Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అగ్ని శలభ న్యాయం… జర్నలిజం కొలువులూ అంతే… మాడిపోతారు..!!

October 10, 2025 by M S R

.

ఒక మనిషి ఇంకో మనిషి జీవితంతో ఆడే ఆటనే స్వార్థం అంటారు.. తాము ఇంకొద్దిరోజుల్లో చస్తామని తెలిసినా… కొంతమంది మనుషుల వక్రబుద్ది ఏమాత్రం మారదు..

నేను 2010లో వైజాగ్ లో రిపోర్టర్ గా ఒక ఛానెల్లో పని చేస్తున్నపుడు నాకు అడ్వర్టయిజ్మెంట్ల విషయంలో ఆ ఛానెల్లోని ఇన్ పుట్ ఎడిటర్ తో పడేది కాదు.. రిపోర్టర్ గా న్యూస్ కవరేజ్ చేస్తాను గానీ.. ఏమాత్రం చేయలేనని తెగేసి చెప్పాను. ఎంతటి ప్రమాద కరమైన చోటికైనా సరే వెళ్లి వార్తలు కవర్ చేస్తా.. అంతేగానీ పొలిటికల్ లీడర్ల దగ్గరకు వెళ్లి యాడ్స్ రూపంలో డబ్బులు వసూలు చేయలేనని చెప్పాను..

Ads

అప్పటి నుంచి అతగాడి నుంచి రకరకాల వేధింపులు మొదలయ్యాయి.ఈ సిచ్యువేషన్ లోనే మరో ఛానెల్ నుంచి మంచి ఆఫర్ వచ్చింది.. ఇప్పుడు మీడియాలో ఒక ఛానెల్లో మంచి పొజిషన్ ఉన్న వ్యక్తి నాకు పిలిచి ఆఫర్ ఇచ్చారు.. అప్పట్లోనే  35 వేల జీతంతో కనీసం ఇంటర్ వ్యూ కూడా చేయకుండా హెచ్ ఆర్ చేత ఆఫర్ లెటర్ మెయిల్ చేయించారు.. నేను కూడా చేరిపోదామని డిసైడ్ అయ్యాను. ఆ జీతం నాకు చాలా ఎక్కువ..

రిజైన్ చేసేముందు ఛానెల్ నిర్వాహకులతో మాట్లాడి రిజిగ్నేషన్ లెటర్ ఇద్దామని హైదరాబాద్ వచ్చాను..  పని ఎందుకు మానేస్తున్నావంటే.. అడ్వర్జయిజ్‌మెంట్ల కోసం ఆ నీచుడు వేధింపుల గురించి కూడా డిస్కస్ చేశాను. అప్పటికి ఆ ఛానెల్లో డైరెక్టర్ పొజిషన్ లో ఉన్న ఒక వ్యక్తి నన్ను పిలిపించారు.

అప్పటికే ఆయనకు క్యాన్సర్.. ఫైనల్ స్టేజ్ లో ఉంది.. త్వరలో చనిపోతావని ఇంకొద్దిరోజులే మీకు భూమ్మీద నూకులన్నాయని డాక్టర్లు చెప్పారు కూడా.. ఆయన నన్ను పిలిచి నీకు ఆ ఛానెల్ వాళ్లు ఆఫర్ చేసిన సేలరీ నేను ఇప్పిస్తాను. నువ్వు ఎక్కడికీ వెళ్లొద్దు.. అలాగే నీకు అడ్వర్టైజ్మెంట్ల వేధింపులు కూడా లేకుండా చేస్తాను అని హామీ ఇచ్చారు..

అసలే అలవాటైన ఛానెల్ కావడం వల్ల అవతల వచ్చిన ఆఫర్ ని వదులుకున్నాను.. నిజానికి ఆ రోజు ఆ ఛానెల్లో జాయిన్ అవుదామని ప్రిపేర్ అయి హైదరాబాద్ వచ్చిన నేను ఈ వృద్ద డైరెక్టర్ ఇచ్చిన హామీతో వెనుదిరిగి వైజాగ్ వెళ్లిపోయాను..

నాకు ఆఫర్ ఇచ్చిన వ్యక్తికి ఫోన్ చేసి సారీ సర్ అన్నాను.. వాళ్ల మాటలు నమ్మి తప్పు చేస్తున్నావ్.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు.. నీకొచ్చిన ఆఫర్ చెడగొట్టడానికి వాళ్లు ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు.. అయినా ఉద్యోగం మానేయాలనుకున్నవాడివి మళ్లీ వెళ్లి వాళ్లకి చెప్పాల్సిన అవసరం ఏముందని నాకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు .. కానీ.. ఆయన మాటలు నేను వినలేదు.. ఈ పెద్దాయన ఇచ్చిన హామీతో ఆయన చెప్పిన మాటలు నాకు పెద్దగా ఎక్కలేదు..

కానీ… ఆ డైరెక్టర్ ఇచ్చిన హామీ తర్వాత నెల సేలరీ పెరగలేదు.. పైగా అంతకుముందు నన్ను వేధించిన వ్యక్తి నుంచి మరింత దాడి పెరిగింది.. ఒక విధంగా హింస పెరిగిపోయింది.. ఏం చేయాలో అర్థం కాలేదు.. నాకు హామీ ఇచ్చిన వ్యక్తికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు..

చివరికి ఇతగాడు నన్ను ఎలాగైనా సరే ఛానెల్ నుంచి బయటకు పంపాలని డిసైడ్ అయ్యాడు. ఛానెల్ యాజమాన్యంతోనే వీడియో కాన్ఫరెన్స్ పెట్టిస్తే అందులో నేను యాడ్స్ చేయడం లేదని చెప్పాడు.. అందుకు నేను సీరియస్ గానే అతన్ని నువ్వు జర్నలిస్టువా.. బ్రోకర్ వా.. అని అందరిముందూ అన్నాను.. అంతేగాదు నన్ను 24 గంటలు పని కోసం వేధించండి.. పని చేస్తాను.. ఎక్కడికి వెళ్లమంటే అక్కడికి వెళ్లి న్యూస్ కవర్ చేస్తాను.. కానీ అడ్వర్టైజ్మెంట్లు మాత్రం చేయలేను అని తెగేసి చెప్పాను..

నేను సెన్సెటివ్ పర్సనాలిటీ అని అతనికి తెలుసు.. బ్రోకర్ వా.. అన్నందుకు పరువు పోయినట్టు ఫీలైన అతగాడు.. తర్వాతి నుంచి నుంచి నా పవర్స్ అన్నీ కట్ చేశాడు.. లైవ్ వెహికల్ బయటకు తీయాలంటే అతని నుంచి పర్మిషన్ తీసుకోవాలనే నిబంధన పెట్టాడు.. కెమెరామెన్ ని బయటకు తీసుకెళ్లాలంటే అతని అనుమతి తీసుకోవాలనే ఆంక్షలు పెట్టాడు.. స్ట్రింగర్లు ఎవరూ నాకు రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదని స్వయంగా ఫోన్ చేసి వాళ్లకే చెప్పాడు..

అంతేగాదు నామీద బ్యాడ్ ప్రచారం మొదలుపెట్టాడు.. తట్టుకోలేకపోయాను.. ఎంత కష్టమైనా పడొచ్చు. కానీ అవమానం మాత్రం భరించలేము.. వర్క్ విషయంలో ఎంతైనా ప్రెషర్ తీసుకోవచ్చు.. భరించవచ్చు.. కానీ ఇలాంటి దుష్టపన్నాగాలు, కుట్రల్ని తట్టుకోలేము.. నాకు అర్థమైంది.. నేను అతని ముందు ఓడిపోయాను.. అతన్ని ఎదుర్కోవడానిక నా శక్తి సరిపోవడం లేదు.. సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయడం నాకు చేతకావడం లేదని నాకే తెలిసిపోయింది..

సరే.. అంతకుముందు నేను ఉద్యోగం మానేస్తానంటే.. వద్దని అడ్డుకున్న ఆ పెద్దాయనని కలుద్దామని హైదరాబాద్ వచ్చాను.. ఆయన్ని కలిసి ఇందేటి సర్.. మీరు నాకు ఇచ్చిన హామీ ఏంటి.. ఇప్పుడు జరుగుతున్నదేంటి.. నాకు పక్క ఛానెల్లో మంచి ఆఫర్ వచ్చింది.. నా సేలరీతో నా కష్టాలు తీరిపోయేవి.. కానీ మీమాట మీద నమ్మకంతో ఆగిపోయాను.. మీరు సేలరీ పెంచుతా అన్నారు.. పెంచలేదు.. అడ్వర్టయిజ్మెంట్లు లేకుండా చేస్తా .. అన్నారు చేయలేదు.. పైగా ఆ వ్యక్తి నుంచి ఇంకా వేధింపులు, కుట్రలు పెరిగాయి.. నన్ను బయటకు పంపడానికి అన్నిరకాల ప్రయత్నాలు చేస్తూ నన్ను అవమానిస్తున్నారు అని చెప్పాను..

నాది చాలా చిన్న జీవితం సర్.. పేద కుటుంబం నుంచి వచ్చి జర్నలిజంలో బతుకుని వెదుక్కుంటున్నాను.. ఇదే నా జీవనాధారం.. ఈ మధ్యే పెళ్లయింది.. నా భార్య ప్రెగ్నెంట్ కూడాను.. నాలాంటివాడిని ఇలా చేయడం సరికాదు.. నాలాంటి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు సర్.. అంటూ కన్నీటితోనే వేడుకున్నాను..

ఆ పెద్దాయన నాతో మాట్లాడుతూనే దగ్గుతూనే ఉన్నారు.. ఆయన ముఖంలో నాకు చావు కళ కనిపించింది.. క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ లో ఉన్న ఆయన.. దగ్గుతూనే.. ఇప్పుడు నీకు తెలిసొచ్చిందా… నీకేదో ఇంకో ఛానెల్ నుంచి ఆఫర్ వచ్చింది అని నా ముందు టివ్ టివ్ లాడావ్… పొగరుగా ఆఫర్ లెటర్ తీసుకొచ్చి మరీ.. నా టేబుల్ మీద పెట్టావ్.. ఇప్పుడేమైంది ఆ పొగరు.. ఆ బలుపు ఎక్కడా కనిపించడం లేదే.. లేబర్ కొంప నుంచి వచ్చానని చెబుతున్నావ్.. ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి కదా.. ఎవరిని పడితే వారిని ఎంత మాట పడితే అంత మాట అంటావా.. నువ్వెంత .. నీ బతుకెంత అన్నాడు.

ఆయన ముఖం నాకు ఆ నిమిషంలో చాలా భయంకరంగా కనిపించింది.. మనుషుల ఇంత స్వార్థంగా ఉంటారా.. ఎదుటోడి జీవితంతో ఇంతలా.. ఆటాడుకుంటారా… ఒక జీవితాన్ని ఇంత కసిగా నాశనం చేస్తారా.. ఒక జర్నలిస్టు కెరీర్ ను ఇలా నలిపేస్తారా… అనుకున్నాను కన్నీళ్లు తుడుచుకుని.. కానీ మీరు పెద్దవారు.. పైగా చావు అంచుల్లో ఉన్నారు.. జీవిత చరమాంకంలో ఉండి నాంటి చిన్న జర్నలిస్టుని ఇలా మోసం చేయడం కరెక్టేనా సర్ అన్నాను.

మోసం ఎక్కడ లేదయ్యా.. అన్ని చోట్లా ఉంది.. ఉంటుంది కూడా.. నా దగ్గర పని చేస్తున్న ఒక పిల్లగాడు నా దగ్గరకే వచ్చి నాకు ఇంకొకళ్లు ఉద్యోగం ఇచ్చారు ఇదిగో ఆఫర్ లెటర్ అంటే నాకు మండదా… ఊరుకుంటాం అనుకుంటున్నావా.. అందుకే.. ఆ రోజు అలా చెప్పాను.. పక్క ఛానెల్ కు వెళ్లకుండా ఆపాను. ఇప్పుడు బయటకు పంపించేస్తున్నాము.. అన్నారు.

అప్పుడు అర్థమైంది. ఇదంతా నామీద ఆర్గనైజ్డ్ గా జరిగిందేనని. అంతా కలిసే ఈ కుట్ర చేశారని తెలిసింది.
కానీ ఇది తప్పు కదా.. సర్, భగవంతుడు అనేవారు ఉంటే అన్నీ చూస్తుంటాడు.. నాలాంటి అమాయకుడిని బలి చేసినందుకు కచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు అన్నాను.

నాదగ్గర టీటీలాడకు.. నేను ఇవాళ హాస్పిటల్ బెడ్ మీది నుంచి వచ్చాను.. ఇంకొద్దిరోజుల్లో నేను పోతానని చెప్పారు డాక్టర్లు.. ఇంకా నేను మూల్యం చెల్లించేదేంటి నీ బొంద.. దేవుడే నన్ను తీసుకుపోతున్నాడు.. ఇంక నేను భయపడేదేంటి నువ్వూ.. నీ పిచ్చ మాటలు.. పో.. పోయి పోరాటం చేయి.. ఏదో పొడిచేస్తాను.. ఉద్దరించేస్తానని విర్రవీగావు కదా.. ఇప్పుడు వెదుక్కో ఉద్యోగం.. వాడెవడో నీకు పెద్ద జీతం ఇచ్చి ఉద్యోగం ఇస్తానన్నాడు కదా అప్పుడు.. వాడి కాళ్లు పట్టుకో మళ్లీ ఇస్తాడేమో.. పెద్దోళ్ల ఆటలు ఇలాగే ఉంటాయి.. మేం చాలా చెబుతాం..అన్నీ నమ్ముతావా.. ఏంటి.. నువ్వు తెలివిగలోడివైతై ఆరోజే పక్క ఛానెల్ కి పోవాల్సింది.. పిచ్చి నాయాలువి.. కాబట్టి నా మాటలు నమ్మి ఇక్కడ ఉండిపోయావ్ .. అని ఆయన కర్కశంగా అంటుంటే.. కళ్లు తుడుచుకుంటూ ఏమీ చేయలేని చేతకాని స్థితిలో బయటకు వచ్చేసాను.

సాయంత్రానికి నా అఫిసియల్ సీయూజీ నంబర్ కట్ చేసేసారు.. అంటే అఫిసియల్ గా ఉద్యోగంలోంచి తీసేశారు.. యాజమాన్యాన్ని కలవడానికి అనేక ప్రయత్నాలు చేశాను కానీ..వాళ్లు కలవడానికి ఒప్పుకోలేదు..
అప్పుడే డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను.. జీవితం నాశనం అయిపోయింది.. కెరీర్ ముగిసిపోయిందనే ఆలోచనల్లోకి వెళ్లిపోయాను.. పూర్తిగా కాన్ఫిడెన్స్ పోయింది.. ముందుగా వాళ్లు చేసిన మోసాన్ని తట్టుకోలేకపోయాను.. ఇలా నమ్మించి గొంతు కోయడం ఇదే కదా అని తెగ బాధపడిపోయాను..

ఓవర్ థింకింగ్ తో నిద్ర పట్టేది కాదు.. అయినా లేని కాన్ఫిడెన్స్ ని తెచ్చుకుని వేరే ఛానెల్స్ లో ఉద్యోగం కోసం.. తీవ్ర ప్రయత్నాలు చేసాను.. ఎక్కడికెళ్లినా దారుణంగా అవమానించి పంపేవారు తప్ప జాబ్ మాత్రం ఇవ్వలేదు..

ఈ బాధలో నిద్రలేకుండా కళ్లుపీక్కుపోయి పేషంట్ లా తయారయ్యాను.. మరోవైపు గర్భవతి అయిన నా వైఫ్ డెలివరీకి పుట్టింటికి వెళ్లింది.. హైదరాబాద్ లో అక్క వాళ్ల ఇంట్లో ఉండేవాడిని.. అలా ఉద్యోగం లేకుండా ఎవరి ఇంట్లో అయినా ఉంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు.. అందుకే ఎక్కువ సేపు వాళ్ల ఇంట్లో ఉండకుండా సాధ్యమైనంతవరకూ బయట ఉండడానికి ట్రై చేసేవాడిని.. జేబులో డబ్బులు ఉండేవి కావు.. ఖర్చుల కోసం పీఎఫ్ ఎమౌంట్ విత్ డ్రా చేసేశాను..

మోతీనగర్ లో ఉన్న స్నేహితుడు విజయానంద్ ఇంటికి వెళ్లి అక్కడ కొన్నిరోజులు ఉంటూనే ఉద్యోగం కోసం వెదుక్కునే వాడిని.. ఒక విధంగా దాదాపు రెండునెలల పాటు నరకం అనుభవించాను.. ఆ దశలో మైగ్రైన్ లాంటి రోగాలు మొదలయ్యాయి.. ఒక విధంగా సూసైడల్ టెండెన్సీ వచ్చేసింది.. డిప్రెషన్ ఇంతలా ఉంటుందా అని నాకు నేనే దాని నుంచి బయటపడడానికి ట్రై చేసేవాడిని.. కానీ సాధ్యమయ్యేది కాదు..

ఒకవేళ నాకు ఏదైనా అయితే నాకు పుట్టబోయే బిడ్డ పరిస్థితి ఏంటి అని సెల్ఫ్ గానే.. సర్ది చెప్పుకునేవాడిని.. ఈ డిప్రెషన్లో పిచ్చిపిచ్చి కలలు వచ్చేవి.. అర్థరాత్రి నిద్ర లేచి .. మంచం మీద కూర్చుని ఆలోచిస్తూ ఉండేవాడిని. జీవితంలో అన్ని దారులు మూసుకుపోయాయనే భావన కలిగేది.. ఇలాంటి టైంలోనే చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు.. కానీ నేను ఒక విధంగా ఆ స్టేజ్ నుంచి బయటపడడంలో మాత్రం సక్సెస్ అయ్యాను.

ఇంతటి దారుణ పరిస్థితుల్లో ఒకరోజు ఏబీఎన్ రాధాకృష్ణ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది.. సర్.. గుంటూరు జిల్లా సత్తెనపల్లి దగ్గర ఇంజినీరింగ్ కాలేజీలో స్టూడెంట్స్ తో ప్రోగ్రాం చేయడానికి వస్తున్నారు.. మీరు వచ్చి కలవండని చెప్పారు.. అంతే ప్రాణం లేచొచ్చింది.. సూసైడల్ టెండెన్సీ ఎగిరిపోయింది.. మళ్లీ జీవితం చిగురించినట్టనిపించింది..

కొద్దిరోజులకు నేను ఏబీఎన్ లో చేరాను.. అత్యంత భయంకరమైన పరిస్థితుల్లో నాకు మళ్లీ జీవితాన్ని ఇచ్చింది ఏబీఎన్ రాధాకృష్ణగారే.. ఆయన ఇచ్చిన అవకాశంతో మళ్లీ కెరీర్ మొదలైంది.. నన్ను అంత దారుణంగా మోసం చేసిన ఆ ముసలి డైరెక్టర్ కొద్దిరోజులకే చనిపోయాడు.. అడ్వర్టయిజ్మెంట్ల్ పేరుతో నన్ను దారుణంగా వేధించి ఇంతటి దారుణ పరిస్థితులకు కారణమైన మరో వ్యక్తి కొద్దిరోజులకే అవమానకర స్థితిలో ఆ ఛానెల్ నుంచి బయటకు పోవాల్సి వచ్చింది..

ఆత్మవిశ్వాసం కూడా కొన్నిసార్లు స్వార్థం, మోసం ముందు ఓడిపోతుంది.. నా పరిస్థితి కూడా అదే.. ఒక చిన్న ప్రాణి మీద క్రూరమృగాలన్నీ కలిసి దాడి చేసి ఒక విధంగా మానభంగం చేశాయి.. ఆ బాధలోంచి నా ఆలోచన మారింది.. ఇలాంటి మృగాలతో పోరాడే శక్తి అప్పుడే వచ్చింది.. జర్నలిస్టుల జీవితాలు పైకి కనిపించింతగా ఏమీ ఉండవు.. పైగా నాలాంటి జర్నలిస్టులు ఎంతోమంది నాలాంటి పరిస్థితినే ఎదుర్కుంటున్నారు..

ఆ తర్వాత కూడా నేను ఇంతకంటే పెద్ద సమస్యలనే ఎదుర్కున్నాను. మీడియాలో ఇలాంటి మృగాలతో పోరాటం చేశాను.. కానీ ఎప్పుడూ ఇంతలా నొప్పి అనిపించలేదు.. ఎందుకంటే జీవితం పోరాడడం నేర్పే శక్తినిచ్చింది..కానీ జీవితంలో నేను నరకం అనుభవించిన ఆ రెండునెలల టైమ్ గుర్తొస్తేనే 15 ఏళ్ళు గడిచినా సరే ఈరోజుకు వణికిపోతుంటాను..

నా జీవితాన్ని, కెరీర్ ను నాశనం చేయడానికి ప్రయత్నించిన ఆ నీచుడు.. ఇవాళ ఒక యూట్యూబ్ ఛానెల్లో ఎవరినో ఇంటర్ వ్యూ చేస్తూ కనిపించాడు.. ఆ దుర్మార్గుడిని యూట్యూబ్ లో చూడగానే.. ఆ పాత చేదు జ్ఞాపకం గుర్తొచ్చింది… దేవుడు నాకు ఏదైన బలమైన శక్తి ఇస్తే ఆ రాస్కెల్ ని అందరి ముందూ చెప్పుతో కొట్టాలనేది.. నా ఆశ.. నన్ను అంతలా బాధ పెట్టి సూసైడల్ టెండెన్సీ వరకూ తీసుకెళ్లి నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టిన ఆ మృగాన్ని కసితీరా మళ్లీ మళ్లీ కొట్టి బిగ్గరగా ఏడ్చి .. ఆ బాధనంతా మనసులోంచి బయటకు పంపించేయాలని అనిపిస్తోంది …… .. అశోక్ వేములపల్లి

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆహా… నోబెల్ అవార్డుల జ్యూరీకి మనస్పూర్తి ప్రశంసలు… ఎందుకంటే..?
  • అంబానీలు, ఆదానీలు బోలెడు… అచ్చమైన భారత ‘రతన్’ టాటా ఒక్కడే..!
  • రేఖ బయోబుక్..! పుట్టుక నుంచీ ఆమె లైఫ్ జర్నీపై సంపూర్ణ చిత్రణ…
  • రష్మికపై కన్నడ ఇండస్ట్రీ నిషేధం..? నిజమేనా..? ఎవరితో లొల్లి..?!
  • అగ్ని శలభ న్యాయం… జర్నలిజం కొలువులూ అంతే… మాడిపోతారు..!!
  • నీయమ్మని, నీయక్కని, నీతల్లిని… ఈ డర్టీ సాంగ్‌కు సిగ్గూశరం లేని సమర్థన..!!
  • నా బిడ్డ పెళ్లిని ఆ బైకర్ల గ్రూప్ రఫ్‌గా అడ్డుకుంది… కానీ మంచే జరిగింది…
  • ఆహా… దక్షిణ వాగ్గేయకారులకూ అయోధ్య రాముడి చెంత చోటు…
  • గుడ్డు అంటేనే గుడ్డు… వెరీ గుడ్డు… అకారణ భయాలే నాట్ గుడ్డు…
  • కాంతారా చాప్టర్-1 … ఇది వనరుల దోపిడీ కథ… ఓ డిఫరెంట్ రివ్యూ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions