ఒక వార్త… ఎక్కడో కనిపించింది… నిజానికి వార్త కాదు, ఓ సూచన… కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్‌కు..!
బాబూ, నాగీ, సినిమా బాగానే తీశావు గానీ, ఒక్క తప్పు చేశావోయీ… సంగీత దర్శకుడిగా ఆ సంతోష నారాయణుడిని తీసుకున్నావు కదా… అబ్బే, అస్సలు మెప్పించలేదు తను… కల్కి రెండో పార్టుకు తనను తీసేసి, మరెవరినైనా పెట్టుకో, కల్కి ఫస్ట్ పార్టులో కొన్ని సీన్లు సరైన బీజీఎం లేక రావల్సిన హై రాకుండా పోయింది, అంటే ఎలివేట్ కాలేదు…
పైగా పాటలు మరీ ముఖ్యం… బాహుబలి రెండు పార్టులకూ ప్రధానమైన బలం బీజీఎంతోపాటు పాటలు… కీరవాణి తన ఫ్యామిలీ సినిమా కదా, మనసు పెట్టి రాగాలు కూరుస్తాడు… కాంతార సినిమాకు ప్రధానమైన బలం చివరి పాట… అదే సినిమాను ఎక్కడికో తీసుకెళ్లింది… కనుక, కాబట్టి, అందుకని, సో సదరు సంతోష నారాయణుడిని వదిలించుకోగలవని సూచన…. ఇదే ఆ వార్త సారాంశం…
Ads
ఎవరీ సంతోష్ నారాయణ్..? తమిళ ఇండస్ట్రీలో చాన్నాళ్లుగా ఉన్నాడు… దాదాపు పుష్కరకాలంగా… మరీ పెద్ద సినిమాలు ఏమీ తన సినిమాల జాబితాలో లేవు కానీ బిజీగానే ఉండే కంపోజర్ తను… అప్పుడెప్పుడో 2014లో బిల్లారంగా సినిమాకు వర్క్ చేస్తే… మళ్లీ మొన్నటి దసరా సినిమా దాకా తను ఏ తెలుగు సినిమాకూ వర్క్ చేసినట్టు లేడు… తరువాత సైంధవ్, యాత్ర-2 ఉన్నట్టున్నాయి…
అత్యంత భారీ వ్యయంతో వచ్చిన కల్కికి సంగీత దర్శకుడిగా తనను ఎలా ఎన్నుకున్నాడు నాగ్ అశ్విన్..? ఈ ప్రశ్నకు జవాబు ఎలాగూ నాగీ నుంచి రాదు గానీ… తను పెట్టుకున్న నమ్మకం మాత్రం నిలుపుకోలేదు సంతోష్ నారాయణ్… అది నిజం… ఐతే ఇప్పటికిప్పుడు తనను పీకిపారేసి ఇంకెవరైనా పెద్ద సంగీత దర్శకుడిని తీసుకోగలడా..? కొన్నిసార్లు మొహమాటమో, నైతికతో అడ్డు వస్తుంది…
ఎహె, సినిమా అనేది కమర్షియల్ ప్రాజెక్టు… పైగా అత్యంత ఖరీదైన ఇండియన్ సినిమా… మొహమాటపు లెక్కలుండవు అంటారా..? నిజమే… కానీ ఎవరిని ఎంచుకోవాలి..? ఇళయరాజా పనైపోయింది… కీరవాణి, అనిరుధ్, దేవిశ్రీప్రసాద్, థమన్, కాంతార అజనీష్ తదితరుల్లో ఎంచుకోవాలా..? నాగ్ అశ్విన్ అడిగినా సరే వాళ్లు అంగీకరించకపోవచ్చు… వేరెవరో ఎంగిలి చేసిన ప్రాజెక్టులో అడుగుపెట్టలేకపోవడం అని కాదు… ఒకరు సైన్ చేసిన ప్రాజెక్టులోకి వీళ్లు ఎంటర్ కారు, ఇండస్ట్రీలో అది అనారోగ్య వాతావరణాన్ని పెంచుతుంది…
ఐనా వాళ్లు కూడా చాలా సినిమాల్లో ఫెయిల్ కాలేదా..? నిజానికి నాగ్ అశ్విన్ తనకు నచ్చేట్టు ఔట్ పుట్ సంతోష్ నారాయణ్ నుంచి వచ్చేలా చూసుకోవాలి… తను కల్కి సంగీతం విషయంలో కాంప్రమైజ్ అయ్యాడు… ఏమో, తనకు ఆ మ్యూజిక్ నచ్చిందేమో కూడా తెలియదు… సో, సంగీత దర్శకుడిని మార్చుకోవడం కాదు, ప్రజెంట్ ట్రెండ్‌కు సరిపోయే ఔట్ పుట్ సంతోష్ నారాయణ్ నుంచి డిమాండ్ చేసి పొందడమే కర్తవ్యం..!!
Share this Article