Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జూ..లకటక..! మతాంతర పెళ్లిళ్ల సినిమా కథలు అందరూ తీయలేరు..!!

January 12, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …….. కొన్ని సినిమాల సక్సెస్ , ఫెయిల్యూర్ స్టోరీలు చిత్రంగా ఉంటాయి . ఫస్ట్ రిలీజులో ప్రేక్షకులు ఆదరించరు .‌ తర్వాత రిలీజులలో ఆదరిస్తారు . ఇలాంటి చరిత్ర కలిగిన సినిమాలలో ఒకటి 1989 లో వచ్చిన ఈ జూ…లకటక సినిమా . కులం కన్నా , మతం కన్నా ప్రేమ , స్నేహం , మానవత్వం మిన్న అనే సందేశంతో ఎన్నో సినిమాలు వచ్చాయి .

జయభేరి , కులగోత్రాలు , బొంబాయి , ఒకే కుటుంబం , సప్తపది , ఇలా చెప్పుకుంటూ పోతే అంతే ఉండదు . ఇలాంటి సినిమాలను సందేశాత్మక సినిమాలుగా గౌరవించేవారు . గత రెండు దశాబ్దాలుగా పరిస్థితి మారిపోయింది . ముఖ్యంగా మతాంతర వివాహాలను ఏవేవో పేర్లు పెట్టి ద్వేషాన్ని రగిలించటం ప్రారంభం అయింది .

Ads

ఒకనాడు ఇలాంటి వివాహాలను జాతీయ సమైక్యతగా చూసిన సమాజం లోనే ప్రభుత్వాలు అలాంటి వివాహాలను తప్పు పట్టుతూ చట్టాలే చేసేదాకా తిరోగమనంలో ఇరుక్కుపోయాం . అప్పుడప్పుడు అయినా ఇలాంటి సినిమాలు రావటం లేదిప్పుడు . పొరపాటున వచ్చినా బాయ్ కాట్ , గర్ల్ కాట్ అని గగ్గోలు .

విజయ బాపినీడు దర్శకత్వంలో వచ్చిన ఈ జూ…లకటక సినిమా కధ ఏంటంటే ఒక సాంప్రదాయ ఆచార్యుల వారు , స్ట్రాంగ్ క్రిస్టియన్ ప్రాణస్నేహితులు , ఎదురెదురు ఇళ్ళల్లోనే ఉంటూ ఉంటారు . ఇద్దరికీ చెరొక కూతురు , చెరొక కొడుకు ఉంటారు . ఒకరిని ఒకరు గాఢంగా ప్రేమించుకుంటారు .

రాజేంద్రప్రసాద్ , కల్పన క్రైస్తవ కుటుంబం . చంద్రమోహన్ , తులసి హిందూ కుటుంబం . చంద్రమోహన్ , కల్పన ఒక జంట . రాజేంద్రప్రసాద్ , తులసి ఒక జంట . చంద్రమోహన్ , కల్పనల ప్రేమ వలన ప్రాణస్నేహితులు బధ్ధ శత్రువులు అవుతారు . ఈ గోల పడలేక వాళ్ళిద్దరూ ఆత్మహత్య చేసుకుంటారు .

రాజేంద్రప్రసాద్ , తులసి తమకు చనిపోయిన వారి ఆత్మలు ఆవహించినట్లుగా నాటకం ఆడతారు . నాటకం తెలిసిన తల్లిదండ్రులు ఇద్దరి మీద ఆంక్షలు ఎక్కువ చేస్తారు . వాటిని అధిగమించి పెళ్లి చేసుకోవడంతో సినిమా శుభాంతం అవుతుంది .

వీరి పెళ్లి తంతులో రాజేంద్రప్రసాద్ తాత అల్లు రామలింగయ్య , తులసి మేనమామ సుత్తి వేలు , సబ్ ఇనస్పెక్టర్ బ్రహ్మానందం సహాయ సహకారాలను అందిస్తారు . ఈ రెండు కుటుంబాల కధలో ఒక కీచకాధముడు కోట శ్రీనివాసరావు కూడా ఉంటాడు . ఆ కీచకుడికి ఓ అసిస్టెంట్ చిడతల అప్పారావు . క్లైమాక్సులో కీచక వధ బదులు కీచకుడే తనంత తాను కప్పు మీద నుంచి జారి హతుడవుతాడు . ఇదీ కధ టూకీగా .

సినిమా కధనాన్ని పకడ్బందీగా నడపటంలో నిష్ణాతుడయిన విజయ బాపినీడు కొంత విఫలం అయ్యాడని చెప్పక తప్పదు . అంతే కాకుండా వాసూరావు సంగీత దర్శకత్వంలో పాటలు కూడా నిరుత్సాహపరుస్తాయి .
పాటల్ని వేటూరి , భువనచంద్రలు వ్రాయగా బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , మాధవపెద్ది రమేష్ , వసంత , సరళ రేఖ పాడారు . లైలాకు మజ్నూకు అనే రీమిక్స్ పాట , గుడివాడ స్టేషను ఎప్పుడయినా చూసావా , ప్రేమ బలీ ఇది ఘోర కలీ పాటలు బాగానే ఉంటాయా . కాశీ విశ్వనాధ్ డైలాగులను బాగానే వ్రాసారు . ఇంకా బాగా వ్రాసే స్కోప్ ఉన్న సినిమా .

joo lakataka

చంద్రమోహన్ , రాజేంద్రప్రసాద్ , అల్లు రామలింగయ్యల నటన బాగుంటుంది . కల్పన చాలా అందంగా అలరిస్తుంది . ఆ టూత్ పిక్ నోట్లో పెట్టుకునే మేనరిజాన్ని దర్శకుడు ఎందుకు పెట్టారో తెలియదు . కొద్దిగా కన్విన్సింగుగా ఉండదు .

విలనుగా కోట శ్రీనివాసరావుని వాడుకోలేకపోయారు . అయిననూ బాగానే ఉంటుంది . తండ్రులుగా రమణమూర్తి , కోట శంకరరావు బాగా నటించారు . ఇద్దరిలో Sankara Rao Kota ఇంకా బాగా నటించారు .

నేనెందుకు ఈ సక్సెస్ &ఫెయిల్యూర్ సినిమాను పరిచయం చేస్తున్నానని కొందరు మిత్రులకు సందేహం రావచ్చు . ఈ సినిమా కధాంశం మతాంతర వివాహాలు . మనిషి విశ్వ మానవుడు . రాష్ట్రాలు , దేశాలు , ఖండాలు దాటి కుల మతాలతో సంబంధం లేకుండా నచ్చిన వారిని జీవిత భాగస్వాములుగా చేసుకుంటున్నారు .

అలాంటి వసుధైక కుటుంబం ఉండాలని ఆశించే వాడిని . కులం , మతం కన్నా ప్రేమ , స్నేహం , మానవత్వం మిన్న అనే సందేశాన్ని ఇచ్చే సినిమా ఇది . అందుకే ఈ సినిమాను పరిచయం చేస్తున్నాను . సినిమా యూట్యూబులో ఉంది . చూడబులే . ట్రై చేయండి .

నేను పరిచయం చేస్తున్న 1220 వ సినిమా
#తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జూ..లకటక..! మతాంతర పెళ్లిళ్ల సినిమా కథలు అందరూ తీయలేరు..!!
  • అమెరికా మైక్రోవేవ్, సోనిక్ వెపన్స్ వాడిందా..? అసలు అవేమిటో తెలుసా..?!
  • హై-ప్రొఫైల్ వ్యక్తులో బోల్తాపడుతున్నారు – జేడీ లక్ష్మినారాయణ ఎంత..?!
  • పండుగ వాసనల్లేని… రెండు ముదురు బెండకాయల సంక్రాంతి షో..!!
  • అనిల్ రావిపూడి ‘మన శివశంకర ప్రసాద్ గారిని’ పాస్ చేసేశాడు..!!
  • జగన్ వ్యాఖ్యల్ని సొంత మీడియాయే ఎందుకు దాచిపెట్టినట్టు..!?
  • టీవీ న్యూస్..! వార్తల విశ్వసనీయతను చంపేస్తున్న వేగం…! ఓ ఉదాహరణ..!
  • అనేక భాషల్లో తీసినా… తెలుగులోనే సూపర్ బ్లాక్ బస్టర్… ఎందుకు..?!
  • ఒక వేదన నుంచి ‘వేదాంతం’… ఒక వైరాగ్యం నుంచి ఔదార్యం..!!
  • ఉభయ తారకం..! సిద్దిపేట జిల్లాపై BRS, Cong నేతల ప్లానింగు..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions