్రీనివాసరెడ్డి, ఎం.ఏ. సత్తార్, హేమసుందర్, ఎస్.ఎన్.సి.ఎన్. ఆచార్యులతో అడ్ హాక్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు సహకార అధికారి రమాదేవి ప్రకటించారు. అతి త్వరలో ఈ కమిటీ పాలకవర్గ ఎన్నికలు నిర్వహిస్తుందని, తాము పర్యవేక్షిస్తామని ఆమె తెలిపారు. ఇప్పటి వరకూ వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసుకుని పరస్పరం నిందారోపణలు గుప్పించుకున్న రెండు వర్గాలలోని కీలక సభ్యులు పరస్పరం చర్చించుకోవడం ఈ సమావేశానికి హైలైట్.
ఒకానొక దశలో కమిటీ ఎంపిక ప్రక్రియ తమకు ఆమోదయోగ్యం కాదనీ, అధికారులు.. చేసుకునేది చేసుకుంటారంటూ తమను బలపరిచేవారిని బయటకు వెళ్ళిపోదామని పిలుపు ఇచ్చినా ఎవరూ సభ ప్రాంగణం నుంచి కదలలేదు. ఇక్కడే అధికారి కీలెరిగి వాతపెట్టారు. చట్టం తనకు ఇచ్చిన హక్కును ఉపయోగించి ప్రక్రియ పూర్తి చేస్తాననడంతో ఇరువర్గాలు దారికి వచ్చాయి. తమకు మాట్లాడే అవకాశం ఇమ్మని కోరినా, ఈ సమావేశంలో అలాంటి అవకాశం లేదని రమాదేవి స్పష్టం చేయడంతో ఆ రెండు వర్గాలకు వేరే ఆప్షన్ లేకపోయింది. మాట్లాడడానికి అవకాశం ఇచ్చి ఉంటే, పరిస్థితి ఎలా మారేదో ఊహించుకోవచ్చు. సున్నితంగా ఉన్నట్టు కనిపిస్తూనే… అధికారి రమాదేవి తన కర్తవ్యాన్ని నిష్పక్షపాతంగా నిర్వహించి… సమావేశ లక్ష్యాన్ని సునాయాసంగా సాధించారు…
(జర్నలిస్టుల ఆశల్ని కేసీయార్ నిర్దాక్షిణ్యంగా తొక్కేయడంతో చాన్నాళ్లుగా ఈ స్థలాల వివాదం ఈ సొసైటీ సభ్యుల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తించింది… మరోవైపు వేల మంది జర్నలిస్టులు కూడా తమకు ఇళ్ల స్థలాల కోసం నిరీక్షిస్తున్నారు… ఈ దశలో మొత్తం తెలుగు జర్నలిస్టుల్లో ఈ సొసైటీ పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి… అందరికీ ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి మీదే నమ్మకం, ఆశ… పైగా సుప్రీం సానుకూలంగా తీర్పు చెప్పినా ఇక్కడ పని సానుకూలం కావడం లేని దురవస్థ… అందుకే ఈ కథనం…)
Share this Article