Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కలికాలం..! మనం కన్నవాళ్లను, మనల్ని కన్నవాళ్లనూ నమ్మలేం..!!

April 4, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. ఆరని ఆకలి కాలం కలికాలం ,
అవనికి ఆఖరి కాలం కలికాలం,
నీతిని కాల్చే నిప్పుల గోళం,
నిలువున కూల్చే నిష్ఠుర జాలం,
కలికాలం ఆకలి కాలం,
కలికాలం ఆఖరి కాలం .
జరుగుతున్న కలికాలం గురించి సిరివెన్నెల వారు ఎంత గొప్పగా చెప్పారో !

దిగువ మధ్య తరగతి కుటుంబాల అప్పుల కష్టాలు , దిన దిన గండం నూరేళ్ళ ఆయుష్ బతుకులు చుట్టూ ఎన్ని సినిమాలు వచ్చాయో లెక్క లేదు . వాటిల్లో కొన్నింటిని మరచిపోలేం . ఆ కోవలో సినిమాయే జయసుధ స్వంతంగా నిర్మించిన ఈ కలికాలం సినిమా . సినిమాకు ఆమే షీరో . అద్భుతంగా నటించింది .

Ads

రచయిత శ్రీరాజ్ యువ మాసపత్రికలో ప్రచురించిన కధ నాటకంగా రూపాంతరం చెందింది . ఆ నాటకాన్ని చూసిన దర్శకుడు ముత్యాల సుబ్బయ్య ఆ కధ మీద మనసు పారేసుకుని నిర్మాతల కోసం వెతకటం , నటించమని జయసుధను అడగటానికి వెళితే కధ నచ్చి తమ బేనరుపై తీయమని అడగటం , JSK కంబైన్స్ బేనరుపై ఈ చిత్రం నిర్మించబడటం జరిగింది . 35 లక్షల రూపాయల బడ్జెట్టుతో తిరుపతి , చుట్టుపక్కల షూటింగ్ జరుపుకుంది .

కమర్షియల్గా ఎలా ఆడిందో నాకు తెలియదు కానీ కళాసాగర్ వారి ఉత్తమ సహాయ నటి , ఉత్తమ దర్శక అవార్డులు వచ్చాయి . కుంకుమ భాగ్య అనే టైటిలుతో కన్నడంలోకి రీమేక్ అయింది . లక్ష్మి , శ్రీనాథ్ , సాయికుమార్ , సుధారాణి నటించారు . కలికాలం అనే టైటిలుతోనే తమిళంలోకి రీమేక్ అయింది . రాధిక , రవి తదితరులు నటించారు . సంతాన గోపాలం అనే టైటిలుతో మళయాళంలోకి రీమేక్ అయితే తిలకన్ , జగదీష్ , బాలచంద్ర మీనన్ నటించారు .

సినిమా గంభీరంగా సాగేదే అయినా కుటుంబ కధాచిత్రం కావటం , అలాంటి కధ ఇంటింటీ కధ కావటం , జయసుధ అద్భుత నటన వలన సినిమాకు ప్రాధాన్యత వచ్చింది . ఈ సినిమాలో తారసపడే తాగుబోతు కబుర్లరాయుడు మామ వంటి వృధ్ధులు , కష్టపడి పని చేయకుండా beg , borrow , steal బేచ్ వంటి కుమార/కుమారీ రత్నాలు , లేనపోని మధ్య తరగతి మిధ్యా పరువులు మన చుట్టూ ఎక్కడ పడితే అక్కడ తారసపడుతుంటారు/తారసపడుతుంటాయి .

కలికాలం

అయితే ఈ సినిమాలో ప్రత్యేక మలుపు ఏమిటంటే చనిపోయాడు అనుకున్న తండ్రి ఉద్యోగం , LIC డబ్బు , వగైరాల కోసం బతికొచ్చిన తండ్రిని చీకట్లో పడేయటం , తల్లి కుంకుమ బొట్టును కొడుకే స్వహస్తాలతో చెరిపేయటం , వీళ్ళందరి అఘాయిత్యాలను భరించలేని భార్యాభర్తలు ఇంట్లోనుంచి పారిపోవటం . ఈ మలుపులు ఈ సినిమాను ప్రత్యేకం చేసాయి .

భార్యాభర్తలుగా చంద్రమోహన్ , జయసుధ , తాగుబోతు మామగా సుత్తి వేలు , పుత్ర రత్నంగా సాయికుమార్ , అతనిని పెళ్ళి చేసుకుని ఉధ్ధరించే ప్రయత్నం చేసే భార్యగా ఈశ్వరీరావు , కూతురిగా అరుణ , ఆమె భర్తగా శుభలేఖ సుధాకర్ నటించారు . ఇతర పాత్రల్లో నర్రా , పి జె శర్మ , బ్రహ్మానందం , రాళ్ళపల్లి , చిట్టిబాబు  తదితరులు నటించారు .

శ్రీరాజ్ ఒరిజనల్ కధను రమణి మెరుగులు దిద్దగా స్క్రీన్ ప్లే , దర్శకత్వాన్ని ముత్యాల సుబ్బయ్య నిర్వహించారు . బరువైన డైలాగులను తోట మధు అందించారు . విద్యాసాగర్ సంగీత దర్శకత్వంలో రెండు కుర్ర జంటల పాట ఒకటి , ఓ విషాద పాట ఉన్నాయి . థియేటర్లో బాగానే ఉంటాయి . బాలసుబ్రమణ్యం , మనో , చిత్ర పాడారు .

1991 లో వచ్చిన ఈ సినిమా యూట్యూబులో ఉంది . ఒకటి రెండుసార్లు టివిలో వచ్చింది . నేను టివిలోనే చూసాను . బతికొచ్చిన తండ్రిని చీకటిలో బతకమనటం , క్లైమాక్సులో భార్యాభర్తలు పిల్లల బారి నుండి పారిపోవటం అలాంటి సంతాన బాధిత వృధ్ధులను కలచివేస్తాయి . నేనూ కలచివేయబడ్డాను .

స్పీడు స్పీడు సినిమాలను చూసే ఈ స్పీడు కాలంలో నచ్చుతుందో లేదో తెలియదు కానీ చూడతగ్గ సినిమాయే . గంభీరంగా సాగే ఈ సినిమాను జయసుధ అభిమానులు తప్పక చూడవచ్చు ..... కాదు, చూడాలి... ఇది కలికాలం కాబట్టి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కలికాలం..! మనం కన్నవాళ్లను, మనల్ని కన్నవాళ్లనూ నమ్మలేం..!!
  • తెలంగాణ జాతిపిత ఎవరో క్లారిటీ వచ్చేసింది… ఇక రచ్చ ఆపేయండి…
  • రోహిణి సింధూరి..! చీట్… నో క్లీన్ చిట్…! శుద్ధపూస ఏమీ కాదట..!!
  • యువ సన్యాసి విషాదకర మరణం… విషాదంలో జైన సమాజం…
  • అందరూ ఆడుకునేవాళ్లే..! అమరావతి రాజధాని ఓ విషాదగాథ…
  • శని అంటే శని… అంతే… ఎవరూ అతీతులు కాదు… ఐదూళ్ల కథ కూడా…
  • మోటోక్రాస్ రేసింగ్..! టెక్నికల్లీ హైస్టాండర్డ్స్… ఎమోషనల్లీ వీక్…!!
  • పాండవులు అడిగారు ఐదూళ్లు… ఇప్పుడు తెలంగాణ అడుగుతోంది…
  • రకాస ముచ్చట… దెయ్యాల కోటలో పెళ్లి ఆపిన పెళ్లికాని ప్రసాదు..!
  • హిందీ రాముడికన్నా మన తెలుగు రాముడే బాగున్నాడు..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions