Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘‘రాసి పెట్టుకొండి- రావడం మాత్రం పక్కా… అవసరమూ ఉంది’’

July 17, 2026 by M S R

.

ఎస్, జూనియర్ ఎన్టీయార్ తను నోటి నుంచి స్వయంగా ఏదీ చెప్పలేదు, చెప్పడం లేదు… తనకు ఎన్టీఆర్‌లాగా ధైర్యంగా అవునూ, కాదూ అని చెప్పే ధైర్యం లేదు… ఊగిసలాట, మీమాంస, అనిశ్చితి… అందుకే జూనియర్ రాజకీయాల్లోకి వస్తున్నాడహో అని జమీన్ రైతు అనే ఓ నెల్లూరు లోకల్ పత్రిక రాస్తే అది సంచలనం అయిపోయింది…

టీమ్ ఎన్టీయార్ ఏదో ప్రకటనలు చేస్తుంది, కానీ జూనియర్ మాట్లాడడు… అదేదో ఆర్ఏడబ్ల్యూ ఎన్టీయార్ అని మాట్లాడుతుంది, దానికీ జూనియర్‌కూ నిజంగా లంకె ఏమిటో తెలియదు… కానీ జూనియర్ పొలిటికల్ ఎంట్రీ అనే వార్త బాంబులా పేలింది అనేది మాత్రం నిజం…

Ads

దీనికి అదే జమీన్ రైతు ప్రచురించిన ఫాలోఅప్, వివరణ సారాంశం ఇదుగో ఇలా ఉంది… ఎవరూ ఉలిక్కిపడకండి, జూనియర్ రాజకీయ తెరపైకి రావడం లేటేమో గానీ రావడం మాత్రం పక్కా…




‘‘Zamin Ryot …. ఇంతకూ ఎన్టీఆర్ వస్తున్నాడా, లేక రావడం లేదా? ఈ ప్రశ్నకు సమాధానం ఆయన నుంచే రావాలి. కానీ తన తాత వలె ధైర్యంగా అవును, వస్తున్నాను అని చెప్పే మనస్తత్వం జూనియర్ ఎన్టీఆర్‌కు వుందని భావించలేము. మేము వ్రాసిన వార్త మీద “ఆర్ఎడబ్ల్యుఎన్‌టిఆర్” అనే సంస్థ, తమ పత్రికా విలేఖరుల సమావేశం హోటల్ బుకింగ్ చూసి ‘జమీన్‌ రైతు’ పొరపాటు పడిందని, ఈ వార్తను తేలికపరచే ప్రయత్నం చేసింది. ఈ సంస్థ ఏమిటో, వారు ఎప్పుడు ఎక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టదలచుకొన్నారో మాకు తెలియదు.

మాకు తెలిసిన నిజం, స్వయానా జూనియర్ ఎన్టీఆర్ తన సామాజిక సేవా కార్యక్రమాలకు శుభ ముహుర్తం నిర్ణయించుకొన్న వాస్తవం; అందుకోసం ఆయన సిద్ధం చేసుకొన్న పోస్టర్ కూడా నిజం. ముహుర్తం ఎక్కడ, ఏ పుణ్య పురుషుడు పెట్టాడన్న సమాచారం మాకు తెలుసు; కానీ అది వెల్లడించదగినది కాదు కాబట్టి, చెప్పము.

తమిళనాడులో విజయ్ అసాధారణ విజయం సాధించిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తన రాజకీయ అవకాశాలపై జరిపిన చర్చలలో కొన్నిటి మీద ‘జమీన్‌ రైతు’ వద్ద స్పష్టమైన సమాచారం వుంది. ఢిల్లీ పెద్దలతో ముచ్చట్ల వార్తలూ తెలుసు. తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక సీనియర్ పాత్రికేయుడికి దీనిపై ఇచ్చిన సంకేతం కూడా తెలిసిన సంగతే. ఇన్ని ఆధారాలు వున్నాయి కాబట్టే, అంత తేటతెల్లంగా, నందమూరి అందగాడు జనం కోసం వస్తున్నాడని ప్రకటించాము.

ఆ వార్తలో ఏ మాత్రం సందేహించవలసిన అంశం లేదు. అందులో మేము చెప్పింది – ఇప్పటికిప్పుడు ఆయన రాజకీయ ప్రణాళికలు రచించడం లేదు; కనీసం ఒక సంవత్సరం పాటు సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలకు దగ్గర కావాలనే ఆలోచన మాత్రం వుందని మాత్రమే.

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఆరంగేట్రం చేస్తాడా చేయడా అన్న చర్చ పక్కన పెట్టి, చూస్తే ఆయన అవసరం రాష్ట్రానికి ఎంతో వుందన్నది మా అభిప్రాయం. మొరటుగా చెప్పాలంటే, రాష్ట్రంలోని రెండు రాజకీయ పార్టీలు కూడా చెదల పుట్టల వలె మారిపోయాయి. పుట్టలు వేరు కానీ, పురుగులు మాత్రం ఒకటే. రాష్ట్ర సంపదను, భవిష్యత్తును, ప్రజల జీవితాలను ఈ చెద పురుగులు శిథిలం చేస్తున్నాయని చెప్పడానికి ఎంత మాత్రం సందేహించడం లేదు.

అధికారం నిలుపుకోవడానికి ఒకరు, పోగొట్టుకున్నది రాబట్టుకోవడానికి మరొకరు నిత్యం ప్రజల ముందు గారడీ విద్యలు ప్రదర్శించడం తప్ప, ప్రజల శ్రేయస్సు పట్ల వారిలో ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని అందరికీ తెలుసు. రాజకీయం అంటే, ప్రజల సొత్తు దోచుకోవడం అన్న నిర్వచనంతో నడుస్తున్నాయి రెండు పార్టీలు కూడా. వేల కోట్ల ప్రజా ధనాన్ని పటికబెల్లం వలె ఆరగిస్తున్నారు. పత్రికలు, టీవీ ఛానళ్లను తమ అదుపులో వుంచుకొని, నిజాలు వెల్లడి కాకుండా దాచేస్తున్నారు కాబట్టి, ప్రజలకు సమాచారం తెలియడం లేదు కానీ, గత ఐదేళ్ల జగన్ పాలనలో, ఇప్పుడు ఈ రెండున్నరేళ్ల చంద్రబాబు పాలనలో జరుగుతున్న దోపిడీ పర్వం చరిత్రలో ఎప్పుడూ చూడని స్థాయిలో వుంది.

గనులు, భూములు, నీటి పారుదల ప్రాజెక్టులు, విద్యుత్ పరికరాలు, విద్యుత్ కొనుగోలు, బొగ్గు కొనుగోలు వంటి అంశాలలో ఎన్ని వేల కోట్ల రూపాయల ప్రజా ధనం ఖజానా నుంచి ఈ దుర్మార్గుల జేబులలోకి వెళ్తున్నదీ పరిశోధన చేస్తే, యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయే కఠోర వాస్తవాలు ఎన్నో బయటకు వస్తాయి. పెన్షన్లు ఇస్తున్నాము, అమ్మ ఒడి పంచుతున్నాము కాబట్టి, మేమేమి చేస్తే మీకేమి సంబంధం అన్నట్లుగా వుంది ప్రజల పట్ల వీరి ధోరణి. రెండు పార్టీలు, రెండు పార్టీలకు చెందిన నాయకులు కలిసి తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా పంచుకు తినడం ఒక ఆనవాయితీగా మారిపోయింది.

నలభై ఐదేళ్ల నాడు ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పుడు ఎటువంటి పరిస్థితులు వున్నాయో, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రావాలనుకుంటున్న పరిస్థితులు కూడా అచ్చు గుద్దినట్లు, అట్లే వున్నాయి. నీతిగా వుంటాను, నీతివంతమైన పాలన అందిస్తాను అనే ఒక్క మాట చిత్తశుద్ధితో చెబితే, జూనియర్ ఎన్టీఆర్ వెంట నడవడానికి యావత్ ఆంధ్ర ప్రజానీకం సిద్ధంగా ఉంది.

జూలై 18 తేదీ జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ నుంచి తన కార్యక్రమాలు ప్రారంభించబోతున్నాడో మాకు తెలియదు; కానీ ఆ పుణ్యకార్యం జరిగి పోవడం మాత్రం ఖాయం…..’’

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సగటు తమిళుడికి తన భాష, సంస్కృతిపై ఓ ‘పిచ్చి ప్రేమ’… అంతే!
  • చలించిన న్యాయమూర్తి… ‘‘ఆ చెడ్డ అంకుల్ ఇక బయటికి రాడు తల్లీ…’’
  • కాళేశ్వరం బ్లండర్స్‌..! నిపుణులకూ రిపేర్ ప్లాన్స్ అంతుబట్టడం లేదు..!!
  • ‘ఏం చేస్తరు? ఉరి తీయరు కదా? – మేడారం నుంచి వాషింగ్టన్ !!
  • వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ‘కల్కి భగవాన్’ కన్నుమూత!
  • దేశంలోకెల్లా నంబర్ వన్ కమెడియన్ చంద్రబాబు!
  • సిగ్గులేదు; గిదేం చరిత్రరా? – ఒరే, ఓదెల, నానీ ఎవుర్రా మీరంతా..?
  • కసబ్ ఇండియాకు ఎందుకొచ్చాడు – వాడి వయస్సెలా నిర్ధారించారు ?
  • పెళ్లికి సగం రోజు పెరోల్… పెళ్లయిపోగానే మళ్లీ జెయిల్ !
  • బీజేపీ- బీఆర్ఎస్ ‘పొత్తుపొడుపు’..! అమిత్ షా రాక సంకేతాలివే !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions