ఓ ఇంట్రస్టింగ్ ఫస్ట్ పేజీ బాక్స్ ఐటం కనిపించింది ఆంధ్రప్రభలో… సైన్డ్ ఎడిటోరియల్ అంటారు దీన్ని సాధారణంగా… ఏవైనా కీలకాంశాలను పాఠకులకు వివరించేందుకు పలు సందర్భాల్లో ఇలాంటి ‘‘సంతకం చేయబడిన ఫస్ట్ పేజీ సంపాదకీయ లేఖలు’’ పరిపాటే… అసాధారణం ఏమీ కాదు… సదరు మీడియా సంస్థ ఓనరో, ఎడిటరో, ఎండీయో, ముఖ్యమైన బాధ్యులో అలాంటివి వదులుతూ ఉంటారు… ప్రజలకు, పాఠకులకు పత్రిక ప్రముఖంగా ఏదైనా విషయాన్ని చెప్పాలని అనుకున్నప్పుడు ఈ పద్ధతి పాటిస్తుంటారు… ఈరోజు ఈ ఆంధ్రప్రభ ‘ఫస్ట్ పేజీ బాక్స్ ఐటం’ ఎందుకు ఒక్కసారిగా కళ్లను కట్టేసిందీ అంటే… అది జర్నలిస్టు సంఘం జాతీయ నేత కె.శ్రీనివాసరెడ్డి మీద పత్రిక ఛైర్మన్, మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ తీవ్రంగా విరుచుకుపడిన తీరు..! సాధారణంగా ఓ పత్రిక ఓనర్ జర్నలిస్టు సంఘాల నేతలతో బహిరంగంగా గోక్కోవడం ఆశ్యర్యం అనిపించింది… ఆయన లేఖలో చాలా అంశాలు అనేక ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయి… శ్రీనివాసరెడ్డి స్పందించి జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితిని అనివార్యంగా క్రియేట్ చేస్తోంది ఆ లేఖ… తెలుగు రాష్ట్రాల్లోని జర్నలిస్టులందరి దృష్టి, చర్చ ఇప్పుడు ఈ లేఖపైనే…
ఫస్ట్ పేజీలో ఆయన రాసిన లేఖ పూర్తి పాఠం ఇదీ లింకు… ఇందులో ఆయన ఆరోపణ ప్రధానంగా ఏమిటంటే… మొన్న షర్మిల నిర్వహించిన వైఎస్ సంస్మరణ భేటీకి శ్రీనివాసరెడ్డి కూడా హాజరయ్యాడు… వైఎస్‌తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకునే క్రమంలో ఆంధ్రప్రభ పత్రిక మీద విషాన్ని కక్కాడు… ఇరవై ఏళ్ల క్రితం ఆంధ్రప్రభను నేను కొనకుండా అనేక రకాలుగా శ్రీనివాసరెడ్డి అడ్డుపడ్డాడు… తాను చెప్పినా వినకుండా పత్రికను గనుక కొంటే, మళ్లీ మూసేసుకోకతప్పదని నన్ను బెదిరించాడు… ఉద్యమాలు చేయించాడు… పత్రికను కొన్నందుకు కోపంతో శ్రీనివాసరెడ్డి ఢిల్లీ వెళ్లి సోనియాను కలిసి నాకు టికెట్టు ఇవ్వకూడదని బతిమిలాడాడు… వైఎస్ మీద ఒత్తిడి తెచ్చాడు… కాకినాడకు వచ్చి మరీ వైఎస్ కాన్వాయ్‌కు అడ్డం పడ్డాడు… కాకినాడలో ప్రచారం చేసి నన్ను ఓడిస్తానని సవాల్ చేశాడు… ఇదంతా జరిగి 20 ఏళ్లు అవుతున్నా ఇంకా నాపై అదే విద్వేషం… నా పత్రికే కాదు, పలు పత్రికల్ని మూసివేయించడానికి శ్రీనివాసరెడ్డి ప్రయత్నించాడు… ఈ వ్యవహారశైలి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జర్నలిస్టు సంఘాల పట్ల జనంలో జుగుప్సను కలిగిస్తోంది… నీ అసలు ఉద్దేశాలేమిటో బహిరంగంగా వివరించు……. ఇదండీ ఆయన లేఖ రఫ్ సారాంశం…
Ads
ఒక పత్రిక గనుక మూతపడితే, ఇంకెవరో దాన్ని కొని నడిపించే ప్రయత్నం చేస్తే ఓ జర్నలిస్టు సంఘ నేతగా ఎందుకు అడ్డుపడ్డాడు..? ఆ పత్రిక ఓనర్ రాజకీయ జీవితాన్ని టార్గెట్ చేయడం ఏమిటి..? అసలు శ్రీనివాసరెడ్డి మూసివేయించాలని అనుకున్న వేరే పత్రికలు ఏవి..? పత్రిక నాలుగు కాలాల పాటు చల్లగా నడిస్తేనే అందులో పనిచేసే జర్నలిస్టుల జీవితాలు బాగుంటాయి కదా, మరి ఓ జర్నలిస్టుల సంఘం నేతే మూయించే ప్రయత్నం చేశాడా..? నిజమేనా..? కారణాలేమిటి..? లేక ముత్తా గోపాలకృష్ణే అకారణంగా ఆరోపణలు చేస్తున్నాడా..? ఇదంతా జనంలో జుగుప్స కలుగచేస్తోందనే ఆయన విమర్శ చాలా ఘాటైంది… శ్రీనివాసరెడ్డి ఇప్పటికీ జర్నలిస్టు సంఘ నాయకుడే… విశాలాంధ్ర, మనతెలంగాణ ప్రయోగాలు వికటించాక, ప్రస్తుతం సీపీఐ పార్టీ వాయిస్ ప్రజాపక్షం సంపాదకుడిగా వ్యవహరిస్తున్నాడు… ముత్తా గోపాలకృష్ణ చేసిన తీవ్ర విమర్శలకు జవాబు చెప్పడానికి తను కూడా ప్రజాపక్షంలో ఫస్ట్ పేజీ సైన్డ్ ఎడిటోరియల్ రాయాల్సి ఉంటుందా..?!
Share this Article