సంప్రదాయ పాత్రికేయ కోణాన్ని వదిలేసి… వాస్తవ కోణాల్లోకి వెళ్దాం ఓసారి… అదుగో ఆ మంత్రిని అందుకే పీకేశారు, ఇదుగో ఈ మంత్రిని తీసేయడానికి కారణం ఇదే… కులాలు, ప్రాంతాలు, వయస్సు, చదువు, లింగం ఆధారంగా బోలెడు మీడియా విశ్లేషణలు వస్తున్నయ్… ఒక్కొక్క రాజకీయ విశ్లేషకుడు సందర్భం దొరికింది కదా మా పాండిత్య ప్రదర్శనకు అన్నట్టుగా రెచ్చిపోతున్నారు… టీవీల్లో డిబేట్లు సహజంగానే మోకాలి బుర్రలతో తెగ కొట్టేసుకుంటున్నయ్… వాస్తవం ఏమిటంటే..? మంత్రుల పనితీరుకూ, పన్నెండు మందిని కేబినెట్ నుంచి పీకేయడానికి ఏ సంబంధమూ లేదు…! ఉదాహరణకు… తవార్ చంద్ గెహ్లాట్‌ను తీసేశారు, తనను ఆల్రెడీ కర్నాటక గవర్నర్‌గా వేశారు… దానికీ కొన్ని సమీకరణాలుంటయ్… కొందరికి పార్టీ బాధ్యతలిస్తారు, ఇంకెవరికో చాన్స్ ఇవ్వడం కోసం కొందరిని బలితీసుకుంటారు… ఆరోగ్యమంత్రి కరోనాను సరిగ్గా డీల్ చేయలేదు, రసాయనాల మంత్రి కరోనా డ్రగ్స్ టాకిల్ చేయలేదు, అందుకే పీకేశారు అనే విమర్శ అబ్సర్డ్… ఫెయిల్యూర్లే పీకేయడానికి కారణాలైతే అందరికన్నా ముందు నిర్మలా సీతారామన్‌ను కదా తీసేయాల్సింది… అంతెందుకు, కరోనా వేక్సిన్లపై అతి పెద్ద ఫెయిల్యూర్ మోడీయే కదా… స్మృతి ఇరానీ పేరు వినిపించక ఎన్నేళ్లయింది..? సో, పనితీరు కారణంగా మార్పులు అనే ప్రచారాలు ఉత్త దిక్కుమాలిన ప్రయాస… కేంద్ర కేబినెట్ అంటే… దాదాపు అన్ని రాష్ట్రాలు, అన్ని సామాజికవర్గాలకూ చాన్స్ ఇవ్వాలి… రాజకీయ కోణాలే ప్రధానం… ఇంకాస్త వివరాల్లోకి వెళ్దాం…
కొత్తగా చాలామందిని తీసుకున్నారు, అకాలీదళ్, శివసేన వంటివి ఎన్డీఏ నుంచి వెళ్లిపోయిన ఖాళీలు, కొన్ని ఉద్దేశపూర్వకంగా ఉంచిన ఖాళీలు… అన్నీ ఇప్పుడు నింపేశారు… ఎన్నికల కోసం ఈ కసరత్తు, ప్రయాస అనే విమర్శ శుద్ధ అబద్ధం… ఇప్పుడేమైనా జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయా..? కేబినెట్‌లో కులాలు, ప్రాంతాల సమతూకం చూసుకోగానే జనం సునామీలాగా వోట్లు గుద్దేస్తారా..? హంబగ్..! ప్రతి మంత్రి పదవికీ ఓ లెక్క ఉంటుంది, పీకేయాలన్నా, కొత్తగా తీసుకోవాలన్నా…! ఉదాహరణకు యూపీలో కుర్మి నాయకురాలు అనుప్రియ ఉంది, ఎన్డీయే మిత్రపక్షం… రాబోయేవి యూపీ ఎన్నికలు… ఆమెను కేబినెట్‌లో తీసుకోవాల్సి వచ్చింది… ప్యూర్ పొలిటికల్ ఈక్వేషన్… బీహార్‌లో ఎల్‌జేపీ పాశ్వాన్ పార్టీని ముక్కచెక్కలు చేసిన పాశ్వాన్ తమ్ముడు పశుపతి ఉన్నాడు… తనను ఇంకా ఎంకరేజ్ చేయడం కోసం కేబినెట్‌లోకి తీసుకున్నారు… గతంలో అలిగిన జేడీయూ ఇప్పుడు కేబినెట్‌లో చేరిపోయింది… మిత్రపక్షంగా ఆబ్లిగేషన్…
Ads
శర్బానంద సోనోవాల్ ఒక ఆబ్లిగేషన్… ఆమధ్య అస్సాంలో సీఎంగా హిమంత విశ్వశర్మకు చాన్స్ ఇవ్వడం కోసం సోనోవాల్ తప్పుకోవాల్సి వచ్చింది… కేంద్రంలో చాన్స్ ఇస్తామని అప్పుడే హామీ ఇచ్చారు… మధ్యప్రదేశ్ విభీషణుడు జ్యోతిరాదిత్య సింధియాకు మంత్రి పదవి ఓ ఆబ్లిగేషన్… ఫడ్నవీస్‌ను తీసుకోవాలని అనుకున్నారు, కానీ లెక్క మారిపోయి, నారాయణరాణెను తీసుకొచ్చారు, మహారాష్ట్ర రాజకీయ వ్యూహాలేవో పదును పెంచుకుంటున్నయ్… ఆ రాష్ట్రం నుంచే ప్రీతమ్ ముండేకు ఇవ్వాలనుకున్నారు, కానీ లెక్క ఎక్కడో కుదరలేదు… ఇలా ప్రతి మంత్రి పదవికీ ఓ లెక్క ఉంది… నిజానికి మంత్రుల పనితీరు అనేది పెద్ద బోగస్ యవ్వారం… చాలామందికి ఫైళ్లు చదవడమే రాదు… కనీసం నోట్ ఫైళ్లు కూడా చదవరు… వాళ్ల దృష్టి ఎంతసేపూ వాళ్ల నియోజకవర్గాలు, వాళ్ల రాష్ట్రాల పార్టీ వ్యవహారాల్లోనే ఉంటుంది…
పార్టీ పాలసీలు, నిర్ణయాలు ఆధారంగా కొన్ని సూచనలు వస్తయ్, వాటి ప్రకారం కొన్ని ఫైళ్లు ప్రిపేరవుతయ్… ప్రధాని కార్యాలయం గైడ్ చేస్తుంది… మంత్రి సంతకం చేస్తాడు, అంతే… సొంత నిర్ణయాలు తీసుకోగల మంత్రులు మోడీ ప్రభుత్వంలో లేరు, ఒక్క అమిత్ షా మినహా…! ఇప్పుడూ ఉండరు… జగత్ కంత్రీలు అనబడే మంత్రిత్వశాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు ఎవరి స్వార్థం కోసమో కొన్ని ఫైళ్లు ప్రిపేర్ చేస్తారు, తమ ‘లెక్కలు’ చూసుకుంటారు… మంత్రుల OSD ల కళ్ళు దాటిపోతే, అవి పీఎంవోలో వడబోస్తారు… వాటిని మోడీ దృష్టికే పోనివ్వరు… కేబినెట్ ర్యాంకు సరే, స్టేట్ ర్యాంక్ మినిష్టర్లకు వాళ్ల శాఖల్లో ఏం జరుగుతున్నదో వాళ్లకే సరిగ్గా తెలియదు… ఎక్కువశాతం బ్యూరోక్రాట్లే కథలు నడిపిస్తూ ఉంటారు… ఒకవేళ ఫలానా కొత్త ప్రతిపాదన జనానికి మేలు చేస్తుంది, రాజకీయంగా-ఆర్థికంగా పార్టీకి ఉపయుక్తం అని ఎవరైనా మంత్రి ఫీలయితే… నేరుగా ప్రధానితో, కేబినెట్ సెక్రెటరీతో మాట్లాడి సర్క్యులేట్ చేస్తారు… కానీ ఆ తెలివిడి, ఆ చొరవ, ఆ ఓపిక, ఆ తీరిక, ఆ అధ్యయనం ఉన్నవాళ్లు అత్యంత అరుదు… విదేశాంగ శాఖ వంటి ఒకటీరెండు మంత్రిత్వ శాఖలే మినహాయింపు… అంతే…!!
Share this Article