బప్పీలహిరి దేహం పంచభూతాల్లో విలీనం అయిపోయింది… తన పాటలతో ఉర్రూతలూగించిన ఆయనకు జీవితకాలంలో ఒక్క పద్మశ్రీ కూడా దక్కలేదు సరికదా తన మరణానంతరం మీడియా స్మరణ కూడా తక్కువే అనిపించింది… మరీ తెలుగు మీడియా అయితే మరీ మొక్కుబడిగా స్పందించింది… అవున్లెండి, చక్రవర్తి బాపతు మీడియా టేస్టుకు బప్పీలహిరి ఏం రుచిగా ఉంటాడు..?! సాక్షిలో ఆర్టికల్ మాత్రం బాగుంది… కానీ ఇంకాస్త డెస్త్ ఉంటే మరీ బాగుండు అనిపించింది…
మీడియా జస్ట్, అలా తీర్పులు చెప్పేస్తుంది, వ్యక్తుల మీద ముద్రలు వేస్తుంది… బప్పీలహిరిని వదులుతుందా ఏం..? మాస్ మహారాజా అనేసింది… మెలొడీ చేతకాదు అని స్టాంపేసింది… నిజానికి అది చేతకానితనం కాదనీ, నిర్మాతలు తనతో కావాలనే డిస్కో పాటలు చేయించుకున్నారనీ మరిచింది… ష్, మెలొడీ, క్లాస్ అనేవి మనం పాటలకు వేసిన పిచ్చి స్టాంపులు… అంతే… బీట్ ఉంటే మాస్, లేకపోతే క్లాసా..? నాన్సెన్స్… బప్పీ అనగానే ఊ లాలా ఊ లాలా మాత్రమే గుర్తొస్తే ఎలా..? మీకొక పాట గుర్తుచేస్తాను…
Ads
తెలుగు నుంచి హిందీలోకి కృష్ణ ఒక సినిమాను రీమేక్ చేస్తున్నాడంటే చాలు బప్పీలహిరి వాలిపోవల్సిందే… తన ట్యూన్లు అలా ప్రేక్షకులను కనెక్టయిపోతాయని గుర్తించింది కృష్ణే… బప్పీ తెలుగులో కూడా బోలెడు సినిమాలు చేశాడు… ప్రత్యేకించి చిరంజీవితో చేసిన పాటలైతే ధూం తడాఖా… అంతే… ప్రత్యేకించి రౌడీ అల్లుడు సినిమాలో ఏముంది..? ఏమీలేదు… కేవలం బప్పీలహిరి పాటలు, చిరంజీవి గెంతులు… అవే సినిమాను నిలబెట్టాయి…
ఈ సినిమాలో కోరి కోరి కాలుతోంది పాట తీసుకొండి… పాట కేటగిరీ మాస్… ఓ రొమాంటిక్ డ్యుయెట్… అప్పుడు మార్కెట్ గిరాకీలో ఉన్న తెలుగు సంగీత దర్శకులైతే ఢమఢమ ఏదో వాయించేవాళ్లు… కానీ బప్పీ దాన్ని ఓ ఆహ్లాదకరమైన పాటగా మార్చేశాడు… అందరూ తనను తబలా పిచ్చోడు అంటారు గానీ… ఈ పాటను వీడియోలాగా గాకుండా… కళ్లు మూసుకుని, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినండి… భిన్నమైన లోకంలోకి వెళ్లిపోతారు, తబలా సడి లేదు, సవ్వడి లేదు…
ఓ టిపికల్ బప్పీ తరహా సంగీత వాయిద్యాలేవో మనల్ని పలకరిస్తయ్… పాట మొదట్లో వినిపించిన ఓ మెలొడియస్ వాయిద్యగానం పాట అయిపోయేదాకా బ్యాక్ డ్రాప్‌లో వినిపిస్తూనే ఉంటుంది… విన్నాక చెప్పండి, మెలోడీ కేటగిరీ కిందకు వేద్దామా, మాస్ రేంజులో పడేద్దామా..? దాదాపు ఆ సినిమాలో పాటలన్నీ అంతే… అప్పటి బాలీవుడ్ స్టయిల్ ట్యూన్లు… కానీ రకరకాల వాయిద్యాలతో కొత్త కొత్తగా మన చెవుల్లోకి పారవశ్యాన్ని ఒంపేస్తాడు… మాస్ అయితే చెప్పే పనే లేదు… డిస్కో డాన్సర్ పాటకు థియేటర్ లో ప్రతి ఒక్కరూ లేచి డాన్సు చేసిన దృశ్యం కళ్ళారా చూశాను…
ఏమాటకామాట, సింహాసనం సినిమా పాటల్ని గనుక బాలు పాడి ఉంటే… ఆహా… ఇంకెంత దుమ్మురేపేవో…! నమక్ హలాల్ మిగతా పాటలు వదిలేయండి… రాత్ బాకీ బాత్ బాకీ పాట ఓసారి వీడియో గాకుండా ఆడియోను మాత్రమే కళ్లుమూసుకుని వినండి… తను వాడిన వాయిద్యాలు మోసుకొచ్చే స్వరమేఘాలు ఒక్కుదుటున వర్షిస్తాయి, ముంచేస్తాయి, తడిపేస్తాయి… ఒక్క ముక్కలో చెప్పాలంటే బప్పీలహారి మీద రకరకాల ముద్రలు వేసి, తనకు దక్కాల్సిన గుర్తింపును సినిమా సమాజం ఇవ్వలేదేమో అనిపిస్తుంది…!!
Share this Article