.
మైనింగ్ కింగ్, వివాదాస్పద వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి… తను నటించి, ఈరోజు రెండు భాషల్లో రిలీజైన జూనియర్ అనే సినిమా రివ్యూకు ముందు… శ్రీలీల గురించి చెప్పాలి ఓసారి…
తన కెరీర్‌కు సంబంధించి పదే పదే తప్పులు చేస్తోంది… పాత్ర ప్రాధాన్యం ఏమీ చూసుకోకుండా సినిమాలు ఒప్పుకుంటోంది… తను ఈజ్ ఉన్న డాన్సర్ కాబట్టి నిర్మాతలు, దర్శకులు నాలుగు స్టెప్పులు వేయించి వదిలేస్తున్నారు… దాంతో క్రమేపీ ఆమె ఓ ఐటమ్ డాన్సర్‌గానే మిగిలిపోతోంది… జూనియర్ సినిమా మరో తార్కాణం…
Ads
అసలు ఆమె పాత్ర ఎందుకు ఉందో ఆమెకైనా అర్థమైందో లేదో ఫాఫం… చివరకు ఆ స్టెప్పులను కూడా మరీ దబిడిదబిడి బాలయ్య పాట తరహాలో కంపోజ్ చేస్తున్నారు కొరియోగ్రాఫర్లు… రాను రాను శ్రీలీల అంటే ఐటమ్ స్టెప్పులు మాత్రమే అని ప్రేక్షకుడు లైట్ తీసుకునే ప్రమాదం ఉంది… శ్రీలీల చేజేతులా చేసుకుంటున్నదే… చివరకు ఈ పోస్టర్లలో జెనీలియా బొమ్మలు ప్రముఖంగా వేశారు గానీ శ్రీలీలను లైట్ తీసుకున్నారు…
అర్థమవుతోందా నీకు శ్రీలీలా..? ‘వైరల్ వయ్యారి’ పాట మినహా ఈ చిత్రంలో ఆమె పాత్ర లేదా నటన గురించి గుర్తుంచుకోవడానికి ఏమీ లేదు… అసలు సెకండాఫ్‌లో ఆమె కనిపించదు… మరీ అంత నామమాత్రపు పాత్ర…
మరొకటి చెప్పుకోవాల్సింది… ‘చమురు ఉండగానే సరిపోదోయ్, సరుకు ఉండాలి’… ఇది చాలాసార్లు వినేదే… గాలి కిరీటిని చూస్తే అలాగే అనిపించింది… డబ్బున్న మారాజునో, వారస నటుడినో లాంచ్ చేయాలంటే, ఆ సినిమా మొత్తం సోకాల్డ్ కమర్షియల్ అంశాలతో నింపి, తను ఫైట్లు చేయగలడు, స్టెప్పులు వేయగలడు అని నిరూపించే పనిలో పడతారు దర్శకులు… కానీ నటన..? అదే కదా కీలకం…
గతంలో కూడా చాలామంది ఇలా వచ్చారు, వెళ్లిపోయారు… నిలబడాలంటే మంచి కథలు, మంచి పాత్రలు పడాలి, సాధన చేయాలి, కష్టపడాలి… ఇప్పుడు మరీ సోషల్ మీడియా ప్రేక్షకగణం శల్యపరీక్ష చేస్తుంది… కిరీటి ఇంకా చాలా దూరం వెళ్లాలి… ఫీల్డులో నిలబడాలంటే… ఏదో హీరో అనే సోకు తీరింది అనుకుంటే ఇంకేమీ చెప్పలేం… వాళ్ల డబ్బు వాళ్లిష్టం… మైనింగ్ సొమ్ము వేల కోట్లలో మూలుగుతోందిగా… (ఈ వయస్సుకే ఆ విగ్గేమిటోయ్… ఆడ్‌గా కనిపిస్తోంది…)
ఇంకొకటి… జెనీలియా… చాన్నాళ్ల తరువాత తెరపైకి రీఎంట్రీ… సేమ్, అలాగే ఉంది… కాకపోతే మరీ అంత గొప్పగా చప్పట్లు కొట్టే రేంజ్ నటన ఆమె నుంచి ఎక్స్‌పెక్ట్ చేయలేం, పైగా ఈ సినిమాలో పాత్ర గురించి ఊదరగొట్టారు బాగా… కానీ అంత సీన్ కనిపించదు… బట్, వోకే… తనకు అప్పగించిన మేరకు కొంత న్యాయం చేసినట్టే..!
హీరో కాలేజీలో ప్రవేశించడంతో సినిమా మొదలవుతుంది, దాని తర్వాత మంచి ఛేజ్ సీక్వెన్స్, హీరో ఇంట్రడక్షన్ సాంగ్ వస్తాయి… అలా ఫస్టాఫ్ మొత్తం కొత్త హీరోను ప్రేక్షకుల బుర్రల్లోకి ఎక్కించే రొటీన్ ఫార్ములా ఎలివేషన్లు… ఇది ఒక టెంప్లేట్ -డ్రివెన్ సినిమాకు టోన్ సెట్ చేస్తుంది… అయితే, అదీ పెద్ద సమస్య కాదు… తరువాత కూడా ఫక్తు రొటీన్… ఏమాత్రం తాజాదనం లేదు, కొత్తదనం లేదు, వైవిధ్యం లేదు… నిస్సారంగా నడుస్తుంది…
నిజానికి ఓ ఏజ్ వచ్చేసరికి కొన్ని జ్ఞాపకాలు క్రియేట్ చేసుకోవాలనే కథాంశం వెరయిటీయే, కానీ దాని చుట్టూ రాసిన సీన్లు, సిట్యుయేషన్లు ఏమాత్రం ఆసక్తికరంగా లేవు, పైగా అక్కడక్కడా హాస్యాస్పదం… కిరీటి మొత్తం సినిమాను తన భుజాలపై మోయడానికి ప్రయత్నిస్తాడు.., కానీ అతిపెద్ద లోపం పాతబడిన, స్ఫూర్తి లేని రచన…
సెకండాఫ్ కాస్త కథ మీద, కథనం మీద కాన్సంట్రేట్ చేయడానికి దర్శకుడు ప్రయత్నించాడు గానీ, సరిపోలేదు… విలన్ ట్రాక్‌లు మరింత బలహీనంగా ఉన్నాయి… సరిగ్గా రాయబడలేదు… వైరల్ వయ్యారి పాట తప్ప సినిమాలో కాస్త చూడబుల్ ఏమీ లేదు…
దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ‘వైరల్ వయ్యారి’ అనే పాట వైరల్ హిట్… అదీ శ్రీలీల వల్ల, ఆ స్టెప్పుల వల్ల ఆకర్షణీయంగా ఉంది తప్ప ఆ ట్యూన్ ఫలితం కాదు, మిగతావి అసలు గుర్తుండవు, బీజీఎం కూడా సోసో… డీఎస్పీ నానాటికీ ‘పాతబడి’పోతున్నాడు ఫాఫం… ఖర్చు బాగానే పెట్టారు… నిర్మాణ విలువలు వోకే… ఎటొచ్చీ, సినిమా కథ ట్రీట్‌మెంటే సోసో…
Share this Article