.
Subramanyam Dogiparthi…. గుండమ్మ కధ , యమగోల వంటి బ్లాక్ బస్టర్లకు డైలాగ్స్ వ్రాసిన మా గుంటూరు జిల్లా వాడయిన డి వి నరసరాజు గారు దర్శకత్వం వహించిన ఏకైక సినిమా 1986లో వచ్చిన ఈ కారు దిద్దిన కాపురం . చక్కని హాస్య రస భరిత కుటుంబ కధా చిత్రం . ఆయనే కధ , స్క్రీన్ ప్లే , డైలాగులను కూడా వ్రాసుకున్నారు . నిర్మాత రామోజీరావు గారు .
కోడలు దిద్దిన కాపురం , కొడుకు దిద్దిన కాపురం , అల్లుడు దిద్దిన కాపురం , పిల్లలు దిద్దిన కాపురం వంటి దిద్దబడిన కాపురాలు చాలా ఉన్నాయి . ఇది కారు దిద్దిన కాపురం . మోజుపడి కారు కొనుక్కున్న రామస్వామి అనే ఆయన కారు ప్రమాదంలో చనిపోతాడు . కారు మీద మోజు తీరని రామస్వామి ఆత్మ కార్లో పీఠం వేసుకుని కూర్చుంటుంది . సీన్ కట్ చేస్తే …
Ads
ఆ ఊళ్ళోనే ఒక ఇంజనీర్ నూతన్ ప్రసాద్ , ఆయన భార్య రమాప్రభలు కాపురం చేస్తుంటారు . ఆయనకు రిటైర్మెంట్ వయసు తగ్గించటం వలన ఉద్యోగం ఊడి, మళ్ళా పెంచడంతో ఊడిన ఉద్యోగం రిస్టోర్ అవుతుంది . ఈ సీనుతోనే సినిమా ప్రారంభం అవుతుంది . మళ్ళా ఉద్యోగం వచ్చాక ఇంజనీర్ గారికి ఫారిన్ కారు కొనుక్కోవాలని మోజు కలుగుతుంది .
ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది . నాకు అలాగే కంటెస్సా కారంటే భలే ఇష్టం . పడవలాగా ఉండేది . ఓ పదిహేనేళ్ళ కింద నేనూ ఓ సెకండ్ హేండ్ కంటెస్సా కారుని రెండో కారుగా మోజుపడి కొనుక్కున్నా . ఓ నాలుగయిదేళ్ళు సేవ చేసింది . రిపేర్ల తాకిడి తట్టుకోలేక వదిలించుకున్నా . మళ్ళా సినిమాలోకి వద్దాం …
ఫారిన్ కారు కొనుక్కున్న దంపతులకు ముగ్గురు కూతుళ్లు . పెద్దల్లుడు సుత్తి వేలు , పెద్ద కూతురు శ్రీలక్ష్మి . రెండో కూతురు శ్రీశైలజ , ఆమె భర్త పేరు నాకు తెలియదు . ఆమె అత్త వై విజయ . రాచిరంపాన పెడుతూ ఉంటుంది . మూడో కూతురు పవిత్ర . ఫైర్ బ్రాండ్ . కట్నాలు వంటి దురాచారాలను ప్రతిఘటిస్తూ ఉంటుంది . వాటి బారి నుండి తల్లిదండ్రులను బయటపడేసేందుకు ఓ నిరుద్యోగి క్రిస్టియన్ డేవిడ్ని రిజిస్టర్ మేరేజి చేసుకుని విడిగా ఉంటుంది .
పెద్దల్లుడు , రెండో వియ్యపురాలు నూతన్ ప్రసాద్ , రమాప్రభలు తొందరగా చచ్చిపోతే వాళ్ళకున్న ఏకైక ఆస్తి ఇంటిని అమ్మేసి వాటాలేసుకుంటానికి ఆవురావురుమని చకోర పక్షుల్లాగా చూస్తుంటారు . వీళ్ళకు తోడు పక్కింట్లో ఓ కుళ్ళుబోతు జంట ఉంటుంది . నగేష్ , మమత . నూతన్ ప్రసాద్ మీద పడి కుళ్ళుకోవటమే సినిమా అంతా వాళ్ళిద్దరి పని .
ఈ టైంలో వచ్చిన రామస్వామి ఆత్మ ఫారిన్ కారు పెద్దల్లుడికి , వియ్యపురాలికి , నగేష్ మమతల జంటకు , అప్పిచ్చిన సేట్ మాడాకి , అందరికీ దేహశుద్ది చేసి లైన్లోకి తెస్తుంది . అలా నూతన్ ప్రసాద్ , రమాప్రభల కాపురాన్ని దిద్దుతుందన్న మాట .
సినిమా అంతా హాయిహాయిగా , నవ్వుకుంటూ , బోర్ ఫీల్ కాకుండా చూసేయవచ్చు . నూతన్ ప్రసాద్ , రమాప్రభల జంట బాగుంటుంది . రమాప్రభ , వై విజయలు ప్రౌఢ సౌందర్యంతో ప్రేక్షకులను అలరిస్తారు . The beauty of anything lies in the eyes of the beholder. ఈ సినిమాలో హీరోయినుగా నటించిన పవిత్ర అందంగా ఉండటమే కాకుండా బాగా నటించింది కూడా . అయినా మరే సినిమాలో కనిపించినట్లు గుర్తు లేదు నాకు .
మూడో అల్లుడు రాజేంద్రప్రసాద్ . బాగా నటించాడు . Housewives లాగానే househusbands ఎందుకు ఉండకూడదు అన్నట్లు చక్కగా househusband అయి భార్యకు చేదోడువాదోడిగా సెటిల్ అవుతాడు . ఊళ్ళో మహిళా మండలి వాళ్ళు సన్మానం కూడా చేస్తారు . Home maker may be male or female .
నగేష్ మమతల జంట . ఇలాంటి బేచ్ మన చుట్టూ చాలామంది ఉంటుంటారు . ఎవరు కొత్త బట్టలు వేసుకున్నా , ఏదయినా వస్తువు కొనుక్కున్నా , ఏదయినా ఫంక్షన్ చేసుకున్నా కుళ్ళుకుంటూ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు . అలాంటి పాత్రలో ఇద్దరూ చాలా బాగా నటించారు . ఓ పాట కూడా పాడుతారు తమ కుళ్ళుని శాంతపరచమని . సాగర మధనం జరిగేటప్పుడు గరళం ఎట్లా మింగావో అంటూ సాగుతుంది ఆ పాట .
నరసరాజు గారి హాస్యానికి సత్యం సంగీతం తోడయి సినిమాను చక్కటి కుటుంబ కధా చిత్రాన్ని చేసింది . పాటలనన్నీ వేటూరి వారే వ్రాసారు . ముఖ్యంగా ప్రియ తులసి మది తెలిసి నను గనవే దయతలచి పాట ఎంత శ్రావ్యంగా ఉంటుందో ! పొరపాటున కూడా మిస్ కాకండి . ముఖ్యంగా సంగీత ప్రియులు అస్సలు మిస్ కాకండి . Celestial !
మిగిలిన పాటల్లో ఆడవె నాట్యమంజరి అజంతా సుందరి కూడా శ్రావ్యంగా ఉంటుంది . సగం సగం సంసారం సుఖం సుఖం జీవితం డ్యూయెట్ బాగుంటుంది . సుత్తి వేలు , డిస్కో శాంతిల మీద సొగసుల మృదంగ తాళము పాట కూడా బాగుంటుంది . వెరశి పాటలన్నీ బాగుంటాయి .
నరసరాజు గారి డైలాగ్స్ యమగోలలో అంతగా మరీ ఈడ్చి ఈడ్చి కొట్టవు కానీ రాజకీయాలను , రాజకీయ నాయకులను కాస్త కొడతాయి ఈ సినిమాలో కూడా . కధను బాగా నేసారు . కధ బాగుండకపోతే రామోజీరావు గారు చెయ్యి వేయరుగా !! సత్యం సంగీతానికి , వేటూరి సాహిత్యానికి తగ్గట్లుగా బాలసుబ్రమణ్యం , జానకమ్మ , శైలజ చాలా శ్రావ్యంగా పాడారు .
కారు చుట్టూ తిరిగే సినిమాలు ఇంగ్లీషులో చాలా ఉన్నాయి . The car , Christine , Dead End , The wrath వంటివి . మన తెలుగులో ఇది కాక మరేదయినా సినిమా ఉందేమో నాకు ఐడియా లేదు . (విజయ్ దేవరకొండ టాక్సీవాలా, ఇదే నూతన్ ప్రసాద్ నటించిన బామ్మమాట బంగారుబాట..?)
మొదటి కారు ఓనర్ రామస్వామి భార్యగా సంగీత కాసేపే కనిపించినా చక్కగా నటించింది . నూతన్ ప్రసాద్ , రమాప్రభలు కారు ఫస్ట్ ఓనర్ భార్య అయిన సంగీతను , ఆమె ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నాక రామస్వామి ఆత్మ వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పి ప్రశాంతంగా ఊర్ధ్వ లోకాలకు వెళ్ళిపోతుంది . ఈ సీనుని నరసరాజు గారు ప్రేక్షకుల మనసుకు హత్తుకునేలా బాగా తీసారు .
పద్మనాభం , మేల్కోటె , మరెంతో మంది ఔత్సాహిక నటినటులు నటించారు . ఇంత చక్కటి feel good , humorous , romantic entertainer యూట్యూబులో ఉంది . మామూలుగా రామోజీరావు గారి సినిమాలు యూట్యూబులో ఉండవు . ఎలాగో ఇది ఉంది . చూసి ఉన్నా మరలా చూడతగ్గ హాస్య చిత్రం . నవ్వు ఒక వరం . నవ్వలేకపోవటం దౌర్భాగ్యం , దరిద్రం . #తెలుగు_సినిమాల_సింహావలోకనం
Share this Article