.
ఒక వార్త… యూపీలోని దిహులీలో… 1981 నవంబరు 18 సాయత్రం… ఎస్సీ కాలనీలోని సాయుధ దుండగుల బృందం జొరబడి పురుషులు, మహిళలు, పిల్లలు అని కూడా చూడకుండా విచ్చలవిడిగా కాల్పులు జరిపింది…
24 మంది ప్రాణాలు కోల్పోయారు… ఈరోజు ఐదుగురికి మరణశిక్ష విధిస్తూ మెయిన్‌పురి కోర్టు తీర్పు వెలువరించింది… అంటే 44 ఏళ్ల తరువాత గానీ బాధిత కుటుంబాలకు కాస్త ఉపశమనం కలిగించే తీర్పు ఇవ్వలేకపోయింది మన వ్యవస్థ… “justice delayed is justice denied”
Ads
ఆ మరణ శిక్ష పడిన బాధితులకు ఇంకా న్యాయస్థానాల్లో పోరాడే అవకాశాలున్నాయి… ఈ వార్త చదువుతుంటే మిత్రుడు వి.సాయి వంశీ (విశీ) పొద్దున పెట్టిన పోస్టు గుర్తొచ్చింది… ఇదుగో ఆ పోస్టు యథాతథంగా…
44 మంది దళితుల సజీవదహనం.. కీల్‌వేన్మని
(The 44 Dalit Murders in Tamilnadu)
… ఒంటికి చిన్ప వేడి తగలితే వెంటనే నొప్పితో అల్లాడతాం. అలాంటిది 44 మందిని ఒకచోట పెట్టి, వారిని సజీవదహనం చేస్తే ఎలా ఉంటుంది? ఆ దారుణం వెనుక కారణం ఏమిటి? ఒక్కటే.. వారంతా దళితులు కావడం. ఇదంతా ఎక్కడ జరిగింది? తిరువళ్లువర్, పెరియార్, సుబ్రహ్మణ్య భారతి లాంటివారు పుట్టిన తమిళ నేల మీదే! బాధితులకు ఇప్పటికైనా ఏమైనా న్యాయం జరిగిందా?
… తమిళనాడు రాష్ట్రం నాగపట్టణం జిల్లాలోని ఒక ఊరు కీల్‌వేన్మని. ఆ ఊరిలో అగ్రకులాల వారు చెప్పిందే చట్టం, చేసిందే శాసనం. వందల ఎకరాల భూమి వారి చేతుల్లో ఉంది. ఆ పొలాల్లో పనిచేస్తూ చాలీచాలని జీతంతో బతికే పరిస్థితి దళితులది. ఇచ్చిన కూలీ తీసుకోవాలి. మారు మాట్లాడకుండా పని చేయాలి. నోరెత్తితే దెబ్బలు, శిక్షలు, జరిమానాలు. ఇలాంటి సమయంలో అక్కడ సీపీఎం పార్టీ తన కార్యకలాపాలను మొదలు పెట్టింది.
దళితులు, వెనుక బడిన వర్గాల వారితో మాట్లాడటం, వారి సమస్యలు కనుక్కోవడం, వారి స్థితిగతులు మెరుగుపడేలా కార్యక్రమాలు రూపొందించడం వంటివి సీపీఎం నాయకులు చేసేవారు. ప్రధానంగా రైతు కూలీలకు తక్కువ జీతం చెల్లించి, పని చేయించుకుంటున్నారనే విషయం గ్రహించి, దానికి వ్యతిరేకంగా వారిని సంఘటితం చేశారు. కీల్‌వేన్మనితో పాటు చుట్టుపక్కల ఊళ్ళలో ఎర్రజెండాలు ఎగరేసి, తమ నిరసన తెలిపేలా చేశారు.
దళితులు, వెనుక బడిన వర్గాలు తమ చెప్పుచేతల్లోనే ఉంటాయని భావించిన అగ్రకులాల వారికి ఇది దెబ్బగా మారింది. ఊరూరా ఎర్రజెండా ఎగరడం వారిని కలవరపరిచింది. దీంతో సీపీఎంతో సంబంధం ఉన్న వారికి పనులు ఇవ్వడం మానేశారు. ఆ పార్టీ మీటింగ్‌లకు వెళ్లేవారిని దూరం పెట్టారు. దీంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. కూలీ పెంచితేనే పని చేస్తామని అటువైపు నుంచి దళితులు అగ్రకులాల వారికి అల్టిమేటం జారీ చేశారు.
వారికి లొంగి, కూలి పెంచేందుకు అగ్రకులాల వారు సిద్ధంగా లేరు. వారు చెప్పిన కూలీకి పనిచేయడానికి ఇటు దళితులు సిద్ధంగా లేరు. ఒక పక్క కోతల కాలం దగ్గర పడుతోంది. దీంతో అగ్రకులాల వారు పక్క ఊరి నుంచి పనివాళ్లని రప్పించారు. వారికి వ్యతిరేకంగా స్థానిక కూలీలు నిరసన తెలిపారు. మొత్తంగా కీల్‌వేన్మని అట్టుడికిపోయింది. ఈ దళితులకు మద్దతు ఇచ్చిన ఓ దుకాణదారుణ్ని అగ్రకులాల వారు ఎత్తుకుపోయి, చిత్రహింసలు పెట్టారు. దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ గొడవల్లో అగ్రకులాల వారికి చెందిన ఓ గూండా మరణించాడు.
అంతే! అగ్రకులాల వారికి ఆగ్రహం పెరిగింది. తమ కింద పనిచేసేవారు తమనే ఎదురించి, ఇంత పని చేస్తారా అని రగిలిపోయారు. రేపు తమను చంపినా అడిగే దిక్కు ఉండదని భయపడ్డారు. దీనికి ఒకటే దారి, వాళ్లని చంపడం అని అంతా భావించారు.
1968 డిసెంబర్ 25 రాత్రి 10 గంటలకు సుమారు 200 మంది అగ్రకులాల వారు, వారి అనుచరులు దళితవాడ మీద పడ్డారు. అక్కడున్న వారిపై దాడి చేశారు. కత్తులు, బరిసెలు, కొడవళ్ళతో వచ్చిన వారిని దళితులు నిరోధించలేకపోయారు. కొంతమేరకు పోరాడి, ఇక శక్తి లేక సుమారు 50 మంది దాకా వెళ్లి రామయ్య అనే వ్యక్తికి చెందిన గుడిసెలో దాక్కున్నారు. ఆ గుడిసెను గుర్తించిన అగ్రకులాల వారు దానికి నిప్పు పెట్టారు. ఆ మంటల మధ్య దళితులు చిక్కుకుని హాహాకారాలు చేశారు.
ఆరుగురు వ్యక్తులు గుడిసెలోనుంచి తప్పించుకోవాలని చూస్తే, వారిలో ఇద్దర్ని పట్టుకొని మళ్లీ మంటల్లో తోసేశారు. తల్లులు ఇద్దరు బిడ్డల్ని బయటకు తోసేసి, వారి ప్రాణాలు కాపాడాలని ప్రయత్నిస్తే అగ్రకులాల వారు ఆ పిల్లల్ని కూడా పట్టుకొని మంటల్లో వేశారు. మొత్తం 44 మంది సజీవదహనం కాగా, అందులో ఐదుగురు వృద్ధులు, 16 మంది మహిళలు, 23 మంది చిన్నారులు. ఇంత దారుణం చేసిన తర్వాత నిందితులు నేరుగా పోలీసుల దగ్గరికి వెళ్లి, తమకు రక్షణ కావాలని అడగటం, పోలీసులు వారికి రక్షణగా నిలవడం మరింత దారుణమైన విషయం.
అప్పటికి తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉంది. అన్నాదొరై అప్పటి ముఖ్యమంత్రి. వెంటనే నిందితులను పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ దమనకాండకు నాయకత్వం వహించిన గోపాలకృష్ణన్ నాయుడిని, అతని అనుచరులనూ పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో కేసు నడిచింది. నిందితులకు 10 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేశారు. 44 మందిని చంపిన వారికి పదేళ్ల శిక్ష!
దోషులు డబ్బున్న వారు, వెంటనే హైకోర్టుకు వెళ్లారు. గోపాలకృష్ణన్ నాయుడిని నిర్దోషిగా విడుదల చేస్తూ 1975లో మద్రాసు హైకోర్టు తీర్పు ఇచ్చింది. ‘డబ్బున్న వాళ్లు స్వయంగా నేరంలో పాల్గొంటారని అనలేం. వారు ఇంట్లోనే ఉండి, వాళ్ల అనుచరుల చేత పనులు చేయిస్తారు. అందుకే గోపాలకృష్ణన్ నాయుడు ఘటనా స్థలంలో ఉన్నట్టు ఆధారాలు లేవు. అతను నిరపరాధి’ అంది హైకోర్టు. కీల్‌వేన్మని మరోసారి ఘొల్లుమంది.
దోషులను చట్టం విడిచిపెడితే, ప్రజలే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారనేందుకు గుర్తుగా 1980లో గోపాలకృష్ణన్ నాయుడిని కొందరు అతి దారుణంగా చంపేశారు.
కీల్‌వేన్మని ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన నేపథ్యంలో ప్రముఖ తమిళ రచయిత ఇందిరా పార్థసారథి ‘కురుత్తిపునల్’ అనే నవల రాశారు. దాన్ని ‘నెత్తురు నది’ పేరుతో రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి తెలుగులోకి అనువదించారు. ఈ నవలను కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించింది.
ఈ నవల ఆధారంగా తమిళంలో 1983లో ‘కన్ సివందాన్ మన్ సివక్కుం’ (కళ్లు ఎరుపెక్కితే మన్ను ఎరుపెక్కుతుంది) అనే సినిమా తీశారు. 1997లో వచ్చిన ‘అరవిందన్’ అనే తమిళ సినిమాలోనూ కీల్‌వేన్మని ఘటనను చూపించారు.
‘వెన్మయ్ తీ’(వెన్మయి నిప్పు) పేరుతో జి.వీరయాన్ 32 పేజీల పుస్తకం రాశారు. కీల్‌వేన్మని ఘటనపై 2006లో ‘రామయ్యావిన్ కుడిసై’ (రామయ్య గుడిసె) అనే డాక్యుమెంటరీ తీశారు. ఈ ఘటన నేపథ్యంలో 2014లో రచయిత్రి మీనా కందసామి ‘The Gypsy Goddess’ అనే నవల రాశారు. కీల్‌వేన్మనిలో మరణించిన దళితుల కోసం స్మారకం నిర్మించారు. దానిపై మృతుల పేర్లు రాసి ఉంటాయి….
Share this Article