Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చూపరులను కట్టిపడేసే కాళీయమర్దనం… కానీ అదో శాపగ్రస్త ఆలయం…

January 28, 2025 by M S R

.

(   రమణ కొంటికర్ల  ) ..   …. కాళీయమర్దనంతో ఆకట్టుకునే ఆ గుట్ట అందాల్లో.. అక్కడి ప్రకృతీ పులకిస్తూ నాట్యమాడుతుంది!

కొండ కిందో, కొండపైనో నాగుపాములుండటం కాదు.. ఆ కొండే ఓ నాగుపాము రూపంలో దర్శనమిస్తుంది. వేములవాడ- కరీంనగర్ రహదారిపై వెళ్లే చూపరులను ఇట్టే ఆకర్షిస్తుంది. కాళీయమర్దనుడిగా.. పడగవిప్పిన నాగుపాము తలపై నిల్చుని ఆడుతున్న శ్రీకృష్ణుడి రూపం ఆ మార్గంలో వెళ్లే వాహనదారులను అటెన్షన్ కు గురి చేసి ఓ పది నిమిషాలు ఆగేలా చేస్తుంది.

Ads

ఆ తర్వాత కుదిరితే అప్పటికప్పుడు.. లేదా, వీలు చేసుకుని ఇంకెప్పుడైనా కచ్చితంగా దర్శించాలనే ఉత్సుకతను రేకెత్తిస్తుంది. ఇవన్నీ నాంపల్లి గుట్ట ప్రత్యేకతలు.

అవును, ప్రకృతి రమణీయత మధ్య రాజన్న సన్నిధికి అత్యంత చేరువలో, కేవలం నాల్గు కిలోమీటర్ల దూరంలో కనిపించే నాంపల్లి నర్సింహస్వామి క్షేత్రం తెలంగాణా సిగలో అంతగా అభివృద్ధికి నోచుకోని ఓ శాపమున్న క్షేత్రం. శపించేవాడే దేవుడైతే.. మరి ఆ దేవదేవుడే కొలువైన ప్రాంతానికి శాపమెలా వచ్చింది..? అసలేం జరిగింది..?

temple

నారసింహ క్షేత్రాలంటేనే ఒక్క ధర్మపురి మినహా.. మిగిలిన చాలా క్షేత్రాలన్నీ కొండలూ, గుట్టలపైనే. నవ నారసింహ క్షేత్రాలు మాత్రమే ప్రాచుర్యానికి నోచుకోవడం వల్ల.. మరికొన్ని లక్ష్మీనృసింహ క్షేత్రాలు, వాటి పర్యాటక అందాలు అంతగా వెలుగులోకి రాకుండా పోయాయి. ఎవరో కొందరు చరిత్రకారులు మినహాయిస్తే వాటి గురించి అనర్గళంగా చెప్పేవారూ కరువైపోయిన రోజులివి. అలాంటి క్షేత్రాల్లో ఒకటి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నాంపల్లి క్షేత్రం.

అత్యంత ఎత్తున కొలువైన ఈ నాంపల్లి నారసింహుడికి సుమారు వెయ్యేళ్ల చరిత్ర ఉన్నట్టు చెబుతారు. మహాసిద్ధ మహర్షులు ఈ ఆలయంలో తపస్సు చేసినట్టు కొందరు చరిత్రకారులు, ఆధ్యాత్మికవాదులు చెప్పే మాట. ప్రకృతి సుందరమైన ఈ ఆలయాన్ని దర్శించేందుకు దీని విశిష్ఠత తెలిసినవారెందరో వస్తున్నా.. అనుకున్న స్థాయిలో ఆదరణ మాత్రం దక్కడం లేదు. అందుకు ఈ గ్రామానికున్న శాపమే కారణమంటారు.

రాజరాజనరేంద్రుడి భార్యైన పుణ్యశ్రీ రత్నాంగి దేవి తన కొడుకు మరణం తట్టుకోలేక ఈ నాంపల్లి పట్టణం కాలగర్భంలో కలిసిపోవాలని, ఇక్కడి ఆలయాల్లో దేవతలు కూడా ఎలాంటి పూజలు, అర్చనలకు నోచుకోవద్దని శపించినట్టుగా కొన్ని చారిత్రక ఆధారాలున్నట్టు చెబుతుంటారు.

ఈ నాంపల్లిని వెనుకటికి శ్రీమన్నపల్లి అని కూడా పిల్చేవారట. అలా రత్నాంగి దేవి శాపంతోనే ఈ గ్రామం ఓ కుగ్రామంగా మారిపోయి, గుర్తింపు దక్కలేదన్నది కొందరు వినిపించే కథ.

కాకతీయుల కాలంలో ఒక వెలుగు వెలిగిన ఈ ప్రాంతంలో ఇక్కడి దేవుడి వస్తువులు, ఆభరణాలు, పురాతన శివలింగాలు, రథాలు వంటివన్నీ మాయమై.. రాజరాజనరేంద్రుడి కోట ధ్వంసమై.. కోటలో విలువైన యుద్ధసామాగ్రితో పాటు, నరేంద్రుడి ధనరాశులు కూడా దోపిడీకి గురైనట్టు చారిత్రక కథలు చెప్పే మాట.

అసలు ఎములాడ రాజన్న పుట్టుకకు కారణమే ఈ నాంపల్లి గుట్ట అంటుంటారు. ఈ నాంపల్లి కొండ నుంచి వేములవాడ రాజన్న ఆలయం వరకూ.. భీమేశ్వరాలయం వరకూ ఓ సొరంగమార్గముందనేదీ ప్రచారంలో ఉంది.

అదెంతవరకూ నిజమో తెలియదుగానీ.. గొప్ప చరిత్ర గల ఈ శ్రీమన్నపల్లి అనే ప్రస్తుత నాంపల్లి క్షేత్రం రత్నాంగీదేవి శాపంతో ఆదరణకు నోచుకోలేదన్నదే ఇక్కడ వినిపించే ప్రధాన కథ. అందుకే ఇంత సుప్రసిద్ధ క్షేత్రం ఇంకా ఇక్కడి చుట్టుపక్కల జనానికే తెలియకపోవడమూ విచారకరమే.

అయితే, ఇక్కడే మరో కథా వినిపిస్తుంది. అదే రత్నాంగిదేవికి సంతానం కాకపోవడంతో ఈ గుట్టపై కొలువుదీరిన పెరుమాళ్లైన లక్ష్మీనారసింహుడు, ఆంజనేయుడికి పూజలు చేసిందని.. అందుకే ఆమెకు సంతానం కల్గిందనీ మరో కథనమూ ప్రచారంలో ఉంది.

అందుకే, ఇక్కడికి పెళ్లై సంతానం కానివారు వచ్చి అఖండ గండాదీపంలో నూనె పోసి దీపం వెలిగిస్తే సంతానప్రాప్తి కల్గుతుందని, కోరిన కోర్కెలు తీరుతాయనీ ఇక్కడికొచ్చే భక్తుల నమ్మకం.

ఇలా పలు కథలు ప్రచారంలో ఉన్న ఈ ఆలయంపై మరింత పరిశోధన చేస్తే కచ్చితంగా ఇక్కడి ఆధ్యాత్మిక చరిత్ర మరింత వెలుగులోకి తీసుకొచ్చే అవకాశమూ ఉంది.

పడగ విప్పిన సర్పాకారంలో కనిపించే నాంపల్లి గుట్ట దిగువున నిర్మించిన పెద్ద నాగదేవత ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రకృతి అందాల మధ్య ఎత్తైన గుట్ట మీద లక్ష్మీసమేతంగా కొలువై ఉన్న నరసింహస్వామి ఆలయం ఒకవైపు.. చుట్టూ పచ్చని చెట్లూ, పంటపొలాలు, ఓ వైపు మూల వాగు, మరో వైపు మానేరు వాగులతో ఒక మనోహరమైన దృశ్యం సాక్షాత్కారం కావాలంటే ఈ గుట్టకోసారి రావల్సిందే.

పూర్వకాలంలో నాంపల్లి గుట్టను శ్రీమన్నపల్లిగానే కాకుండా, నామపల్లిగా కూడా పిలిచేవారట. చోళుల కాలంలో ఇక్కడ ఉన్న స్వామివారికి పూజాదికాలు జరిగినట్లు ఆధారాలున్నాయంటారు చరిత్రకారులు. క్రీస్తుశకం 11వ శతాబ్దంలో రాజమహేంద్రవరాన్ని పాలించిన రాజరాజ నరేంద్రుడు వేములవాడ ప్రాంతాన్ని దర్శించాడట.

అప్పుడు ఇక్కడ కోనేటికి మెట్లు కట్టించాడు. అతని భార్య రత్నాంగిదేవి ఈ గుట్టపైనే తపస్సు చేసి సారంగధరుడిని కుమారుడిగా పొందిందని చారిత్రక కథనం వినిపిస్తుంది. ఇందువల్లే కొత్తగా పెళ్లయిన దంపతులు సంతానం కలిగితే ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటారు. అందుకే నాంపల్లి లక్ష్మీనర్సింహుణ్ని సంతాన నర్సింహుడని కూడా పిల్చుకుంటారు.

ఆలయం తూర్పున ఉన్న రావిచెట్టుకు ముడుపులు కట్టి వెళ్లే ఆచారం ఇక్కడ కనిపిస్తుంది. ఆలయం లోపల ఉన్న ఆంజనేయస్వామి రాతి శిల ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. అదే సమయంలో హిరణ్యకశిపుణ్ని అంతమొందించే క్రమంలో ఓ స్తంభాన్ని చీల్చుకుని సాక్షాత్కారమయ్యే ఉగ్రనారసింహుడి రూపాన్నీ ఇక్కడ అందంగా ఆవిష్కరించారు.

గుట్టపైన రెండు చరియల మధ్య సహజంగా ఏర్పడిన రెండు బ్రహ్మపుష్కరిణీలు కనువిందు చేస్తాయి. ఆలయానికి పక్కనే ఉన్న చిన్న గుహలో శివ లింగంతో పాటు ఇతర దేవతామూర్తుల విగ్రహాలు కొలువై ఉంటాయి.

క్రీస్తుశకం పదో శతాబ్దంలో నవనాథ సిద్ధులు ఈ గుట్టపై తపస్సు చేసి సిద్ధి పొందారనీ చెబుతుంటారు. వారు ప్రతీరోజూ ఈ గుహ నుంచి భూగర్భ సొరంగ మార్గం ద్వారా వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి పూజలు చేసి వచ్చేవారనేది చరిత్రకారులు చెప్పే మాట.

ప్రతి ఏడాది నాంపల్లి గుట్టపై ఉన్న స్వామి ఆలయంలో పార్వతీ, రాజరాజేశ్వరస్వామి కళ్యాణం, లక్ష్మీ నర్సింహ స్వామి కళ్యాణం, మహాశివరాత్రి వేడుకలు, శ్రావణమాసం పూజలు, రామనవమి, గోదారంగనాథుల కల్యాణంలాంటి ఉత్సవాలు విశేషంగా అలరిస్తాయి.

పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచే నాంపల్లి గుట్టకు.. కాళీయమర్దనమే మరింత ప్రత్యేక ఆకర్షణ. ఐదుతలల సర్పాకారంలో నిర్మించిన నాగదేవత ఆలయం గుట్టపై నుంచి చూస్తుంటే .. చెట్ల మధ్యన చుట్టుకున్న కొండంత పాములా కనిపిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తుంది.

మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు చొరవతో ఈ ఆలయం కాళీయమర్దనుడి రూపంలో కొలువు దీరటం మరో విశేషం. ఆలయంలోనికి వెళ్లే మార్గంలో స్వామి లీలల్ని వివరించేలా అనేక శిల్పాలు కనిపిస్తాయి.

నాంపల్లి గుట్ట ఆలయాన్ని వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం అధికారులు 17 ఏళ్ల క్రితమే దత్తత తీసుకుని అభివృద్ధి చేశారు. పర్యాటక శాఖ గుట్ట దగ్గర ధ్యాన మందిరం, ప్లానిటోరియం, గుట్టపైకి రోప్‌వే, కాటేజీలు, లైట్ అండ్ సౌండ్, తాగునీటి వసతి లాంటి అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేసినా.. అవి ఇంకా రూపు దాల్చలేదు. ప్రధాన రోడ్డు నుంచి ఘాట్ ‌రోడ్డు మీదుగా గుట్టపై వరకు అన్ని వాహనాలు వెళ్లడానికి రోడ్డు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి మెట్ల ద్వారా స్వామిని దర్శించుకోవచ్చు.

కరీంనగర్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో.. సిరిసిల్ల నుంచి పది కిలోమీటర్ల దూరంలో.. వేములవాడ నుంచి నాల్గు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ నాంపల్లి దర్శనం కేవలం ఆధ్యాత్మిక అనుభూతినే కాదు… పర్యాటక ఆహ్లాదాన్నీ ఇచ్చేది. మరింకెందుకాలస్యం..?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions