సుప్రీంకోర్టు అంటే చాలా కేసులకు సంబంధించి వేడి వేడి వాదనలు, విచారణలు సాగుతుంటాయి కదా… అప్పుడప్పుడూ సరదా సంభాషణలు వాతావరణాన్ని ఉల్లాసపరుస్తాయి… ఆహ్లాదాన్ని నింపుతాయి… సుప్రీంలో ఇండస్ట్రియల్ లిక్కర్ మీద ఓ కేసు ఉంది… జడ్జిగా సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ కూడా ఉన్నాడు… ఈ కేసులో సీనియర్ అడ్వొకేట్ దినేష్ ద్వివేదీ తన వాదనలు మంగళవారం స్టార్ట్ చేశాడు…
‘తెల్లని నా జుట్టుపై రకరకాల రంగులు కనిపిస్తున్నందుకు ముందుగా నన్ను క్షమించండి… అఫ్ కోర్స్, మన చుట్టూ బోలెడుమంది పిల్లలు, మనవళ్లు ఉన్నప్పుడు ఎవరైనా ఈ హోలీ రంగుల్ని ఎలా తప్పించుకోగలరు..? మనల్ని మనం రక్షించుకోలేం కదా…’ అన్నాడు సరదాగా… ‘అదంతా సరే, ఆల్కహాల్‌తో సంబంధం లేదా..?’ అనడిగాడు చంద్రచూడ్ నవ్వుతూ, అంతే సరదాగా ఉడికిస్తూ…
‘ఉండకపోతే ఎలా..? హోలీ అంటే కాస్త మందు కూడా… నేను తప్పక అంగీకరించాల్సిందే… అఫ్ కోర్స్, అసలే నేనేమో విస్కీ ప్రియుడిని’ అని బదులిచ్చాడు ద్వివేదీ… విచారణలో మరో సందర్భంలో తన విస్కీ అనుభవాన్ని కూడా సరదాగా వినిపించాడు…
‘నాకేమో సింగిల్ మాల్ట్ విస్కీ కావాలి… సింగిల్ మాల్ట్ విస్కీలకు స్వర్గధామం వంటిది ఎడిన్‌బర్గ్ … అక్కడికి వెళ్లినప్పుడు ఓ స్నిఫ్టర్ గ్లాసులోని మద్యంలో మరిన్ని ఐస్‌క్యూబ్స్ వేసుకోవడానికి ప్రయత్నించాను… కానీ వెయిటర్ బాధపడ్డాడు అది చూసి… దీన్ని నీట్‌గా తీసుకోవాలి, దేన్నీ కలపకూడదు సార్ అన్నాడు.. . దీనికోసమే ప్రత్యేకంగా ఆ గ్లాసులుంటయ్, అవి చూడటం నాకు అదే మొదటిసారి’ అని చెబుతూ పోయాడు…
కోర్టు రూంలో అన్నీ నవ్వులు… అది తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ… కేంద్రం- నడుమ పారిశ్రామిక ఆల్కహాల్‌పై అధికారాలకు సంబంధించిన కేసు… చాలామంది వీకెండ్స్‌లో తీసుకునే మద్యం వంటిదేనా ఈ పారిశ్రామిక ఆల్కహాల్, ఇదీ ప్రశ్న… దానిపైనే విచారణ…
ద్వివేదీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తరపున వాదిస్తున్నాడు… ఆల్కహాల్ ఏదైనా సరే, ఇండస్ట్రియల్ కావచ్చు, వేడుకల్లో తీసుకునేదే కావచ్చు, ఆల్కహాల్ అంటే ఆల్కహాల్.., వోడ్కా, విస్కీ, బ్రాందీ ఏదైనా సరే రాష్ట్రాల అధికార పరిధి కిందకే వస్తాయి అనేది తన వాదన సారాంశం… ‘మత్తుపానీయం మనుషులకు ఆనందాన్ని ఎంత కలిగిస్తుందో తెలియదు గానీ రాష్ట్రాలకు మాత్రం మంచి కిక్కిచ్చే ఆదాయాన్ని ఇస్తుంది కదా’ అని ఓ జడ్జి చమత్కరించాడు…
మరో జడ్జి… ‘మద్యం ఏజ్ పెరిగేకొద్దీ దాని రుచి పెరుగుతుంది కదా… రంగులను బట్టి కూడా రుచుల్లో తేడా వస్తుందా..? ఉదాహరణకు కొన్ని ముదురు రంగులో ఉంటాయి, కొన్ని లైట్ కలర్స్‌లో ఉంటాయి… సరుకు రంగును బట్టి రుచి ఉంటుందా..?’ అనడిగాడు మరింత సరదా జోడిస్తూ… ఈ చెణుకులు, నవ్వులతో పారిశ్రామిక ఆల్కహాల్ వంటి అత్యంత డ్రై కేసు కూడా హోలీ తరహా ఉత్సాహభరిత వాతావరణాన్ని తీసుకొచ్చింది అక్కడ…!
Share this Article
Ads