Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కాళ్లల్లో కట్టెలు పెట్టేవాళ్లున్నా సరే… గూట్లేలు, గుండుగాళ్లే జోష్ నింపుతున్నారు…

August 28, 2021 by M S R

మైనంపల్లి, మల్లారెడ్డిలతో రేవంతుడిని, సంజయుడిని తిట్టించడం అనేది కేసీయార్ స్ట్రాటజీ కావచ్చుగాక…. కోపమొస్తే ఒక మాట అనరా అని కేటీయార్ సమర్థించవచ్చుగాక… కానీ కేసీయార్ గమనించాడో లేదో తెలియదు గానీ ప్రజల్లో తన పట్ల, తన పార్టీ పట్ల, తన ప్రజాప్రతినిధుల పట్ల, తన ప్రభుత్వం పట్ల, తన వ్యవహారిక ధోరణి పట్ల వ్యతిరేకత పెరుగుతోంది… టీఆర్ఎస్ క్యాంపు ఉలిక్కిపడి ఇక బూతులకు పూనుకున్నా సరే, కొన్ని నిజాల్ని అంతర్గతంగా అంగీకరించాల్సిందే… అసలు ఇది కాదు, మనం చెప్పుకోవాల్సింది… రెండు విపక్ష క్యాంపుల్లో కనిపిస్తున్న ఓ ప్రధాన విశేషాన్ని..! కాస్త లోపలికి వెళ్దాం… ఇన్నేళ్లూ కేసీయార్ చెప్పినట్టే విపక్షాలు నడుచుకునేవి… మీరు చదివింది నిజమే… కాంగ్రెస్‌లో గానీ, బీజేపీలో గానీ తన కోవర్టులే ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు అనేది ఇన్నేళ్లూ పొలిటికల్ సర్కిళ్లలో వినిపించిన విమర్శ… నిజమా, కాదా వదిలేయండి… కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు… అదీ అసలైన విశేషం…

bandi sanjay

ఈటలను వెళ్లగొట్టారు, రాజీనామా చేసేదాకా వదల్లేదు, తను కూడా నేను రెడీ అని తొడకొట్టి బరిలో నిలిచి తిరుగుతున్నాడు… మరి గతంలో తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసి, ఇప్పుడు పార్టీలు మారి, పదవులు వెలగబెడుతున్న బడా బడా నేతలు కూడా రాజీనామాలు చేసి, మేమూ సై అనొచ్చు కదా అంటారా..? ప్రజలు మమ్మల్ని ఆమోదించారు అని నిరూపించుకోవచ్చు కదా అంటారా..? అద్భుతమైన పాలన అందిస్తున్న కేసీయార్‌కు వాళ్లను గెలిపించుకోవడం చిటికెలో పని అంటారా..? అసలు ఈటల విషయంలో తల్లడం మల్లడం అయిపోతున్నాడు… జనానికి అర్థమైపోతోంది… దాన్నలా వదిలేస్తే… ఎంత తిట్టించినా సరే, బండి సంజయ్ మొత్తం పార్టీ కేడర్‌లో ఓ జోష్ నింపుతున్నాడు… తన భాష, తన సబ్జెక్టు వదిలేయండి… పార్టీలోనే అంతర్గతంగా తన కాళ్లల్లో కట్టెలు పెట్టి, బొక్కబోర్లా పడగొట్టి నవ్వాలనుకునే కేరక్టర్లు బోలెడు మంది, ముఖ్య నేతలతో సహా… వాళ్లందరినీ పక్కకు నెట్టేసి… పాత ‘టీఆర్ఎస్-బీజేపీ దోస్తీ’ వ్యవహారాల్ని పక్కకు నెట్టేసి… ప్రజాసంగ్రామయాత్ర అంటున్నాడు… కేసీయార్ అమితంగా ప్రేమించే ఒవైసీ కోటలో అడుగుపెట్టి, వేల మంది అనుచరులతో భాగ్యలక్ష్మి గుడి దగ్గర హంగామా క్రియేట్ చేశాడు… ఈమధ్యలో తెలంగాణ ప్రజానీకం ఎరుగని దూకుడు అది… వీడియో చూస్తారా..? ఇదుగో…

Ads

https://muchata.com/wp-content/uploads/2021/08/video-1630151120.mp4

ఇక రేవంత్ రెడ్డి విషయానికొస్తే… అది కాంగ్రెస్… సీనియర్లు అసలు తనకు పీసీసీ అధ్యక్షపదవి రాకుండా విశ్వప్రయత్నాలు చేశారు… ఈ ఏడున్నరేళ్లలో కాంగ్రెస్ నిజానికి కేసీయార్ మీద దూకుడుగా పోయిందే లేదు… పరుషంగా అనిపించినా సరే, అదీ టీఆర్ఎస్‌కు సంబంధించిన బీ-టీమ్ అన్నట్టుగా సాగింది యవ్వారం… ప్రతి ఉపఎన్నిక, ప్రతి ఎన్నిక కాంగ్రెస్ చేతులెత్తేయడం, టీఆర్ఎస్ విజయఢంకా మోగించడం… ఇక్కడ ఏం జరుగుతుందో అసలు ఎఐసీసీకి సోయి లేదు… రేవంత్ వచ్చాక కూడా సీనియర్ల సహకార రాహిత్యం చూస్తున్నాం, కాంగ్రెస్‌లో అది సహజమే కావచ్చు, కానీ కేసీయార్ వంటి శిఖరస్థాయి నేతను ఎదుర్కొని, తన ప్రజాదరణను బ్రేక్ చేయడానికి ఐక్యంగా ఏం చేయాలో ఆ పార్టీలో తెలివిడి లేదు… ఐతేనేం, రేవంత్ తనదైన ధోరణిలో దూకుడు కనబరుస్తున్నాడు… పాత టీడీపీ కేడర్ అంతా రేవంత్ వైపు వెళ్లిపోతోంది… కాంగ్రెస్ కేడర్ కూడా కాస్త కదులుతోంది… ఇంద్రవెల్లి, రావిర్యాల, మూడుచింతలపల్లె తదితర ప్రోగ్రాములు రేవంత్ పార్టీని నడపగలడు అని నిరూపించాయి…

revanth reddy

కావచ్చు, ప్రభుత్వ వ్యతిరేకత వోటు కాంగ్రెస్, బీజేపీ నడుమ బలంగా చీలిపోతే మళ్లీ మాకే లాభం కదా అనే అంచనా అధికార పార్టీలో ఉండవచ్చుగాక… కానీ ఒకసారి ప్రభుత్వ వ్యతిరేకత పెరగడం ప్రారంభమైతే అది ఎక్కడిదాకా దారితీస్తుందో తెలియదు… అది బీజేపీకి యూజ్ కావచ్చు లేదా కాంగ్రెస్‌కే యూజ్ కావచ్చు… లేదా కేసీయారే లాభపడొచ్చు… కానీ ప్రభుత్వ పాలన అంటే పూర్తిగా రాజకీయపరమైన పథకాలే తప్ప మరొకటి లేదనే విషయం ఇంకా ఇంకా ఎక్స్‌పోజ్ అవుతూ పోతుంది… హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ పడుతున్న ప్రయాస చూస్తేనే అర్థమవుతున్నది కదా… నామినేటెడ్ పదవులు, వందల కోట్ల ఫైళ్ల క్లియరెన్సులు, దళితబంధులు, సర్వబంధు హామీలు, కొత్తగా రిజర్వేషన్ల పెంపు వాగ్దానాలు… వాట్ నాట్… కేసీయార్ నిజానికి సాధారణ ఎన్నికల్లో కూడా ఇంత కష్టపడలేదేమో, ఇంత ఆలోచించలేదేమో… మరి ఈ స్థితి ఎందుకొచ్చింది..? ఒక్క ఈటలతో పోరు ఓ కురుక్షేత్రమా..? ఒక్కడు అంతటి బలమైన ప్రత్యర్థా..? జవాబుల్లేని ప్రశ్నలు… విపక్ష క్యాంపుల్లోని తన మిత్రులు చేతులెత్తేయడం కూడా మరో కారణం కావచ్చునేమో… ఏమో… ఈ మల్లారెడ్డితో తిట్టించడం, మైనంపల్లితో తిట్టించడం ‘‘కౌంటర్ ప్రొడక్ట్’’ అవుతుందనే సోయి కూడా లేకుండా పోవడం… సాలే, గూట్లే భాషే రాజకీయం అనుకోవడం… ఆ స్థాయికి జారిపోవడం… ఓ ఉద్యమపార్టీ ప్రస్తుత రాజకీయ దుస్థితికి, ఫ్రస్ట్రేషన్‌కు అద్దం పడుతోంది… ఎస్, నిజం నిష్ఠురంగానే ఉంటుంది…!! రేవంత్, సంజయ్ భాష కూడా అలాగే ఉంది కదా అనకండి… మరి వాళ్లకూ మీకూ తేడా ఏముంది..?! సేమ్ అని చెబుతున్నారా ప్రజలకు..!? వాళ్లు విపక్షంలో ఉన్నారు, అధికారంలో ఉన్నవాళ్లకు ఓ సంయమనం అవసరం లేదా..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions