Bharadwaja Rangavajhala………… ‘‘కులము… కులము …. కులమనే పేరిట మన భారతదేశమున ఎందరి ఉజ్వల భవిష్యత్తు భగ్నమౌతోంది. ఎందరు మేధావుల మేధస్సు తక్కువ కులంలో పుట్టారనే కారణాన అడవి కాచిన వెన్నెల అవుతోంది. నేను సూత పుత్రుడననేగా ఈ లోకం నన్ను చూచి వెకిలిగా కూస్తోంది. నీ కుమార పంచకాన్ని కాపాడుకోవాలనే మాతృప్రేమతో వచ్చిన నీకు ఈనాడు కర్ణుడు కౌంతేయుడయ్యాడు. వీడు నీ వరాల తండ్రి కాదు.
తెలిసీ తెలియని పడుచుతనపు ఉన్మాదంలో దూర్వాసదత్తమైన మంత్ర శక్తిని పరీక్షించదలచిన నీ పాపపు పంట వీడు. లోకాపవాదానికి వెరచి కన్న బిడ్డను గంగపాలు చేసిన గొడ్రాలువి నువ్వు. ఈనాడు నా తల్లినని చెప్పుకోడానికి వచ్చావా..? నాడు కురుకుమారుల అస్త్ర పరీక్షా సమయంలో వీడు సూతపుత్రుడు వీడు సూతుడు అని రాజలోకమంతా అపహాస్యం చేస్తుంటే.. కాదు వీడు సూతుడు కాదు, నా బిడ్డ కౌంతేయుడు అని ఎలుగెత్తి చెప్పలేకపోయావే..?
……… కథానాయకుని కథ చిత్రంలో కర్ణుడి పాత్రలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగు ఇది. రాసింది మోదుకూరి జాన్సన్. ఈ సీన్ షూట్ అయ్యాక… ఎన్టీఆర్… జాన్సన్ ను ఓసారి తన కార్యాలయానికి రండి అని పిల్చారు. జాన్సన్ మర్నాడు వెళ్లారు. నిన్న మీరు రాసిన డైలాగు చూసాక వచ్చిన ఆలోచన ఇది. నాకు చాలాకాలంగా ఇలా ఆనాడు జరిగిన భావ విప్లవం గురించి ఓ సినిమా తీయాలనే కోరిక ఉంది… దాన్ని తీర్చేందుకు అనువైన రచయిత కోసం చూస్తున్నాను. మీరు కనెక్ట్ అయ్యారు. మీరు సరే అంటే మనం కర్ణ పాత్ర నేపధ్యంలో… స్క్రిప్టు రడీ చేద్దాం… అన్నారు జాన్సన్ వైపు చూసి…
Ads
అయ్యా … మీరు చెప్పింది వింటుంటే మీతో ట్రావెల్ అయ్యే అవకాశం ఉన్న, అవసరమైన రచయిత ఒకరు నా మనసులో మెదిలారు… వారి పేరు కొండవీటి వేంకటకవి. ఆయన చార్వాక పత్రికలో రెగ్యులర్ గా వ్యాసాలు రాస్తున్నారు. నేను ఇప్పుడు కొన్ని సినిమాలు కమిట్ అయి ఉన్నాను. వారిని కాదని చెప్పలేను. అన్నీ సగం సగం మొదలై ఉన్నాయి. కనుక మీరు సరే అంటే వేంకట కవి గారిని మీకు పరిచయం చేస్తాను అన్నారు జాన్సన్…
ఆయన గురించి నాకూ తెల్సు అన్నారు ఎన్టీఆర్… ఆయన మా ఊరి దగ్గర్లో ఉన్న చిట్టిగూడూరు సంస్కృత కళాశాలలోనే చదువుకున్నారు. అయినా మీరు వారితో మాట్లాడి… సమన్వయపరచండి… అని సమావేశం ముగించారు ఎన్టీఆర్. అలా దానవీరశూర కర్ణ రూపకల్పన వెనుక మోదుకూరి జాన్సన్ పాత్ర ఉందన్నమాట.. ఈ విషయం ఎన్టీఆరే స్వయంగా కొండవీటి వెంకటకవి సన్మానసభలో వెల్లడించారు. ఈనెల ఇరవైన బెజవాడలో మోదుకూరి జాన్సన్ సంస్మరణ సభ జరుగుతోంది… ఆ సందర్భంలో ఇది రాశానన్నమాట…
Share this Article