.
బహుశా దేశంలో ఏ రాజకీయ నాయకుడు లేదా ఏ ఉన్నతాధికారీ ఒక స్వతంత్ర విచారణ కమిషన్‌పై… దాని ఏర్పాటే రాజకీయ ప్రేరేపితమనీ, దురుద్దేశపూరితమనీ ఆరోపించి ఉండడు… కోర్టుకెక్కి ఉండడు… కేసీయారే తొలి వ్యక్తి కావచ్చు…
కాళేశ్వరం నిర్మాణ వైఫల్యాలు, అక్రమాలపై జనంలో చర్చ ఇంకా ఇంకా జరుగుతూనే ఉంది… కేసీయార్ అండ్ క్యాంప్ ఎంత యాగీ చేస్తుంటే అంతగా జనంలోకి నెగెటివ్‌గా వెళ్తుంది… ఐనా కమిషన్ ఏర్పాటు వల్ల, రిపోర్టు ఇవ్వడం వల్ల వ్యక్తిగత ప్రతిష్ట ఎలా దెబ్బతింటుంది..? ఐనా కమిషన్ తీర్పు చెప్పలేదు కదా, శిక్షలు సూచించలేదు కదా…
Ads
ఎవరో బాంబులు పేల్చారనీ, అందుకే మేడిగడ్డ కుంగిందనీ, పిల్లర్లు పగిలాయనీ ఆరోపించేది బీఆర్ఎస్ క్యాంపే… మరి అది జరిగినప్పుడు అధికారంలో ఉన్నది కేసీయారే కదా.., ఎందుకు సీరియస్‌గా చర్యలు తీసుకోలేదు..? ఎందుకంటే..? నిర్మాణ వైఫల్యాలు, సాంకేతిక లోపాల కారణంగానే కుంగుబాటు అని తనకు తెలుసు కాబట్టి… మళ్లీ తన క్యాంపే అకాలవర్షాలతో తస్కింది అంటుంది… ఏదో ఒక కారణానికి స్టికాన్ అయిపొండి ముందుగా…
అకాల వర్షాలతో ప్రమాదం అనే వాదన కూడా సాంకేతికంగా చెల్లదు… గోదావరి అంటేనే భారీ వరదలు… అవన్నీ తట్టుకునేలా కట్టాలి కదా బరాజులు… ఒక గరిష్ట వరదను ప్రామాణికంగా తీసుకుని, అంతకుమించిన వరద వచ్చినా సరే, తట్టుకుని నిలబడేలా కదా డిజైన్ ఉండాలి, నిర్మాణం ఉండాలి… అదే కదా ఇంజినీర్లు పాటించే ప్రథమసూత్రం…
- సరే, ఎవరిమీదనైనా ఆరోపణలు వస్తే, అవి కరెక్టు కావని నిరూపించుకునే బాధ్యత తనదే కదా… దానికి అనేక చట్టపరమైన న్యాయమార్గాలున్నాయి… అసలు రిపోర్టు అధికారికంగా బహిర్గతం గాకుండానే అది ఏకపక్షమని, దురుద్దేశపూరిత ప్రయత్నమనీ ఎలా నిర్దారణకు వచ్చారు..?
కాళేశ్వరం వైఫల్యాలకు కేసీయార్ సీఎం హోదాలో తీసుకున్న వ్యక్తిగత నిర్ణయాలు అని కమిషన్ గనుక అభిప్రాయపడితే… కాదు, ప్రొసీజర్ ప్రకారం తీసుకున్న నిర్ణయాలే అని చెప్పుకోవాల్సిందే తప్ప… కమిషన్‌కు రాజకీయ రంగు రుద్దాల్సిన పని లేదు…
- విచారణ కమిషన్‌కు నేతృత్వం వహించిన పీసీ ఘోష్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఈ దేశ తొలి లోకపాల్… పేరొందిన న్యాయవాదుల కుటుంబంలో తను ఐదవతరం… సుదీర్ఘమైన జుడిషియల్ సర్వీస్… న్యాయప్రసిద్ధుడు… ఒక కమిషన్ ఏర్పాటులోని చట్టబద్ధత, విచారణ జరగాల్సిన తీరు తనకు తెలియదా..? కమిషన్ రాజకీయ దురుద్దేశాలతో రిపోర్టు ఇచ్చిందనే బీఆర్ఎస్ ప్రధాన నేత ఆరోపణ సదరు జస్టిస్ ప్రతిష్టకు కూడా భంగకరం కాదా..? స్ట్రెయిట్‌గా ఆ రిపోర్టే చెల్లదు అని ప్రచారం చేయవచ్చా..? సగటు మనిషిలో ఇలాంటి ఎన్నో సందేహాలు..!!
సరే, కమిషన్ ఏర్పాటు రాజకీయ దురుద్దేశాలతో చేయబడిందని భావించినప్పుడు… కమిషన్ ఏర్పడినప్పుడే కదా సవాల్ చేయాల్సింది..? ప్రభుత్వం అధికారికంగా ఈరోజుకూ కమిషన్ రిపోర్టు వెల్లడించలేదు… అసెంబ్లీకి సమర్పిస్తామని, అందులో చర్చిస్తామని చెప్పింది… అసెంబ్లీ అభిప్రాయం మేరకే చర్యలు ఉంటాయని తెలిపింది…
కేవలం విచారణ కమిషన్ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పలేదు… సిట్ వేయాలా..? వేరే దర్యాప్తు ఆదేశించాలా..? ఏదీ నిర్ణయం జరగలేదు… చివరకు కేబినెట్‌లో జరిగిన చర్చ ఏమిటో కూడా వెల్లడించలేదు… మీడియా పబ్లిష్ చేసిందీ అంటే, దానికి ప్రభుత్వ బాధ్యత ఏముంది..? అది మీడియా చెప్పుకోవాలి… మీడియా తన సోర్స్ చెప్పాల్సిన పనీ లేదు…
ఏదైనా అక్రమాల ఆరోపణలు ఎదురైనప్పుడు… సరైన మార్గంలో నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడమే మార్గం… అంతేతప్ప, పొలిటికల్ దురుద్దేశాలు అనే ఎదురుదాడి చేస్తే ఆ ఆరోపణలన్నీ చెల్లుబాటు గాకుండా పోవు…
- మరో విషయం… ప్రాణత్యాగానికి సిద్ధపడిన నేతపై నిందలా అనే వాదన… ఎవరు నిరాహార దీక్ష చేసినా సరే ప్రాణత్యాగానికి సిద్ధపడటమే… పైగా ఆ దీక్ష తెలంగాణ ఏర్పాటు కోసం..! అదెలా జరిగిందనే మూలాల్లోకి, కారణాల్లోకి చర్చించే సందర్భం ఇది కాదు…
- ఐనా దీక్ష చేసినంత మాత్రాన ఇక విచారణలు, దర్యాప్తుల నుంచి ఇమ్యూనిటీ వస్తుందా..? ఏ కేసు బాట ఆ కేసుదే, దేని మెరిట్ దానిదే..!! ఇన్ని అంశాలు ఉన్నందున హైకోర్టు ఏం చెప్పబోతున్నదనేది ఆసక్తికరంగా మారింది..!
Share this Article