ఒక ఫోటో ఆసక్తికరంగా అనిపించింది… నిజానికి ఓ సాదాసీదా ఫోటోయే… కానీ వర్తమాన తెలుగు పత్రికల స్థితిగతుల, సంస్థాగత వ్యవహారాల నేపథ్యంలో కాస్త ఇంట్రస్టింగ్… ఈ ఫోటోలో ఉన్నది ఏబీఎన్- ఆంధ్రజ్యోతి బాస్ రాధాకృష్ణ… విమానంలో జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టాడు… తన వెనుక కనిపిస్తున్నది వక్కలంక రమణ… పత్రికలో కీలకమైన పొజిషన్ తనది…
ఈనాడు రామోజీరావు చాన్నాళ్లుగానే ఈనాడుకు దూరదూరంగానే ఉన్నాడు వయస్సు, అనారోగ్యాల రీత్యా… ఆయన వెళ్లిపోయాక ఈ యాభై ఏళ్ల నంబర్ వన్ తెలుగు దిన పత్రిక బరువుబాధ్యతలు, పగ్గాలు ఎండీ కిరణ్ చేతుల్లోకి వచ్చాయి పూర్తిగా… కానీ ఇప్పుడు అది ఒకప్పటి ఈనాడు కాదు, సర్క్యులేషన్ డౌన్… ఇప్పటికీ అదే అగ్రశ్రేణి పత్రికే అయినా సరే, గతంలో ఉన్నంత దూకుడు లేదు, ప్రమాణాల్లేవు… పైగా డిజిటల్ ఫార్మాట్ మీద కాన్సంట్రేషన్‌తో… ప్రింట్ ఖర్చు తడిసిమోపెడు అవుతున్న ఈనాడు మీద పెద్దగా కాన్సంట్రేషన్ చూపించడం లేదు…
రామోజీరావు బతికి ఉన్నన్నాళ్లూ ఏ ముఖ్య నాయకుడు వచ్చినా సరే, తన అపాయింట్‌మెంట్ తీసుకుని, తన ఇంటికి వెళ్లి కలిసేవారు, అదీ తన పట్టు, ఈనాడు పట్టు… ఇకపై ఏమిటి అనేది ఓ ప్రశ్నార్థకం… మరోవైపు సాక్షి, జగన్ ఓటమితో ఆత్మరక్షణలో పడింది… జగన్ ఎంత ప్రయత్నించినా ఈనాడును కొట్టలేకపోయాడు… ఈనాడుతో పోలిస్తే ప్రొఫెషనలిజం పెద్దగా కనిపించదు… ప్రమాణాల గురించి చెప్పుకోవల్సిన పనిలేదు… ఇటు రేవంత్‌తో పడదు, తెలంగాణ జనమూ సాక్షిని పెద్దగా ఆదరించరు… మరోవైపు ఏపీలో చంద్రబాబు అండ్ కో దాడులూ ఉంటాయని ఊహించవచ్చు…
Ads
ఇక ఆంధ్రజ్యోతి… పక్కా తెలుగుదేశం పత్రికే, ఏపీలో ఇప్పుడిక దాని స్థానం సుస్థిరం మరో ఐదేళ్ల వరకూ… తెలంగాణలో రేవంత్ రెడ్డీ తనవాడే… సో, రెండు రాష్ట్రాల్లోనూ రాధాకృష్ణ రాతకు, మాటకు బాగా విలువ పెరిగింది… రామోజీరావు మరణానంతరం తెలుగులో పాపులర్, పవర్‌ఫుల్ పాత్రికేయుడు ప్రస్తుతానికి తనే… తను ఇన్నాళ్లూ పట్టించుకొనని సంస్థాగత ప్రక్షాళన, దిద్దుబాటు, మార్పుల వైపు అడుగులు వేస్తున్నట్టుంది చూడబోతే… తన స్థానాన్ని తెలుగు పాత్రికేయంలో మరింత సుస్థిరం చేసుకునేందుకు…
గతంలో రామోజీరావు కూడా జిల్లాలు తిరుగుతూ స్వయంగా పత్రిక స్థితిగతులను సమీక్షించుకునేవాడు… ఆంధ్రజ్యోతిలో చాన్నాళ్లుగా మార్పుల్లేవు… యూనిట్ ఇన్‌ఛార్జులు, బ్యూరో ఇన్‌ఛార్జులు పాతుకుపోయారు… బదిలీల్లేవు… డెస్కులు ఖాళీ… చాన్నాళ్లుగా నిష్క్రియాపరంగా ఉన్న జర్నలిజం స్కూల్ నుంచి కొత్తగా మళ్లీ శిక్షణ నోటిఫికేషన్ వచ్చింది, అర్జెంటుగా కొన్ని డెస్కుల్లో ఖాళీల భర్తికి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు పిలిచారు… లేకపోతే బండి నడిచేట్టు లేదు… (అన్ని పత్రికల్లోనూ ఇదే దుస్థితి… డిజిటల్ జర్నలిస్టులు కోకొల్లలు, ఎటొచ్చీ ప్రింట్ మీడియా జర్నలిస్టులకే కొరత…)
సరే, జిల్లాలు తిరుగుతూ ఏం మార్పులు చేస్తాడనేది పక్కన పెడితే… తన వెంట అసిస్టెంట్ ఎడిటర్ వక్కలంక రమణ ఉన్నాడు, మాజీ ఈనాడు, ప్రస్తుతం ఆంధ్రజ్యోతి పత్రికలో తనేది చెబితే అది చెల్లుబాటు, సమర్థుడు, ఆర్కేకు నమ్మకస్తుడు… తన వెంట ఉండాల్సినవాడే… కానీ ఎడిటర్ శ్రీనివాస్ ఏడి..? నెట్వర్క్ ఇన్‌చార్జి కృష్ణ ప్రసాద్ ఏడి..? ఆర్కే వెంట రమణతోపాటు ఆయన కొడుకు, సర్కులేషన్ జిఎం రామకృష్ణారావు, ఏడివిటీ జిఎం శివప్రసాద్ మాత్రమే ఉన్నారట…
వోకే.., ఆయన పత్రిక ఆయనిష్టం, ఎవరికి ఏం బాధ్యతలు ఇవ్వాలో, ఏం పని తీసుకోవాలో తనిష్టం… ఒకవైపు చంద్రబాబునాయుడు తెలంగాణలో పూర్వ వైభవం అంటున్నాడు, వచ్చే ఎన్నికల్లో నాదే గెలుపు అంటున్నాడు… కమ్ముకొస్తున్నాడు… ఈ స్థితిలో తన క్యాంపు మౌత్ పీస్ కూడా బలం పెంచుకుని, ప్రభావం చూపించే స్థితిలో ఉండటం తన ప్రాధాన్య అవసరం… కానీ..?
పత్రిక నిర్వహణ వ్యయం రోజురోజుకూ దుస్సహంగా మారుతోంది… ఈ స్థితిలో తను కూడా ఏబీఎన్‌కే ప్రాధాన్యమిస్తున్నాడు కొన్నాళ్లుగా… ఏబీఎన్ రేటింగ్స్ కూడా పెరిగాయి… ఇప్పుడిక పత్రిక కాపీలు ఇంకా పెంచుకునే ప్రయత్నం చేస్తే మాత్రం నష్టదాయకమే… ఇప్పుడున్న సర్క్యులేషన్ పడిపోకుండా జాగ్రత్తపడితే చాలేమో… నమస్తే దెబ్బతినిపోయి, ఈనాడు పడిపోతూ, సాక్షి కూడా డిమోరల్ అయిపోయిన నేపథ్యంలో ఆంధ్రజ్యోతిని మెరుగైన, ప్రభావమంతమైన స్థితిలో పెట్టుకునే అవకాశం రాధాకృష్ణకు లభించింది…!!
Share this Article