దేనికైనా ఓ టైమ్ రావాలి… ఆ టైమ్ వచ్చింది… కాళేశ్వరం ప్రాజెక్టు ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ మెయింటెనెన్స్… ఏ కోణంలో చూసుకున్నా సరే అతి పెద్ద ఫెయిల్యూర్ అని సాక్షాత్తూ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీయే తేల్చేసింది… ఇక ప్రాజెక్టులో అవినీతి ఏమిటో ఎవరు తేల్చాలి..? తెలంగాణ జాతిపిత, తెలంగాణ గాంధీ అని పిలవబడుతున్న కేసీయార్ నిజానికి తెలంగాణకు చేసిన నష్టం ఏమిటో ఇప్పుడు బట్టబయలు అయిపోయింది… మేడిగడ్డ బరాజ్ కుంగిపోయి, అన్ని వైఫల్యాల్ని, అన్ని నిజాల్ని బయటపెట్టింది…
ఏమన్నారు..? ఏమన్నారు..? ప్రపంచ ప్రఖ్యాత కట్టడమా..? నదికి కొత్త నడకలు నేర్పడమా..? ప్రపంచ అద్భుతమా..? బాహుబలి ప్రాజెక్టా..? ఎవరూ దాన్ని ఏమీ అనొద్దా..? కేసీయార్ ఓ ప్రముఖ ఇంజినీరా..? ఓ పొలిటిషియన్ ఓ భారీ ప్రాజెక్టుకు డిజైన్ చేస్తుంటే యావత్ ఇంజినీర్ల సమాజం సైలెంటుగా చూస్తూ కూర్చుంది… లక్షన్నర కోట్ల ప్రజాధనం ఖర్చు చేస్తుంటే కాగ్ వంటి అన్ని వ్యవస్థలూ సైలెంటుగా ఉండిపోయాయి… ఆ ప్రాజెక్టు రీడిజైన్ నష్టదాయకం, లోపభూయిష్టం అని తెలంగాణ జాయిట్ యాక్షన్ కమిటీ వంటి సంస్థలు నెత్తీనోరూ మొత్తుకున్నా వినిపించుకున్నవారే లేరు… మీడియా అయితే పూర్తిగా కేసీయార్‌కు సరెండర్ అయిపోయింది…
రాహుల్ ఆరోపణలు చేస్తే తనకు అవగాహన లేదన్నాడు హరీష్ రావు… కాళేశ్వరాన్ని ఏమైనా ఉంటే ఊరుకోం అని కేటీయార్ అన్నాడు… స్పందించాల్సిన అసలు సిసలు బాధ్యుడు కేసీయార్ కిమ్మనడం లేదు… అది తప్ప ఇంకేవేవో చెబుతున్నాడు సభల్లో… మేడిగడ్డ కుంగిపోయింది… అన్నారం కూడా ప్రమాదాన్ని సూచిస్తోంది… అసలు మొత్తం మేడిగడ్డ బరాజ్ పనికిరాదు అని, మొత్తం నిర్మించాల్సిందే అని డిమాండ్ చేస్తుంటే… అబ్బే, కుంగినచోట రిపేర్లు ఎల్అండ్‌టీ చేస్తుంది అని కేటీయార్ చెప్పుకొచ్చాడు…
Ads
కానీ కేంద్ర నిపుణుల బృందం ఏమంటోంది..? ఇవీ ముఖ్యాంశాలు… ఆ కమిటీ రిపోర్టులు వాట్సప్పులో ఇప్పటికే సర్క్యులేట్ అవుతున్నాయి…
బ్యారేజీ యొక్క ప్లానింగ్, డిజైన్ సరిగా లేదు
*మొత్తం బ్యారేజీని పునాదుల నుండి తొలగించి తిరిగి పూర్తిగా నిర్మించాలి
*అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా ఇదే విధమైన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది
*డ్యామ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల బ్యారేజీ క్రమంగా బలహీనపడింది
*బ్యారేజీ వైఫల్యం ప్రజల జీవితాలకు, ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది
*సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు బ్యారేజీ మొత్తం ఉపయోగించే అవకాశం లేదు
*ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ మరియు ఆపరేషన్ మెయింటెనెన్స్ విషయాల్లో వైఫల్యం వల్లే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడానికి కారణం
*బ్యారేజీ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోవడం, ఫౌండేషన్ మెటీరియల్ యొక్క పటిష్టత సామర్థ్యం తక్కువగా ఉండటం, బ్యారేజీ లోడ్ వలన ఎగువన ఉన్న కాంక్రీట్ పైల్స్ బలహీన పడటం వల్ల పిల్లర్స్ సపోర్డ్ బలహీనపడింది
*కమిటీ కోరిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. 20 అంశాలు అడిగితే కేవలం 12 అంశాల వివరాలను మాత్రమే ఇచ్చింది
*రాష్ట్ర ప్రభుత్వం అందించిన డేటా అసంపూర్ణంగా ఉంది
*అక్టోబర్ 29, 2023 లోపు పూర్తి వివరాలను అందించకపోతే బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన పరీక్షలు, అధ్యయనాలను రాష్ట్ర ప్రభుత్వం చేయలేదని భావించాల్సి వస్తుంది
Share this Article