‘‘హత్య సులభం… కప్పెట్టడమే కష్టం’’ ఇదీ నేరనీతి… ఈ నీతి అర్థం గాకే పోలీసులకు చాలామంది నేరస్థులు ఇట్టే దొరికిపోతుంటారు… అన్నింటికీ మించి నేరస్థులు నేరం చేసిన తరువాత తమ నోరును కట్టేసుకోవడం, మాటకు కట్టడి విధించుకోవడం ముఖ్యం… లేకపోతే జైలుపాలు కావల్సి వస్తుంది… ఐనా…. ఇన్ని టీవీ సీరియళ్లు, ఇన్ని సినిమాలు, ఇన్ని పుస్తకాలు, సోషల్ మీడియా కథనాలు ఎంత చెబుతున్నా సరే.., ఎన్ని చిట్కాలు బోధిస్తున్నా సరే.., బాడీ లాంగ్వేజీతోసహా నేరం చేశాక లాంగ్వేజీ పట్ల ఎలా జాగ్రత్త వహించాలో పూసగుచ్చినట్టు వివరిస్తున్నా సరే… కొందరు నేరస్థులకు ఇంకా ఎక్కడం లేదు… అందుకే దొరికిపోతున్నారు… ఈ కేసు కూడా అంతే… ఆమె నోరు అదుపులో పెట్టుకోలేకపోయింది, దొరికిపోయింది… కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్ చేయడానికేముంది..? తరువాత అంతే కూల్‌గా వ్యవహరిస్తేనే దానికి సార్థకత అంటుంది నేరసూత్రావళి… ఇంతకీ కేసు ఏమిటంటే..?
నల్గొండ జిల్లా, తిప్పర్తి మండలం, సర్వారం గ్రామం… జక్కలి రామకృష్ణ (30)ది ఓ మొబైల్ షాపు, చిట్టీల వ్యాపారం… ఆ ఊళ్లోనే ఉండే మమతతో ప్రేమలో పడి, ఆమెనే పెళ్లిచేసుకున్నాడు… ఇద్దరు కొడుకులు, ఓ బిడ్డ… సంసారం సజావుగా సాగుతోంది… కానీ నెల క్రితం ఓరోజు హఠాత్తుగా శవమై కనిపించాడు… భార్య మమత లబోదిబో ఏడుస్తూ, గుండెపోటుతో కుప్పకూలాడని చెప్పింది… బంధుమిత్రులందరూ వచ్చారు… కన్నీళ్లు పెట్టుకున్నారు, అంత్యక్రియల్ని నిర్వహించారు… అక్కడికి అయిపోయింది… పది రోజుల క్రితం ఇంట్లో అత్తామామాలతో గొడవ… మాటామాటా పెరిగింది, ‘మీ కొడుకునే ఖతం చేసిన, మీరో లెక్కా నాకు, ఎక్కువ మాట్లాడితే మీ పనీ అంతే’ అని నోరుజారింది మమత… అత్తామామలకు ఎక్కడో స్ట్రయికైంది… కొడుకు మరణం మీద డౌటున్నట్టు పోలీసులకు చెప్పారు… తీగ లాగడం మొదలైంది…
Ads
ఆవేశంలో నేరాలు చేసి, తరువాత ఇట్టే బయటపడిపోతుంటారు ఇలాంటి కేసుల్లో… పోలీసు విచారణ తెలుసు కదా, ఈమె మొత్తం కక్కేసింది… అసలు కథేమిటంటే..? రామకృష్ణకు ఓ క్లాస్మేట్ ఉన్నాడు, పేరు రాజశేఖర్… తనతో ఈ మమతకు సంబంధాలు ఏర్పాడ్డాయి… మధ్యలో అడ్డుగా ఉన్న మగడిని ఖతం చేయాలని అనుకుంది… ఓరోజు మగడితో ఫుల్లు మందుకొట్టించింది… పిల్లలు మధ్యలో లేవకుండా పాలల్లో నిద్రమాత్రలు వేసి తాగించింది… తరువాత ప్రియుడితో కలిసి భర్త ఊపిరి తీసింది… గుండెపోటుతో చచ్చిపోయాడని చెప్పింది… మస్త్ నటించింది… కానీ తన కోరికల్లాగే నోటినీ కట్టడి చేసుకోలేకపోయింది… ఆమె సైలెంటుగా ఉంటే, ఈ కథ ఎన్నడూ బయటికి వచ్చేదే కాదు… అసలు ఈమే కాదు, మన చుట్టుపక్కల రోజుకు ఒక వార్త ఇలాంటిదే… ప్రియుడితో కలిసి భర్త హత్య… ఎంత సున్నితంగా మారిపోయినయ్ పెళ్లయిన మగాళ్ల జీవితాలు..? రక్షణ లేకుండా పోయింది… మొగుళ్ల ప్రాణాలు తీస్తారు, ప్రియులను ఉసిగొల్పి జైళ్లపాలు చేస్తారు… ఇటూఅటూ బాధితుడు గృహస్థుడే కదా… హతవిధీ…!!
Share this Article