Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జాబ్… జాబ్… జాబ్… కటకట… అమెరికాలో రోజులేమీ బాగాలేవు…

March 17, 2024 by M S R

ఇది పోతే మరొకటి, కొలువులు కరువా, కంపెనీ మారితే పే కూడా పెరుగుతుంది….. మొన్నమొన్నటిదాకా ఇదీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల ధీమా… సారీ, ఇప్పుడా పరిస్థితి అస్సలు లేదు… ఉన్నది పోతే మరెలా..? ఇదే ప్రస్తుత ఆందోళన… పెద్ద పెద్ద కంపెనీల్లో కొన్నాళ్లుగా స్థిరపడిన సీనియర్లలోనూ ఏదో ఇబ్బందికరమైన అభద్రత…

అమెరికాలో కొందరితో మాట్లాడుతుంటే… ఈ ఉద్యోగ అభద్రత సీరియస్‌నెస్ అర్థమవుతుంది… అంతేకాదు, ఇది రాబోయే రోజుల్లో ఇంకా తీవ్రతను సంతరించుకోనుందనీ అనిపిస్తోంది… పాపం శమించుగాక… నిజానికి అమెరికాలో డాక్టర్లు, ఇతర వృత్తుల్లో ఉన్నవారికి పెద్ద ఝలక్స్ ఏమీ లేవు… ఎటొచ్చీ సాఫ్ట్‌వేర్ చాలా హార్డ్ సిట్యుయేషన్స్…

కొందరు కొలువులు పోయి, వేరే కొలువులు రాక, ఈలోపు వీసా గడువు పూర్తయి, నిరాశతో ఇండియా బాట పట్టారు… కొందరు ఇక్కడే కొలువుల కోసం నిరీక్షిస్తున్నారు… ఎక్కడా కొలువు రాకపోతే వీసా రెన్యువల్ ఎలా అనే ఆందోళన… ఎంఎస్ చేసీ ఏడాదిగా, రెండేళ్లుగా కొలువులు లేక నిజంగానే చాలా నిరాశలో కాలం గడుపుతున్న విద్యార్థులు వేలల్లో…

Ads

రిటెయిల్, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీల్లో ఉన్నవాళ్లూ ‘ఉన్న జాబ్ కాపాడుకుంటే చాలు’ అనుకునే స్థితి… మిత్రుడు Sreekumar Gomatham అంచనా మేరకు… 2025 నాటికి 5 లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్ ఎంఎస్ పూర్తి చేసుకుని, హెచ్1బీ వీసా కోసం వెయిటింగులో ఉంటారు… మరో లక్షన్నర మంది ఈ ఏడాది కొత్తగా వచ్చి జాయినవుతారు… ప్రతీ ఏటా కోటా దేశం ఇచ్చేది 85 వేలు మాత్రమే కదా… బెస్ట్ కేస్ 40 వేల మందికి హెచ్1బీ వీసా క్లిక్కయినా ఇంకా ఎందరిలో నిరాశ ప్రబలుతుందో అర్థం చేసుకోవచ్చు…

ఈ సంవత్సరం 7.8 లక్షల దరఖాస్తులు వచ్చాయి హెచ్1బీ లాటరీ కోసం… నిజంగా లాటరీ అనే పదం ఆప్ట్… అప్పులు చేసి, ఆస్తులు అమ్మి, అడ్డగోలు ఫీజులు, అదనంగా కాస్ట్ ఆఫ్ లివింగ్ భరిస్తూ ఏటా వేలాది మంది వస్తూనే ఉన్నారు అనేక ఆశలతో… యూనివర్శిటీలకు ఇదొక పెద్ద వ్యాపారం అయిపోయింది… కానీ వాట్ నెక్స్ట్..? అదీ అసలైన ప్రశ్న…

బేబీసిట్టర్స్‌గా, మెయిడ్స్‌గా… రెస్టారెంట్లు, గ్యాస్ స్టేషన్లు, మాల్స్ ఎట్సెట్రా వ్యాపార సంస్థల్లో అడ్డగోలు దోపిడీకి సైతం తలవంచే సిట్యుయేషన్… తప్పదు, తప్పడం లేదు… గంటకు 8-10 డాలర్లకు పార్ట్ టైమ్ పనిచేసే వాళ్లు కొన్ని వేలల్లో ఉన్నారని ఓ అంచనా… సరే, అవి రూల్స్‌కు విరుద్ధమైనా సరే, కడుపు కోసం, ఇక్కడ ఉండటం కోసం, రేపటి ఆశ కోసం ఏదో కష్టపడుతున్నారు, ఎటూ దిక్కుతోచక కన్నీటిని కంటిబిగువున దిగమింగుతూ… వాళ్లను తప్పుపట్టే పనేమీ లేదు… బాధితులు… కానీ ఎన్నాళ్లు..? ఇంకా ఎందరు..?

మొన్న ఓ ఐఐటీ ఖరగ్‌పూర్ గ్రాడ్యుయేట్… గూగుల్ వదిలేస్తే… కొత్త కొలువు కోసం దాదాపు 100 దరఖాస్తులు చేస్తే, మూడోనాలుగో ఇంటర్వ్యూలు వచ్చాయి… ఏడో ఎనిమిదో వడబోత ఇంటర్వ్యూల తర్వాత కష్టమ్మీద ఓ చిన్న కంపెనీలో జాయినైంది… మరొకరు ఇండియాలో మంచి జాబే వదులుకుని, భర్తకు డిపెండెంట్‌గా వచ్చింది… 200 దరఖాస్తులకు రెండు ఇంటర్వ్యూలు… ఇంకా జాబ్ రాలేదు… వెయిటింగ్… జస్ట్, ఎగ్జాంపుల్స్… చిన్న చిన్న ఉదాహరణలు చాలు సిట్యుయేషన్ పట్టివ్వడానికి… కన్సల్టెన్సీలు కూడా చేతులెత్తేస్తున్నాయి… ‘ఒక జాబ్ ఉంటే వంద మంది పోటీ పడుతున్నారు, ఏం చేయమంటారు..?’ అన్నాడు ఓ కన్సల్టెన్సీ ఓనర్…

మొన్న ఓ మెసేజ్ చూపించాడు ఒకాయన… పెద్ద రిటెయిల్ స్టోర్‌లో మనవాళ్ల చోరీ… తప్పదు, జేబులో డాలర్లు లేవు, అవసరాలు తీరాలి… వాళ్లు పట్టుకున్నారు… 52 డాలర్ల సైటేషన్… సీపీటీ, ఓపీటీకి ఇది ఫర్దర్‌గా ప్రాబ్లం అవుతుందా అనే కొత్త ఆందోళన… నిజానికి అమెరికాలో రిటెయిల్ స్టోర్స్ ప్రధానంగా నమ్మకం ఆధారంగా పనిచేస్తాయి… ఎంత కొన్నారు..? ఎంతకు బిల్లయింది..? ఏమేం తీసుకుపోతున్నారనే చెక్స్ తక్కువ… ఇప్పుడు అవీ స్టార్ట్ చేశారు… ఎందుకో మీకు తెలుసా..? ఓ పెద్ద రిటెయిల్ సంస్థ ఒక ఏడాది ఏకంగా 100 బిలియన్ల మేరకు కోల్పోయింది ఇలా… వాళ్ల అధికారిక అంచనా… ఆన్‌లైన్ ఆర్డర్లు, తీసుకునీ, అబ్బే, రాలేదని బుకాయించే ఉదాహరణలు అదనం…

చాన్నాళ్లుగా ఇక్కడ స్థిరపడ్డవాళ్లు… ఇలా దిక్కుతోచని స్థితిలో ఉన్న వాళ్లకు టెంపరరీ, పార్ట్ టైమ్ ఉద్యోగాలు చూపిస్తూ, ఎక్కడో ఓచోట అకామిడేట్ చేయడానికి సాయం చేస్తుంటారు… వాళ్లూ చేతులెత్తే స్థితి ఇప్పుడు… గతంలో కొన్ని కన్సల్టెన్సీలు కనీసం వసతి చూపించేవి టెంపరరీగా… ఇప్పుడు ఆ ఆశలూ లేవు… పోనీ, తెలిసినవాళ్ల ఇళ్లల్లో నాలుగు రోజులు తలదాచుకుందామంటే ఇక్కడ ఎవడి బతుకు వాడికే కష్టం అవుతోంది… వేరే దేశాల విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతోంది, ఫలితంగా మనవాళ్లకు ఈ పార్ట్ టైమ్ జాబ్స్‌లో కూడా పోటీ పెరుగుతోంది…

అమెరికాకు పిల్లల్ని పంపించే పేరెంట్స్ ఆశలు తప్పులేదు, వాళ్ల ఎఫర్ట్స్, బ్యాంకు లోన్స్ ఎట్సెట్రా తప్పులేదు, పిల్లల ఆశల్లోనూ తప్పులేదు… ఇప్పుడప్పుడే పరిస్థితి మెరుగుపడే సూచనలూ లేవు… కృత్రిమ మేథ చాలా కొలువులను కబళిస్తోంది… దీనికితోడు బ్రిటన్, జపాన్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో రెసిషన్ ఛాయలు, అమెరికా దాకా రాలేదు గానీ వస్తే ఎలా..? ముందే జాగ్రత్తపడుతున్నయ్ ఈ కంపెనీలు… ఈ స్థితిలో లక్షలాది భారతీయ ఉద్యోగులు, విద్యార్థులు, ఇంకా రాబోయేవాళ్ల స్థితిగతులు ఏమిటో ఇండియాలోని తల్లిదండ్రులకు తెలిసి ఉండటం ముఖ్యమే… ఈ కథన ఉద్దేశమూ అదే… చివరగా చెప్పేదేమిటంటే…? రోజులు బాగాలేవు..!! (నిజానికి ఇక్కడి సిట్యుయేషన్ మీద ఎప్పుడో ఓసారి వచ్చీపోయే గెస్ట్ టూరిస్టుల అవగాహనే సముద్రంలో పిట్ట రెట్టంత… బట్, ఈ మెతుకు చాలు కదా…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions