ఉద్యోగ పర్వం: భారత దేశం……. అమెరికాలో నిన్న ఒక ఇండియన్ పిలగాడు *నన్ను ఉద్యోగం నుంచి తీసి ఆ ఉద్యోగాన్ని ఇండియాలో ఉన్న ఇండియన్స్ కి ఇచ్చారు అని* ఒక వీడియో చేస్తే వైరల్ అయ్యింది. ఆ పిలగాడు అమెరికాలో పుట్టిన ఇండియన్ పిలగాడులా ఉన్నాడు కానీ ఇండియాలో పుట్టిన ఇండియన్ లా లేడు. ఆ విషయం పక్కన పెడితే అమెరికాలో ఏవరేజ్ న ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కి 120K – 150K డాలర్లు ఇస్తారు. అదే జాబ్ కాంట్రాక్ట్ పద్దతిలో అయితే ఒకో ఉద్యోగి చేతికి అంత ఇవ్వరు కానీ వెండర్, ఆఫీస్ స్పేస్, కరెంట్ బిల్, కేఫిటేరియా బిల్ మొదలగునవి కలిపి ఒక ఉద్యోగి కోసం నెలకి 15 లక్షల పైన ఖర్చు అవుతుంది.
అమెరికాలో ఉండి చేసినా, హైదరాబాద్ లో ఉండి చేసినా అదే ఉద్యోగం. అదే అమెరికాలో ఉన్న ఉద్యోగిని తొలగించి ఇండియాలో ఒకో ఉద్యోగికి నెలకి లక్ష ఇచ్చి తీసుకున్నా 15 మంది వస్తారు. అంటే అమెరికాలో ఒకర్ని తీసివేస్తే ఇండియాలో 15 మంది దొరుకుతారు. చేసేది అదే ఉద్యోగం, అదే ఇండియన్స్ ఎక్కడ అయినా… అమెరికాలో 100 మందిని తొలగించి ఇండియాలో అనుభవాన్ని బట్టి కొంతమందికి నెలకి 3 లక్షలు, మరికొంతమందికి నెలకి లక్ష, ఇంకొంతమందికి 50 వేలు, కొద్ది మందికి నెలకి 5 లక్షలు చొప్పున ఇచ్చినా 1000 మందిని పెట్టుకోవచ్చు.
ప్రొడక్టవిటీ కూడా 10 రెట్లు పెరుగుతుంది, లాభం 10 రెట్లు కంటే ఎక్కువే ఉంటుంది; అందుకే కోవిడ్ తర్వాత ప్రధానంగా అమెరికాలో ఇండియన్స్ కి ఉద్యోగాలు బాగా తగ్గిపోయాయి. H1B వీసా ఉన్నా అమెరికా వెళ్ళకుండా ఇండియాలో ఉండి ఉద్యోగం చేస్తున్న వారు నలుగురు నాకు తెలుసు. అలా అని అమెరికాలో ఉద్యోగాలు తగ్గి ఇండియాలో ఉద్యోగాలు పెరుగుతున్నాయా అంటే లేదు, కారణం మన ప్రభుత్వాల చేతకానితనం. వాళ్ళ వర్గం వాళ్ళని, వాళ్ళ ప్రాంతం/జిల్లా వాళ్ళని పేరు గాంచిన హబ్స్ కి, స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్స్ కి హెడ్స్ గా పెడుతున్నారు. మీ దుంపతెగ, వందల వేల కోట్లు ఏంటి, లక్షల కోట్లు తినండ్రా అయ్యా , కానీ కనీసం నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళని, ప్రపంచ మార్కెట్ అంతా తెలిసిన వాళ్ళకి మంచి ప్రయారిటీ ఇస్తే ఇండియాలో 3 కోట్ల కంటే ఎక్కువే ఉద్యోగాలు క్రియేట్ చేయొచ్చు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం.
Ads
నాకు తెలిసినంత వరకు మన GDP లో 8% సాఫ్ట్ వేర్ ఎగుమతులు మరియూ IT సేవల వలన మన దేశానికి వస్తుంది. ఇంకా మన దేశ జనాభా సరాసరి వయస్సు 28 సంవత్సరాలు. ప్రస్తుత ప్రపంచ పరిస్తితులని క్యాష్ చేసుకొని మన దేశంలో ఉన్న యువత అందరికీ ఉద్యోగాలు క్రియేట్ చేయవచ్చు కానీ మన నాయకులు, ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు లేదు.
చిన్న ఉదాహరణ: ఫేస్ బుక్, యాపిల్ లాంటివి రాకముందు ప్రపంచంలో ఉన్న టాప్ 500 కంపనీలలో 490 కంపనీల ఆదాయం కంటే టాప్ 10 పార్మా కంపనీల ఆదాయం ఎక్కువ. ప్రపంచంలో ఫైజర్ నంబర్ వన్ పార్మా, ఆ తర్వాత నోవార్టిస్, సనోఫి, జాన్సన్ & జాన్సన్ , AbbVie, బేయర్, ఈ లిల్లీ, రోష్ ఆస్ట్రాజెనెకా, టకేడా మొదలగునవి ఉన్నై. ప్రస్తుతం ఇవన్నీ వాటి మాతృ దేశాల్లో ఉద్యోగాలు 70% కంటే ఎక్కువ తగ్గించి హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఆఫీస్ లు ప్రారంభించి అక్కడ ఉద్యోగులని తీసుకుంటున్నారు.
మరోవైపు ఇండియాలో కూడా నాకు తెలిసి పెద్ద పెద్ద కంపనీలల్లో 50 వేల మందికి పైగానే ఉద్యోగులని తొలగించారు, IIT ల్లో కూడా ఉద్యోగాలు రాని వారు కొంతమంది ఉన్నారు. TCS, ఇన్ ఫోసిస్, విప్రో, HCL లాంటి కంపనీలు ఇంతక ముందులాగా ఫ్రెషర్స్ ని తీసుకునే రిక్రూట్ మెంట్స్ డ్రైవ్స్ అంతగా కండక్ట్ చేయటం లేదు. వాళ్ళ ఆదాయమే తగ్గుతుంది. దీనికితోడు మళ్ళీ ఫ్రెషర్స్ మీద ఇంతకమునుపు లాగా బడ్జెట్ అంటే అది అదనపు భారం.
ఈ మధ్య కాలంలో వచ్చిన ఆర్టిఫీషియల్ ఇంటెల్లిజెన్స్ వలన ఎక్కువ ఎఫెక్ట్ మన దేశానికే. 10 నుంచి 15% ఉద్యోగాలు ఈ ఆర్టిఫీషియల్ ఇంటెల్లిజెన్స్ వలన పోతాయి, పోతున్నాయి. కానీ మన దగ్గర అదే ఆర్టిఫీషియల్ ఇంటెల్లిజెన్స్ ఉపయోగించుకొని ఆ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 30 నుంచి 40% ఉద్యోగాలు మన దేశానికే తీసుకురావచ్చు. ప్రధానంగా ప్రభుత్వాల కృషి ఉండాలి; ఉచిత పథకాలకి డబ్బు అంతా పెట్టే బదులు కొంత మొత్తం ప్రభుత్వాలే ఇంటర్న్ షిప్ లు, ట్రయినింగ్ సెంటర్స్ పెట్టాలి. చదువు పూర్తి అయిన వారికి నెలకి 30-40 వేలు ఇచ్చి ఇంటర్న్ గా తీసుకొని వాళ్ళకి కావాల్సిన ట్రయినింగ్, అనుభవం ఇస్తే వాళ్ళు ఎక్కడైనా ఉద్యోగం తెచ్చుకునే అర్హత సాధిస్తారు, ప్రస్తుత పరిస్తితులని క్యాష్ చేసుకొని GDP పెరుగుదలలో కీలక భూమిక పోషిస్తారు.
గత 20 సంవత్సరాలు నేను క్లినికల్ ట్రయిల్స్ కి సంబంధించిన డేటా మీద ప్రోగ్రామింగ్/ కోడింగ్ చేశా. ఇండియాలో ఉన్నప్పుడు ఒక కంపనీలో 20 మందిని తీసుకొని 6 నెలలు ఇంటర్న్ షిప్ లో నేర్పిస్తే 6 నెలలు తర్వాత ఆ పిల్లలు నాకంటే బెటర్ గా నేను చేయలేని వాటిని కూడా అవలీలగా చేశారు. వాళ్ళందరికీ మా కంపనీలో ఫర్మినెంట్ ఉద్యోగం వచ్చింది. నా మనస్సులో అనుకున్నా; 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ చెప్పులు తుడవటానికి అయినా పనికి వస్తానా అనిపించింది. కారణం ఆ పిల్లలు నిజంగా టాలెంటెడ్, మరియూ వెరీ నాలెడ్జ్ బుల్. దానికి తోడు వాళ్ళకి ట్రయినింగ్ ఇచ్చింది కూడా నేనే.
ఆ తర్వాత ఆ కంపనీలో మానేసి నేను వేరే కంపనీలోకి వచ్చా. ప్రస్తుతం ప్రపంచంలోనే నంబర్ వన్ యూనివర్శిటీ హార్వర్డ్ పిలగాళ్ళు ఒక ముగ్గురు ఆర్టిఫీషియల్ ఇంటెల్లిజెన్స్ సాఫ్ట్ వేర్ డెవలప్ చేస్తున్నారు. క్లినికల్ ట్రయిల్స్ గురించి, క్లినికల్ ట్రయిల్స్ డేటా గురించి వాళ్ళ ప్రొఫెసర్స్ చెప్పింది అర్ధం కాలేదు అని నా నంబర్ తెలుసుకొని ఒక నెల రోజులు నా దగ్గర సబ్జెక్ట్ తెలుసుకొని, నేను 20 సంవత్సరాలు ప్రోగ్రామింగ్/ కోడింగ్ చేసి డెవలప్ చేసిన రిపోర్ట్స్ ని వాళ్ళు ఒక్క రోజులో క్రియేట్ చేసారు. మళ్ళీ ఆశ్చర్యపోవటం నా వంతే అయ్యింది.
రోజురోజుకీ టెక్నాలజీలో పెను మార్పులు వస్తున్నై. నా ఉద్యోగంతో పాటు ఆర్టీఫీషియల్ ఇంటెల్లిజెన్స్ పెయిడ్ వర్సన్స్ కి నెలకి 10 వేలు కట్టి నేను కూడా AI నేర్చుకుంటున్నాను. లేకపోతే నేను నేర్పించిన పిల్లలకంటే కూడా వెనకపడిపోతా అని నాకు తెలుసు.
ఏది ఏమైనా మన దేశంలో ప్రొడక్ట్ బేసెడ్ లో ఒక 50 లక్షల ఉద్యోగాలు. ఎలక్ట్రానిక్స్ రంగంలో ఒక 20 నుంచి 30 లక్షల ఉద్యోగాలు, పార్మాలో ఒక 20 లక్షల ఉద్యోగాలు, ఆర్టిఫీషియల్ ఇంటెల్లిజెన్స్ లో 20 నుంచి 50 లక్షల ఉద్యోగాలు ఇంకా టిపికల్ మ్యానిఫ్యాక్షరింగ్ లో కోటి ఉద్యోగాలు ఈజీగా క్రియేట్ చేయవచ్చు. మన దగ్గర పిల్లల్లో ఎక్కువ మందికి మ్యాథమేటిక్స్ అయినా సైన్స్ అయినా డేటా సైన్స్ అయినా ఈజీగా అర్ధం అవుతుంది. క్లియర్ గా చెప్పేవాళ్ళు, ఇంటర్న్ షిప్ లు క్రియేట్ చేసి ఆయా రంగాలలో బేసిక్స్ నేర్చుకునే అవకాశం పిల్లలకి క్రియేట్ చెయ్యాలి.
ప్రతిదీ కంపనీలే చేయాలంటే కుదరక చాలా లక్షల, కోట్ల ఉద్యోగాలని మనం అందిపుచ్చుకోలేకపోతున్నాం. నిజానికి ఒక 10 వేల ఎకరాల్లో ట్రయినింగ్ సిటీని, ఇంకో 10 వేల ఎకరాల్లో ఇంటర్న్ షిప్ సిటీని, ఇంకో 10 వేల ఎకరాల్లో స్కిల్ డెవలప్ మెంట్ సిటీని నిర్మించి తగిన విధంగా మన యువతకి అవకాశాలు క్రియేట్ చేసే నగరాలని మనం నిర్మించుకోవచ్చు కారణం మన దేశంలో టాలెంట్ కి కొరత లేదు, స్కిల్ కి కొరత లేదు, చదువుకున్న యువతకి కొరత లేదు.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కొన్ని కొన్ని విషయాల్లో చాలా బాగా పనిచేస్తున్నై కానీ ఉద్యోగాల కల్పనలో మాత్రం మన కెపాసిటీలో 10% కూడా వినియోగించుకోలేకపోతున్నాం. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆంధ్రాలో చంద్రబాబు గారి ప్రభుత్వం, కేంద్రంలో నరేంద్ర మోడి గారి సర్కార్ ఈసారి ఉద్యోగ కల్పనలో యువతకి చేయూతనిస్తాయి, ఆ దిశగా కృషి చేస్తాయి అని ఆశిస్తూ…. జగన్నాథ్ గౌడ్
Share this Article